భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రతా మహాత్మ్యం – ఆఖ్యానాలు
“వేదాది ధర్మాలను రక్షించడానికి ఆసురీ ధర్మాన్ని నాశనం చేయడానికీ సర్వశక్తి మంతుడైన భగవంతుడు శ్రీహరి ఎన్నో అవతారాలను ధరించి ఈ సూర్యచంద్ర వంశాల పాలన పోషణలను చేశాడు. జన్మమే లేనివాడు మనకోసం చివరికి చేపగానూ తాబేలు గానూ పుట్టవలసి వచ్చినా వెనుకాడలేదు.
అని బ్రహ్మ వ్యాసమహర్షికి వివరించసాగాడని శౌనకాది మహామునులకు మహాపౌరాణికుడైన సూత మహర్షికి చెప్పసాగాడు.
“ఆ స్వామి మత్స్యావతారాన్ని ధరించి లోక కంటకుడైన హయగ్రీవుడను దైత్యుని సంహరించి వేదాలను మరల భూమిపైకి తెచ్చి మన్వాదులను రక్షించాడు. క్షీరసాగర మథన సమయంలో లోకహితాన్ని కోరి ఆదికూర్మమై మందర పర్వతాన్ని తనమూపున ధరించి భరించాడు. క్షీరసాగరం నుండి అమృతాన్ని తేవడానికీ, ప్రజారోగ్యాన్ని కాపాడడానికీ తానే స్వయంగా ధన్వంతరియై దిగివచ్చాడు.
సుశ్రుతునికి అష్టాంగ పర్యంతమైన ఆయుర్వేదాన్ని కూలంకషంగా బోధించి అవతారాన్ని చాలించాడు. దేవతలను తన్ని తగలేసి అమృతభాండాన్ని ఎగరేసుకుపోయిన రాక్షసులనుండి అమృతాన్నీ, ఆవిధంగా ధర్మాన్నీ కాపాడడానికి ఆడవేషం (మోహిని) వేసి ఆటలాడడానికి కూడా సంకోచింపలేదు.
కరుణాకరుడైన శ్రీహరి వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి అతనిచే సముద్ర పతితమైన భూమినుద్ధరించాడు. నృసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. తరువాత జమదగ్ని ఇంట పరశురామునిగా నవతరించి మొత్తం ఆర్యావర్తాన్ని క్షత్రియ మదాహంకార కబంధ హస్తాలనుండి విడిపించాడు.. దీనికాయన ఇరువది యొక్క మార్లు దేశమంతటా కలయదిరిగాడు.
అహంకారంతో కన్నుమిన్ను గానకుండా వరప్రసాదంతో మదమెక్కి పోయిన వేయిచేతుల కార్తవీర్యార్జునుని కూడా సంహరించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి అందులో మొత్తం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి మహేంద్రగిరి పైకి తపస్సు చేసుకొనుటకు వెడలిపోయాడు.
తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల స్వరూపంలో దశరథుని ఇంట శ్రీహరి అవతరించాడు. పితృవాక్యపాలన, సత్యపరాక్రమం, దుష్టసంహారం మున్నగు ఆదర్శలక్షణాలకు ఆలవాలమైన శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడెలా వుండాలో తన జీవనయానమే ఉదాహరణగా జీవించి మానవజాతికి చూపించాడు.
రావణాది లోకకంటకుల నుండి జాతిని రక్షించాడు. తండ్రి మాట మేరకు పదునాలుగేండ్లు అడవులలో ఇడుములు పడి త్రైలోక్యపూజ్యుడై మరలి వచ్చి పట్టాభిషిక్తుడై దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, ప్రజలను, ఆనందసాగరంలో ఓలలాడించాడు.
అశ్వమేధాది ఎన్నో యజ్ఞాలను చేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. సీతకి కూడా అంత గొప్పతనమూ ఉంది. రామకథను సీతాచరితమన్నవారూ ఉన్నారు. ఆమె అంత గొప్ప పతివ్రత.
ఇపుడు పతివ్రతా మాహాత్మ్యాన్ని వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ప్రతిష్ఠాన పురంలో కౌశికుడని ఒక కుష్టు రోగియైన బ్రాహ్మణుడుండేవాడు. అతని పత్ని అతనిని దైవసమానంగా చూసుకుంటూ ప్రేమతో భక్తిగా, అతనికి సర్వోపచారాలూ చేస్తూ అతనికే మాత్రమూ అసౌకర్యం కలుగకుండా సేవిస్తుండేది.
అయినా అదేమి కర్మయోగాని ఆ పతి ఆమెనొక మంచి మాటైనా ఆడకపోగా ఆమెపై విసుక్కొనేవాడు. కోపించేవాడు, కోరరాని కోరికలు కోరేవాడు. ఒకనాడతడు వేశ్యా సంపర్కమును వాంఛించాడు. ఆమె బాగా చీకటి పడినాక అతనిని భుజాలపై నెత్తుకుని, తగినంత ధనాన్ని కూడా పట్టుకొని వేశ్య ఇంటివైపు పోసాగింది.
దారిలో నొక కూడలిలో తపస్వీ, మహాత్ముడునైన ఒక మహర్షి కొరతవేయబడి వున్నాడు. ఆయన శరీరంలో దిగబడిన లోహపు శంకువు వల్ల కలిగే దుస్సహవేదన తెలియకుండా సమాధిగతుడై వున్నాడు. చీకటిలో కనబడక ఈ పతివ్రత ఆయన పక్కనుండే వెళ్ళడంతో ఆమె భర్త కాలు ఆ మహర్షికి తగిలి ఆయన సమాధి భగ్నమైంది.
వెంటనే భరింపరాని నొప్పి ఆయనను విహ్వలుని చేయడంతో ఇక తట్టుకోలేక తనకి తగిలిన కాలు ఎవడిదో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు. ఆ పతివ్రతకు తన భర్త సరదాగా కాలు ఊపుతూ ఉన్నాడనీ, అది ఎవరో మహానుభావునికి తగిలి శపించాడనీ తెలియగానే తన దోషం లేకుండానే తనకి వైధవ్యం కలగడం అన్యాయమనీ, కాబట్టి ఇక సూర్యుడు ఉదయించనే కూడదనీ శాసించింది. ఆమె యొక్క పాతివ్రత్యమహిమ వల్ల ఆ రాజ్యంలోనే కాక ఎక్కడా కూడా సూర్యుడు ఉదయించలేదు. దానితో ప్రపంచం అల్లకల్లోలమైపోయింది.
భయభీతులైన దేవతలు బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. ఆయన ఒక మహాపతివ్రతను శాంతింపచేసే శక్తి ఆమెకు గురుతుల్యురాలైన పరమ పతివ్రతకే వుంటుందని చెప్పి వారందరినీ పోయి అత్రి మహాముని పత్నియైన అనసూయను ప్రార్థించుమని సూచించాడు.
మహాతపస్వినియైన అనసూయ దేవతలను కరుణించి ఆ బ్రాహ్మణ పత్నిని రావించి ఆమె భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించి సూర్యుడు దయించే ఏర్పాటు చేసింది. ఇంతటి పతివ్రతే సీత కూడా.
నూట ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹