కేతుగ్రహ చరిత్ర రెండవ భాగము
అరుణుడు నడుపుతున్న రథం మీద సూర్యుడు విలాసంగా కూర్చున్నాడు. త్రిమూర్తులు కల్పించుకోవడంతో తనకు ఆ ”రాహు పీడ” వదిలింది ! రథికుడినీ , అశ్వాలనూ కూడా అర్ధం చేసుకోగలిగిన నేర్పరి సారథిగా లభించాడు ! తన దినచర్య ఇక నిరాఘాటంగా సాగుతుంది !
మేఘ గర్జనను వెక్కిరించే ధ్వనితో వికతమైన నవ్వు ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగించింది. రథపథానికి సమీపంలో ముసురుకున్న మేఘాల మాటు నుండి తన వైపు దూసుకు వస్తోంది ఆ వికటాట్టహాసం ! ఎవరు ? ఎవరు నవ్వుతున్నారు ? ఎందుకు నవ్వుతున్నారు ? రాహువా ?
ఉరుములా ధ్వనిస్తున్న వికటాట్టహాసం ప్రభావానికి మేఘాలు చెల్లా చెదరవు తున్నాయి. మరుక్షణం వికృతంగా , నెత్తురు ముద్దలా ఎర్రగా ఉన్న కేతువు ముఖం సూర్యుడికి కనిపించింది , మేఘాల చాటు నుండి వెలికి వస్తూ.
రథం నడుపుతున్న అరుణుడు , అప్రయత్నంగా అటు వైపు చూశాడు.
“సూర్యభగవాన్ ! ఎవడా రక్కసుడు ?” అరుణుడు ప్రశ్నించాడు.
“రాహువు సోదరుడు , కేతువు !” సూర్యుడు కేతువునే చూస్తూ అన్నాడు.
కేతువు నోటిని గుహలాగా తెరిచి , చేతులతో సైగ చేస్తున్నాడు ! ఎర్రటి నాలుక గుహలో చెలరేగిన మంటలా కనిపిస్తోంది. ద్వారం వద్ద పై నుండి క్రిందకూ , క్రింద నుండి పైకీ పొడుచుకు వచ్చిన వాడి కత్తుల్లా కేతువు పళ్ళు !
రథానికీ , తనకూ మధ్య ఉన్న దూరంలో హెచ్చు తగ్గులు లేకుండా – ఆ రాక్షస కేతువు తనను వెంటాడుతున్నట్టు సూర్యుడు గ్రహించాడు. భయంకరంగా నవ్వుతూ , వికతంగా , పరిహాస పూర్వకంగా కేతువు చేస్తున్న సంజ్ఞలు ”నిన్ను కబళిస్తాను ! కాచుకో !” అంటూ మౌనంగా చెప్తున్నాయి !
రాహువు , కేతువూ – ఇద్దరూ తన మీదా , చంద్రుడి మీదా కక్ష కట్టారు. త్రిమూర్తులు రాహువును నియంత్రించి , కేతువును ఎందుకు విస్మరించారు ? తమ మీద కేతువుకు ప్రతీకారేచ్ఛ లేదని అనుకున్నారా ? లేక , రాహు కేతువులు ముందు చూపుతో ఒకరి అనంతరం మరొకరు రంగ ప్రవేశం చేస్తున్నారా ? వేధిస్తున్న వెయ్యి ప్రశ్నలకు సమాధానం కోసం వెదుకుతూ , నవ్వుతో తనను వెంటాడుతున్న కేతువు ఏ క్షణంలో ఏం చేస్తాడో అని ఆందోళన పడుతూ సూర్యుడు తన యాత్రను యాంత్రికంగా కొనసాగించాడు.
రథం పరుగెడుతోంది. కాలం దూసుకు వెళ్తుంది. కేతువు నవ్వు అంచెలంచెలుగా దశదిశల్నీ బ్రద్దలు చేస్తూనే ఉంది.
అస్తమయ కాలం సమీపించింది. సూర్యుడు తేలికగా నిట్టూర్చాడు. అరుణుడి ముఖం మీద చిరునవ్వు మెరిసింది. ఒక్కసారిగా , ఆకాశంలో ప్రశాంతత ఏర్పడింది. కేతువు వెనుదిరిగి చూస్తున్నాడు. ఆ రక్కసుడి ప్రవర్తన తనకు ఒక హెచ్చరికా ? తీవ్రంగా ఆలోచిస్తున్న సూర్యుడు త్రిమూర్తులను స్మరించాడు , తనలో.
పక్షం రోజుల పాటు కొద్ది కొద్దిగా వృద్ధి చెందుతూ , మామగారైన దక్ష ప్రజాపతి శాపం నుండి తాత్కాలిక విముక్తితో , పరిపూర్ణ కళతో వెలిగిపోతున్న చంద్రుడు ఇరవై ఏడుగురు పత్నులకూ ప్రేమ పూర్వకంగా వీడ్కోలు పలికి తన నిశావిహారానికి బయలుదేరాడు. క్షయవ్యాధితో నెలలో సగం రోజులు కృశించి , కృశించి , కళ తప్పి , నీరసించి పోయిన తమ ప్రాణనాథుడు రోగవిముక్తుడై , కళకళలాడుతూ వెళ్ళడాన్ని చూస్తూ సంతోషంగా వీడ్కొన్నారు. చంద్రపత్నులు.
లోకాలను తన తెల్లటి వెలుతురుతో స్పృశిస్తూ గగన విహారం చేస్తున్న చంద్రుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దిక్కులు పిక్కటిల్లే శబ్దం. కారు మేఘాలు లేకుండానే వినవస్తున్న ఉరుముల ధ్వని !
ధ్వని గురించి ఆలోచిస్తున్న చంద్రుడు తన ముందు ప్రత్యక్షమైన దృశ్యాన్ని చూసి , నిర్ఘాంతపోయాడు. ఎర్రటి ముఖం ! గుహలాంటి నోరు ! వికృతంగా అవుపిస్తున్న కరాళదంష్ట్రలు ! గాలికి విచ్చలవిడిగా ఎగురుతూ గగుర్పాటు కలిగించే శిరోజాలు !
“ఏమిటలా చూస్తున్నావు చంద్రా ? నన్ను గుర్తుపట్టలేదా ? ఆనాడు అసురుడి రూపం త్యజించి , సుర రూపం ధరించాక కూడా గుర్తుపట్టావే ?” నవ్వు ఆపి , చంద్రుడిని చూస్తూ అన్నాడు కేతువు.
చంద్రుడు ఆగి , ఆందోళనతో చూస్తూ ఉండిపోయాడు. “శిరచ్ఛేదం చేయించిన క్షణంలోనే నన్ను మరిచిపోయావా ?”
“నువ్వు… నువ్వు… కేతువు…”
“నువ్వు మరిచిపోయినా , నేను నిన్ను మరిచిపోను ! మరిచిపోను ! మరిచిపోలేను ! నిన్ను పలకరించాలని అనిపించినప్పుడల్లా ఇలా వస్తూనే ఉంటాను ! కలుసుకుంటూనే ఉంటాను. కబళిస్తూనే ఉంటాను !” కేతువు గర్వంగా నవ్వుతూ శరవేగంతో చంద్రుడి వైపు దూసుకు వచ్చాడు. కేతువు తాకిడితో చీలిపోతున్న గాలి చప్పుడు చేస్తోంది.
దగ్గరవుతున్న కొద్దీ కేతువు నోరు బ్రహ్మాండమైన , జుగుప్సాకరమైన రక్తబిలంలా తెరుచుకుంటూనే ఉంది. ఏం జరగబోతోందో చంద్రుడు ఊహించేలోగా ఆయన శరీరం కేతువు నోటిలో ఇరుక్కుంది. కేతువు అవలీలగా , ఆనందంగా చంద్రుడి శరీరాన్ని కొద్ది కొద్దిగా కబళిస్తున్నాడు.
క్రమంగా చంద్రుడి కాంతి తరుగుతోంది. లోకాలలోంచి చంద్ర కాంతి క్రమంగా అదృశ్యమవుతోంది. కారుమేఘం చాటుకు జరుగుతున్నట్టు , చంద్రుడు కేతువు నోటిలోకి లాగబడుతున్నాడు.
ఇంద్రుడు , సతీమణి శచీదేవితో నందనవనంలో విహరిస్తున్నాడు. దేవ పారిజాత పుష్పాల సువాసన , కల్పక పుష్పాల సౌరభం చల్లగా వీస్తున్న గాలిలో వ్యాపిస్తున్నాయి. పున్నమి వెన్నెల నందనం అందాన్ని వెయ్యింతలు చేస్తోంది.
పండు వెన్నెలలో శచీదేవి స్వేచ్ఛగా తిరుగుతోంది. సంపూర్ణ చంద్రకాంతిలో శచీదేవి అప్సరసలను తలదన్నే సౌందర్యంతో ఇంద్రుడి కళ్ళకు విందు చేస్తోంది. ఆయన చూపులు వికసించిన దివ్య పుష్పంలా ఉన్న శచీదేవి ముఖం మీదే ఉన్నాయి.
ఉన్నట్టుండి శచీదేవి ముఖం మీది వెలుగు మాయమైంది. ఆమె ముఖం మసకగా కనిపిస్తోంది. క్రమంగా మసకచీకటి ఆమె శరీరాన్ని ఆక్రమిస్తోంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో చూపుల్ని సతీమణి మీద నుండి పక్కకు మరల్చాడు. మసక చీకటి , తన ధర్మపత్నినే కాదు , పరిసరాల్ని కూడా కబళిస్తోంది.
చంద్రుడికి అడ్డుగా మేఘం అడ్డోచ్చిందా ? ఆలోచిస్తూ ఇంద్రుడు ఆకాశంలోకి , చంద్రుడి వైపు చూశాడు. చంద్రుడికి అడ్డుగా మేఘం లేదు ! చంద్రుడినే చూస్తున్న ఇంద్రుడి నేత్రాలు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.
చంద్రుడిని ఎవరో కబళిస్తున్నారు ! ఎవరు ? రాహువా ? త్రిమూర్తుల చేత నియంత్రించబడిన రాహు రక్కసుడు వాగ్దాన భంగం చేసి , చంద్రుణ్ణి గ్రహణం చేస్తున్నాడా ? ఆలోచిస్తున్న ఇంద్రుడికి – చంద్రుడిని కబళిస్తున్నదెవరో క్షణంలో అర్థమైంది ! కేతువు !
రాహువు తెర వెనుకకు వెళ్ళాడు. కేతువు రంగ ప్రవేశం చేశాడు ! అమృత వితరణ సందర్భంలో దెబ్బతిన్న వాడే కదా , కేతువు కూడా !
“నాథా !” శచీదేవి పిలుపు ఇంద్రుడిని హెచ్చరించింది. ఇంద్రుడు ఆలోచనలు ఆపి , అర్ధాంగి కోసం చూశాడు. శచీదేవీ నీడలా కదుల్తూ వస్తోంది. దగ్గరగా వచ్చిన శచీదేవి చేతిని పట్టుకున్నాడు ఇంద్రుడు.
“పూర్ణిమ వేళ ఈ అమావాస్య అంధకారం ఎందుకు , నాథా ?” శచీదేవి ప్రశ్నించింది.
“రాక్షసమాయ ! సరికొత్త ఉపద్రవం ! కేతువు చంద్రుడిని కబళించాడు ! ఆలస్యం చేయకుండా త్రిమూర్తుల దర్శనం చేసుకోవాలి !” అంటూ ఇంద్రుడు మందిరం వైపు ఆమెను నడిపిస్తూ నడవసాగాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹