కేతుగ్రహ చరిత్ర మూడవ భాగము
తన వదనగహ్వరంలో బంధితుడుగా చిత్రవధ అనుభవించిన చంద్రుడిని సూర్యోదయానికి ముందు వదిలిపెట్టాడు. కేతువు. నీరసంగా , నిస్సహాయంగా , కళావిహీనంగా అగుపిస్తున్న చంద్రుడిని రాక్షస కుంచికతో తాను చిత్రించిన చిత్తరువును చూస్తున్న విచిత్ర చిత్రకారుడిలా తృప్తిగా చూశాడు కేతువు.
“నువ్వు చేసిన నేరానికి శిక్ష పరంపరకు ఇది ప్రారంభం మాత్రమే , చంద్రా ! ముచ్చట వేసినప్పుడల్లా వస్తాను ! నిన్ను కబళించి పగ తీర్చుకుంటాను !” కేతువు నవ్వుతూ అన్నాడు.
చంద్రుడు మాటలు రానివాడిలా దీనంగా చూశాడు. చంద్రుడి దీనావస్థను చూస్తూ కేతువు గొల్లున నవ్వడం ప్రారంభించాడు. వికృతమైన దంతాలనూ , కోరలనూ ప్రత్యక్షం చేస్తున్న ఆ నవ్వు కేతువు ముఖాన్ని మరింత వికృతంగా , భయంకరంగా మార్చింది.
చంద్రుడు ఓటమిని మోస్తున్న వాడిలా తలను వాల్చుకుని నడవసాగాడు. కేతువు వెకిలి నవ్వు ఆయనను వెంటాడుతూనే ఉంది.
ఇరవై ఏడుగురు పత్నులూ చేస్తున్న ఉపచారాలేవీ చంద్రుడికి ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. పరిమళ ద్రవ్యాలతో చేసిన స్నానం అతడికి ఏ మాత్రమూ ఊరట కలిగించలేదు. చంద్రుడు భయభ్రాంతుడైపోయి ఉన్నాడు. నెలలో అర్ధభాగం దక్షుని శాప ఫలంగా క్షయవ్యాధి బాధ ! రెండవ అర్ధభాగం – రాక్షస గ్రహణ బాధ ! ఒక దానిని వెన్నంటుతూ మరొకటిగా , ఊహించని ఉపద్రవాలు తన్ను చుట్టుముట్టుతున్నాయి !
“స్వామీ… ఈ రాహుకేతువుల చిత్రవధ నుంచి ఎలా తప్పించుకుంటారు ?” అశ్విని ఆందోళనతో అడిగింది.
చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు. “వాళ్ళది అసురబలం ! తోడుగా పరమశివుడి వరం ! అమృతం దానవులకు దక్కకూడదన్న మహదాశయంతో స్పందించినందుకు ఇంత శిక్ష అనుభవించాల్సిరావడం బాధాకరం అశ్వినీ ! ఆ భయంకరమైన వదన కుహరంలో రోత పుట్టించే దుర్గంధం ! జుగుప్స కలిగించే లాలాజలం ! ఆ యాతన గుర్తుకురాగానే శరీరం జలదరిస్తుంది !”
“అయితే ఈ మహాపదను తప్పించుకోవడం ఎట్లా , స్వామీ ?” రోహిణి దీనంగా అడిగింది.
“ఏముందీ ? నా విధిని నిర్లక్ష్యం చేసి , దినచర్యను విస్మరించి , మందిరంలో ఉండిపోవడమే !” చంద్రుడు నీరసంగా అన్నాడు.
“అలా చేస్తే లోకాలు వెన్నెల లేక తల్లడిల్లిపోతాయి కద !” భరణి అంది.
“మన ప్రాణనాథుడు – ఎలా చేసినా ఆకాశంలో విహరించే అవకాశం ఉండదుగా , అక్కా ! ఉంటే మనతో బాటు హాయిగా మందిరంలో ఉండిపోవాలి ! లేదంటే ఆ రాక్షసుడి నోటిలో ఇరుక్కుని , లోపలే ఉండిపోవాలి !” కృత్తిక విశ్లేషిస్తూ అంది.
చంద్రుడు కృత్తిక వైపు మెప్పుగా చూశాడు.
లోకం కంట పడకుండా ఎక్కడో లోపల బంధింపబడి ఉండటమే పర్యవసానమైనప్పుడు , ఆ నిశాచరుడిలో ఎందుకు , మీ అందరితో పాటు మందిరంలో ఉండిపోతాను ! నేను… వెలుపలికి వెళ్ళను !”
“నారాయణ ! నారాయణ !” అంటూ నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
హఠాత్తుగా ఊడిపడిన నారద మహర్షిని చూసి , అందరూ నిర్ఘాంతపోయారు. చంద్రుడు నీరసంగా , మౌనంగా చేతులు జోడించాడు.
“సుఖీభవ !” అంటూ నారదుడు , పారవశ్యంతో గాలి పీల్చుకున్నాడు. “పరిమళం… పరవశింపజేస్తోంది !”
“రాత్రి పూర్తిగా ఆ రక్కసుడి వదనగహ్వనంలో ఉక్కిరిబిక్కిరైపోయి ఉన్నారు. స్వామీ ! అక్కడ ఊరిన ద్రవాలలో తడిసి , భరించలేని దుర్గంధంతో వచ్చారు కదా ! దివ్యమైన పరిమళ ద్రవ్యాలతో పతిదేవులకు అభ్యంగస్నానం చేయించాం !” అశ్వని వివరించింది.
“ఇంత మంది అంగనల చేత అభ్యంగనం చేయించుకునే మన చంద్రుడి అదృష్టమే అదృష్టం !” నారదుడు నవ్వుతూ అన్నాడు. “మహర్షీ ! నా భయాన్నీ , బాధనూ మీరు ఊహించలేదు !” చంద్రుడు నీరసంగా అన్నాడు.
“నారాయణ ! ద్వార బంధం ఆవల నుండి ఆలకించాను ! ఈ రాత్రి విశ్వవిహారానికి వెళ్ళడం లేదా ?” నారదుడు ప్రశ్నించాడు.
“శాశ్వతంగా మానుకోవాలన్న ఆలోచన వస్తోంది. మహర్షీ !” చంద్రుడు బలహీనంగా అన్నాడు.
“నారాయణ ! నెలలో సగ భాగం క్షయతో కుంచించుకుపోతూ కూర్చుంటావు. మిగిలిన సగమైనా విహారం చేయకపోతే ఎట్లాగా ? నువ్వు గగనాన సంచరిస్తూ చల్లటి కాంతిని వెదజల్లకపోతే ఓషధులు ఏమై పోవాలి ? ఔషధాలు ఎలా సిద్ధం కావాలి ? వ్యాధిగ్రస్థులు ఎలా బ్రతకాలి ?”
“తనకు మాలిన ధర్మం తప్పు కదా , మహర్షీ ?” చంద్రుడు దీనంగా అన్నాడు.
“నారాయణ ! నువ్వు ఈ విధంగా ఆలోచించి , విధులను విస్మరిస్తావన్న భయంతో , త్రిమూర్తులు నన్ను ఇక్కడికి పంపించారు…”
“త్రిమూర్తులా !”
“త్రిలోకాలలో ఏ ఉపద్రవం సంభవించినా , చక్కబెట్టాల్సింది ఆ ముగ్గురే కద చంద్రా ! మందిరంలో , ఈ మహిళామణుల మధ్యలో దాగే ఆలోచన విరమించి , నీ నిత్యసంచారం కొనసాగించమన్నారు ఆ దేవదేవులు ! రాహువును కట్టడి చేసిన విధంగానే ఈ కేతువునూ నియంత్రిస్తామని చెప్పమన్నారు…”
“నిజమా ?!”
“ఆ ! నిర్భయంగా నీ నిశావిహారాన్ని కొనసాగించు. కేతువు నీ సమీపానికి రాకుండా త్రిమూర్తులే అడ్డుకట్ట వేస్తారు !”
“ధన్యోస్మి !” చంద్రుడు సంతోషంగా అన్నాడు.
“రాహన్నా ! చూశావా , చంద్రుడు ఎలా మిడిసిపడుతున్నాడో !” ఆకాశంలోకి చూస్తూ అన్నాడు కేతువు.
“నిన్న నోటిలో నొక్కిపట్టి ఉక్కిరిబిక్కిరి చేశావు గదా , చిన్నాన్నా ! ఎంత ధైర్యం ఆ చంద్రుడికి ?” రాహు కేతువులతో బాటు నుంచున్న మేఘహాసుడు అన్నాడు.
“సూర్య చంద్రులు ధైర్యంగా ఆకాశంలో సంచరిస్తే గానీ మనం కబళించలేం కదా ! ఆ ఇద్దరూ తమ విధులను నిర్లక్ష్యం చేయలేరు కదా !” రాహువు నవ్వుతూ అన్నాడు.
“సరే ! ఇక గ్రహణ కార్యానికి కదులుతాను !” అన్నాడు కేతువు. రాహువూ , మేఘహాసుడు కేతువును కౌగిలించుకుని వీడ్కొలిపారు.
కేతువు ఆకాశంలోకి రివ్వున ఎగిరాడు. తలతిప్పి , తన వైపే చూస్తూన్న తండ్రీకొడుకులను , చిరునవ్వుతో చూశాడు.
“జయం ! జయం ! సోదరా !” రాహువు నవ్వుతూ అన్నాడు.
కేతువు ధూమకేతువులాగా వాయువేగంతో చంద్రుని వైపు దూసుకువెళ్తున్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹