కేతుగ్రహ చరిత్ర ఐదవ భాగము
“చాలా మంచి పురోగతి , మీ ఒడంబడిక ! మీరిద్దరూ నా పుత్రులే ! సూర్యుడూ నా పుత్రుడే ! నా కంటిని నా వేలితో నేనే పొడుచుకున్నట్టుగా లోలోపలే కుమిలిపోయాను , ఇన్నాళ్ళూ !” కశ్యపుడు చిరునవ్వుతో అన్నాడు. “ఆ చంద్రుడు కూడా మనకు దూరస్థుడేం కాదు. నా తండ్రిగారి సోదర మానస పుత్రుడైన అత్రి మహర్షి పుత్రుడే !”
“అన్నీ పరిగణనలోనికి తీసుకున్న అనంతరమే మేము త్రిమూర్తుల సూచనను అంగీకరించాం , నాన్నగారూ !” రాహువు అన్నాడు.
“సంతోషం నాయనా ! సూర్యుడితో పాటు మీరిద్దరూ ఉన్నత స్థానాలు సాధించుకున్నారు. లోకారాధ్యులు కాబోతున్నారు ! ఇద్దర్నీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను !” కశ్యప ప్రజాపతి ఆప్యాయంగా అన్నాడు.
“నా బిడ్డ ప్రయోజకుడయ్యాడు కదా , నన్ను అభినందించండి ! సింహిక నవ్వుతూ అంది.
“నా పుత్రుడు కూడా !” దనూదేవి అంది , కేతువును దగ్గరకు తీసుకుంటూ
“నన్ను కూడా అభినందించి , ఆశీర్వదించండి , పితామహా ! మీ పుత్రులిద్దరికోసం తపస్సు చేసి , శివుణ్ణి మెప్పించాను !” మేఘహాసుడు తాతగారి దగ్గరగా వచ్చి , ఆయనను రెండు చేతుల్తో పట్టుకుంటూ అన్నాడు.
“పుత్రులూ , పౌత్రులూ గొప్పవాళ్ళవుతున్నారు ! అది ఆ పరమాత్మ సంకల్పం , నా అదృష్టం !” అంటూ కశ్యపుడు మేఘహాసుడిని వాత్సల్యంతో దగ్గరగా తీసుకున్నాడు. రాహువు , కేతువూ మళ్ళీ నవ్వడం ప్రారంభించారు.
“క్లుప్తంగా ఇదీ కేతువు కథ !” నిర్వికల్పానంద ముగిస్తూ అన్నాడు.
“కేతు చరిత్ర మరీ సంక్షిప్తంగా వినిపించారు !” చిదానందుడు నవ్వుతూ అన్నాడు.
“కేతు గ్రహం గురించి ఉపలబ్దంగా ఉన్న కథనే మనం చెప్పుకున్నాం ! ఇతర గ్రహ దేవతలకు ఉన్నట్టు చరిత్ర విస్తృతంగా లేకపోయినప్పటికీ , ప్రభావంలో , మహిమలో కేతువు సోదర గ్రహ దేవతలకు సమానుడే !” నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు.
“గురువు గారూ ! ఇంతటితో నవగ్రహాల చరిత్రలు సమాప్తమైనట్టేనా ?” శివానందుడు ప్రశ్నించాడు.
“ఆలోచించి , నువ్వే చెప్పు , శివానందా !” నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. శిష్యులందరూ కుతూహలంగా చూశారు.
“నవగ్రహాలు ఆవిర్భవించారు , పెరిగి పెద్దవారయ్యారు , పదవులకు తగిన అర్హతలు సంపాదించుకున్నారు ! వాళ్ళ స్థానమానాలు నిర్ణయించబడాలి ! ఆధిపత్యాలు నిర్దేశించబడాలి ! నవగ్రహదేవతలుగా అభిషేకించబడాలి !” నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు. “ఈ కార్యక్రమాలన్నీ పూర్తయితే గానీ , నవగ్రహ దేవతల చరిత్రలు పరిసమాప్తం కావు కద !”
“అయితే , గురువుగారిప్పుడు నవగ్రహాల నియామక విశేషాలు వినిపిస్తారు !” విమలానందుడు తన మిత్రుల వైపు చూస్తూ ఉత్సాహంగా అన్నాడు.
“త్రిమూర్తుల ఆదేశాన్ని అనుసరించి , నారద మహర్షి నవగ్రహాల పట్టాభిషేక మహోత్సవానికి సకల దేవతలనూ ఆహ్వానించాడు.
“సూర్య చంద్ర కుజ బుధ బృహస్పతీ శుక్ర శని రాహు కేతువులనూ , వాళ్ళ పత్నులనూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. నవగ్రహాల తల్లిదండ్రులకూ , వాళ్ళ పత్నుల తల్లిదండ్రులకూ కూడా ఆహ్వానాలు అందాయి. నారదుడు ముందు చూపుతో దైత్యదానవులకు కూడా ఆమంత్రణం చేసాడు. బ్రహ్మదేవుడి సూచనతో నారదుడు స్వాయంభువ మనువుకూ , ఆయన ధర్మపత్ని శతరూపాదేవికీ ఆహ్వానం అందజేశాడు…”
నిర్వికల్పానంద చెప్పసాగాడు.
రేపటి నుండి నవగ్రహ పట్టాభిషేకం ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹