మహాభారతం – బుద్ధాది అవతారాలు
భూభారాన్ని తగ్గించడానికీ వీలైనంత ఎక్కువమంది దుష్టుల్ని సంహరింపడానికీ భగవానునిచే కల్పింపబడిన మహాభారత యుద్ధమును యుధిష్ఠిరాది పాండవులను శ్రీకృష్ణుడు రక్షించిన తీరును ఒకపరి తలుద్దాం.
విష్ణు భగవానుని నాభి కమలం నుండి నేను (అనగా బ్రహ్మ)పుట్టాను కదా! నానుండి అత్రి, అతడి నుండి చంద్రుడు, అతడి నుండి బుధుడు ఉద్భవించారు. బుధునికి ఇలాదేవియను పత్ని ద్వారా పురూరవుడు జనించాడు.
అతనికి ఆయువను పుత్రుడు అతనికి యయాతి అను కొడుకు పుట్టారు. యయాతి వంశంలో భరతుడు, కురుడు, శంతనుడు కలిగారు. శంతనునికి గంగ ద్వారా సర్వ సద్గుణ సంపన్నుడు, బ్రహ్మ విద్యలో పారంగతుడునగు దేవవ్రతుడు జనించాడు.
ఏ యుగంలోనూ ఎవరూ చేయలేనంత గొప్ప ప్రతిజ్ఞను చేసి బ్రహ్మచారిగానే చివరిదాకా జీవించి రాజ్య సింహాసనాన్ని కూడా తండ్రిగారి రెండవ పెళ్ళి ముచ్చట తీర్చడం కోసం త్యజించిన దేవవ్రతునే ఆ ప్రతిజ్ఞ యొక్క భీషణత్వానికి అచ్చెరువొంది ఈ లోకం అత్యంతాదరంతో భీష్ముడని పిలుచుకొంది.
శంతనునికి భీష్ముని దయ వల్ల ప్రాప్తించిన పత్ని సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అను కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు అదే పేరుగల గంధర్వుని తోడి యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుని కోసం భీష్ముడు కాశీరాజ పుత్రికలైన అంబికను అంబాలికను తెచ్చి అతనికిచ్చి వివాహం చేశాడు. విచిత్రమైన వీరత్వం ఏమాత్రమూ లేని విచిత్ర వీర్యుడు పిల్లలు పుట్టకముందే మరణించాడు.
అప్పుడు సత్యవతి శంతనుని వంశాన్ని నిలబెట్టడం కోసం తన పెద్ద కొడుకైన వ్యాస దేవుని ఆజ్ఞాపించి దేవర న్యాయం ద్వారా తనకోడళ్ళను పుత్ర వతులను చేయించింది. అంబికకు ధ్రుతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు పుట్టారు. అంబిక తరపున పోయిన ఆమె దాసి వ్యాసమహర్షి ద్వారా విదురుని కన్నది.
ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా నూరుగురు కొడుకులు, ఒక కూతురు కలుగగా పాండురాజునకు కుంతి ద్వారా యుధిష్ఠిర భీమార్జునులు, మాద్రి ద్వారా నకుల సహదేవులు కలిగారు. గాంధారి పుత్రులను కౌరవులనీ కుంతీ మాద్రుల కొడుకులను పాండవులనీ లోకం పిలుచుకోసాగింది.
ఈ నూట ఐదుగురు వంశాంకురాలూ మహాబలశాలులే గాని గాంధారి పెద్దకొడుకైన సుయోధనుడు, పాండవులూ సాహస పరాక్రమాలూ కూడా వుండడం వల్ల మహావీరులుగా ప్రఖ్యాతి చెందారు.
దైవవశాత్తూ కౌరవ పాండవుల మధ్య వైరభావాలు జనించాయి. దుర్యోధనుడు పాండవులనెన్నో బాధలకు గురిచేశాడు. లక్క ఇంటిని వారికి విడిదిగా చూపించి దానిని దహనం చేయించాడు. ముందే పసిగట్టిన విదురుడు సొరంగమార్గాన్ని తవ్వించి పాండవులను రక్షించాడు.
విదురుని సలహా మేరకు పాండవులు కొన్నాళ్ళు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో నివసించారు. అక్కడ భీముడు బకాసురుడను రాక్షసుని చంపి ఆ పుర నివాసులకు శాశ్వతంగా వాని పీడను వదిలించాడు.
అక్కడినుండి పాంచాల దేశానికి వెళ్ళి ద్రౌపదీ స్వయంవరంలో పాల్గొన్నారు పాండవులు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించి ద్రౌపదిని గెలుచుకోగా విధివశాన ఆమె పాండవ పత్నియైనది.
తరువాత భీష్మ ద్రోణుల ప్రోద్భలం వల్ల, విదురుని మంత్రాంగం వల్ల ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి వారికి అర్థరాజ్యాన్నిచ్చేశాడు. వారు ఇంద్ర ప్రస్థమనే గొప్ప సుందర మైన రాజధానిని కట్టుకొని ఒక అద్భుతమైన సభామండపాన్ని కూడా నిర్మింపజేసుకుని రాజసూయ యజ్ఞాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చారు.
వాసుదేవుని అనుమతితోనే అర్జునుడు ద్వారకాపురికి పోయి కృష్ణసోదరి సుభద్రను పెండ్లాడాడు. అగ్నిదేవునికి ఖాండవ వన దహనంలో సహాయపడి నంది ఘోషమను దివ్యరథాన్ని, ముల్లోకాలలో శ్రేష్ఠతమమైనదిగా పేరు గాంచిన గాండీవమను ధనుస్సునూ, అవినాశములైన బాణములనూ, అభేద్య దివ్య కవచాన్నీ ఆయననుండి అర్జునుడు పొందాడు.
రాజసూయ సందర్భంగా దేశ దేశాంతరాలలో దిగ్విజయ యాత్రను చేసి అసంఖ్యాకములుగా యుద్ధాలను చేసి అనేకులైన రాజులనోడించి వారి నుండి కప్పములుగా గొన్న కొండలంతేసి రత్నరాశులను అర్జునుడు తన అన్న యుధిష్ఠిరునకు (ధర్మరాజుకి) సమర్పించాడు.
పాండవుల మొత్తం శ్రీని అపహరించడానికి శకుని ధర్మరాజుని ద్యూతక్రీడకు ఆహ్వానించి దుర్యోధనుని ప్రతినిధిగా తాను పాచికలు వేసి మాయచేసి గెలిచాడు. తత్ఫలితంగా పాండవులు ద్రౌపదితో సహా పన్నెండేళ్ళు వనవాసమూ, ఒక ఏడు అజ్ఞాత వాసమూ చేయవలసి వచ్చింది. కుంజరయూధము దోమ కుత్తుక జొచ్చినట్లు పాండవులు. విరాటరాజు కొలువులో పనిచేసి అజ్ఞాతవాస నియమాన్ని పూర్తిచేశారు.
అజ్ఞాతవాస కాలంలో పాండవులలో ఏ ఒక్కరు బయటపడిపోయినా మరల వారందరూ పన్నెండేళ్ళు వనవాసమూ ఒక యేడు అజ్ఞాతవాసమూ చేయాలనే నియమం పెట్టారు.
కాబట్టి పాండవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వప్రయత్నం చేసిన దుష్ట చతుష్టయానికి అనగా దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులకు చివరి దశలో పాండవులు. విరాట రాజ్యంలో వున్నారేమోననే అనుమానం వచ్చి పెద్ద సైన్యంతో దాడిచేసి గోవులను అపహరించడానికి ప్రయత్నించారు. అర్జునుడు వచ్చి అవక్రవిక్రమ ప్రతాపాన్ని మెరిపించి మొత్తం కౌరవసేనను చిత్తుచిత్తుగా ఓడించాడు. కర్ణుడు పడిపోయాడు. దుర్యోధనుడు. మూర్ఛపోయాడు.
తెలివివచ్చి సంతోషించబోయిన దుర్యోధనునికి అజ్ఞాతవాసకాలం నాటికి ముందరి రోజే సమాప్తమైపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వెనుకకు మరలించు కుపోయారు గురువులు.
జూదపు నియమాలను దిగ్విజయంగా పాటించారు. కాబట్టి తమ అర్థరాజ్యాన్ని తమకివ్వాలనీ అలాకాని పక్షంలో కనీసం అయిదూళ్ళయినా ఇమ్మని పాండవులు శ్రీకృష్ణుని ద్వారా రాయబారం చేశారు. సూదిమోపినంత స్థలమైనా ఇవ్వబోనని దుర్యోధనుడు చెప్పడంతో అసలు రాజుకు గుడ్డితనంతోబాటు మూగరోగం కూడా కలగడంతో యుద్ధమూ, బంధునాశమూ తప్పలేదు.
(ముసలిరాజుకి అంధత్వం పుట్టుకతోనే వచ్చింది. ఈ మూగతనం పుత్ర వ్యామోహం నుండి ఇప్పుడు పుట్టుకొచ్చింది)
(అయిదువేల యేళ్ళ క్రిందట)
ఆ ముందుగానీ ఆ తరువాత గానీ ఏ ఒక్కజాతీ కనీవినీ ఎఱుగని మహాయుద్ధం కౌరవపాండవుల బాహ్య నాయకత్వాన కురుక్షేత్రంలో జరిగింది.
పాండవుల తరఫున ఏడు అక్షౌహిణుల సైన్యమూ, కౌరవులవైపున పదకొండ క్షౌహిణుల సైన్యమూ ఈమహాసంగ్రామంలో పాల్గొన్నారు. ధృష్టద్యుమ్నుని పాండవులూ భీష్ముని కౌరవులూ తమ తమ సర్వ సైన్యాధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
పాండవ సేనాధిపతి యుద్ధం ముగిసేదాకా ఆ పదవిలోనే ఉన్నాడు కానీ కౌరవ సేనాపతులు మారవలసి వచ్చింది.
(ఈ క్రింది పేరా గరుడపురాణానికే ప్రత్యేకం….)
పాండవసేనాపతిగా శిఖండీ, కౌరవసేనాపతిగా భీష్ముడూ యుద్ధాన్ని ప్రారంభించారు. రెండు సేనల మధ్యా అస్త్రశస్త్రాలతో బ్రహ్మాండమైన యుద్ధం భయంకరంగా పదిరోజులపాటు జరిగింది. పదవరోజు శిఖండి, అర్జునుడు ప్రయోగించిన వందలాది బాణాలు తన తనువును భేదించడంతో భీష్ముడు నేలకొరిగాడు.
స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు హస్తినాపురానికి సమర్థమైన స్థిరమైన పాలన వచ్చేదాకా మరణించదలచుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేదాకా అలాగే అంపశయ్యపై వుండి యుద్ధాన్ని ఆరగానే అప్పటికి మిగిలిన ధర్మరాజుకి (విష్ణుసహస్రంతోసహా) సర్వ ధర్మ సంబంధిత విభిన్న ఉపదేశాలనిచ్చి, పితృతర్పణలిచ్చి, శ్రీకృష్ణభగవానుని తదేకంగా తిలకిస్తూ ప్రాణం విడిచాడు. ఆయనకు నిర్మలాత్ములకు లభించే పరమానంద పదమైన మోక్షం లభించింది.
తరువాత కౌరవ సైన్యాధ్యక్ష పదవిపై ద్రోణాచార్యుడాసీనుడైనాడు. ఆయన పాండవ సేనాపతియైన ధృష్టద్యుమ్నునితో తలపడ్డాడు. వీరి సేనలమధ్య భయంకరమైన యుద్ధం అయిదురోజులపాటు సాగింది. కౌరవుల పక్షాన పోరాటం చేస్తున్న వందల కొలది రాజులు అర్జునుని బాణాగ్నిలో భస్మమైపోయారు. అశ్వత్థామ మృతి చెందాడనే అసత్యపు వార్త విని హతాశుడై ద్రోణాచార్యుడు మరణించాడు. (ఆయనను ధృష్టద్యుమ్నుడు చంపినట్టు ఇక్కడ చెప్పబడలేదు).
తరువాత కర్ణుడు కౌరవ సేనాపతిగా రెండురోజులు ప్రచండంగా యుద్ధాన్ని కొనసాగించాడు కానీ అతడు మహావీరుడైన అర్జునుని నిశితాస్త్రాల దెబ్బకు నేలకొరిగాడు. అప్పుడు సేనాపతిగా నియుక్తుడైన శల్యుడు అపరాహ్ననికి ముందే ధర్మరాజు తోడి యుద్ధంలో మరణించాడు.
కాలాంతకుని వలె కాలసర్పంవలె క్రోధంతో బుసలుకొడుతూ యమదండము వంటి గదను తిప్పుతూ భీమునిపైకి పోయిన, దుర్యోధనుడు తన అధర్మమే భీముని రూపంలో తననోడించగా నేలకొరిగాడు. ”యతో ధర్మస్తతో జయః” అనే సూక్తికి నిలువెత్తు ఆదర్శంగా, ఉదాహరణగా భారతయుద్ధం చరిత్రలో నిలచి వుంది.
యుద్ధం ముగిసిపోయినా హత్యాకాండ ఆగలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అర్ధరాత్రి వేళ పాండవ శిబిరంపై దాడిచేసి తన తండ్రి వధను స్మరిస్తూ ఎందరో పాండవ వీరులను సంహరించాడు. అలా చంపబడిన వారిలో ధృష్టద్యుమ్నుడూ, ద్రౌపది పుత్రులైన పంచపాండవులూ ఉన్నారు. అర్జునుడు అశ్వత్థామను వెంబడించిపోయి అతనిని నిలువరించి యుద్ధంలో ఓడించి ఐషికమను పేరు గల అస్త్రంతో అతని సర్వశక్తులకూ, అహంకారానికీ కారణమైన శిరోమణిని పెకిలించి వేశాడు. గురు పుత్రుడనీ బ్రాహ్మణుడనీ అశ్వత్థామను అర్జునుడు చంపలేదు.
ధర్మరాజు అత్యంత శోక సంతప్తలైన స్త్రీల నందరినీ ఓదార్చి తాను పవిత్రక స్నానమాచరించి దేవతలకూ పితృజనులకూ తర్పణాలిచ్చాడు. తరువాత రాజ్యాభిషిక్తుడై ప్రజాశ్రేయస్సు కోసం అశ్వమేధయాగాన్ని చేసి విష్ణువును పూజించాడు. బ్రాహ్మణులను దక్షిణాదులతో తృప్తిపఱచాడు. ఈలోగా శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. ఆ వార్తను వినగానే ధర్మరాజు అభిమన్యు పుత్రునికి రాజ్యాభిషిక్తుని చేసి తన సోదరులతో పత్నితో సహా విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వర్గం వైపు సాగిపోయాడు.
మహాభారతయుద్ధంలో అసురశక్తులు తొంబది శాతం నశించినా ఇంకను కొందరు దానవులు మిగిలిపోయారు. వారు శరవేగంతో అభివృద్ధి చెందడాన్ని గమనించి శ్రీమహా విష్ణువే బుద్ధుడై అవతరించి వారిని సమ్మోహితులను చేసి వారిలోని దానవత్వాన్ని రూపుమాపి ఉత్తమ మానవులనుగా తీర్చిదిద్దాడు.
అధర్మం ప్రస్తుతానికి అదుపులో వుంది. అది గాడి తప్పి విజృంభిస్తుంది. అపుడు శ్రీమహావిష్ణువు శంభల గ్రామంలో కల్కినామంతో అవతరిస్తాడు. అశ్వాన్నధిరోహించి జగమంతటా కలియదిరిగి ఎక్కడెక్కడి అధర్మపరులనూ వెదకి పట్టుకొని వధిస్తాడు.
రుద్రదేవా! అధర్మాన్ని అంతమొందించడానికీ, సత్త్వగుణ ప్రధాన దేవతల శక్తులను పెంచడానికీ, పుడమిపై పెచ్చరిల్లు అశాంతిని త్రుంచడానికి శ్రీమన్నారాయణుడేదో ఒక రూపంలో దిగి వస్తూనే ఉంటాడు.
లోకుల ఆరోగ్య రక్షణ కోసం పాల సముద్రంలో అమృత భాండాన్ని పట్టుకొని ధన్వంతరిగా అవతరించిన ఆయనే విశ్వామిత్ర పుత్రుడైన సుశ్రుతుడను మహాత్మునికి ఆయుర్వేదాన్ని స్వయంగా ఉపదేశించాడు.
నూట పన్నెండవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹