Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట పదమూడవ అధ్యాయం

ఆయుర్వేద ప్రకరణం

గరుడ పురాణంలోని ఆయుర్వేద ప్రకరణానికి గొప్ప ప్రసిద్ధి ఉంది. ఇందులోని మొదటి ఇరవై అధ్యాయాలలో నిదాన స్థాన విషయాలు వర్ణింపబడ్డాయి రోగ కారణాలనూ లక్షణాలను బట్టి రోగనిర్ణయాన్ని చేయడాన్నే రోగ నిదానమంటారు.

తరువాతి నలభై అధ్యాయాలలో రోగచికిత్స, ఔషధాలు వాటి నిర్మాణ విధి చెప్పబడ్డాయి. అంతేగాక మందుకి తగిన అనుపానం, వాడవలసిన తీరు కూడా చేర్చబడ్డాయి. ఒకే రోగానికి అనేకములైన మందులు సూచించబడ్డాయి. కాని వీటిని సుయోగ్యుడైన వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి.

ఈ ప్రకరణంలో (పురాణంలో) అక్కడక్కడ గల ఖండితాలనూ, అస్పష్టతనూ ఆర్ష సంస్కృతికి చెందిన ఆయుర్వేద గ్రంథాలనాశ్రయించి సరిచేయడం జరిగింది.

రోగనిదానం

ధన్వంతరి సుశ్రుతునికి చెప్పిన శాస్త్రమిది.

ప్రాచీన కాలంలో ఆత్రేయాది మహామునులు రోగనిదానానికి సంబంధించి గొప్ప కృషి చేశారు. దానికి స్వయంకృషినీ ప్రతిభనూ జోడించి ధన్వంతరి ఇలా ఉపదేశించాడు. సుశ్రుత పాప, జ్వరం, వ్యాధి, వికార, దుఃఖ, ఆమయ, యక్ష్మ, ఆతంక, గద, ఆబాధ – ఇవన్నీ పర్యాయవాచ్యములైన శబ్దములు.

రోగాన్ని తెలుసుకోవడానికి అయిదు ఉపాయాలుంటాయి. అవి నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయం, సంప్రాప్తి, నిమిత్తం, హేతువు, ఆయతనం, ప్రత్యయం, ఉత్థాన కారణం అనే వాటిని బట్టి రోగాన్ని పోల్చడమే రోగనిదానం. దోషవిశేషాలు తెలియకుండానే రోగాన్ని పోల్చగలిగితే దానిని పూర్వరూపమంటారు.

ఇది సామాన్యమనీ, విశిష్టమనీ రెండు విధాలు. ఈ పూర్వరూపం పూర్తిగా వ్యక్తమైతే రూపం అనబడుతుంది. సంస్థాన, వ్యంజన, లింగ, లక్షణ, చిహ్న, ఆకృతి, ఇవి రూపానికి పర్యాయ వాచ్యములైన శబ్దాలు. హేతు విపరీతం, వ్యాధి – విపరీతం, హేతు వ్యాధి- ఉభయ విపరీతం, హేతు విపరీతార్థకారి, వ్యాధి విపరీతార్థకారి, హేతు వ్యాధి ఉభయ విపరీత అర్థకారి ఔషధాలుంటాయి. ఇవి అన్న, విహారాలను సుఖదాయకంగా ఉపయోగపడేలా చేస్తాయి.

దీనిని సాత్మ్యమంటారు. ఉపశయమని కూడా అంటారు. దీనికి విపరీతం అనుపశయం. అనుపశయానికి మరోపేరు వ్యాధ్య సాత్యము, దోషం శరీరంలో పైకి గాని ఇతర దిశల్లో గాని వ్యాపిస్తున్న పద్ధతి, దానివల్ల వచ్చేరోగం సంప్రాప్తి అనబడుతుంది. దానికి పర్యాయ పదాలు జాతి, ఆగతి.

సంప్రాప్తిలో సంఖ్య, వికల్పం, ప్రాధాన్యం, బలం, వ్యాధి కాల విశేషతలు ఆధారంగా విభిన్న విధాలునిర్ణయింపబడివున్నాయి. ఈ శాస్త్రంలోనే జ్వరభేదాలు ఎనిమిది చెప్పబడ్డాయి. ఇది సంఖ్యా సంప్రాప్తి.

రోగోత్పత్తికి కారణభూతమైన దోషములు అంశాంశ కల్పన అంటే ఎక్కువ, తక్కువల వివేచన వికల్ప సంప్రాప్తి,స్వతంత్రత లేదా పరతంత్రతల ద్వారా దోషాల యొక్క ప్రాధాన్యాన్ని గానీ, అప్రాధాన్యాన్ని గానీ వివేచన చేయడం ప్రాధాన్య సంప్రాప్తి. హేతు – పూర్వరూపం, రూపముల సంపూర్ణత లేదా అల్పతల ద్వారా రోగబలం, అబలములను వివేచించడం బలసంప్రాప్తి.

దోషానుసారం రాత్రి, పగలు, ఋతువు,భోజనాల పరిపాక అంశాలు (ఆది, అంత, మధ్య) చూసి వాటి ద్వారా రోగకాలాన్ని తెలుసుకోవడం కాలసంప్రాప్తి.

ఈ విధంగా నిదానం యొక్క అభిధేయాలు (నిదాన, పూర్వరూప, రూప, ఉపశయ, సంప్రాప్తి) నిర్వచింపబడడం జరిగింది. ఇపుడు వాటిని మరింత విస్తారంగా చూద్దాం. అన్ని రోగాలకూ మూలకారణం శరీరస్థితమైన కుపిత దోషమే. అయితే దోష- ప్రకోపానికి ఒంటికి పడని తిండి ఎక్కువగా దోహదం చేస్తుంది. దీనిని అహిత సేవనమంటారు.

ఇది మూడు రకాలు.

వాత ప్రకోప నిదానం:-

చేదు, వేడి, కషాయ, ఆమ్ల, గట్టి పదార్థాలతో అన్నమును అతిగా తినడం, పరుగులు పెట్టడం గబగబా మాట్లాడడం, రాత్రి జాగరం, ఎక్కువ ధ్వనిచేస్తూ మాట్లాడడం, అన్ని పనులనూ అతిగా చేస్తుండడం, భయం, శోకం, చింత, అతి వ్యాయామం, శృంగారంలో మితిలేకుండా పాల్గొనడం, వీటివల్ల శరీరంలోని వాయువు ప్రకోపానికి లోనవుతుంది. ఈ వాయువికారం విశేషించి గ్రీష్మఋతువులో పగటి, రాత్రి భోజనాల తరువాత ఎక్కువగా బాధిస్తుంది.

పిత్త ప్రకోప నిదానం:-

చేదు, గట్టి, గరుకు, వేడి, ఉప్పటి పదార్థాలనూ కోపాన్నీ, దాహాన్నీ పెంచే తిళ్ళనూ తినడం వల్లం పిత్తం ప్రకోపిస్తుంంది. ఇది శరదృతువులో మధ్యాహ్నం అర్ధరాత్రి వంటి మంటను పుట్టించే క్షణాలలో ఎక్కువగా బాధిస్తుంది.

కఫ ప్రకోపనిదానం:-

తీపిరసాలు, ఆమ్లాలు, లవణాలు, స్నిగ్ధ, గురు, అభిష్యంది, శీతల భోజనాల వల్లనూ, ఎక్కువకాలం కూర్చొనుట, నిద్రపోవుట, సుఖపడుట, అజీర్ణం, పగటినిద్ర, బలకారక పదార్థాలను అతిగా తినుట, కష్టపడకపోవుట మొదలగు కారణాల వల్ల అన్నం అరిగే ప్రారంభకాలంలోనూ, రాత్రి పగలు ప్రారంభ కాలాల్లోనూ కఫం ప్రకోపిస్తుంది. దీన్నే శ్లేష్మమని కూడా అంటారు.

త్రిదోష సామాన్య సంప్రాప్తి:

ఈ మూడు ప్రకోపాల మిశ్రిత స్వభావంతో సన్నిపాతం పుట్టుకొస్తుంది. సంకీర్ణ భోజనం, అజీర్ణం కలిగించే భోజనం, విషమ, విరుద్ధ భోజనం (మొత్తం మీద వంటికి పడని తిండి) మద్యపానం, పచ్చిముల్లంగి, ఎండినకూరలు, గానుగపిండి, మృత్యువత్సరమని పేరుగాంచిన పేలపిండి, మాంసం, చేపలు ఇవన్నీ సన్నిపాతాన్ని తెచ్చే ఆహారాలే.

దూషితాన్నమూ, గ్రహప్రభావమూ కూడా ఈ వికారాన్ని తెచ్చిపెడతాయి. ఇంకా చాలా చాలా కారణాలే వున్నాయి. రసవాహినుల ద్వారా శరీరం లోపలకి చేరుకొని రోగాలను కలిగించే పదార్థాలు కూడా ఉన్నాయి.

నూట పదమూడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment