Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట ఇరవై నాల్గవ అధ్యాయం

నవగ్రహాల పట్టాభిషేకం ఐదవ భాగము

చిత్రవిచిత్రమైన అనేక వర్ణాలు కలిసిన పది ”శబలాశ్వాలు” లాగుతున్న ఇనుప రథం శబ్దం చేస్తూ దేవతా పంక్తుల వైపు దూసుకు వస్తోంది. రథం మీద నల్లటి గొడుగూ , నల్లటి పతాకం చూపరులను భయభక్తులకు గురిచేస్తూ కనిపిస్తున్నాయి.

నల్లటి వస్త్రాలు , నల్లటి పుష్పమాలికలూ ధరించిన శనైశ్చరుడు సహజమైన తన నల్లటి కాటుకలాంటి దేహకాంతితో రెండు చక్రాల ఇనుప రథం మీద వేగంగా వస్తూ సందర్శకులలో ఒక విధమైన లీలామాత్రమైన భీతిని పుట్టిస్తున్నాడు.

“నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం !

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ !”

శనిని స్తుతిస్తూ సప్తర్షులు పుష్పాక్షతలు చల్లుతున్నారు. వెంటనే దేవరాక్షస గణాలు సమధికోత్సాహంతో శనైశ్చర స్తుతిని పఠించసాగారు. పూలవాన కురిపిస్తూ , దేవతా పంక్తులనూ , రాక్షస పంక్తులను దాటి , శనైశ్చరుడు తన రథాన్ని శుక్రుడి ప్రక్కన ఆపాడు.

అనంతరం రాహువు తన రెండు చక్రాల రథాన్ని నడుపుతూ వచ్చాడు. రాహు రథం బూడిద రంగులో ఉంది. తుమ్మెదలలాగా నల్లగా ఉన్న అశ్వాలు ఎనిమిది – ఆ రథాన్ని లాగుతున్నాయి , వాయువేగంతో ! రథం మీద నల్లటి గొడుగూ , నల్లటి పతాకం ఉన్నాయి. నీలాంబరాన్ని నీలవర్ణ పుష్పమాలికలనూ ధరించిన రాహువు రథం మీద తన ఉగ్ర స్వరూపాన్ని అట్టహాసంగా ప్రదర్శిస్తూ కూర్చున్నాడు.

దగ్గరగా వచ్చిన రాహువు మీద పూలూ , అక్షతలూ , చల్లుతూ మహర్షులు స్తోత్రం ప్రారంభించారు.

“అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం !

సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ !”

సోత్రపఠనం చేసిన సప్తర్షుల కంఠాలు ప్రతిధ్వనులుగా సురాసుర కంఠాలు ధ్వనిస్తూ , రాహు స్తోత్రాన్ని పఠించాయి. దేవతలూ , రాక్షసులూ కురిపిస్తున్న పుష్పవర్షాన్ని సగర్వంగా స్వీకరిస్తూ రాహువు రథాన్ని ముందుకు పోనిచ్చాడు. ఆయన రథం శనైశ్చరుడి రథం దగ్గరగా ఆగింది. తమ సోదరుడైన రాహువును కీర్తిస్తూ అసురులు చేస్తున్న జయజయధ్వానాల భీకర శబ్దాన్ని కేతు రథ చక్రాల ధ్వని కబళించివేసింది.

నలుపూ , ఎరుపూ కలిసిన విచిత్రమైన ధూమ్రవర్ణంలో మెరిసిపోతున్న ద్విచక్రరథాన్ని లాక్షారసంలాగా ఎర్రగా ఉన్న ఎనిమిది గుర్రాలు లాగుతూ , మహావేగంతో పరుగు తీస్తున్నాయి.

చిత్ర విచిత్రమైన రంగులు వేళవించిన వస్త్రాన్ని ధరించిన కేతువు కంఠసీమలో చిత్ర పుష్పాల చిత్రమాలిక తళతళలాడుతోంది. రథం మీద ధ్వజమూ , ఛత్రమూ కూడా ఆయన వస్త్రాలలాగే చిత్ర వర్ణాలతో ఉన్నాయి ! చిత్ర వర్ణ వస్త్రాలతో , మాలికలతో అలంకించబడిన కేతువు శరీరం మోదుగపువ్వు రంగులో చూపులకు అద్భుతావహంగా ఉంది.

“పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం !

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !”

పుష్పాక్షత వర్షం కురిపిస్తూ , కేతు స్తోత్రం పఠించారు సప్తర్షులు.

దేవరాక్షసులు ముక్త కంఠాలతో యధావిధిగా కేతు స్తోత్ర శ్లోకాన్ని పఠిస్తున్నారు. పుష్పాలు విసురుతూ , జయజయధ్వానాలు చేస్తున్న సోదర అసురుల మధ్య తన రథాన్ని పోనిస్తూ , అందరినీ రౌద్ర గంభీరంగా చూస్తున్నాడు కేతువు.

తన సమీపాన రథాన్ని ఆపుతున్న కేతువును చూస్తూ , ఆనందంగా , గర్వంగా చిరునవ్వు నవ్వాడు రాహువు.

నవగ్రహ దేవతల పత్నులు – దేవ దానవ సందర్శక పంక్తుల మధ్య నడుస్తున్నారు. వాళ్ళ ముందు నడుస్తున్న అప్సరసలు పువ్వులు చల్లుతున్నారు. తమ వైపు వయ్యారంగా నడిచి వస్తున్న పత్నులను , రథాల మీద ఉన్న నవగ్రహాలు చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్నారు.

సూర్యపత్ని , సంజ్ఞ , చంద్రపత్నులు – అశ్విని , భరణి , కృత్తిక , రోహిణి , మృగశిర , ఆర్ద్ర , పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ , పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త , స్వాతి , విశాఖ , అనూరాధ , జ్యేష్ఠ , మూల , పూర్వాషాఢ , ఉత్తరాషాఢ , శ్రవణం , ధనిష్ఠ , శతభిషం , పూర్వాభాద్ర , ఉత్తరాభాద్ర , రేవతి , అంగారక పత్ని శక్తి , బుధుడి సతీమణి ఇల , గురువు పత్ని తార , శుక్రపత్ని ఊర్జస్వతి , శని సతీమణి జ్యేష్టాదేవి , రాహుపత్ని సింహిదేవి , కేతు పత్ని చిత్రలేఖ చిరునవ్వులు చిందిస్తూ పట్టాభిషిక్తులైన తమ భర్తల రథాల వైపు వెళుతున్నారు.

గ్రహపత్నులందరూ తమతమ పతిదేవుళ్ళ రథాలను అధిరోహించారు. సతీసమేతంగా దర్శనమిస్తున్న నవగ్రహాలను చూస్తూ అందరూ కరతాళధ్వనులు చేస్తున్నారు.

నవగ్రహాలకు దివ్య సుందర రథాలను సమకూర్చిన విశ్వకర్మను అభినందించారు , త్రిమూర్తులు.

“విశ్వకర్మ మీ కోసం – జ్యోతిశ్చక్రంలో మీ మీ నిర్దేశిత స్థానాలలో నిర్మించిన మందిరాలలో వాసం చేయండి. మీ ఆధిపత్యాలనూ , కారకత్వాలనూ అనుసరించి ప్రాణుల జీవితాలను నిర్దేశించండి. ముఖ్యంగా భూలోకవాసులైన మానవుల ఆరాధనలు అందుకుంటూ , వాళ్ళను తరింపజేయండి !” విష్ణువు నవగ్రహ దేవతలతో అన్నాడు.

“ఆజ్ఞ !” నవగ్రహ దేవతలు ఏకకంఠంతో అన్నారు.

“సూర్యచంద్రులిద్దరికీ ఇదివరకే సంబంధిత మండలాలలో రమ్యమైన హర్మ్యాలు నిర్మించి స్వాధీనం చేయబడ్డాయి. ఆ ఇద్దరూ సకుటుంబంగా ఆ మందిరాలలో వసిస్తున్నారు…” విష్ణువు మళ్ళీ అన్నాడు. “కుజ , బుధ , గురు , శుక్ర , శని , రాహు కేతువులు పట్టాభిషేక సందర్భంలో తమ తమ నూతన భవనాలలో నివాసం ప్రారంభిస్తారు. మీరు తొమ్మండుగురూ సూక్ష్మ రూపాలలో ఉన్నప్పటి స్థానాలే ఇప్పుడూ మీకు అంతరిక్షంలో లభించాయి. ఎవరెవరి జ్యోతిర్మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో – దేవతలందరికీ అవగాహన కలగడం కోసం చతుర్ముఖుడు వివరిస్తాడు.”

చిరునవ్వుతో తనవైపు చూస్తున్న విష్ణువుకు నమస్కరించి , బ్రహ్మ నవగ్రహాల వైపు తిరిగాడు.

“గ్రహరాజైన సూర్యుడి స్థానం సూర్య మండలం అనబడుతుంది. అది అంతరిక్ష మధ్యంలో ఉంది. ఆ మండలం మధ్య సూర్య మందిరం. సూర్యమండలానికి ఆగ్నేయ దిశలో చంద్ర మండలం , దక్షిణ దిశలో అంగారక స్థానం. ఈశాన్యంలో బుధుడి మండలం. గురువు స్థానం సూర్యుడికి ఉత్తరదిశలో. శుక్రగ్రహ స్థానం సూర్యుడికి తూర్పుదిశలో ఉంది. శనైశ్చర మండలం సూర్యుడికి పశ్చిమాన ఉంది. నైరుతి దిశలో రాహు మండలం , వాయవ్య దిశలో కేతు మండలం ఉన్నాయి. నవగ్రహ దేవతలైన మీ శాశ్వత స్థానాలు ఇవే !”

తాను చెప్పవలసింది ముగించిన బ్రహ్మ పరమశివుడి వైపు సాభిప్రాయంగా చూశాడు. పరమశివుడు నవగ్రహాలను కలయ జూస్తూ ఇలా అన్నాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment