నవగ్రహాల పట్టాభిషేకం ఏడవ భాగము
“నవగ్రహాలలో ప్రథముడూ , గ్రహాల అధినేత అయిన సూర్యుడు – కళింగ దేశాధిపతి !
చంద్రుడు – యామున దేశానికి అధిపతి !
అంగారకుడు అవంతీ దేశాధిపతి !
బుధుడు – మగధ దేశానికి అధిపతి !
గురువు – సింధుదేశానికి అధిపతి !
శుక్రుడు – కాంభోజదేశానికి అధిపతి !
శనైశ్చరుడు – సౌరాష్ట్ర దేశాధిపతి !
రాహువు – బర్బరదేశాధిపతి !
కేతువు – అంతర్వేది దేశానికి అధిపతి !”
“తమ ఆధిపత్యంలో ఉన్న దేశాల మానవుల మీదా , ప్రాణుల మీదా ఆయా గ్రహదేవతల ప్రభావం ప్రముఖంగా ఉంటుంది ! అంతరిక్షంలో నక్షత్రాల కలయికతో ఏర్పడిన రాసులు పండ్రెండున్నాయి ! ఆ ద్వాదశ రాసుల మీద మీ ఆధిపత్యాన్ని చతుర్ముఖులు వివరిస్తారు !” శివుడు బ్రహ్మ వైపు చూస్తూ ముగించాడు.
“జన్మ పరంగా ప్రాణులు ముఖ్యంగా మానవులు ఈ ద్వాదశ రాశులకూ సంబంధించి ఉంటారు. ఆయా రాశులు ఆయా నవగ్రహదేవతల ఆధిపత్యాలకు లోబడి ఉంటాయి. జన్మించిన నక్షత్రాల ఆధారంగా ప్రాణుల రాశులు నిర్ణయమవుతాయి. రాశ్యాధిపతులైన మీ ప్రభావం – తదనుగుణంగా ఉంటూ , మానవుల , ప్రాణుల జీవితాలను నిర్దేశిస్తాయి !”. బ్రహ్మ ఉపోద్ఘాత రూపంలో అన్నాడు. “మీ , మీ ఆధిపత్యాలలో ఉండే రాశుల వివరాలు ఆలకించండి !”
“సూర్యుడు సింహరాశికి అధిపతి. చంద్రుడు కర్కటరాశికి అధిపతి. అంగారక కుజుడు మేషరాశికీ , వృశ్చిక రాశికీ అధిపతి. బుధుడు కన్యారాశికీ , మిథున రాశికీ అధిపతి. గురువు ధనూరాశికీ , మీన రాశికీ ఆధిపత్యం కలిగి ఉంటాడు. శుక్రుడు తులారాశికీ , వృషభరాశికీ అధిపతి. శనైశ్చరుడు మకర రాశికీ , కుంభరాశికీ ఆధిపత్యం కలిగిఉంటాడు. రాహువు శుక్రుడి ఆధిపత్యంలోని తులారాశి మీదా , కొన్ని సందర్భాలలో బుధుడి ఆధిపత్యంలోని కన్యారాశి మీదా ఆధిపత్యం కలిగి ఉంటాడు. కేతువు బుధుడి ఆధిపత్యం ఉన్న మిథున రాశి మీదా , గురువు ఆధిపత్యంలోని మీన రాశి మీదా ఆధిపత్యం కలిగి ఉంటాడు.
సూక్ష్మంగా చెప్పాలంటే ప్రాణి మీద రాశి ప్రభావం , రాశి మీద గ్రహప్రభావం ఉంటాయన్నది సారాంశం !” బ్రహ్మ ముగించాడు.
“ఆదిత్య , సోమ , మంగళ , బుధ , గురు , శుక్ర , శని , రాహు , కేతువులకు ఒక సందేశం !” శ్రీమహావిష్ణువు నవగ్రహాలను కలయజూస్తూ అన్నాడు.
“లోకాలలోని ప్రాణులు ప్రముఖంగా మానవుల ఆరాధనలకు అందివచ్చే విధంగా సూక్ష్మ తేజోరూపాలతో ఉన్న నవగ్రహాలు , దివ్యశరీరాలతో ఆవిర్భవించాలని నేను ఆశించి , తదనుగుణంగా సంకల్పించాను. ఆదర్శ దంపతుల సంతితిగా మీరు సశరీరులుగా అవతరించారు. గ్రహదేవతలుగా అభిషిక్తులయ్యారు. మీ దృష్టులకూ , ప్రభావాలకూ లోబడి జీవ యాత్రలు సాగించే నరులు , ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో మిమ్మల్ని భావిస్తారు ; సంభావిస్తారు ; సేవిస్తారు ! భవిష్యత్తులో ఆగమోక్తంగా ఆలయాలు నిర్మించి మిమ్మల్ని ప్రతిమారూపంలో ప్రతిష్ఠించి , ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి , దానిలోకి మీ శక్తులను ఆవాహనం చేస్తారు. అభిషేకాలతో , అర్చనలతో మిమ్మల్ని ఆరాధిస్తారు. ఆ ఆరాధనలను స్వీకరించండి. ఆరాధకులను అనుగ్రహించండి. దివ్యరూపాలతో మిమ్మల్ని ఆవిర్భవింపజేసిన మా సంకల్పాన్ని నెరవేర్చండి. ఇక మీ స్థానాలకు తరలి వెళ్ళండి ! శుభం భూయాత్ !” శ్రీమహావిష్ణువు ఆశీర్వాదపూర్వకంగా అన్నాడు.
“శుభం భూయాత్ !” పరమేష్టి , పరమేశ్వరులు ఏకకంఠంతో అన్నారు దీవిస్తూ. “తథాస్తు !” సప్తర్షుల కంఠాలూ , మానసపుత్రుల కంఠాలూ , దేవతల కంఠాలూ ఉత్సాహంగా ఉచ్చరించాయి.
త్రిమూర్తులకూ , తల్లిదండ్రులకూ , పెద్దలకూ సూర్యుడు చేతులు జోడించి నమస్కరించాడు. అనూరుడు అశ్వాలను సున్నితంగా అదలించాడు. సూర్య రథం కదిలి , ముందుకు సాగింది.
ఇతర గ్రహ దేవతలు కృతజ్ఞతా సూచకంగా చేతులెత్తి , నమస్కారాలు చేశారు. ఉత్సాహంగా తమతమ రథాల అశ్వాలను అదలించారు.
ఒకేసారి సాగుతున్న నవగ్రహాల నవరధోత్సవాన్ని అందరూ నేత్రపర్వంగా తిలకిస్తున్నారు. తమ మండలాలూ , మందిరాలూ ఉన్న నిర్దేశిత దిశల వైపు రథాలను పోనిస్తున్నారు నవగ్రహదేవతలు.
అంతరిక్షంలో జ్యోతిర్మండలాల వైపు సాగిపోతున్న ”నవరథాలు” క్రమంగా దూరమైపోతూ , కాంతిపుంజాలలాగా దర్శనమిస్తున్నాయి.
కథనం ముగించి , శిష్యులను చిరునవ్వుతో చూశాడు , నిర్వికల్పానంద. “ఇప్పటి దాకా మనం నవగ్రహాల చరిత్రలను శ్రవణం చేశాం. పురాణ శ్రవణం చేసేటప్పుడు సందేహాలు కలగడం సహజం. ఏదైనా సందేహం ఉందా , సదానందా ? ఉంటే అడుగు !”
“చిన్న సందేహం గురువు గారూ !” సదానందుడు అన్నాడు. “నవగ్రహాలలో సూర్యుని నుండి శనైశ్చరుడి దాకా ఏడు గ్రహాలకూ వివిధ రాశుల మీద విడి విడిగా – ఆధిపత్యాలున్నాయి. రాహుకేతువులకు మాత్రం ఆ విధంగా ప్రత్యేకాధిపత్యం ఏ రాశి మీదా లేదు ! వాళ్ళు ఇతర సప్తగ్రహాలతో సమానులే కదా !”
“మంచి ప్రశ్న !” నిర్వికల్పానంద అన్నాడు. “ద్వాదశ రాసులలో ప్రత్యేకమైన ఆధిపత్యంలో తప్పించి , రాహుకేతువులిద్దరూ అన్నింటా , అందరితోనూ సమానులే. అయినప్పటికీ ఆ ఇద్దర్నీ జ్యోతిష సిద్ధాంత వేత్తలూ , మహర్షులూ – ఛాయగ్రహాలుగానే గుర్తించారు. ప్రత్యేకంగా ”రాశి – ఆధిపత్యం” లేకపోవడానికి అదే కారణం కావచ్చు. మరొక అంశమేమిటంటే , రాహుకేతువులకు రాసుల మీద ఉన్న ఆధిపత్య విషయంలో ప్రాంతీయభేదాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి , మన తెలుగునాట రాహువుకు తులా రాశి మీదా , కేతువుకు మిథున రాశి మీదా ఆధిపత్యం ఉన్నట్టు భావిస్తారు. అయితే , మౌలికంగా తులారాశి మీద ఆధిపత్యం శుక్రుడిది. మిధున రాశి మీద ఆధిపత్యం బుధుడిది ! ఇంక మన పొరుగు దేశమైన కర్నాటకలో రాహుగ్రహానికి కన్యా రాశి మీదా , కేతువుకు మీన రాశి మీదా ఆధిపత్యం ఉన్నట్టు పరిగణిస్తారు ! అయితే మౌలికంగా కన్యారాశికి బుధుడూ , మీన రాశికి గురువూ అధిపతులు ! రాసులకు సంబంధించి , రాహుకేతువుల ఆధిపత్యాలలో ఉన్న వైరుధ్యాల విషయం తేల్చాల్సింది జ్యోతిష విద్వాంసులు ! మనం కాదు !” నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹