Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట పద్దెనిమిదవ అధ్యాయం

మదాత్యయరోగ నిదానం

మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగమంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది.

మధువును గాని సారాను గాని ఇతర మాదక ద్రవ్యాలను గాని అతిగా సేవించిన వారిని బ్రతికించడం కష్టం. అది వారి కణములన్నిటినీ సోమరులుగా తయారుచేస్తుంది. దాంతో అవి ఏ మందుకీ ప్రతి చర్యను చూపించవు. మద్యం జ్ఞానేంద్రియాలను ఉద్రేకపఱచి మెదడును మొద్దుబారేలా చేస్తుంది. అందువల్ల వాటి మధ్య సమన్వయం లోపించి మొత్తం శరీరభాగాలన్నీ దెబ్బతింటాయి. అందుకే మొదటిసారి, రెండవసారి తాగిన వాడికి చురుకుదనం పెరిగినట్లై గొప్ప హాయిగా వుంటుంది కాని తరువాత ఆ సుఖం వుండదు.

అయినా మూర్ఖుడు భ్రమలో మునిగి ఆ సుఖం కోసం అన్వేషిస్తూ తాగుతునే ఉంటాడు. తాగుడుకి అలవాటుపడిన ఉన్నతాధికారి అదుపులేని క్రూర విషసర్పమువంటివాడు. ఈ మత్తులో గాని, అది దొరకనపుడు గానీ ఎవరిని ఎందుకు కాటేస్తాడో చెప్పలేం. మద్యం క్రూరత్వాన్ని పెంచుతుంది. నోటితో చెప్పలేని చెడ్డపనులు చేయిస్తుంది.

అది సజ్జనుడిని నీచునిగా మార్చేస్తుంది. అది బాగా నెత్తి కెక్కినవాడు ఎంత చెడ్డ పనిచేయడానికైనా భయపడడు. మందుకి బానిసైపోయి అది దొరకని వాడు, ఆ దొరకని నాడు పరమనీచుడై పోయి గుక్కెడు మద్యం కోసం హత్యచేయడానికైనా వెనుకాడడు. ఈ దశకి వచ్చేసరికి వాని ఆరోగ్యం సర్వనాశనమైపోయి వుంటుంది. మెదడు దెబ్బతినేయడంతో ఏది సుఖమో ఏది అసుఖమో తెలియక ఏడవవలసినపుడు నవ్వుతాడు. నవ్వవలసినపుడు ఏడుస్తాడు. జ్ఞాపకశక్తి నశిస్తుంది. తులన దెబ్బతిని ఎక్కడబడితే అక్కడ పడిపోతుంటాడు.

సహజంగా బాగా తిని అరిగించుకొనేశక్తి గలవారు, స్వతహాగా బాహుబల సంపన్నులు, మంచి పుష్టికరమైన భోజనంతో మద్యాన్ని పుచ్చుకున్నా వారికి పెద్దగా మత్తెక్కదు. ఆ మత్తుకోసం మరింత తాగితే మాత్రం సర్వనాశనం తప్పదు. తాగుబోతులకు వచ్చే జబ్బులు పిత్త, కఫ దోషాల్లో దేని ప్రకోపం వల్లనైనా రావచ్చు. త్రిదోషాలూ ఒకేసారి దాడి చేయడం వల్ల కూడా కలగవచ్చును.

తఱచుగా వచ్చే విరేచనాల వల్ల దాహం, కాసింత నిరాశ, జ్వరం, అరుచి, ఆహార విముఖత, మలబద్ధకం, కళ్ళు చీకట్లు కమ్ముట, వెక్కుళ్ళు, శ్వాసలో ఇబ్బంది, నిద్రపట్టక పోవుట, అతిగా చెమటలు పట్టుట, మలమూత్ర విసర్జనల్లో ఏదో అడ్డు పడినట్లుండుట, ఒళ్ళు అక్కడక్కడ వాచుట, మానసిక ఆందోళన ఇవన్నీ త్రిదోషాలు కలిసి తాగుబోతుపై దాడిచేస్తే బయటికి కనిపించే లక్షణాలు. రోగి ఏదో కలల లోకంలో పడినట్లుంటాడు. పిలిచినా పలకడు.

ఈ రోగం పిత్తదోషం వల్ల వస్తే అంతటా మంటపుడుతున్నట్లు ఉంటుంది. లోనా పైనా కూడా. జ్వరం, స్వేదనం, స్పృహ తప్పుట, గుండె దడ కనిపిస్తాయి. కఫ ప్రకోపం వల్ల వస్తే వాంతులు, అశాంతి, నిద్రమత్తు, కడుపు వాయువు ఎక్కువై బరువెక్కుట (ఉదరగౌరవం) అనే లక్షణాలు బయటపడతాయి.

తెలిసి తెలిసీ మత్తుకి అలవాటుపడిపోయిన వారు క్రమేపీ ఆలోచించే శక్తిని కోల్పోతారు. మానసిక రోగాలు ప్రవేశిస్తాయి. ప్రతీదీ వారికి ఆనందాన్నే కలిగి స్తుంటుంది.

కర్రముక్క ఇచ్చినా, అన్నం ముద్ద పెట్టినా, లడ్డూను చేతిలో వుంచినా ఒకలాగే, చిన్నపిల్లల్లా, సంతోషపడి పోతారు. ఇవి ఎక్కువగా వాత ప్రకోప లక్షణాలు. నోటి నుండి కఫం, చీము పడుతుండడం, ఏమీ తాగకున్నా నిద్రమత్తులో జోగుతున్నట్లుండడం వీరి లక్షణాలు. ఒళ్ళు నొప్పులు ఎక్కువగా వుంటాయి. ఏం మాట్లాడినా పెద్దగా అర్ధం వుండదు. ఒకటనుకొని ఇంకొకటి అంటారు. గుండె, గొంతు చెడతాయి. మూర్ఛలొస్తుంటాయి.

ఊపిరి హాయిగా, సక్రమంగా ఆడక అవస్థ పడుతుంటారు. దాహం, జ్వరం, కడుపులో తిప్పు బాధిస్తుంటాయి. ఏదో ఒకటి రెండు మార్లు దారి తప్పి తాగినా తెలివితేటలుపయోగించి దానిని పూర్తిగా వదిలేసిన వారికి ఈ రోగాలేవీ రావు.

వంచనకు గురైనవారూ, ప్రథమకోపులూ మత్తుకి సంబంధించిన మూడు రోగాలకూ అనగా మూర్ఛలు, నేలపైబడి లేవలేకపోవుట, కడుపులో త్రిప్పులకూ లోనవుతారు. వీరు తిండికి సంబంధించిన నియమాలను సరిగా పాటించకపోతే ప్రమాదమే. శరీరంలో నాళాలన్నీ చెడతాయి. వాత, పిత్త, కఫలోపాలూ, మలిన రక్తం, శరీర భాగాలన్నిటిలో సారా ప్రవహించడం వల్ల ఈ రోగులను సరిచేయుటకు చాలాకాలం పడుతుంది.

మత్తురోగులలో వాతం ప్రకోపిస్తే మనిషి చీపురు పుల్లలాగైపోతాడు. రక్తహీనత ఏర్పడుతుంది. ఏ కోశానా మెరుపన్నది మిగలదు. జీవకళ కనబడదు. శరీరం ఎఱ్ఱబడు తుంటుంది. మనిషిలో మోసం చేసే బుద్ధి పెరిగిపోతుంది. ఆలోచనలు, చర్యలు స్థిరంగావుండవు. పిత్తం ప్రకోపిస్తే మత్తులో వున్నా లేకున్నా ఆ రోగి తెగ చిరాకు పడిపోతుంటాడు. శరీరానికి ఎరుపూ, పసుపూ కలిగిన అందవికారమైన రంగు వస్తుంది. కఫం ప్రకోపిస్తే మనిషి నడుస్తున్నా. అరుస్తున్నా నిద్రలో వున్నట్లే వుంటాడు. సందర్భశుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు. ఏదో మరో లోకంలో వున్నట్లుంటాడు. మూడు ప్రకోపాలూ కలిసివున్న వారికి ఈ పై లక్షణాలన్నీ కనిపిస్తాయి. రక్తప్రసరణంలో ఆటంకము ఏర్పడుతుంది. పక్షవాతమూ రావచ్చు.

త్రిదోష ప్రకోప లక్షణాలు ఇంకా ఇలా కూడా ఉంటాయి. రోగి తన వారి గొంతుకలను ఎంత ప్రయత్నించినా పోల్చలేకపోవడం పిత్తలోపం. మనిషి నిద్ర పోతున్నా శరీరం వణకుతునే వుండడం జరిగినపుడు వాత లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. రోగికి ఆకాశం ఎఱ్ఱగా కనిపించవచ్చు. లేదా అంతా చీకటిగా నల్లటి తెరల చాటుననున్నట్లు కనిపించవచ్చు. ఒక్కసారి తల విదిలించి చూస్తే అంతా బాగానే కనబడుతుంది. కాని గుండెలో సన్నగా నొప్పి మొదలెట్టినట్లవుతుంది. తల తిరుగుతుంది. ఛాతీ భాగమంతా ప్రకంపిస్తున్నట్లవుతుంది. వెక్కిళ్ళు వస్తుంటాయి.

పిత్త ప్రకోపంలో ఆకాశం ఎఱ్ఱగా గాని పచ్చగా గాని కనబడుతుంది. మాటిమాటికీ స్పృహ పోతుంటుంది. తెలివి వచ్చాక విపరీతంగా చెమటలు పడతాయి. అధికదాహం, గొంతులో మంట వుంటాయి. శరీరం రంగు ఒకవైపు పసుపు పచ్చగానూ మరొకవైపు నీలంగానూ తేలవచ్చు. కనులు ఎఱ్ఱగానో పచ్చగానో అయిపోతాయి.

కఫ ప్రకోపంలో రోగికి ఆకాశం నిత్యం మేఘావృతంగానే గోచరిస్తుంది. మృతి చెందినట్లయిపోయి (”కోమా” లో వుండి) కొన్ని గంటల తర్వాత ఎప్పుడో ఈ లోకంలోకి వస్తాడు. గుండెలో గాబరాగా వుందని గోల పెడుతుంటాడు. చొంగ కారుతుంటుంది. అంగాలన్నీ బరువెక్కిపోయి తిమ్మిర్లు వస్తాయి. ఉన్నట్టుండి ”డబ్బు”మని కిందపడిపోతాడు. అపస్మారంలోకి వెళ్ళిపోతాడు. మరల లేచి తన పనులు తాను చేసుకుంటున్నపుడు కూడా మాటలో స్పష్టత వుండదు.

కాబట్టి మత్తు మందు ఏదైనా ప్రమాదకరమే కాని అదే మత్తు పానీయాన్ని వ్యక్తి యొక్క శరీరతత్త్వాన్ని బట్టి రోజుకి అయిదు నుండి పదిచుక్కలు తీసుకుంటే నిద్రబాగా పడుతుంది, బుర్ర చక్కగా పనిచేస్తుంది. అంగాలలో చురుకుదనం వస్తుంది. చర్మానికి నైగనిగ్యం, ముఖానికి నవకం వస్తాయి. కాని మానవజాతి చేసుకునే దురదృష్టమేమనగా అలా రోజుకి అయిదు, పది చుక్కలనే పుచ్చుకొని అంతటితో ఆగేవాడు కోటికొక్కడుంటాడు.

నూట పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment