నవగ్రహాల పట్టాభిషేకం ఎనిమిదవ భాగము
“గురువు గారూ ! నవగ్రహాల పట్టాభిషేక విశేషాలు వినిపించారు ! నవగ్రహాల ఆధిపత్యాలున్న నవరత్నాల గురించీ , నవధాన్యాల గురించి వివరించారు ! కొన్ని వృక్షజాతుల మీద కూడా నవగ్రహదేవతలకు ప్రత్యేక ఆధిపత్యం ఉంటుందంటారు. ఆ విషయం కొంచెం వివరించండి !” శివానందుడు అడిగాడు.
“ఔను ! నవగ్రహదేవతలకు తొమ్మిది రకాల వృక్షజాతుల మీద ఆధిపత్యం ఉంది. ఆధిపత్యం ఉన్న వాటి మీద అభిమానమూ సహజంగా ఉంటుంది కద ! అందుకే ఆయా వృక్షాలను నవగ్రహాలకు ఇష్టమైన వృక్షాలుగా మనం గుర్తిస్తాం !” నిర్వికల్పానంద అన్నాడు. “నవరత్నాలూ , నవధాన్యాలూ , వృక్షాలూ – ఇవే కాకుండా , గ్రహదేవతలకు అభిమాన లోహాలూ , రుచులూ కూడా ఉన్నాయంటున్నాయి , మన శాస్త్రాలు. వృక్షాల విషయానికి వస్తే – సూర్యుడికి జిల్లేడు , చంద్రుడికి మోదుగ , అంగారకుడికి చండ్ర , బుధుడికి ఉత్తరేణి , గురువుకు రావి , శుక్రుడికి అత్తి , శనైశ్చరుడికి జమ్మి , రాహువుకు గరిక , కేతువుకు దర్భ – అభిమానమైనవి. ఈ తొమ్మిదింటిలో రాహువు ఆధిపత్యం కలిగిన గరిక , కేతువు ఆధిపత్యం కలిగిన దర్భ వృక్షజాతికి చెందినవి కావు. అవి తృణజాతికి చెందినవి. పైన పేర్కొన్న తొమ్మిదింటిని నవగ్రహ హోమాలలో సమిధలుగా ఉపయోగిస్తాం !”
“గురువు గారూ ! నవగ్రహాలు అభిమానించే వృక్షాలుగా , గడ్డిజాతులుగా వీటిని ప్రత్యేకంగా నిర్ణయించడానికి ఏదైనా కారణం ఉందా ?” సదానందుడు అడిగాడు.
“బహుశా ఆ వృక్షాదుల ఓషధగుణాలు ప్రధాన కారణం కావచ్చు. వాటి మీద నుంచి , వాటి సంపర్కంతో వీచేగాలిలోని ప్రత్యేక శిష్టలక్షణం , వాటిని సమిధలుగా హోమాగ్నిలో దహించినప్పుడు వెలువడే ధూమంలో , వాసనలో ఉన్న ఔషధ లక్షణాలూ – వాటి ఎన్నికకు కారణం కావచ్చు !” నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు. “మన భారతీయ ధార్మిక సిద్ధాంతాలలో , ఆలోచనా సరళిలో , ఆచరణలో ఉన్న మహోన్నత లక్షణం అదే ! ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క జంతువు వాహనం ! ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వృక్షం ఇష్టం ! ఈ వైదిక సూచనలో దాగి ఉన్న అర్థం , పరమార్థం ఏమిటి ?”
“దేవతల్ని ఆరాధిస్తున్నాం ! అభిమానిస్తున్నాం ! ఆ దేవతల వాహనాలైన జంతువుల్నీ అలాగే అభిమానించండి ! ప్రేమించండి ! ఆయా జంతు సంతతిని జిహ్వాచాపల్యంతో , కడుపు కక్కుర్తితో సంహరించకండి ! దేవతలు అభిమానించే వృక్షసంతతిని నాశనం చేయకండి ! అనే సువర్ణ సందేశాన్ని అందించడమే ఆ పరమార్థం !”
“అలాగే లోహాలలో సూర్యుడికి రాగీ , చంద్రుడికి కంచూ , కుజుడికి బంగారం , బుధుడికి ఇత్తడి , కంచు , సత్తూ , గురువుకు బంగారమూ , వెండీ , శుక్రుడికి వెండీ , శనైశ్చరుడికి ఇనుమూ , రాహువుకు , కేతువుకూ సీసమూ అభిమాన లోహాలు ! అదే విధంగా రుచులు కూడా !”
“సూర్యుడికి కారం , చంద్రుడికి ఉప్పు , కుజుడికి చేదు , బుధుడికి వగరు , గురువుకు మధురం , శుక్రుడికి పులుపు , శనైశ్చరుడికి చేదు , రాహువుకూ , కేతువుకు చేదు ఇష్టమైన రుచులు !”
“అంటే , గురువు గారూ ! ఆయా సమిధలతో , ఆయా లోహాలతో , ఆయా రుచుల పదార్థాల నైవేద్యాలతో గ్రహదేవతలను ఆరాధించాలనేగా అర్థం ?” చిదానందుడు అడిగాడు.
“ఔను ! అంతే కద ! ప్రాపంచికంగా తీసుకో ! నాకు జున్నూ , మీగడ పెరుగూ ఇష్టం ! మీకు అవి దొరికినప్పుడల్లా తెచ్చి నాకు ఇస్తారు ! ఎందుకు అలా ఇస్తున్నారు ?” నిర్వికల్పానంద నవ్వుతో ప్రశ్నించాడు. “మీకు ఇష్టమైనవి కనుక !” శివానందుడు చిరునవ్వుతో అన్నాడు.
“బాగుంది ! నాకిష్టమైంది ఇస్తే , మీకు నేను ఏమిస్తాను ?” నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు.
శిష్యులు మౌనంగా చూశారు.
“మీకు ఇష్టమైనది లేదా మీరు కోరుకునేది – నేను ఇస్తాను అంతేగా !” నిర్వికల్పానంద. అడిగాడు.
“అంతే గురువుగారూ !”
“పారమార్థికంగా అంతే ! భగవంతుడికి ఇష్టమైన దానిని ఇచ్చి , ఆరాధిస్తే , ఆయన భక్తుడికి ఇష్టమైనది ఇస్తాడు ! ఇచ్చి పుచ్చుకోవడాలన్నమాట ! అందుకే , అందరికీ తెలియడానికే ఏయే దైవస్వరూపానికి ఏయే పువ్వులు ఇష్టమో , ఏయే పదార్థాలు ఇష్టమో , ఏయే సమిధలు ఇష్టమో సత్యద్రష్టలు కనిపెట్టి , తెలియజెప్పారు !”
“చక్కటి అవగాహన కలిగించారు. గురువు గారూ !” విమలానందుడు సంతోషంగా అన్నాడు.
“నవగ్రహాల జన్మాదికాలు విన్నాం. చరిత్రలు తెలుసుకున్నాం ! ఇంక ఆ గ్రహ దేవతల మహిమలు ఆకర్ణిస్తే – నవగ్రహ పురాణ శ్రవణం పరిసమాప్తమవుతుంది. నిర్వికల్పానంద ప్రస్తుత విషయాన్ని గుర్తు చేస్తూ అన్నాడు. “మన నవగ్రహదేవతలకు త్రిమూర్తులు అఖండమైన శక్తులూ , కారకత్వాలూ , అధికారాలూ , ఆధిపత్యాలూ ఇచ్చారు. ఆ కారణంగా సకల ప్రాణుల మీదా నవగ్రహాల ప్రభావం ఉండితీరుతుంది. చారిత్రక పురుషులూ , పురాణపురుషులూ , మహా జ్ఞానులూ , చివరకు అవతార పురుషులూ – నవగ్రహాల వీక్షణ మీద ఆధారపడిన , ప్రభావితం చేయబడిన జీవయాత్ర సాగించిన వాళ్ళే ! నవగ్రహ వీక్షణకు అతీతులు ఎవ్వరు – ఎవ్వరూ లేరు ! నవగ్రహదేవతల వక్రదృష్టి ఫలితంగా కష్టాల పాలైన వారి గురించీ , శుభదృష్టి ఫలితంగా సుఖసంతోషాలు పొందిన వారి గురించి తెలుసుకుందాం ! ముందుగా గ్రహరాజు సూర్యుడితో ప్రారంభించుదాం !” నిర్వికల్పానంద ఉపోద్ఘాతం ముగించాడు.నిర్వికల్పానంద కళ్ళు మూసుకుని చేతులు జోడించాడు. భక్తితో , శ్రావ్యంగా సూర్య స్తుతిని పఠించాడు.
“సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం !
శ్వేతపద్మధరం దేవం ! తం సూర్యం ! ప్రణమామ్యహమ్ !!”
నిర్వికల్పానంద మెల్లగా కళ్ళు తెరిచి , శిష్యుల వైపు ప్రసన్నంగా చూశారు.
“నవగ్రహపురాణ శ్రవణంలో ప్రశస్తమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. దేవతల చరిత్రలు మనల్ని ప్రభావితం చేస్తాయి. వాళ్ళ మహిమలు ఇతోధికంగా ప్రభావితం చేస్తాయి. నవగ్రహాలలో ప్రథమ గ్రహమూ , గ్రహరాజూ అయిన సూర్యభగవానుడు లోకాలకు నిరవధికంగా రెండు కానుకలు అందిస్తున్నాడు. ఒకటి: వెలుగు , రెండు: వేడిమి. ఈ రెండింటి ద్వారా ప్రాణులకు ఆహారమూ , ఆరోగ్యమూ సిద్ధిస్తున్నాయి. సూర్యుడు కాంతి దాతా , ఉష్ణదాతా మాత్రమే కాదు , జ్ఞానదాత కూడా. ఆయన ప్రసన్నుడైతే విశిష్టజ్ఞానానికి అవసరమైన , మహత్తరమైన విద్యను అనుగ్రహిస్తాడు. సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకొని విద్యనూ , జ్ఞానాన్నీ పొందిన పురాణ పురుషులున్నారు. వాళ్ళకు సంబంధించిన ఇతివృత్తాల ద్వారా మనం సూర్య మహిమను తెలుసుకోవచ్చు…”
“వాళ్ళెవరు గురువుగారూ ?” అత్రుతని అదుపు చేసుకోలేని సదానందుడు అడ్డు తగిలాడు.
“చాలా మందే ఉన్నారు ! మహర్షి యాజ్ఞవల్యుడు. ఆంజనేయుడు , శ్రీరామ చంద్రుడు , ధర్మరాజు , కుంతి , ద్రౌపది – ఇలా వీళ్ళందరూ సూర్య ప్రసాదాన్ని పొంది , ఆయన మహామహిమను చవి చూసిన విశిష్ఠులే ! ముందుగా మహర్షి యాజ్ఞవల్యుల వారి కథతో మహిమా శ్రవణం ప్రారంభించుదాం !” నిర్వికల్పానంద ఉపోద్ఘాత రూపంలో అన్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹