సూర్యగ్రహ మహిమ మొదటి భాగము
“జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి !
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం !!”
“మహర్షి యాజ్ఞవల్క్యుడు జనకమహారాజు గారికి గురువు. ఆయన ఆస్థానంలో ఉండేవాడు. గురువు తిరస్కారానికి గురి అయిన కారణంగా యాజ్ఞవల్క్యుడు వేదవిద్యను సంపూర్ణంగా అధ్యయనం చేయలేకపోయాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా జనకమహారాజుకు వినిపించాడు…”
“గురువు గారూ ! యాజ్ఞవల్మ్య మహర్షి ఎవరు ?” శివానందుడు ప్రశ్నించాడు.
“యాజ్ఞవల్క్యుని తల్లి ”ఆలంబినీ దేవి” అనీ , తండ్రి ”దేవరాతుడు” అని పురాణాలు చెప్తున్నాయి. ఆ విషయం అలా ఉంచి , ఆ మహర్షి ఏ విద్యను కాంక్షించాడో , ఆ విద్య ఎందుకు లభించలేదో , తదనంతర కాలంలో ఎలా లభించిందో తెలుసుకుందాం ! ఒకనాడు యాజ్ఞవల్క్యుడిని ఆయన గురుదేవులు సమ్ముఖానికి రమ్మని పిలిచారు…” నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు.
యాజ్ఞవల్క్యుడు వృక్ష మూలాన , అరుగు మీద ఆసీనుడైన గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేసి , లేచి , వినయంగా నిలుచున్నాడు.
“గురుదేవా ! సన్నిధికి రమ్మన్నారట…”
“నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు !” గురువు ముక్తసరిగా అన్నాడు.
తన విద్యాభ్యాసం పూర్తయిపోయిందా ?! యాజ్ఞవల్క్యుడు ఆశ్చర్యపోతూ , గురువుగారి ముఖంలోకి చూశాడు.
“గురుదేవా ! విశిష్ట వేద విద్యా , సాంఖ్య యోగాలూ తమరు నాకు ఇంకా అనుగ్రహించలేదు…”
“ఆ విద్యలను పొందే అర్హత నీకు లేదు !”
“గురుదేవా !” యాజ్ఞవల్క్యుడు నిర్ఘాంతపోతూ చూశాడు.
“తెలియక నేనేదైనా అపచారం చేశానా గురుదేవా ? అదే జరిగి ఉంటే…”
“అధిక ప్రసంగం !” గురువు తీక్షణంగా చూస్తూ అన్నాడు. “అధిక ప్రసంగం నీకు అర్హతను ఆపాదించదు , యాజ్ఞా ! మా నిర్ణయానికి కారణం అపచారం కాదు , నీ గ్రహచారం ! వెళ్ళు !”
“గురుదేవా…”
“వెళ్ళమని ఆజ్ఞాపించాం !”
గురువు గారి అగ్ని నేత్రాలను ఒకసారి చూసి , మౌనంగా నమస్కరించి , యాజ్ఞవల్క్యుడు వెనుదిరిగాడు. అవమానం , ఆవేదన , ఆవేశం అతని హృదయంలో కెరటాల్లా పొంగుతున్నాయి. యాజ్ఞవల్క్యుడు వంచిన తల ఎత్తకుండా యాంత్రికంగా నడుస్తున్నాడు. బరువుగా , నెమ్మదిగా కదులుతున్న పాదాలు అతన్ని ఆశ్రమ ప్రాంగణంలోంచి ఆవలికి తీసుకు వెళ్తున్నాయి. మండుటెండలో , అరణ్యమార్గంలో నడుస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. తను నడుస్తున్న మార్గం కాని మార్గం , అడవి జంతువుల ఆడుగుల గుర్తులతో ఏర్పడిన ఆ ”జంతు మార్గం” తనని ఎక్కడికి తీసుకు వెళ్తుందో అతనికి తెలీదు. యాజ్ఞవల్క్యుడు విరక్తితో కూడిన నవ్వు నవ్వుకున్నాడు. తనకు గమ్యం లేదు ! మార్గం ఏదో తెలీదు !
“ఆ విద్యలను పొందే అర్హత నీకు లేదు !” గురువుగారి అభిశంసన అతని చెవుల్లో గింగురుమంది.యాజ్ఞవల్క్యుడు అప్రయత్నంగా ఆగాడు. తనలో ఆ అర్హత ఎందుకు లేదు ? తన ”అనర్హతని” గురుదేవులు ఏ ప్రాతిపదిక మీద నిర్ణయించారు ? ఈ అన్యాయానికి కారణం ఏమిటి ?
“కారణం అపచారం కాదు ! నీ గ్రహచారం !” గురుదేవుడి కర్కశ కంఠం యాజ్ఞవల్క్యుడి చెవుల్లో గర్జించింది. అతను ముందుకు నడిచాడు. అపచారం కాదు , గ్రహచారం ! గ్రహ…చారం… గ్రహ… యాజ్ఞవల్క్యుడు మళ్ళీ తటాలున ఆగాడు. గ్రహచారం కారణమా ? గురుదేవులు పరోక్షంగా తన మీద ప్రస్తుతం ఉన్న గ్రహవీక్షణను సూచించారా ? యాజ్ఞవల్క్యుడి కుశాగ్రబుద్ధి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించింది. తన మీద ఏ గ్రహ వీక్షణ వక్రంగా ఉంది ? నవగ్రహాలలో ఎవరు తనను ”చిన్నచూపు” చూస్తున్నారు ?
నీటి పక్షుల అరుపులు యాజ్ఞవల్క్యుడి ఆలోచనలకు భంగం కలిగించాయి. మండుటెండలో చెమటతో తడిసి ముద్ద అయిన తన శరీరం , దప్పికతో పిడచకట్టుకు పోయిన నాలుకా గుర్తొచ్చాయి అతడికి. జలపక్షుల అరుపులను ఆలకిస్తూ అటువైపు నడక సాగించాడు. నిర్మలమైన సరోవరజలంలో హాయిగా స్నానం చేశాడు , యాజ్ఞవల్క్యుడు. మధుర మధురంగా ఉన్న ఆ నీటితో తీవ్రంగా ఉన్న దాహార్తిని తీర్చుకుని , కొలను గట్టు మీద ఉన్న చెట్టు నీడలో కూర్చున్నాడు.
గ్రహచారం… ఏ గ్రహ వీక్షణ అనుగ్రహం లోపించింది ? ప్రశ్న కాలసర్పం పడగలా అతనిలో తల ఎత్తుతూనే ఉంది. యాజ్ఞవల్క్యుడు కళ్ళు మూసుకొన్నాడు. మూసుకున్న కళ్ళ ముందు అతని జాతక చక్రం ప్రత్యక్షమైంది. అతని చేతి వేళ్ళు కదులుతున్నాయి. యాజ్ఞవల్క్యుడు జాతక గణన చేస్తున్నాడు. నిశితంగా పరిశీలిస్తూ గ్రహగతుల్ని అవలోకిస్తున్నాడు. చాలా సేపటికి యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరిచాడు. గురుదేవుని పలుకు – ‘’గ్రహచారం”లో నిక్షిప్తమైన అర్థం అతడికి స్పష్టంగా బోధపడుతోంది. నిజమే ! తన ”గ్రహచారం” తిన్నగా లేదు. సూర్య గ్రహ వీక్షణ వక్రంగా ఉంది.
తనకు కోరిన విద్య లభించాలంటే , సూర్య గ్రహ ప్రసన్నత అత్యవసరం. ధ్యానంతో తపస్సుతో తాను సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవాలి ; ప్రత్యక్షం చేసుకోవాలి. యాజ్ఞవల్క్యుడు పరిసరాలను పరికించాడు. సూర్యాస్తమయం కావొస్తోంది. రేపు సూర్యోదయ శుభ సమయంలో తన దీక్ష ప్రారంభమవుతుంది. యాజ్ఞవల్క్యుని ముఖం మీద చిరునవ్వు మెరిసింది. గురువు తిరస్కారంతో తాను క్రుంగిపోడు. లోకబాంధవుడైన ఆదిత్య సూర్యభగవానుడిని మెప్పిస్తాడు. ఆయన అనుగ్రహాన్ని సంపాదిస్తాడు. ఆశించిన విద్యలను సాధిస్తాడు. యాజ్ఞవల్క్యుడు తృప్తిగా నిట్టూర్చి , విశ్రాంతిగా చెట్టు క్రింద నడుం వాల్చాడు.
సూర్యోదయ సమయం. సూర్యుడి రాకను ముందుగా లోకాలకు తెలియజేస్తూ అరుణోదయమయ్యింది. సూర్యుడు బంగారు కాంతులు చిమ్ముతూ తూర్పు దిక్కులో ఉదయించాడు.
సరోవర జలంలో నిలుచుని ధ్యానం చేస్తున్న యాజ్ఞవల్క్యుడు అర్ఘ్యప్రదానం చేసి , తాను సాగించబోయే తపోసాధనకు సంకల్పం చెప్పుకున్నాడు. సూర్యభగవానుడికి చేతులు జోడించాడు. ఉన్నట్టుండి సరోవరంలో అప్పటి దాకా ముడుచుకుని ఉన్న తామరలు సూర్యకిరణాల వెచ్చని స్పర్శతో చకచకా వికసిస్తున్నాయి. సూర్యుడి కిరణ దృష్టి సోకిన వెంటనే వికసిస్తున్న పద్మాల జీవ చైతన్యం తన సంకల్పానికి శుభశకునంగా భావిస్తూ , యాజ్ఞవల్క్యుడు గట్టుపైకి అడుగులు వేశాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹