Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట ముప్పై ఒకటవ అధ్యాయం

సూర్యగ్రహ మహిమ నాల్గవ భాగము

అంజనా , కేసరీ మాతంగ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఏడో అలౌకిక ప్రశాంతత తాండవిస్తోందక్కడ. అందమైన అనేక వర్ణాల పుష్పాలు కొత్త సువాసనలను వెదజల్లుతూ కళకళలాడుతున్నాయి.

అల్లంత దూరాన , ఆశ్రమ వాటికలోని వటవృక్షం క్రింద అరుగు మీద ఆసీనుడై ఉన్న మాతంగ మహర్షి ఆ దంపతులకు కనిపించాడు. ఆయన చుట్టూ ఏదో కాంతి లీలగా మెరుస్తోంది. ఒక పుష్పాన్ని మాతంగ మహర్షి పాదాల మీద ఉంచాలనిపించిది , అంజనకు. ఆమె చెయ్యి పుష్పం దగ్గరగా కదిలింది.

“అంజనా ! ఆ పుష్పాన్ని తెంపకు !” మాతంగ మహర్షి కంఠం మేఘ గర్జనలా గంభీరంగా ధ్వనించింది. అంజన ఉలిక్కిపడి , చేతిని తీసేసుకుంది. తలతిప్పి మాతంగ మహర్షి వైపు చూసింది. ఆయన కళ్ళు మూసుకునే ఉన్నాయి !

కేసరి అంజన చేతిని పట్టుకుని మహర్షి కూర్చున్న చోటికి నడిపించాడు. సమీపించిన కేసరి దంపతులను , మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు మాతంగ మహర్షి , శాంతం , దయ , ప్రశాంతతా ఉట్టిపడుతున్నాయి ఆయన కళ్ళల్లో. “రాకరాక వచ్చారు ! రండి !” మాతంగ మహర్షి చిరునవ్వుతో అన్నాడు. కేసరీ , అంజనా ఆయన పాదాలకు ప్రణమిల్లారు.

“సుఖీభవ !” మాతంగ మహర్షి ఆశీర్వదించాడు. “అంజనా ! పువ్వులు కోయవద్దన్నాను ! ఎందుకో తెలుసా ?” మాతంగ మహర్షి చిరునవ్వుతో అడిగాడు.

అంజన తల అడ్డంగా ఊపింది.

“ఈ ఆశ్రమంలో పుష్పాలు ఎంత కాలమైనా , అప్పుడప్పుడే వికసించినట్టు కళకళలాడుతూ , సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఒకసారి నా శిష్యులు నా కోసం పుష్కలంగా పళ్ళు కోసి , మోసుకు వచ్చారు. ఫల భారంతో వాళ్ళ శరీరాలు చెమటతో తడిసిపోయాయి. వాళ్ళ స్వేద బిందువులు టపటపా రాలేయి , పూల మొక్కల మీద. రాలిన స్వేద బిందువులన్నీ పువ్వులుగా మారిపోయాయి ! ఆ క్షణం నుండీ ఇలాగే , నిత్యనూతనంగా ఉన్నాయి. ఆ పుష్పాలు. నా దృష్టిలో అవి పుష్పాలు కావు , గురుభక్తికి ఆనవాళ్ళుగా వెలుగొందుతున్న స్వేద బిందు పుష్పాలు !” మాతంగ మహర్షి వివరించాడు.

“మీ శిష్యులు ఎంత అదృష్టవంతులో !” కేసరి అన్నాడు.

“నేను కూడా అదృష్టవంతుణ్ణి కేసరీ ! తగిన శిష్యులు లభించడం కూడా అదృష్టమే !” మాతంగ మహర్షి చిరునవ్వు నవ్వాడు. ఆయన చూపులు అంజన మీద వాలాయి. “చూసి , చాలా కాలమైంది ! నీ తండ్రి కుంజరుడు కుశలమే కద , అంజనా ?”

“నాన్న కుశలమే స్వామీ ! కానీ…” అంటూ ఆగిపోయింది అంజన.

“కానీ ?” మాతంగమహర్షి ప్రశ్నార్ధకంగా అన్నాడు. “ఏమిటో చెప్పు తల్లీ ! కుంజరుడు నాకు ఇష్టుడు !”

“కానీ , నాకు సంతతి కలగలేదన్న విచారం నాన్నను క్రుంగదీస్తోంది…” అంజన మెల్లగా అంది.

మాతంగ మహర్షి బిగ్గరగా నవ్వాడు. “విచారం తనయను క్రుంగదీస్తే , తండ్రినీ క్రుంగదీస్తుంది !”

“చక్కగా చెప్పారు ! మా దంపతులకు సంతానమూ లేదు , సంతోషమూ లేదు ! సంసారం నిస్సారమైపోయింది !” కేసరి కంఠంలో విచారం ధ్వనించింది.

“స్వామీ…!” అంజన గాద్గదికంగా పిలిచింది.

మాతంగ మహర్షి తలవాల్చి అంజన ముఖంలోకి చూశాడు. అంజన కళ్ళల్లోంచి నీళ్ళు ఉబుకుతున్నాయి. “ఏమిటి అంజనా ?” అంజన మెల్లగా తలవాల్చుకుంది. ఆమె కన్నీటిబొట్లు మాతంగ మహర్షి పాదం మీద పడ్డాయి.

“అంజనా !” అంటూ మాతంగమహర్షి ఆమె తల మీద తన అరచేతిని వేశాడు. అంజన తల ఎత్తి , కన్నీళ్ళతో ఆయనను చూసింది. “స్వామీ ! తండ్రి కేసరినీ , తాత కుంజరులనూ మించిన శక్తి సామర్థ్యాలు కలిగిన పుత్రుడు కలిగేలా దీవించండి !” మాతంగ మహర్షి చిరునవ్వు నవ్వాడు. “పుత్రుడు పుట్టేలా దీవించే శక్తి నాకు లేదు ! పుత్ర సంతానం కోసం నువ్వు చేసే ప్రయత్నం ఫలించాలన్న ఆశయంతో దీవిస్తాను. ఎందుకో ఈ రోజు – మిమ్మల్ని కలుసుకోవాలనీ , పుత్రసంతానం కోసం ఏం చేయాలో చెప్పాలనీ అనిపించింది నాకు. అందుకే మీరు వచ్చారు !”

“స్వామి !”

“అవునమ్మా ! నీ భవిష్యత్తు , లీలగా నా అంతర్నేత్రానికి గోచరిస్తోంది. మహా ప్రాణుడూ , ముఖ్య ప్రాణుడూ అయిన వాయుదేవుడిని తపస్సుతో మెప్పించు. ఆయన అనుగ్రహ ఫలం నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తుంది !”

“స్వామీ !!” అంజన ఆనందంగా అంది.”రేపే శుభదినం ! పర్వత శిఖరం మీద నీ తపస్సు ప్రారంభించు !” అంటూ మాతంగమహర్షి కేసరి వైపు తిరిగాడు.”కేసరీ ! నీ అర్ధాంగి తపస్సుకు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నీది !”

“తమ ఆజ్ఞ ! అంజనను , కంటిని రెప్ప కాపాడే విధంగా కాపాడుకుంటాను !” అంజనా , కేసరీ మాతంగ మహర్షిపాదాలకు అభివాదనం చేశారు.

“అభిష్ట సిద్ధిరస్తు !” మాతంగమహర్షి దీవించాడు.

పర్వత శిఖరం మీద , ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు క్రింద శుభ్రం చేశాడు కేసరి. సమీపంలో ఉన్న చిన్న కొలనులో సచేలస్నానం చేసి వచ్చింది అంజన. భర్త కేసరి పాదాలకు నమస్కరించింది. వాయుదేవుడిని స్మరించుకుంది. బలవంతుడూ , బుద్ధిమంతుడూ , కుశాగ్రబుద్ధి , శ్రేష్ఠుడూ అయిన పుత్రుడు కలగాలని సంకల్పం చేసుకుంది. ప్రశాంత వాతావరణంలో పులకించిపోతున్న ఆ సుముహూర్తంలో వాయుదేవుడి గురించి తపస్సు ప్రారంభించింది అంజన.

కేసరి అరణ్యంలో తిరుగాడుతూ అంజన కోసం రకరకాల పళ్ళను కోసి తెస్తున్నాడు. కడిగి , శుభ్రం చేసి ఆ మధురఫలాలను అంజనకు అందుబాటులో ఉంచుతున్నాడు. ఆమె ఎప్పుడు తపస్సు ఆపి , ఆహారం కోసం చూస్తుందో !కానీ , కేసరి తెచ్చే పళ్ళన్నీ అలాగే ఉండిపోతున్నాయి. అంజన తపస్సు నిరంతరాయంగా సాగిపోతూనే ఉంది. ఆమె ఆకలి దప్పులను పూర్తిగా మరిచి పోయినట్టుంది ! అన్నాన్ని మరిచిపోతే , అన్నీ మరిచిపోయినట్టే ! తనువును మరిచిపోతే , తనను మరిచిపోయినట్టే ! కేసరి , కళ్ళు మూసి , తపస్సమాధిలో ఉన్న తన సతీమణిని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. అంజన పట్టుదలా , ఏకాగ్రతా , దీక్షా , శ్రద్ధా కేసరిని ఆశ్చర్యంలో ముంచుతున్నాయి. సంతానం కలగాలన్న వాంఛతో తల్లి పడే తపనను తండ్రి పడలేడనిపిస్తోంది కేసరికి.

అంజన తపస్సు సాగుతూనే ఉంది. వాతారవరణంలో మార్పు వచ్చింది. అప్పటిదాకా ప్రశాంతంగా , మెల్లగా వీచిన గాలి వేగం పెరిగింది. కాస్సేపట్లో ఈదురుగాలిగా ఎదిగింది. మరికాస్సేపట్లో సుడిగాలిగా మారింది. ఆ చండమారుత ప్రతాపానికి చెట్లు వంగిపోతున్నాయి. అంజన మీద గొడుగులా ఉన్న చెట్టు క్షణంలో విరిగిపడే దానిలా కదలిపోతోంది ! అయితే ఆ పెనుగాలి ప్రభావం అంజన మీద పనిచేయడం లేదు.పర్వత గుహల్లో , పర్వతం మీద పొదల్లో , చెట్లలో దూరుతూ చెవులు పగిలేలా శబ్దం చేస్తూ , గాలి సుళ్ళు తిరిగుతూ ఉండిపోయింది. ఒక గుహ ముఖద్వారంలో నక్కి , భయాందోళనలతో అంజనవైపే చూస్తున్నాడు కేసరి. ఆమెకు నీడనిస్తున్న చెట్టు విరిగిపోకుండా ఉండాలంటూ పదే పదే ప్రార్ధించాడు కేసరి.

అంజన ఈ లోకంలో లేదు ! కాల స్థల పరిణామాలకు అతీతమైన ఏదో మహాశూన్యంలో ఉన్నట్టుందామె. ఆమె నిబ్బరం కేసరిని అబ్బురపరుస్తోంది. అంజన దీక్షను పరీక్షించడానికా అన్నట్టు వీచిన పెనుగాలి ఉన్నట్టుండి శాంతించింది. అంతసేపూ పర్వతాన్నీ , వృక్షాల్నీ , జంతువుల్నీ గడగడలాడించిన ఆ వాయు శబ్దం దూరంగా , సుదూరంగా వెళ్తున్నట్టనిపిస్తోంది కేసరికి. ధైర్యంగా గుహ ముందుకు వచ్చి చూశాడు. అంజన తపస్సు నిర్మలంగా , ప్రశాంతంగా సాగిపోతూనే ఉంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment