విద్రధ, గుల్మనిదానం
నిలవై, పాసిపోయిన మిక్కిలిగా వేడెక్కిన, గరుకైన, సారంలేని, దప్పికను పెంచు ఆహారాన్ని తీసుకోవడం. అసలేవంకరగా నున్న శయ్యపై గాని మరెక్కడ గాని వంకర టింకరగా పడుక్కోవడం అనే స్వయంకృతాపరాధాల వల్ల రక్తాన్ని పాడుచేసే ఆహార విహారాల వల్ల వ్యక్తి దేహంలోని రక్తం కలుషితమై పోతుంది. దీనివల్ల చర్మం, మాంసం, పొట్ట, నరములు, ఎముకలు, మూలుగ ఇవన్నీ రూపుమాసి పోతాయి. రోగం పొట్టలోచేరి అక్కడి నుండి మొత్తం శరీరాన్ని పరిపాలిస్తుంది. అప్పుడు ముఖంపై గాని, నోటిలో గాని చివరకు శరీర బాహ్యాంతరాలలో ఎక్కడైనా గాని విపరీతంగా నొప్పి పెట్టే ”కురుపు” లవుతాయి. ఈ కురుపులనే ఆయుర్వేదం విదధి అని పేర్కొంది.
ఇవి లోపలికీ బయటికీ కూడా చర్మాన్ని బుసబుస పొంగించి సలుపూ, పోటూ పెడతాయి. త్రిదోషాలూ కలివిడిగా గాని విడివిడిగా గాని విద్రధి, గుల్మాలకు కారణం. కావచ్చు. వాటినుండి కలుషిత రక్తం బయటికి వస్తుంటుంది. అవి, లోనా బయటా కూడా చీమలపుట్ట లాగా ఎత్తుగా పెరుగుతాయి. జీర్ణవ్యవస్థని చెడగొడతాయి. నాభి ప్రాంతంలోనూ, మూత్రాశయంలోనూ, కాలేయంలోనూ, ప్లీహ, హృదయ, వాయుకోశ, మధ్య, ఊరుసంధి ప్రాంతాల్లోనూ ఎక్కువగా పెరుగుతాయి. గుండెదడ వచ్చినపుడు ఇవి భరింపశక్యమైన పోటు పెడతాయి.
ఈ విద్రధి పుట్టినపుడు నల్లగా వుండి పగలడానికి ముందుగానీ బాగా చీము పట్టాక గానీ ఎఱ్ఱగా తయారవుతుంది. దీని వల్ల కొందరికి కొన్ని రోగ లక్షణాలూ మరికొందరికి ఇతరములైన రోగలక్షణాలు బయటపడతాయి. వీటివల్ల కొందరికి తెలివి తప్పవచ్చు. కొందరికి తల తిరగవచ్చు లేదా మూత్రం ఆగిపోవచ్చు, పెద్ద ధ్వనితో అన్నీ కదలవచ్చు.పిత్త జన్యవిద్రధి ఎఱ్ఱగా,రాగిరంగులో లేదా నల్లగా వుంటుంది. జ్వరం, దాహం, స్పృహ తప్పిపడిపోవడం, మంట మున్నగు రుగ్మతలను కలిగిస్తుంది. కఫ జన్యమైతే పుట్టడం, చీము పట్టడం చాలా వేగంగా జరుగుతాయి. ఈ పొక్కులు కొంచెము తెలుపులో నుండి, దురద బాగా పెడతాయి. వణకు, ముట్టుకుంటే మంచులా చల్లగా తగులుట, విద్రధి గలచోట తిమ్మిరెక్కుట, ఆవులింతలు, అరుచి, ఒళ్ళు బరువెక్కుట కూడా జరుగుతాయి.
సన్నిపాత విధి పెరుగుటకు చితుకుటకు కూడా చిరకాలం తీసుకుంటుంది. విషమంగా వుంటుంది. బాహ్యాంతరిక రకాల్లో కూడా రోగికి గట్టి విరేచనం కాదు. కురుపు నల్లబడి దానిచుట్టూ మరిన్ని చిన చిన్న పొక్కులేర్పడి అన్నీ దురదా, సలుపూ, పోటూ పెడుతుంటాయి. చివరలో మంట పుడుతుంది. జ్వరం వస్తుంది.
కలుషిత రక్తం వల్ల ఏర్పడు బాహ్య విద్రధి పిత్త దోషం వల్ల పుడుతుంది. కొన్ని కురుపులు దెబ్బ తగలడం వల్ల కూడా పుడతాయి. ఈ దెబ్బ వల్ల వచ్చే గాయంలో నున్న రక్తం వాత దోషం వల్ల అక్కడ చేరి పిత్తాన్ని ప్రకోపింపచేయడంతో తీవ్రంగా బాధించే విద్రధులేర్పడతాయి.బాధలలో గాని రోగాల్లో గాని తేడాలు విద్రధి పుట్టిన ప్రాంతాన్ని బట్టి వుంటాయి. బొడ్డు ప్రాంతంలో వచ్చే రోగం నీరు కట్టు రోగాన్ని తెస్తుంది. ప్లీహ ప్రాంతంలోని రుగ్మత శ్వాస కార్యంలో అవరోధాలను కల్పిస్తుంది. తీవ్ర దాహమునూ తెప్పిస్తుంది. ఊపిరితిత్తుల లోని విదధి గొంతులో అడ్డంకులనూ, గుండెలోనిది శరీరమంతటా నొప్పులనూ కలిగిస్తాయి.
నడుము, దాని పక్కలలోని కురుపు అక్కడ తిమ్మిరినీ, తమక శ్వాసమనే పడిశభేదాన్నీ, దబ్బనంతో గుండెను తవ్వుతున్నట్లుండే నొప్పినీ… సూది గుచ్చుతున్నట్లున్న గుండె నొప్పినీ సృష్టిస్తుంది. తొడల సందుల్లోగాని, పిఱ్ఱలపై గానీ, వెన్నుపై గానీ లోపలికైనా బయటికైనా పుట్టుకొచ్చే ఈ పొక్కు వల్ల పక్కల్లో నొప్పితో బాటు గుడంలో అడ్డంకీ ఏర్పడుతుంది.
చర్మంపైనే కాకుండా లోపలికి కూడా ఈ చక్కెర కురుపులుంటాయి. అవీ పెరుగు తాయి. చీము పట్టి పగులుతాయి. ఆ చీము బొడ్డు పైకి వుండే కురుపులకైతే నోటి నుండీ ఇతరాలకు గుదం నుండీ బయటకి వస్తుంది. ప్రకోపితమై వాయువు దాని మార్గంలో అడ్డంకి తగిలినపుడు అంగాల వద్ద వాపుని కలిగిస్తుంది. మలనాళంకీ తొడల సందులకీ మధ్య గల నరాల గిన్నెను చేరి వృషణాలను దాటి పోతూ వాటిపై ఒత్తిడిని కలుగజేయడంతో అవి వాచిపోతాయి. ఇలాటి వరిబీజ రుగ్మతలు ఏడు రకాలుగా వుంటాయి.
ఈ దశలోనే వరిబీజాన్ని తగ్గించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అది ఇక కుదరదు.ఈ వరిబీజాన్నే వృద్ధి అని కూడా అంటారు. ఇది నిర్లక్ష్యం చేయబడితే గుల్మంగా మారుతుంది. గుల్మమనగా ప్లీహాదుల వ్యాకోచము. అది అజీర్ణము వంటి ఎన్నో వ్యాధులను సంది. గుల్మని గట్టిగా నొక్కితే శబ్దాలు చేస్తూ అణగిపోతుంది. కాని కాసేపట్లోనే మరల యథాస్థాయికి చేరుకుంటుంది.
రక్తవృద్ధి (ఇదొక వృషణ రుగ్మత పేరు) నయం కాదు. వాతవృద్ధి అదే పరిమాణంలో కొనసాగుతూ, ఎఱ్ఱగా నీలంగా వుండే రక్తనాళాలు కనిపిస్తుండగా వుంటుంది. త్రిదోషాల ప్రకోపాలను బట్టి ఈ వృద్ధి కురుపులలో ఏడు రకాలుంటాయి. ఎనిమిదవది స్త్రీలలో కనిపిస్తుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు, చలి, ఆకలి ఎంత బలవంతునైనా వంచి పారేస్తాయి. చీపురుపుల్లలా చేసేస్తాయి. అందుచేత అందరమూ ఆహార నియమాల విషయంలో, సరదాల విషయంలో జాగ్రత్తగా వుండాలి. ఎక్కువ ఉడికిన అన్నాన్ని తిన్నా, అతిగా ఉపవాసాలు చేసినా, స్నానాలు చేసినా, అతిగా నీటితో సహా ఏది తాగినా తల తిరుగుతుంది. తెలివి తప్పుతుంది. కాబట్టి ఎందులోనూ అతి పనికిరాదు. మితిని మించిన హితము లేదు.
విరేచనాదులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూనే మూలదోషమేంటో జాగ్రత్తగా పరిశీలించాలి.వాతజ వృద్ధిలో వాయువు రోగి శరీరంలోని కలుషిత భాగాలతో కలిసి రోగాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి వాటిని విడివిడిగా గాని కలిపి గాని అదుపు చేయాలి. వాయువు రక్తంతో కలిసి దానిని నాళాలలో సవ్యంగా ప్రవహించనీయకుండా అడ్డుకోవడం వల్ల శరీరంపై పొక్కులు కురుపులు ఏర్పడి ఆ గాలిలోపలి నుండి తన్నుకు వచ్చినపుడల్లా నొప్పెడుతాయి. ఈ గుల్మాలు చర్మానికి లోపలివైపున్నా కూడా వైద్యుని స్పర్శకు తగులుతాయి. ఆ ప్రాంతం కాస్త వేడిగా కూడా వుంటుంది.
కఫజ గుల్మ రోగంలో సైమిత్యం, అరుచి, తలనొప్పి, సర్వాంగాలలో శైథిల్యం, శీత జ్వరం, మూర్ఛ, చెమట, దాహం, జ్వరం అనే లక్షణాలు బయట పడతాయి. త్రిదోష జన్య గుల్మ రోగంలో ఈ లక్షణాలన్నీ కనబడవచ్చు. అంతేకాక తీవ్రవేదన, అతిశయించిన దప్పిక వుంటాయి. ఇది కుదరడం కష్టం. దుష్ట రక్తం, దుష్టాశ్రయం వల్ల వస్తాయి కాబట్టి విద్రధి గుల్మాలు సవ్యంగా స్థిరంగా వుండవు. కొన్ని వేగమే పగులుతాయి. కొన్ని ఆలసిస్తాయి, కొన్ని పగలవు. అంతరాశ్రయ (చర్మంలోపలికున్న గుల్మాల వల్ల, వస్తి, కుక్షి, గుండె ప్లీహాలలో నొప్పి వుంటుంది. జఠరాగ్ని, ఒంట్లో సత్తువ నశిస్తాయి. మల మూత్రాల చలనం మందగిస్తుంది.
బహిరాశ్రయ (చర్మంపై నున్న) గుల్మాలున్న వారికి ఈ వేదనలు పెద్దగా బాధించవు గానీ ఉదరంలో తీవ్రవేదన కలుగుతుంది. కురుపున్న చోట శరీరం నల్లబడిపోతుంది. కురుపుకి గాలి సోకినా తీవ్రంగా నొప్పెడుతుంది. ఉదరాధ్మానం లేదా అనాహరోగమని దీనికి పేరు. పైకి వుండి ఎత్తుగా ముడిపడిన కురుపుని అష్ఠీల విద్రధి అంటారు.వీటిలో కొన్ని కుదరడం అసాధ్యం.
నూట ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹