ఉదర రోగ నిదానం
మందాగ్ని వల్ల వచ్చే రోగాల్లో ఉదరరోగం ప్రధానమైనది. ఉదరంలో మలం ఉండి పోవడం వల్ల అజీర్ణరోగం పట్టుకుంటుంది. వాయువు దీని వల్ల పైకీ క్రిందికీ స్వేచ్ఛగా పోవడానికి కడ్డంకి ఏర్పడుతుంది. అప్పుడు ప్రవాహిని నాడులన్నీ పనిచేయకుండా ఆగిపోతాయి. ప్రాణాపానాది వాయువులు దూషితాలై మాంస సంధులలో ప్రవేశిస్తాయి. దాంతో కడుపు పనులకు అడ్డంకులేర్పడి ఉదరవ్యాధులు వస్తాయి. ఇవి ఎనిమిది రకాలు. వాతజ, పిత్తజ, కఫజ, సన్నిపాతజ, సలిలజన్య, ప్లీహజన్య, బద్దోధరవృద్ధి, క్షతజన్యములు. ఉదరరోగం శరీరంపై దాడి చేయగానే కాలుసేతులు, కడుపు వాచిపోతాయి. తిండి తినాలని ఉండకపోవడంతో అది తగ్గిపోయి దానితో బాటు వంట్లో చురుకుదనం, బలం కూడా క్షీణిస్తాయి. రోగి బక్కచిక్కిపోతాడు. పొట్టమాత్రం ఉబ్బిపోతుంది.
ఒక విధమైన ప్రేతకళ వచ్చేసినట్లనిపిస్తుంది రోగిముఖంలో, ఉదరరోగానికి పూర్వలక్షణాలు ఆకలి నశించడం, అరుచి, జీర్ణసమయంలో దాహం, మంట. దీనికి కారణ వ్యక్తి రోగిగా మారడానికి ముందు చేసే అపథ్యం. ఉదరరోగం వల్ల బలం క్షీణిస్తుంది. దాని వల్ల చిన్న పనిచేయాల్సి వచ్చినా ఆయాసం వస్తుంది. ఏ పని మీదా బుద్ధి నిలవదు. అక్కడక్కడా కురుపులవుతుంటాయి. ఏమాత్రం తిన్నా వస్తి సంధులలో నిరంతరం పీడ కలుగుతుంటుంది.
రోగి చిన్నవాడైనా వృద్ధుని వలె బలహీనుడైపోతాడు. బద్ధకం, నిర్లక్ష్యం, మలవేగం, మందాగ్ని, వాపులు, దాహం, మంట, ఆధానం ఇవన్నీ జలోదర లక్షణాలు. అన్ని ప్రకారాల జలోదరాలూ మృత్యు కారకాలే. ఉదర సమస్యలో వాయువు నాభిలోనూ ప్రేగుల్లోనూ స్తబ్ధతను కలుగజేసి గుండె, బొడ్డు, కటి, గుదము, వంక్షణాలలో తీవ్ర బాధను కలిగించి బయటకు పెద్ద శబ్దంతో పోతుంది. స్వల్పంగా మూత్రం కూడా పోతుంది. కాలుసేతులపై, నోటిలో, కడుపులో కురుపులై పోతాయి. నడుము వెనుక భాగం నొప్పెడుతుంది. బొడ్డు క్రింది భాగమంతా బరువెక్కినట్లుంటుంది కడుపులో నుండి గుడగుడ శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇది వాతోదరం.
కఫజనిత ఉదరరోగంలో శరీరం పాలిపోవడం కూడా జరుగుతుంది. త్రిదోషాలూ కలిసి వచ్చే ఉదర రోగంలో ప్లీహం కురుపేని స్థానభ్రంశం చెందుతుంది. ఈ లక్షణాలన్నింటితో బాటు ఈ ఉదరరోగంలో మూర్ఛ, శూలనొప్పి, కడుపు నల్లగ కూడా వుంటాయి. ప్లీహోదరంతో వాత పిత్త కఫములు మూడిటికీ సంబంధముంటుంది. కుపితమైన అపానవాయువు మల (పురీష) పిత్త, కఫాల దారులనడ్డగించి ఉదర బద్ద గుదర మను పేరు గల రోగాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాని వల్ల జ్వరం, దగ్గు, శ్వాస సమస్య, తలలో బొడ్డులో పక్కలలో, గుదంలో నొప్పులూ కలుగుతాయి.
కడుపు కదలికలు కోల్పోతుంది. దానిపై రక్త నాళాలు నీలంగా ఎఱ్ఱగా ఒక వలనేర్పాటు చేసినట్లు కనిపిస్తాయి. ఆవుతోక పై నున్నట్లుగా కడుపు పైభాగంలో మలం కనిపిస్తుంది. అతిగా తినేవారికీ, ఎముకలనూ పాషాణయుక్త ఆహారాన్ని సేవించేవారికీ పురీష నాళమూ, ప్రేగూ పగిలిపోయి దానివల్ల చీమూ మలాలతో బాటు జలం కూడా గుడా మార్గం ద్వారా బయటికి పోతుంది. అది పచ్చగా ఎఱ్ఱగా పురీష గంధయుక్తమై వుంటుంది. ఈ మిశ్రమం కొంత కడుపులోనే దిగబడిపోయి జలోదరాన్ని కలిగించి తరువాత వాతాది దోషాలచే మరల వికృతి చెంది పరిస్రావీఛిద్రోదర మను పేరు గల రోగం వస్తుంది.
మద్యం నుండి నీరు దాకా గల పానీయాలను అతి శీతలంగా నున్న వాటిని అతి మిక్కిలిగా తాగేసే వారికి మందాగ్ని, కడుపులో చీము పుట్టుక ఎక్కువవుతాయి. వాత, కఫాలు ప్రకోపించి నీటి నాళాలను పాడు చేసి దూషిత జలాలను వృద్ధి చేస్తాయి. క్లోమాన్ని కంగారుపెట్టి ఉదరరోగాన్ని సృష్టిస్తాయి. కంపనంతో సహా ఇదివఱకు చెప్పబడిన అన్ని ఉపద్రవాలకూ రోగిని అగ్గలం చేసే ఈ రోగాన్ని ఢకోదరమనీ, ఉదకరోగమనీ అంటారు.
ఉదరరోగాన్ని నిర్లక్ష్యం చేసే అది బాగా పెరిగి చెమటతో సహా అన్ని స్రవంతులనూ ఆపేస్తుంది. జలములన్నీ కడుపులోనే వుండిపోయి అది బాగా ఉబ్బిపోతుంది. ఉదరరోగాల పేళ్ళు క్రమంగా వాతోదరం, పీతోదరం, కఫోదరం, శ్లేష్మోదరం, ప్లీహోదరం, సన్నిపాతోదరం, జలోదరం. ఇవి ఒకదానిని మించి మరొకటి క్రమంగా మనిషిని మృత్యువుకి దగ్గర చేస్తాయి.ఏ ఉదర రోగానికైనా వేసే మందు పదిహేను రోజుల్లోనే గుణం చూపించాలి. లేకుంటే కష్టమే.
నూట ఇరవై నాల్గవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹