సూర్యగ్రహ మహిమ ఐదవ భాగం
కైలాసం….
“ఆదిదంపతుల చరణాలకు అభివందనాలు !” కైలాస మందిరంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ అన్నాడు వాయువు.
“సుఖీభవ !” శివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు. “వాయుదేవా ! కుశలమే కద !” “మహేశ్వరుల మహాతేజాన్ని కుక్షిలో నిక్షేపించుకున్న ఈ వాయువు కుశలానికి కొరత ఉంటుందా , స్వామీ !” వాయువు వినయంగా అన్నాడు.
“మహేశ్వరుల మహాతేజమా ?!” పార్వతి ఆశ్చర్యంతో అంది. “ఔను మాతా ! ఆదిదంపతులు వానర రూపాలతో విహరించిన విశిష్ట సంఘటనను మరిచిపోయారా ?” వాయువు చిరునవ్వుతో అన్నాడు.
“ఔహ్… ఆ వానర వైభవం…” పరమేశ్వరుడు గుర్తు చేసుకుంటూ , పార్వతి వైపు ఓరగా చూస్తూ ఆగాడు.
“ఆ సమయాన వెల్లివిరిసిన తమ మహత్తర తేజస్సును నాకు అప్పగించారు. కుక్షిలో నిక్షేపించి , రక్షిస్తూ ఉండమని ఆజ్ఞాపించారు ! ఆనాటి నుండీ తమ ఆజ్ఞను శిరస్సు మీదా , తేజస్సును ఉదరంలోనూ ధరించి , భరించి…”
“వాయూ ! అది గుర్తు చేయడానికి కారణం ?” శివుడు వాయువును వారిస్తూ అడిగాడు.
“స్వామీ ! కుంజరుడనే వానర వీరుడి పుత్రీ , కేసరి అనే వానర వీరపత్నీ అయిన అంజన పుత్రసంతానాన్ని కోరి నా గురించి తీవ్రంగా తపస్సు చేస్తోంది ! అనన్య సామాన్యమైన ఆ సాధ్వి దీక్ష నన్ను అలరించి వేస్తోంది. శ్రేష్ఠ వానర రూపంలో మీరు అనుగ్రహించిన మహద్వీర్యాన్ని ఆ వానరకాంతకు దానం చేయడానికి మీ దంపతుల అనుమతి కావాలి !” వాయువు వివరించాడు.
“అవశ్యం ! అంజన పూర్వజన్మలో అప్సరస ! బృహస్పతి శాపం వల్ల వానరస్త్రీగా జన్మించింది ! మా తేజస్సుతో పుత్రుణ్ణి పొందడానికి అంజన అన్ని విధాలా అర్హురాలు !” పరమశివుడు నవ్వుతూ అన్నాడు.
“పుత్రుడిని కోరి అంత దీక్షగా తపస్సు చేస్తున్న అంజన – బిడ్డడిని చక్కగా చూసుకోగలదు !” పార్వతి తన అభిప్రాయం వినిపించింది.
“వాయూ , వెళ్ళు ! మా తేజోఫలాన్ని అంజనకు అందించు !” పరమశివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు. “ఆ వీరపుత్రుడు నీ నామధేయంతో ప్రసిద్ధుడవుతాడు ! నీ పుత్రుడుగా వ్యవహరించబడతాడు !”
“మహాప్రసాదం !” అంటూ వాయుదేవుడు అంతర్హితుడయ్యాడు.
అంతరాయం అనేది లేని తపస్సులో పూర్తిగా మునిగిపోయి , చెట్టు కింద రాతిబొమ్మలా కూర్చున్న అంజనను చూస్తూ కేసరి సానుభూతిగా నిట్టూర్చాడు. అంజన ఎప్పుడు తన సాధనకు విరామం ఇస్తుందో తనకి తెలీదు. కానీ , ప్రతీపూటా ఆమె కోసం మధురమైన ఫలాలూ , తేనె తీసుకు వస్తూనే ఉంటాడు తను ! తన ఇల్లాలి కోరికను త్వరగా తీర్చమని వాయుదేవుడిని ప్రార్ధిస్తూ , అరణ్యం వైపు నడక సాగించాడు కేసరి. ఉన్నట్టుండి గాలి విజృంభించి , సుడిగాలిలాగా అంజన చుట్టూ ఒకసారి వేగంగా పరిభ్రమించింది. మరుక్షణం పిల్లగాలిలా మారిపోయి , చల్లగా వీచసాగింది.
“అంజనా !” గుహలో సింహనాదంలా ధ్వనించింది అంజనను పిలుస్తున్న కంఠం. ఆ పిలుపు అంజన సర్వస్వాన్నీ ఒక స్పందనతో కదిలేలా చేసింది. ఎన్నో రోజులుగా మూతలుపడి , కళ్ళ మీద అతుక్కుపోయిన అంజన రెప్పల్ని ఆ పిలుపు మెల్లగా పైకి ఎత్తింది. ఏదో ఉన్నతమైన దివ్య రూపం లీలగా కనిపించింది అంజనకు. బలిష్టమైన శరీరం , బంగారం లాంటి దేహకాంతి , ఎడమ భుజం మీద పెద్ద బంగారు గద… కండలు తిరిగిన ఆయన శరీరం గాజు కుప్పెలో జ్యోతిలా , స్వర్ణయవనిక వెనుక ఆకారంలా , కనిపించీ కనిపించకుండా దర్శనమిస్తోంది !
“అంజనా ! నేను వాయుదేవుణ్ణి !” వాయుదేవుడి గంభీర కంఠం పర్వత సానువుల్లో ప్రతిధ్వనించింది.
“తండ్రీ…వచ్చావా ?!” అంజన కంఠంలో ఉద్వేగం వణికింది.
“తల్లివి కావాలన్నావుగా ! తపస్సుతో నన్ను మెప్పించావుగా ! అందుకే వచ్చాను ! పుత్రుడుగా నీ గర్భవాసాన జన్మించే మహాతేజస్సును ప్రసాదిస్తున్నాను. నీ శరీరాన్ని ఆవరిస్తున్న ఈ తేజస్సు నీ పావన గర్భంలో పదిలంగా ఉండి , సకాలంలో నీ ఒడిలో ఆడుకుంటుంది !” అంటూ వాయుదేవుడు చెయ్యెత్తి , దీవిస్తున్న భంగిమలో పట్టుకున్నాడు. పాదరస వర్ణంలో తళతళలాడుతున్న కాంతి వాయుదేవుడి అరచేతిలోంచీ అంజన వైపు కిరణంలా దూసుకువెళ్ళి , ఆమె శరీరాన్ని వెలుగుతో నింపింది. మరుక్షణం ఆ కాంతి కిరణం అదృశ్యమైంది. అంజన శరీరాన్ని ఆవరించిన అద్భుత తేజం ఆమె శరీర అంతర్భాగంలోనికి అదృశ్యమైంది.
“అంజనా ! పరమశివుడి అంశతో , మహాబలపరాక్రమ సంపన్నుడూ , మేథావీ అయిన సుపుత్రుడు నీకు జన్మిస్తాడు. మహా పండితుడవుతాడు. నీ నామధేయాన్ని లోకాలలో శాశ్వతం చేస్తాడు. వాయుపుత్రుడుగా , వాతాత్మజుడుగా , మారుతిగా వాసికెక్కుతాడు. ”నరుడి కన్నా వానరుడు మిన్న” అని నిరూపిస్తాడు !” వాయుదేవుడి కంఠంలో ఆప్యాయత ప్రతిధ్వనించింది.
“ధన్యురాలిని స్వామీ !”
అంజన ఆనందభాష్పాలు రాలుస్తూ అంది. వాయుదేవుడు చిరునవ్వు చిందిస్తూ చూస్తున్నాడు. ఉన్నట్టుండి గుహలో దూరి చప్పుడు చేస్తున్నట్టు – వాయువు శబ్దం చేసింది. వాయుదేవుడు అగృశ్యమయ్యాడు. పట్టరాని ఆనందంతో అంజన కూర్చున్నచోటి నుండి లేచింది. భర్త కోసం ఆత్రుతగా అటూ ఇటూ చూసింది.
“స్వామి !”
“అంజనా !” అరణ్యంలోంచి అప్పుడే వస్తున్న కేసరి ఆనందంగా బిగ్గరగా అరిచాడు. అంజన దూరంలో నడిచి వస్తున్న కేసరి వైపు వాయు వేగంతో పరుగెట్టసాగింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹