Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ఇరవై ఐదవ అధ్యాయం

పాండు – శోథ నిదానం

పిత్త, వాత ప్రకోపాల వల్ల ఒక దశలో శరీరంలోని మలిన రక్తనాళాలు, ఇతర మలాలు కూడా ప్రకుపితాలవుతాయి. అపుడు ఈ దశలో పరమ బలవత్తరమైన వాయువు గుండెలోని కెగసి హృదయంలో నుండు పదిధమనులనూ ఆశ్రయంగా చేసుకొని సంపూర్ణ శరీరమంతటా విస్తరిస్తుంది. తరువాత పిత్తాన్నాశ్రయించి శ్లేష్మ, చర్మ, రక్త, మాంసాదులను చెడగొట్టి మలిన రక్తం చర్మానికీ మాంసానికి మధ్య చేరేలా చేస్తుంది. దాని పర్యవసానంగా చర్మం భిన్నభిన్న వర్ణాల్లోకి మారుతుంది. సహజమైన రంగు పోతుంది. ముందు ఆకుపచ్చగా తరువాత పసుపు పచ్చగా చివరకు లేత పసుపు రంగులో ఒంటి రంగు ఉండిపోతుంది. దీనివల్లనే దీనిని పాండు రోగమన్నారు.ఈ రోగంలో ధాతు గురుత్వం, స్పర్శ శిథిలతా వుంటాయి. ఆమ్ల జన్య పాండురోగం వల్ల శరీరంలోని సర్వగుణాలూ క్రమంగా నశిస్తాయి. రక్తం క్రమేపీ తగ్గిపోతుంది. మేదా, ఎముకలు నిస్సారమైపోతాయి. అన్ని అంగాల(లో) నూ నిస్సత్తువ ఆవహిస్తుంది. గుండెలో ద్రవాలు చేరుతాయి. కనులు ఉబికి వస్తాయి. నోటిలో లాలాజలమెక్కువ స్రవిస్తుంది. దాహం వెయ్యదు.

చల్లటి పదార్థాలపై మక్కువ పెరుగుతుంది. కానీ చల్లదనముపై చిరాకు పెరుగు తుంది. రోమాంచం, మందాగ్ని వుంటాయి. శరీరానికి శక్తి తరిగిపోయి జ్వరం, శ్వాసలో ఇబ్బంది, కర్ణశూల, తలతిరుగుడు వస్తాయి. దీన్ని తెలుగులో ”బొల్లి” అనవచ్చు. పాండు రోగంలో అయిదురకాలుంటాయి. వాత, పిత్త, కఫజ, సన్నిపాతజ, మృత్తికా భక్షణ జన్య. గుండెలో వణకు, చర్మం గరుకు దేరుట, అరుచి, మూత్రం పచ్చబడుట, చెమట, మూత్ర పరిమాణంలో తగ్గుదల ఇవన్నీ పాండు రోగానికి పూర్వరంగమనుకోవచ్చు. వాయు జన్యపాండు రోగంలో తీవ్రవేదన, ఒళ్ళు చిటచిటలాడుట మున్నగు లక్షణాలుంటాయి.

ఈ రోగం వల్ల రక్తనాళాలు, గోళ్ళు, మలమూత్రాలు, నేత్రాలు నల్లగాను ఎఱ్ఱగాను అవుతాయి. నోటినుండి ముక్కునుండి విరసత, మలశోషం, పక్కల్లో నొప్పి వస్తాయి. పిత్తజ పాండురోగంలో రక్తనాళాదులు ఆకుపచ్చగా కనిపిస్తాయి. రోగికి జ్వరం, కళ్ళు చీకట్లు కమ్ముట, దాహం, క్షీణత, మూర్ఛ, దుర్వాసన, చల్లనివి తిని తాగాలనే కోరిక, ముఖంలో పెళుసుదనము అను లక్షణాలు వస్తాయి. కఫజ పాండు రోగంలో గుండె చెమ్మగిల్లుట, మలభేదం, పుల్ల, త్రేన్పులు, చిరుమంటలు వుంటాయి. కార్య నిరాసక్తత, నోటిలో ఉప్పటి రుచి, శ్వాసలో అసౌకర్యము, రోమాంచము, గొంతు బొంగురు, దగ్గు, వాంతులు, చిరాకు అను లక్షణాలు గోచరిస్తాయి. త్రిదోషజన్యమైన ఈ రోగంలో లక్షణాలను పోల్చుకోవడం కష్టం. ఈ లక్షణాలన్నీ గాని కొన్నిగాని వుంటూ అసహ్యంగా శరీరం మారిపోతుంది. రోగాలూ ముదిరిపోతాయి.

మన్ను తినడం వల్ల పాండురోగం రావచ్చనుకున్నాం కదా! వగరుగా నున్న మట్టి తినడం వల్ల వాతం, ఉప్పగా లేదా చప్పగా నున్నదాని వల్ల పిత్తం, తీపి మట్టి కఫం ప్రకోపితాలవుతాయి. రసాలన్నీ తగ్గిపోతాయి. రక్తనాళాలన్నీ రక్తంతో నిండిపోయి ఆ రక్తం ప్రవహించకుండా అలాగే వుండిపోవడం పాండురోగానికి కారణమవుతుంది. ఈ రోగం ముదిరిపోతే బొడ్డు, కాళ్ళు, ముఖం, మూత్ర మార్గం పొక్కులెక్కిపోతాయి. క్రిములు, రక్తం, కఫం మలంతోబాటు పడతాయి. పిత్త రోగాన్నుత్పన్నం చేసే ఆహారపానీయాలను అతిగా సేవించే పాండు రోగికి కామెర్ల రోగం వస్తుంది. అతని పిత్తము రక్తమాంసాలను దహించి వేస్తుంది. దానివల్ల మూత్రం, కనులు, ముఖము, ఒళ్ళు, మలము, పసుపు పచ్చని రంగులోకి మారిపోతాయి. మనిషి దుర్బలుడై పోతాడు.

పిత్త శోథాలు (కురుపులు) పుట్టుకొస్తాయి. నిర్లక్ష్యం చేస్తే అవి చాలా పెద్దవైపోతాయి. ఈ రోగాన్ని ”కుంభకామల” మంటారు. హలీమక నామకమైన మరొక రోగముంది. అది పిత్తము శ్యామ హరిత వర్ణాలలోకి పోతే వస్తుంది. పాండురోగంలో ఇదోక రకం. పాండురోగ భేదాలన్నిటిలోనూ గట్టిగా కనిపించే లక్షణాలు కురుపులే. కాబట్టి ఈ శోథాలను క్షుణ్ణంగా పరిశీలించి రోగ నిదానానికి ఆపై నిర్మూలను పూనుకోవాలి. దద్దురోగము, అమ్మవారు, చికెన్హ్పెక్సు, స్మాల్పాక్సు అను పేళ్ళు గల విసర్ప రోగములు, కుష్టు రోగంలోని చాలా రకాలు భారత ప్రభుత్వ సంక్షేమ చర్యల వల్ల మనదేశంలో పూర్తిగా నివారింపబడినవి. ఇవి ఇక ఎవరికీ సోకే అవకాశం లేదు కాబట్టి అధ్యాయాలు అనువదింపబడుట లేదు.

నూట ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment