సూర్యగ్రహ మహిమ – ఆరవ భాగము
ఋతువులు మారుతున్నాయి. ప్రకృతి కాంత ఋతువుకు తగ్గ వేషం ధరిస్తూ , అన్ని ఋతువుల్లోనూ అందంగా కనిపిస్తూ వస్తోంది. మొగ్గలు పుష్పించాయి. పువ్వులు కాయలుగా ఎదిగాయి. కాయలు పళ్ళయ్యాయి. అంజన గర్భం రోజు రోజుకూ వృద్ధి చంద్రుడిలాగా పెంపొందుతోంది. కేసరి ఆమెకు సకల సౌకర్యాలూ సమకూర్చుతున్నాడు. గర్భ భారాన్ని మోస్తున్న అంజన బొద్దుగా ఉన్న తామర మొగ్గను గుర్తుకు తెస్తోంది కేసరికి. ఇన్నాళ్ళూ కానరాని ఏదో అలౌకిక సౌందర్యం ఆమె తనువులోంచి పెల్లుబుకుతోంది. మనసునీ , హృదయాన్నీ అలరించే అద్భుత సౌందర్యం అది ! తనువును తాండవం చేయించే అందం కాదది.
అది వైశాఖ మాస బహుళ పక్ష దశమి. అంజన మగ శిశువును ప్రసవించింది. బాలుడు సహజమైన ఆభరణాలతో , వస్త్రాలతో అద్భుతంగా ఉన్నాడు. ఎర్రటి ముఖం. బంగారంలాంటి శరీర వర్ణం. కర్ణకుండలాలు. యజ్ఞోపవీతం. మెడలో రత్నాల హారం. ముంజేతులకు కంకణాలు. పసుపు పచ్చరంగు కటి వస్త్రం ! ఆ పంచె మోకాళ్ళ పై నుంచి గోచిలా కట్టబడి ఉంది. పీతాంబరంతో , ఆభరణాలతో , ముఖ్యంగా పవిత్ర యజ్ఞోపవీతంతో జన్మించిన కుమారుడు కేసరీ అంజనలను ఆశ్చర్యానందాలలో ముంచి వేశాడు. అంజన ప్రసవం జరిగిన గుహ అంతర్భాగంలోకి ఉన్నట్టుండి సుగంధాలతో , చల్లదనంతో నిండిన మలయమారుతం ప్రవేశించింది. మలయ మారుత రూపంలో వాయుదేవుడు గుహలోకి వచ్చాడు , వానరపుత్రుణ్ణి చూడడానికి,లీలగా తమ ముందు సాక్షాత్కరించిన వాయుదేవుడికి అంజనా , కేసరీ నమస్కరించారు.
“స్వామి ! మీ ప్రసాదం ఫలించింది ! నా జన్మ ధన్యమైంది !” అంది అంజన. “నా జన్మ కూడా , అంజనా !” కేసరి ఆనందంగా అన్నాడు. “ఔను ! మీది ఆదర్శ దాంపత్యం ! పరమేశ్వరుడి మహాతేజం మీ పుత్రుడుగా అవతరించింది…” అంటూ వాయుదేవుడు బాలుణ్ణి చేతుల్లోకి తీసుకొన్నాడు. “బాలుడు మహాసత్వ సంపన్నుడు. అంజనా కుమారుడుగా , ఆంజనేయుడుగా , కేసరి నందనుడుగా ప్రఖ్యాతి చెందుతాడు. వాయుపుత్రుడిగా , మారుతిగా , పావనిగా పిలువబడుతూ నా నామధేయాన్ని సుస్థిరం చేస్తాడు ! అది మనందరి అదృష్టం !”
“నా చిరంజీవికి మీరు వెన్నుకాపుగా ఉండాలి !” అంది అంజన. “అవశ్యం ! అది నాకు మహదానందం , అంజనా ! ఈ మహాప్రాణుడు ఉన్నంత వరకూ ఆంజనేయుడికి ఏ ప్రమాదమూ రాదు !” వాయుదేవుడు బాలుడి నుదురును ముద్దాడి , కేసరికి అందించాడు. కేసరి బాలాంజనేయుడిని హృదయానికి హత్తుకున్నాడు. సున్నితంగా. వాయుదేవుడు ముగ్గుర్నీ దీవిస్తూ అంతర్హితుడయ్యాడు.
పువ్వు పుట్టగానే పరిమళించినట్టు , జన్మించిన అచిర కాలంలోనే ఆంజనేయుడు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం ప్రారంభించాడు. అతని అల్లరీ , ఆటా తల్లిదండ్రులకు పరమానందాన్ని అందిస్తున్నాయి. అంజనా , కేసరీ గుహలోంచి ఇవతలకి వచ్చి , ఆంజనేయుడి కోసం చూశారు. గుబురుగా ఉన్న ఒక చెట్టు నుంచి కాయలూ , పిందెలూ రాలి పడుతున్నాయి. కాయల్నీ , పిందెల్నీ కొరికి , కొరికి కిందపడేస్తున్నాడు ఆంజనేయుడు !
“నాయనా ! ఆంజనేయా ! చెట్టు దిగిరా !” అంది అంజన , చెట్టు వద్దకు నడుస్తూ. ఆంజనేయుడు కిందికి దూకి , చేతుల్లోని కాయలను కొరికి , విసుగ్గా విసిరివేశాడు. “కసుగాయల్నీ , పిందెల్నీ అలా తెంపి , కొరికి పారవేయడం తప్పు కదా , నాన్నా !” అంది అంజన బాలాంజనేయుడిని ఎత్తుకుంటూ.
“అవి రుచిగా లేవమ్మా !” ఆంజనేయుడు తన చర్యను సమర్థించుకుంటూ అన్నాడు. “చెట్టునుంచి ఎర్రగా మగ్గిన పళ్ళను మాత్రమే కోసి , తినాలి నాయనా ! అవి తియ్యగా , రుచిగా ఉంటాయి !”
“అయితే అమ్మా , పళ్ళు ఎర్రగా ఉంటాయా ?” బాలాంజనేయుడు ప్రశ్నించాడు. “ఆ ! కాయలు పచ్చగా ఉంటాయి. పళ్ళు ఎర్రగా ఉంటాయి !” అంజన వివరిస్తూ అంది. “కాయలూ , పిందెలూ – ఇలా తెంపి వేస్తే , వ్యర్థమైపోతాయి. అందువల్ల మనం చక్కగా ఎర్రగా మగ్గిన పళ్ళనే కోసి , తినాలి ! ఏం ?”
“ఓ !” అంటూ ఆంజనేయుడు అంజన చంకలోంచి సర్రున క్రిందికి జారాడు. ఎర్రని పండును చేత్తో పట్టుకు వస్తున్న కేసరి వైపు పరుగెట్టాడు.
పళ్ళ కోసం అరణ్యంలోకి వెళ్తున్న అమ్మనే చూస్తూ గుహ ముందు నిలుచున్నాడు బాలాంజనేయుడు. తెలతెలవారుతోంది. అరుణ వర్ణం తూర్పు ఆకాశాన్ని అందంగా అలముకుంటోంది. బాలాంజనేయుడు కంటికి ఇంపుగా కనిపిస్తున్న అరుణోదయాన్ని చూస్తూ అలాగే నిలుచుండిపోయాడు. ఎర్రటి సూర్యబింబం దిక్చక్రం లోంచి నెమ్మదిగా పైకి లేస్తోంది. బాలాంజనేయుడు ఆశ్చర్యంగా కళ్ళు చిట్లించాడు. అమ్మా , నాన్నా తనకు అందించే ఎర్రటి , గుండ్రటి పళ్ళు గుర్తొస్తున్నాయతనికి.
“మనం ఎర్రగా మాగిన పళ్ళనే కోసి తినాలి !” అమ్మ అంజన మాట బాలాంజనేయుడి చెవుల్లో గింగురుమంది. తూర్పు దిశలో ”ఎర్రటి పండు” ఆకాశంలో పైకి లేస్తూనే ఉంది ! ఎగిరి , ఆ పండును అందుకుని , లొట్టలు వేసుకుంటూ తినాలన్న కోరిక – బాలాంజనేయుడికి నోరూరిస్తోంది. బాలాంజనేయుడు మెల్లగా తలతిప్పి , గుహ ద్వారం వైపు చూశాడు. తండ్రి కేసరి ఇవతలకి రానందుకు సంతోషిస్తూ ”పండు” కనిపిస్తున్న దిక్కు వైపు తిరిగాడు. ఊపిరి బిగపట్టి , ఒక్క సారిగా పైకెగిరాడు. పైకి చేరగానే , తోకను పైకెత్తి, ”పండు” వైపు వాయువేగంతో దూసుకుపోసాడు. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశమార్గాన వెళ్తున్న బాలాంజనేయుడు చిరునవ్వుతో క్రిందికి చూశాడు. దట్టంగా ఉన్న అడవులూ , ఎత్తుగా ఉన్న పర్వతాలూ మహా వేగంతో వెనక్కి దూసుకెళ్తున్నాయి ! తన కుమారుడు నింగికి ఎగసిన వైనాన్ని చూసిన అంజన , పళ్ళ కోసం వెళ్తున్న కార్యక్రమాన్ని ఆపి , వెనుదిరిగి. గుహ వైపు పరుగెట్టింది. అప్పటికే గుహ ముందుకు చేరి , ఆకాశమార్గాన వెళ్తున్న ఆంజనేయుణ్ణి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు కేసరి. ఆయన సమీపానికి చేరిన అంజన భయంతో , ఆందోళనతో తన బాలాకుమారుణ్ణి చూడసాగింది.
బాలాంజనేయుడు తాను బాగా మగ్గి ఎర్రబడిన ఫలంలా భావిస్తున్న సూర్యబింబం వైపు ఇనుమడించిన వేగంతో వెళ్ళసాగేడు. సూర్యబింబం దగ్గరయ్యే కొద్దీ , నూతనోత్సాహంతో తన వేగాన్ని పెంచుతూ ఆంజనేయుడు , నందనవనంలో ఉన్న దేవేంద్రుడి కళ్ళబడ్డాడు. ఏదో దుష్టశక్తి , వానరాకారంతో సూర్యుణ్ణి కబళించడానికి వెళ్తుందనుకున్నాడు ఇంద్రుడు. వెంటనే తన ఐరావతాన్ని అధిరోహించి ఉదయాద్రి వైపు బయలుదేరాడు. దేవేంద్రుని అనుసరిస్తూ ఇతర దిక్పాలకులూ , దేవశిల్పి విశ్వకర్మ సూర్యుడి వైపు కదిలారు. ఇంద్రుడూ , ఇతర దిక్పాలకులూ సూర్యుడిని సమీపించే సరికే బాలాంజనేయుడు సూర్యబింబానికి అతి చేరువకు చేరుకున్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹