సూర్యగ్రహ మహిమ ఏడవ భాగము
“బాల వానరా ! ఆగు ! ఏమిటి అకృత్యం ? తిరిగి పో !” అన్నాడు ఇంద్రుడు గంభీరంగా , ఆయన కంఠ స్వరం ఆకాశంలో ఉరుముల శబ్దంలా ప్రతిధ్వనించింది. బాలాంజనేయుడు నిర్లక్ష్యంగా ఇంద్రుడి వైపు చూస్తూ , పళ్ళు ఇకిలించి , సూర్యుడి వైపు దూసుకెళ్ళాడు. ఇంద్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆయన చేతిలోని వజ్రాయుధం మెరుపులా కదిలి , రివ్వున వెళ్ళి బాలాంజనేయుడి దవడను తాకింది. ఆ వజ్రాయుధా ఘాతానికి లుంగచుట్టుకుని , గిరగిరా తిరుగుతూ స్పృహ కోల్పోయి భూమి మీద పడిపోయాడు , ఆంజనేయుడు. తన పుత్రుడని కూడా చూడకుండా బాలుణ్ణి వజ్రాయుధంతో కొట్టిన ఇంద్రుడి మీద వాయుదేవుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూర్చిల్లి , నేలమీద అచేతనంగా పడి ఉన్న బాలకుణ్ణి తీసుకుని , వాయుదేవుడు లిప్తపాటులో కేసరీ , అంజనల గుహలో ప్రవేశించి , తన ప్రాణశక్తిని ఉపసంహరించివేశాడు. మూర్ఛలో ఉన్న తమ ముద్దుల కుమారుణ్ణి చూస్తూ , అంజనా , కేసరీ దుఃఖంలో మునిగిపోయారు.
తన స్వరూపమూ , స్వభావమూ అయిన వాయుశక్తిని వాయుదేవుడు ఉపసంహరించుకున్న ఫలంగా , చేతన ప్రపంచమంతా అచేతనంగా మారిపోయింది. ఇంద్రుడూ మొదలైన అష్టదిక్పాలకులు కదలికలు లేకుండా , నిశ్చలంగా బొమ్మల్లా ఉండిపోయారు. ఆకాశన ఎగురుతున్న పక్షులు అలాగే ఉండిపోయాయి. చేతన శక్తిని కోల్పోయిన విశ్వం అవాంతరానికి చేరువకు చేరింది !
జరగబోయే అవాంఛనీయమైన ఉపద్రవాన్ని పసికట్టిన బ్రహ్మ క్షణంలో కేసరి గుహ అంతర్భాగంలో ప్రత్యక్షమయ్యాడు. “వాయూ , ఏడీ నీ ప్రియశిశువు ?” అంటూ నిశ్చేతనంగా పడి ఉన్న బాలాంజనేయుడిని చేతుల్లోకి తీసుకున్నాడు. దక్షిణ హస్తంతో బాలకుడి శరీరాన్ని నిమిరాడు. సృష్టి కర్త అపూర్వ స్పర్శతో బాలాంజనేయుడు మూర్ఛనుండి కోలుకున్నాడు. “వాయూ ! నీ ఉపసంహానికి స్వస్తి చెప్పు ! బాలుడు సురక్షితంగా ఉన్నాడు. క్షేమంగా ఉంటాడు !” బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు.
బ్రహ్మ అనుశాసనంతో , శాంతించిన వాయు దేవుడు బంధించిన ప్రాణశక్తిని విడుదల చేశాడు. అంతసేపూ అచేతనంగా ఉండిపోయిన విశ్వం సచేతనంగా మారింది. బ్రహ్మ సంకల్పంతో ప్రేరేపించబడిన అష్టదిక్పాలకులూ , విశ్వకర్మా కేసరి ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యారు. పరమశివుడు కూడా ఆగమించాడు. తన వజ్రాయుధాఘాతంతో సొట్టపడిన దవడతో ఉన్న బాలకుణ్ణి చిరునవ్వుతో చూశాడు దేవేంద్రుడు.
“బాలుని ”హనువు” నా వజ్రాయుధం దెబ్బకు సొట్టపడింది. ఆ కారణంగా , ”హనుమంతుడు” అనే పేరుతో సుప్రసిద్ధుడవుతాడు. ఇక నుంచీ హనుమంతుడు నా వజ్రాయుధం దెబ్బకు లొంగడు !” అంటూ వరాలిచ్చాడు ఇంద్రుడు. “హనుమకు బ్రహ్మాస్త్రంతో హాని ఉండదు ! దీర్ఘాయువు అనుగ్రహిస్తున్నాను!” అన్నాడు బ్రహ్మ.
త్రిశూలంతో గానీ , రుద్రాస్త్రంతో గానీ , పాశుపతాస్త్రంతో గానీ హనుమకు అపాయం ఉండదన్నాడు పరమశివుడు. వరుణుడూ , అగ్నీ తమ ప్రభావాలకు అతీతంగా ఉండేలా బాలునికి వరాలిచ్చారు. కుబేరుడు తన గదను బహూకరించాడు. ఇలా ఒక్కో దేవతా ఒక్కో వరం అనుగ్రహించారు బాలాంజనేయుడికి. దేవతలు ప్రసాదించిన దివ్యమైన వరాలను పొందిన బాలాంజనేయుడు అంజన పెంపకంలో పెరిగి పెద్దవాడవుతున్నాడు. కేసరి ఆంజనేయుడిని మల్ల విద్యలో ప్రవీణుడుగా రూపొందించాడు. శాస్త్రాలు అభ్యసించాలన్న తన కోరికను తల్లిదండ్రుల ముందు వ్యక్తం చేశాడు ఆంజనేయుడు.
అంజనకు విద్యావేత్త అయన బృహస్పతి గుర్తుకు వచ్చాడు.“దేవ గురువు బృహస్పతి సకలవిద్యావేత్త. ఆయనకు తెలియని శాస్త్రాలూ , ఆయన బోధించని విద్యలూ లేవు ! ఆయన విద్యా దాత కూడా ! ఆశ్రమానికి వెళ్ళి , ఆచార్య బృహస్పతుల వారిని ఆశ్రయించు !” అంది అంజన ఆంజనేయుడితో.తల్లిదండ్రుల ఆజ్ఞనూ , ఆశీస్సులనూ స్వీకరించిన ఆంజనేయుడు , ప్రయాణం సాగించి , బృహస్పతి ఆశ్రమానికి చేరుకున్నాడు. శిష్య బృందానికి చేస్తున్న పాఠ ప్రవచనం ఆపి , వానర యువకుడిని ప్రశ్నార్థకంగా చూశాడు బృహస్పతి.
“గురుదేవా! నేను కేసరీ అంజనల పుత్రుణ్ణి ! నా పేరు ఆంజనేయుడు. అమ్మ అంజనాదేవి సూచన ప్రకారం విద్యార్థిగా మీ సన్నిధికి చేరుకున్నాను ! శిష్యుడిగా స్వీకరించి , నాకు సకల శాస్త్రాలూ బోధించండి !” చేతులు జోడించి వినయంగా అన్నాడు ఆంజనేయుడు.
బృహస్పతి కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి. అంజన… ఆంజనేయుడు… పుంజికస్థల… ఆంజనేయుడు…! అంజన ఎవరో గ్రహించిన బృహస్పతి కళ్ళు తెరిచి , ఆంజనేయుడిని చిరునవ్వుతో చూశాడు.”అంజనీ కుమారా ! సకల శాస్త్రాలు అభ్యసించాలన్న నీ కోరికను అభినందిస్తున్నాను ! కానీ… నేను నీకు విద్యాదానం చేయలేను…”
“గురుదేవా ! ఎందుకు ?”
“నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించలేను…”
“ఎందుకో తెలుసుకోవచ్చా , గురుదేవా ?” ఆంజనేయుడిలో ఆశ్చర్యం !”నేను వానరులకు విద్యాదానం చేయను…”
“ఆచార్య…”
“ఎందుకంటే – వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతనికి కొన్ని పరిమితులూ , పరిధులూ ఉంటాయి. నాకూ ఉన్నాయి…” బృహస్పతి ఆంజనేయుడి ముఖంలోకి చూస్తూ అన్నాడు. “నా కుమారుడూ వానరుడూ అయిన తారుడికే నేను విద్య చెప్పలేదు !” ఆంజనేయుడి ముఖంలో జాలి గొలిపే నిరుత్సాహం తాండవిస్తోంది. బృహస్పతిలో పొడసూపిన జాలి మాటలుగా వెలువడింది. “పరిమితులున్న వ్యక్తులున్నట్టే , పరిమితులు లేని వ్యక్తులూ ఉంటారు , ఉన్నారు. అలాంటి వ్యక్తిని నువ్వు ఆశ్రయించాలి , నాయనా !”
“ఎవరు ?” ఆంజనేయుడు తగ్గు స్వరంలో అడిగాడు.
“పైకి – ఆకాశంలోకి చూడు !” బృహస్పతి అన్నాడు. ఆంజనేయుడు అప్రయత్నంగా ఆకాశం వైపు దృష్టి సారించాడు. “ఎవరు కనిపిస్తున్నారు , వెలుగులు చిమ్ముతూ ?”
“….సూర్యుడు.”
“ఆయన్ని ఆశ్రయించు !”
“సూర్యదేవుడినా , ఆచార్యా ?” ఆంజనేయుడు నమ్మలేనట్టుగా అడిగాడు.“ఔను , నాయనా ! సూర్యుడినే ! ఆయన నువ్వు కోరిన విద్యాదానం చేస్తాడు ! వెళ్ళు !”
ఆంజనేయుడు మౌనంగా , చేతులు జోడించాడు. “ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు ! సకల విద్యా ప్రాప్తిరస్తు !” బృహస్పతి చెయ్యెత్తి దీవించారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹