వాత వ్యాధి నిదానం
ధన్వంతరి ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓయి శుశ్రుతా! వాత లేదా వాయు ప్రకోపమే మానవ శరీరంలో కనిపించకుండానే ఎన్నో అనర్థాలను కలిగిస్తుంది. ఆ వాయువే విశ్వకర్మ, శ్రీ విశ్వాత్మ విశ్వరూప ప్రజాపతి, స్రష్ట, ధాత, విభుడు, ప్రభువు, విష్ణువు, సంహర్త, మృత్యువు. ప్రాణవాయువు ప్రాణాలను నిలబెడుతుంది. అయితే సరిగా బతకడం చేతకాక దానినే శరీరంలోపల చెడగొట్టుకుంటే అదే ప్రాణం తీస్తుంది. కాబట్టి వాయువును సమంగా ఉంచుకోవడం కోసం విశేష ప్రయత్నం అవసరం.
వాతానికి సంబంధించి శరీర విజ్ఞానంలో రెండు కర్మ భేదాలు చెప్పబడ్డాయి. అవి ప్రాకృత వైకృతాలు, ఒక్కొక్క కర్మలో మరల నైదేసి విభాగాలు చెప్పబడ్డాయి. మన శరీరంలో నాలుగు ప్రధాన రసాలు ప్రవహిస్తుంటాయి. మన ఆచార విచారాల వల్ల కుపితమైన వాయువు వీటిలో ప్రవేశించి అవి సమంగా పారకుండా చేస్తుంది. వాటి ముఖ ద్వారాలను కప్పేయడం ద్వారా వ్యక్తికి శూలనొప్పి, కడుపుబ్బు, ఆంత్రకూజనం, మలబద్ధకం, స్వరభంగం, దృష్టిభేదం, నడుంనొప్పి వంటి బాధలను కలిగిస్తుంది. వీటి ప్రభావం వల్ల వ్యక్తి శరీరతత్త్వం అభక్ష్య భక్షణం లాటి అలవాట్లను బట్టి మరిన్ని రోగలక్షణాలు కూడా బయటపడవచ్చును.
ఆమాశయం (అన్నకోశం) లో వాతదోషం చోటు చేసుకుంటే వాంతులు, ఆయాసం, దగ్గు, గొంతు బొంగురు, విషూచిక ఇంకా నాభిపై భాగంలో అనేక బాధలూ వస్తాయి. వాత ప్రకోపం వల్ల కనులు, చెవులు కూడా పాడవుతాయి. చర్మం దద్దుర్లెక్కి పోతుంది. గొంతులో మంట పుడుతుంది. (ఇది వాయువు రక్తంలో ప్రవేశించడం వల్ల జరుగుతుంది) విష్టంభ, అరుచి, కృశత, భ్రమలు ప్రదూషిత వాయువు ప్రేగుల్లో ప్రవేశించడం వల్ల కలుగుతాయి. కుపిత వాయువు పొట్టలో ప్రవేశిస్తే రోగికి చర్మంపై ముడులు, కర్కశత, బరువెక్కినట్లుండుట, కడుపును పిడికిలి బిగించి ఎవరో గుద్దుతున్నట్లు నొప్పి, పెదవులు, నోరు ఎండిపోవుట మున్నగు కష్టాలు వస్తాయి.
(వాయువు మాంసంలో దూరినా అంతే) ఎముకలో కలుషిత వాయువు ప్రవేశిస్తే అక్కడ తీవ్రమైన శూలనొప్పి కలుగుతుంది. క్రింది నుండి ఎగురగొట్టబడిన వాయువు కుపితమై మీది భాగాలవైపు వెళితే అది గుండెని నొక్కిపట్టి ఇంకాపైకెగసి తలనుదాకి మెదడు లోనికి పోయి ఆయా భాగాలన్నిటినీ ఎముకలతో సహా నొప్పులపాలు చేస్తుంది. మొత్తం శరీరంపై నాలుగు వైపుల నుండీ దాడి చేస్తుంది.
శరీరాన్ని శిథిలం చేసి పడేస్తుంది. మనిషిలోని ఉత్సాహాన్ని మట్టిపాలు చేస్తుంది. శ్వాస ఆడడమే కష్టమైపోతుంది. కన్నులు తెఱవ డానికి ప్రయత్నించినా వెంటనే మూసుకు పోతుంటాయి. కంఠం నుండి పావురం చేసే గుడగుడ శబ్దాల్లాటివి అంటే ధ్వనుల లాటి చప్పుళ్ళు వస్తుంటాయి. చికిత్సా క్షేత్రంలో ఈ రోగాన్ని ఉపతంత్రక రోగమంటారు.
కుపితవాయువు గ్రీవంలోనూ పక్కలలోనూ వుండే ప్రధాన రక్తనాళాలనూ అన్ని ధమనులనూ దూసుకొనిపోతే శరీరంలో గొప్ప తీవ్ర ఉపద్రవాలే జరుగుతాయి. మెడ దగ్గరి సంధులు వదులైపోతాయి. శరీరమంతా ఒక వింటి బద్దలాగా వంగి పోతుంది. కనులు మూత బడకుండా స్తంభించిపోతాయి. దంతాలు వాటంతటవే కొరుక్కుపోతుంటాయి. కఫం వాంతిగా పడుతుంటుంది. పక్కటెముకలు నొప్పెడు తుంటాయి. గొంతు పెగలదు, మూతి, వెనుకభాగము, మెదడు బిగుసుకు పోతాయి. ఈ రోగాన్ని అంతరాయామ వాతరోగ మంటారు. బహిరాయామ రోగంలో కూడా శరీరం వింటి బద్దలాగే వంగి పోతుంది. తేడా ఏమిటంటే ఛాతీ ముందుకి వచ్చి తల వెనక్కిపోతుంది. రోగి యొక్క మలమూత్రాలలోనూ, రక్తంలోనూ దూషిత వాయువు ప్రవేశించి శరీరాన్ని పసుపు పచ్చగా చేసి అత్యంత దాహాన్ని కలిగించే రోగాన్ని ప్రణాయామమంటారు.
వీటన్నిటినీ మొత్తంగా ఆక్షేపక రోగాలంటారు. శరీరం లోపల్లో చెడిపోయి వక్రభ్రమణం చేస్తున్న వాయువుని బాగు చేసి సక్రమంగా తిరిగేలా చేయగలిగితే రోగికి పూర్తి స్వస్థత చేకూరుతుంది. నాలుకను అవసరానికి పదింతలు రాపిడి చేసి, అత్యుష్ణ పదార్థాలను తినడం వల్ల చిబుకమందలి వాయువు కుపితమై గెడ్డం భాగమంతటినీ స్తంభన దోషానికి గురిచేస్తుంది. నోటిని పూర్తిగా మూయడం గానీ తెరవడం గానీ కష్టమౌతుంది. దీనిని హనుస్తంభ వ్యాధి అంటారు.
ఈ రోగమున్నవాడు తినడానికీ, నమలడానికీ, మాట్లాడడానికీ విశ్వ ప్రయత్నం చేయవలసి వస్తుంది. కుపితవాయువు వాగ్వాహినీ, శిరలో ప్రవేశించి నాలుకను చెడగొట్టి ”జిహ్వస్తంభమను పేరు గల వాతవ్యాధిని కలుగజేస్తుంది. తలపై ఎక్కువ బరువును పెట్టుకొని మోయుట వల్లా అతిగా నవ్వడం వల్లా, ఎగుడు దిగుడు స్థానాల్లో వంకరగా పడుకోవడం వల్లా, గట్టి వాటిని కొరికి తినడం వల్లా వాయువుకి వికారం పుట్టి శరీరం లోపల వక్రంగా పెరిగి పై భాగాలలో పేరుకుంటుంది. దాని ప్రభావం చేత రోగి ముఖం వంకరలు పోతుంది. పెద్ద ధ్వనితో అట్టహాసం చేస్తుంటాడు. కళ్ళు ఏదో ఒకేవైపు చూస్తూ ధ్యానంలో వున్నట్టుగా అలాగే వుండిపోతాయి. క్రమంగా శక్తులన్నీ ఉడిగిపోతాయి. ప్రాకృతిక వాయువు రక్తంలో ప్రవేశించినపుడు రక్తనాళాల్లో నాడుల్లో నొప్పి మొదలై మెదడులోని నాడులు కూడా పాడై అన్నీ నలబడిపోతాయి. దీన్ని శిరోగ్రహదోష మంటారు.
దీన్ని కుదర్చడం అసాధ్యం.
మొత్తం శరీరమంతా దోషయుక్త ప్రకృతిక వాయు (వాత) అధీనం లోకి వస్తే పక్షవాతం వస్తుంది. రోగి శక్తిలో మిగులు బట్టి అది ఏకాంగ, అర్ధాంగ పర్యంత మవుతుంది. మందులకు శరీరం సహకరించకపోతే ”సర్వాంగరోధ” (సర్వాంగ పక్షాఘాత) మను పేరుగల రోగం వస్తుంది. కుదర్చడం కష్టసాధ్యం. ఇదేరోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినా అతి కష్టం మీద కుదర్చవచ్చు. కాని ధాతువులు క్షయమైపోవడం వల్ల వచ్చే వాతప్రకోపం వల్ల గనుక ఈరోగం వస్తే దాని కుదర్చడం అసాధ్యం. అలాగే కఫయుక్తమైన వాతం ఆమాశయంలో కలకలాన్ని సృష్టిస్తే రోగి శరీరమంతా కఱ్ఱలాగై పోతుంది. ”దండా పతానక” మను పేరు గల ఈ రోగాన్ని కుదర్చడమూ అసాధ్యమే.
ప్రకుపిత వాయువు స్కంధ ప్రదేశానికి మూల భాగంలోకి ప్రవేశించి గాని అక్కడ జనించి గాని పైకి లేస్తుంది. అపుడు నాడులన్నీ సంకుచితాలైపోయి భుజాలలో స్పందన ఆగిపోతుంది. దీన్ని ”అవబాహుక” రోగమంటారు. భుజాల వెనుక భాగం నుండి వేలికొనల దాకా వుండే నాడిని ”కండర” అంటారు. కుపితమైన వాయువు ఆ నాడిలో ప్రవేశించి దానిని నిరుపయోగంగావిస్తే వచ్చే జబ్బుకి విషూచి అని పేరు పెట్టారు. ఇదే రెండు జంఘలలో జరిగితే వచ్చే రోగం పేరు కలాయఖంజము.
వాత దోషం కాని మరేది గాని అంతఃశ్లేష్మం ద్వారా జంఘపుటెముకలలోకి చేరినపుడు మనిషికి స్తంభన రోగం వస్తుంది. ఎముకలు శిథిలాలైపోతాయి. జంఘలు వద్ద చర్మం నల్లబడిపోతుంది. అంగాలలో జడత ప్రవేశిస్తుంది. బద్ధకం, అరుచి, మూర్ఛ, జ్వరం వస్తాయి. ఈరోగాన్ని ఊరు స్తంభమనీ బాహ్యవాతమనీ అంటారు. వాయువు రక్తంలో ప్రవేశించగా రెండూ ప్రకోపించినపుడు మోకాళ్ళ సందులలో మహాభయంకరాలూ, మిక్కిలి బాధాకరాలూ అయిన కురుపులు పుట్టుకొస్తాయి. వీటిని క్రోష్టుక శీర్షాలంటారు. వాయువు కుపితమై గుల్ఫాశ్రితమైతే ఆ రుగ్మతని వాతకంటకమంటారు. పార్షి భాగం నుండి వేలి కొనలదాకా గల నాడులను ప్రభావితం చేసి పాదాలను నిశ్చలం గావించే వాయు ప్రకోప రోగానికి గృధ్రసి యనిపేరు. కఫ రోగం కూడా కలిస్తే దీనిని ”పాదహర్ష”మని వ్యవహరిస్తారు. పిత్త – రక్త సంశ్రిత వాత ప్రకోపం వల్ల రెండు పాదాలలోనూ మంటలు పుట్టించేది ”పాదదాహం”..
నూట ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹