సంక్షిప్త ఔషధీయ యోగసారం
సుశ్రుతా! ముందుగా ఏయే ఋతువుల్లో ఏయే అపథ్యాలు ప్రకోపాలకు దారితీస్తాయో చూద్దాం. వర్ష ఋతువులో తీక్ష, చేదు, వగరు రుచులు, రూక్ష గుణాలు గల తిండిని తినడం వల్లనూ, అతిగా బెంగ, శృంగారం, వ్యాయామం, భయం, శోకం, రాత్రి జాగరణ, గట్టిగా కేకలేయడం, చేవ కంటే ఎక్కువగా చేతలు వంటివి కారణాలుగా భోజనం అరుగుతున్నపుడూ, సందెలందూ వాయువు కుపితమవుతుంది. గ్రీష్మంలోనూ వర్ష ఋతువులో కొంతమేరా మధ్యాహ్నకాలంలో వేడిగా, పులుపూ ఉప్పు ఎక్కువగా వుండి, సులభంగా అరగని భోజనం చేసే వారికీ, మద్యపాన ప్రియులకూ, కోపిష్ఠులకు ముఖ్యంగా అర్ధరాత్రివేళల్లో పిత్త ప్రకోపదోషం తగులుతుంది.
వసంత ఋతువులో మంచి రుచికరమైనదీ, చల్లగా నున్నదీ అగు భోజనాన్ని అతిగా, ఆబగా తినేవారిపైనా, వ్యాయామం చేయని వారిపైనా, మాంసం తినేవారి పైనా, సుఖభోగాలనెక్కువగా అనుభవించేవారిపైనా, పగలు నిద్రించేవారిపైనా భోజనాంతంలో ప్రకుపితమైన పిత్తం దాడిచేస్తుంది. ఇక త్రిదోషాలలో ఏది వస్తే ఎలాటి లక్షణాలు బయటపడతాయో ఇదివరకే చెప్పబడింది కదా! మొత్తం మీద రోగ కారణాన్నీ, లక్షణాన్నీ, సంసర్గాన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి. శరీరం దోషాలకూ, ధాతువులకూ, మలానికీ ఆధారమని చెప్పబడింది. కొవ్వు, రక్తం, మాంసం, మేద, ఎముక మూలగ, వీర్యం సప్తధాతువులు. ఇవి చెడనంతసేపు పరవాలేదు.
ఏ రోగం (దోషప్రకోపం) వచ్చినపుడు శరీరం ఎక్కడ ముందుగా చెడుతుందో చూడాలి. వాతం గుదాభాగాన్ని నడుమునీ ముందు పట్టుకుంటుంది. పిత్తం పక్వాశయంలో చేరి దాన్ని చెడగొడుతుంది. కఫం ఆమాశయ, కంఠ, మస్తక సంధి భాగంపై తొలిదాడిని చేస్తుంది. ఏ రకమైన తిండి తింటే ఏ ప్రకోపం దాపురిస్తుందో చూశాము కదా! కాబట్టి దానికి వ్యతిరేక రుచులు గల పదార్థాలను తింటే రోగ తీవ్రత తగ్గుతుంది. మధుర భోజ్య పదార్థాలు నేత్ర శక్తినీ, రసాన్నీ, ధాతువులనూ అభివృద్ధి పరుస్తాయి. అవే స్వల్పంగా పుల్లగా వుండే పదార్థాలతో కలిస్తే, మనస్సునీ హృదయాన్నీ సంతృప్తి పరచి జఠరాగ్నిని ఉద్దీపించి అరుగులను మెరుగు చేస్తాయి. చేదుగా తీక్షంగా నున్న పదార్థాలు వేడిని పెంచి జ్వరం, దాహంను నశింపచేసి, శోధన శోషణలను గావిస్తాయి. కషాయ పదార్థాలు పిత్తవర్ధకాలు, స్తంభక కంఠగ్రహాది దోష వినాశకాలు, శరీర శోషకాలు. అవుతున్నాయి. ఈ గుణాలన్నీ ఒక పరిమాణం (హద్దు) దాకానే వుంటాయి. శరీరంలోని రసాలనీ, వీర్యాన్నీ విశేషంగా పరిపక్వం చేయడానికాధార భూతాలైన ద్రవ్యాలనూ పదార్థాలనూ ఉత్తమాహారంగా పరిగణిస్తారు. రస పరిపాకం మధుర, కటు భేదాలతో రెండు రకాలు.
చికిత్సకు ప్రధానాంగాలు నాలుగు. అవి వైద్యుడు, రోగి, మందు, పరిచారకుడు. ఈ నాలుగూ జాగ్రత్తగా వుంటే రోగం వేగంగా కుదురుతుంది. దేశం, కాలం, రోగి వయస్సు శరీరంలోని అగ్ని యొక్క బలాబలాలు, ప్రకృతి, త్రిదోష ప్రకోపాలు. వాటి సామ్య వైషమ్యాలు, రోగి స్వభావం, మందు, రోగి శరీర సత్త్వ, సహన శక్తులు, రోగ తీవ్రత ఈ అంశాలన్నిటినీ బాగా పరిశీలించాకనే విద్వాంసుడైన చికిత్సకుడు ఆ రోగాన్ని కుదిర్చే పనిలో పడతాడు. (తచ్చాంతికి వెంటనే ఏదో చిట్కా వేసి రోగికి నమ్మకం కుదర్చడం కూడా జరుగుతుంది) జలాశయాలనూ, పర్వతాలనూ ఎక్కువ కలిగిన దేశాన్ని ఆయుర్వేదంలో అనూపదేశ మంటారు. ఈ దేశంలో కఫం, వాయువు ఎక్కువగా ప్రకోపిస్తాయి. అడవులెక్కువగా వుంటే రక్త పిత్తజ ప్రకోపాలెక్కువగా వస్తాయి. సామాన్య దేశాలలో అన్ని రోగాలూ వుంటాయి.
మనిషి పదారేళ్ళొచ్చేదాకా బాలకుడనీ, డెబ్బది యేండ్ల వయసు దాటాక వృద్ధుడనీ మధ్య కాలంలో మధ్య వయస్కుడనీ ఆయుర్వేదం నిర్వచిస్తుంది. (ఇది ‘అప్పటి ‘మాట) కఫ, పిత్త, వాయువులు శరీరంలో అదే క్రమంలో పెరుగుతాయి. వృద్ధాప్యం వల్ల శరీరం శక్తిహీనమైనపుడు రోగి క్షారక్రియ, అగ్ని చికిత్స, శల్యకర్మలు లేకుండా అయిపోతాడు. కృశిస్తున్న దేహం గల వానికి బృంహణ, స్థూలకాయునికి కర్షణ, మధ్యనున్న వానికి రక్షణ అనెడి కార్యాలను చేపట్టాలి. తల్లిదండ్రులకుండే త్రిదోషాదులు పిల్లలకీ సంక్రమిస్తాయి. రోగి తల్లిదండ్రులను గూర్చిన తెలివిడి చికిత్సకుని కుండడం అవసరం. పిత్తాది త్రిదోషాలు సహజ ప్రకృతులలో భాగమై పోతాయి కాబట్టి ఎలా వుండే వారికేది ప్రకోపిస్తుందో తెలియాలి.
బక్కఒళ్ళు, కఱకుదనం, తక్కువ జుత్తు, మారేమనసు, కలవరింతలు గల వ్యక్తికి సాధారణంగా వాతం ప్రకోపిస్తుంది. వయసు మీరకుండానే తలపండుట, ఎఱ్ఱతోలు, చెమట ఎక్కువ, కోపం ఎక్కువ, మంచి బుద్ధి, నిద్రిస్తున్నా చురుకుతనం తగ్గకుండుట అనే లక్షణాలున్నవానికి పిత్త ప్రకోపం తగిలే అవకాశముంది. స్థిరచిత్తం మెల్లని చల్లని మాట, ప్రసన్నత, మెత్తని కేశాలు, కలలో నీళ్ళు, రాళ్ళు కనిపించుట అనే లక్షణాలున్న వానికి కఫం ప్రకోపించడం సాధారణం. మిశ్రిత లక్షణాలున్నవారికి ద్వి లేదా త్రిదోషాలుండవచ్చు.దోషాల దశలు నాలుగు. అవి మంద, తీక్ష, విషమ, సమదశలు. జఠరాగ్నిని ముందు కాపాడి దానిని సమంగా వుంచాలి. విషమ స్థితిలో వాయువును అదుపు చేయాలి. తీక్షా వస్థలో పిత్తదోషాన్ని మందావస్థలో కఫాన్నీ ప్రతిచర్య ద్వారా దశమారేలా చెయ్యాలి.
సర్వరోగోత్పత్తి కారకాలు అజీర్ణ, మందాగ్ని దోషాలే. వాటి లక్షణాలు ఆమ, అమ్ల, రస, విష్టంభాలు. ఆమ (చీము, జిగట) దోషం వల్ల విషూచిక, హృదయదోషం, బద్ధకం వంటి ఉపద్రవాలు వస్తాయి. అలాటప్పుడు వచ (ఇంగువకావచ్చు) కటుఫల (కరక లేదా కాక కావచ్చు)ములను లవణజలంతో కషాయంచేయాలి. దానిని నీటిలో కలిపి త్రాగించాలి. వాంతి చేయించాలి. అమ్లదోషమున్న చోట శుక్రంలో తగ్గుదల, భ్రమ, మూర్ఛ, దాహం మున్నగు బాధలు బయటపడతాయి. ఇలాటి దశలో అగ్నిపై వండనివి. తినుట, చల్లని నీరు తాగుట, చల్లని గాలిని గుండెల నిండా పీల్చుట మంచిది. రసదోషమున్నపుడు శరీరం పగులుట, తలనొప్పి, అన్నంగాని మరేది గాని తినాలనిపించకపోవుట జరుగుతాయి. ఈ దశలో రోగి చేత పగటినిద్రనీ, ఉపవాసాల్నీ మాన్పించాలి. విష్టంభ దోషమున్న రోగికి శూలనొప్పి, కురుపులు, అరుచి, మలమూత్ర విసర్జనల్లో ఇబ్బందీ కలుగుతాయి. అప్పుడు రోగికి చెమట పట్టించాలి. లవణ మిశ్రిత జలాన్ని త్రాగించాలి.
మూడు దోషాలూ గల వారికి ఇంగువ త్రికుటాలతో సైంధవ లవణాన్ని కలిపి ముద్ద చేసి పొట్టపై పూయాలి. వేడి (వెచ్చని నీరు లేదా తేనె కలిపిన వెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. వెదురు మొలకలు, పెరుగు, చేప కూడ మంచి మిశ్రమమే.దీనికి పాలు మాత్రం కలపకూడదు. బిల్వ, సిందూర (శోణ) గంభీర (శ్రీపర్ణి) పాటలు (కలిగొట్టు) అగ్నిమాంద్య ఈ అయిదు చెట్ల మూల సంగ్రహాన్ని ఆయుర్వేదంలో ”పంచమూల” మంటారు. మందాగ్నిని పెంచి పోషించే కఫ, వాత దోషాలను పంచమూల సేవనం పటాపంచలుచేస్తుంది. ఏకాంగియనుపేరు గల ఔషధం (శాలపర్ణి) పృశ్నిపర్ణి (పేఠవనం) రెండు ప్రకారాల బృహతి (దురదగొండి) పల్లేరుకాయ ఈ అయిదింటి మిశ్రమాన్నీ ”లఘుపంచమూల” మంటారు. ఈ ఔషధం వాత- పిత్త దోష వినాశకం, కాంతి వర్ధకం. ఈ రెండు మిశ్రమాలనీ కలిపి ”దశమూలౌషధి” అంటారు. ఈ మందు సన్నిపాత జ్వరాన్ని నశింపజేయడంలో కడు సమర్థకం. దగ్గు, ఆయాసం, కునికిపాటు, పక్కనొప్పిలకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. ఈ మందుని నూనెతో నేతితో పరిపక్వం చేసి తలకి రాస్తే కేశ సంబంధిరోగాలు నశిస్తాయి.
ఇపుడు స్నేహపాకాన్ని వర్ణిస్తాను. ఇది మందుల కషాయం. పాత్రలో నీటిని తీసుకొని మూడింతలు ఆవిరైపోయే దాకా వేడి చేసి అప్పుడు దానితో, అనగా ఆ మిగిలిన నాలుగవ వంతుతో సమాన పరిమాణంగల స్నేహిలద్రవ్యము (ఔషధం)ను వేయాలి. ఇదే స్నేహపాకం. దీనిని పాలతో కూడా తయారుచేసుకోవచ్చు. పాలు స్నేహిల ద్రవ్యంతో సమాన పరిమాణంలో వుండాలి.మనిషి ఆరోగ్యంగా వుండి కలకాలం జీవించాలంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. అన్నీ తినాలి. బాగా తినాలి. కానీ ఒక వయసు వచ్చేదాకానే తిండి మంచిది. మంచి తిండిమరీ మంచిది. రుచులను సమపాళ్ళలో సేవించినంత కాలం రోగం రాదు.
నూట ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹