Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం

పదార్థాల గుణదోషాలు, ఔషధ సేవనంలో అనుపాన మహత్త్వం

ఓయి శుశ్రుతా! పదార్థాలలో ఏవి మంచివో అనే జ్ఞానం చికిత్సకునికి మిక్కిలి అవసరం. ఎఱ్ఱటి శాలి బియ్యం వాత, కఫ, పిత్త దోషాలు మూడింటినీ నశింపజేయగలదు. దాహాన్నీ, కడుపులోని కొవ్వునీ కూడా తొలగించగలదు. మహాశాలి జీర్ణానికి గొప్ప దోహదకరం. కలము (అనగా ఎక్కువ నీటితో కలిపిన కలమ బియ్యం) కఫ, విత్తాలను అదుపు చేస్తుంది.

గౌరషష్టిక మూడు దోషాలనూ, బరువును తగ్గిస్తుంది. శ్యామాకమనే ఔషధి మంచి వాయువునుత్పత్తి చేసి కఫ, పిత్త దోషాలను చెదరగొడుతుంది. ప్రియంగు, నీవార, కొరదూశ ధాన్యాలు కూడా అంతే. యవ (బార్లీ) తఱచుగా వాడితే వాయువునుత్పత్తి చేసి కఫ, పిత్తాలను బాగుచేస్తుంది. గోధుమ జీర్ణకారి. ముద్ద (పెసర పప్పుధాన్యం, కఫ, పిత్త, రక్తాలలో అనవసర భారాన్ని తగ్గిస్తుంది. మాశ బలాన్నిస్తూ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తూ కఫ, పిత్తాలను అదుపు చేస్తుంది. రాజమాత జీర్ణకారి కాదు. అది దేహంలో అదనంగావున్న కఫ, పిత్తాలను చెదరగొట్టి వాయువు వల్ల తేడా రాకుండా కాపాడుతుంది. కులత్థము కఫం వాయువులను చెదరగొట్టి పడిశం, వెక్కిళ్ళు, ప్లీహ వ్యాకోచంలను తొలగిస్తుంది.

రక్త పిత్తం వల్ల వచ్చే జ్వరాన్ని మకుష్టకమనే మందు తగ్గిస్తుంది. చణక పప్పు వాయువునుత్పత్తి చేసి కఫ, పిత్తాలను చెదరగొడుతుంది. కాని దీని వల్ల నష్టాలు కూడా వుంటాయి. పెసలు, కలాయము కఫ, పిత్తాలను అదుపుచేస్తాయి. వాయువును పుట్టిస్తాయి. ఆఢకీ ఇదే పనిని చేస్తూ వీర్యవృద్ధిని కల్పిస్తుంది. అతని పిత్తాన్నుత్పత్తి చేస్తుంది. సిద్ధార్థ ధాన్యం కఫాన్నీ, వాతాన్నీ చెదరగొడుతుంది. నువ్వులు బలాన్నిస్తాయి గాని వేడిని పుట్టించి.. పిత్తాన్ని పెంచుతాయి. (తక్కువగా వాడాలి.)చిత్రక, ఇంగుది, నాళిక, పిప్పలి, తేనె, శిగ్రుచవ్య, చరణ, నిర్గుంది, తర్కారి, కాశమర్దక, బిల్వాలు, కఫ, పిత్త దోషాలను నశింపచేస్తాయి. క్రిములను సంహరిస్తాయి.

శరీరాన్ని తేలికగా చేసి ఆకలిని పెంచుతాయి. వర్షభూ, మార్కరలు వాత, కఫ దోషాలను నశింపజేసి తజ్జనితరోగాలన్నిటినీ తొలగిస్తాయి.ఎరండ చేదుగా వుంటుంది. కానీ కాకమాచితో కలసి త్రిదోషాలనూ, చంగేరి కఫ, వాతాలనూ, వర్షభూ, మార్కరలు వాత, కఫాలనూ అదుపులో పెడతాయి. ఆవాలు అన్ని దోషాలనూ సృష్టిస్తాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా వుండాలి. కౌసుంభ, రాజిక, నాడి చలలో చివరి రెండూ మంచివి. కౌసుంభ ఆవాల వంటిదే.

కలువాకు అన్ని దోషాలను పోగొడుతుంది. త్రిపుట అతి వాయుజనకం. కక్షర అన్ని దోషాలనూ నశింపజేస్తుంది. వాస్తుక రుచిగానూ వుంటుంది. త్రిదోషాలనూ తొలగిస్తుంది. చుచు అనే శాకం తియ్యగా వుంటుంది. చలవ చేస్తుంది. తోటకూర విషనాశకం. ఆకుకూర లన్నింటిలోనూ ఆ గుణముంటుంది. ముల్లంగి ఆమ దోషాన్ని పెంచుతుంది, వాతాన్నీ, కఫాన్నీ రక్షిస్తుంది. నిప్పులపై వండబడిన ముల్లంగి (కూర) అన్ని దోషాలనుండీ శరీరాన్ని రక్షిస్తుంది. పైగా హృదయానికీ కంఠానికి మంచిది. దోస, వంగ, పరవల (దొండవంటి ఒకపాదు) కాకర కూరలు సవ్యంగా వండితే కుష్టు, మేహం, జ్వరం, శ్వాస, దగ్గు, పిత్తదోషం, కఫదోషం నశిస్తాయి.

గుమ్మడి సర్వదోష వినాశకం, వస్తిశోధకం. కీరాదోస, ఉర్వారుకం (దోసలాటిదే) మాత్రం పిత్తదోషాన్ని తగ్గిస్తాయి కాని వాత, కఫ ప్రకోపాలకు దోహదపడతాయి. నిమ్మ, సొరలను ఏ రూపంలో సేవించినా కఫ, వాత దోషాలు తగ్గుతాయి. దానిమ్మ వాత దోషనాశకం. నారింజ దోష నివారకమే గాని బరువు చేస్తుంది. కేశర, మాతులుంగాలు కఫ, వాత వినాశకాలు, జఠరాగ్ని ప్రదీపకరాలు. చిక్కుడు వాత పిత్తాలపై పనిచేస్తుంది. పైగా శరీరానికి నున్నతనీ, శరీరాంతర్గత అధికోష్టాన్ని హరించి ఆరోగ్యకరమైన వాయువునూ పెంచుతుంది.

ఉసిరిక మంచి రుచినీ, మాధుర్యాన్నీ, బలవర్ధక ఆమ్ల రసాన్నీ కలిగివుండి శరీర కాంతిని పెంచుతుంది. హరీతకికి పుణ్యాన్ని ప్రసాదించే శక్తి వుంది. దానిని సేవించిన వారికి అజీర్ణ సమస్య రాదు, కఫ వాత దోషాలు దూరంగా పారిపోతాయి. బహేడా కూడా అలాటిదే. ఇది పిత్త దోషాన్ని కూడా హరించగలదు. చింతపండు వాతాన్ని, కఫాన్నీ అదుపుచేసి ఆమ్ల రసాన్ని కురిపిస్తుంది.లకచం రుచిగా వుంటుంది. కానీ దోషాలనుత్పత్తి చేస్తుంది. బకుల (పొగడ) కఫ- వాత వినాశకం జామ సర్వరోగనివారిణి అయినా ముఖ్యంగా గుల్మ, వాత, కఫ, శ్వాస, కాస రోగనాశకం. కపిత్థం గ్రాహ్యాది జాతిలోని సర్వరోగాలనూ నయం చేస్తుంది. వేడిచేస్తే విషహారిణి కూడా అవుతుంది.

వండిన మామిడి మాంసాన్నీ, వీర్యాన్నీ, రంగునీ శక్తినీ వృద్ధిపఱుస్తుంది. కానీ వాత రోగాన్నుత్పత్తి చేస్తుంది. నేరేడు త్రిదోష వినాశకమే గాని విరోచనం కానివ్వదు. తిందుకం కఫ వాతాల్నీ, రేగువాత పిత్తాలను హరిస్తాయి. ప్రియాలం వాత జన్య దోషాన్ని పోగొడుతుంది. రాజాదనం, అరటి, పనస, కొబ్బరి స్వాదయుక్తాలు, ఒంటి నునుపునీ, కాంతినీ, బరువునీ పెంచుతాయి. వీర్యాన్నీ మాంసాన్ని కూడా వృద్ధి చేస్తాయి.

ద్రాక్ష, మధుక, ఖర్జూర, కుంకుమలు వాత రక్త దోషాలపై విజయం సాధించే శక్తిని కలిగి వుంటాయి. పిప్పలిని వండుకొని తింటే శ్వాస, పిత్తాలు బాగుపడతాయి. ఆర్ద్రకం (అల్లం) రోచకం, పుష్టికారకం, అగ్నిదీపకం. అంతేకాక అల్లము కఫాన్నీ, వాతాన్నీ కూడా కాపాడుతుంది. శొంఠి, పిప్పలి, నల్లమిరపలను కలిపి స్వీకరిస్తే కఫవాత దోషాలు నశిస్తాయి. ఎఱ్ఱమిరపకాయలు శరీరానికి పుష్టి నివ్వలేవని శాస్త్రం చెబుతోంది. ఇంగువ గుల్మాన్నీ, శూలనూ, మలావరోధాన్ని దూరం చేసే శక్తిని గలిగివుంటుంది. అలాగే వాతాన్ని కఫాన్నీ కూడా దోషం లేకుండా సరిచేస్తుంది.

యమానీ, ధనియా, అజాఘృతాలు వాతజ, కఫజ దోషాలను దూరం చేస్తాయి. సైంధవలవణం కనులలో కాంతినీ, శరీరపుష్టినీ ద్విగుణీకృతం చేస్తూ త్రిదోషాలనూ తగ్గిస్తుంది. నల్లఉప్పు (సౌవర్చలం) వాతపు అడ్డంకులను తొలగిస్తుంది. వేడినీ, గుండెనొప్పినీ తగ్గిస్తుంది. విడంగం అనే మందు వేడినీ, దాని తీవ్రత వల్ల కలిగే అన్ని బాధలనూ, శూలనీ, వాత దోషాన్నీ నివారించగలదు. రోమకలవణం హృదయ రోగాన్నీ, పాండు జబ్బునీ, గొంతు బాధలనూ రూపుమాపుతుంది. యవక్షారం అగ్నిదీపకం. సర్జిక్షారం లవణాలను పెంచుతుంది.

ఆకలిని కలిగిస్తుంది. కురుపులు చితికేలా చేస్తుంది. నాభాసం (వాన నీటి మందు) సర్వదోషాలనూ సర్వవిషాలనూ హరిస్తుంది. శరీరాన్ని గుండెనీ తేలిక పరుస్తుంది. నదీయం అనగా జీవనది నీరు (నాదేయం అనికూడా అంటారు) మంచి వాయువునుత్పత్తి చేస్తుంది. వాపి (గుండము) నీరు వాయువునూ కఫాన్నీ అదుపులో వుంచుతుంది. తటాకోదకం వాయువునుత్పత్తి చేస్తుంది. నైర్వరం (సెలయేటి నీరు) శరీరాన్ని తేలికపఱచి, మెదడుకు పదును పెట్టి, మెరుపును ముఖంలోకి తెస్తూ పిత్తాన్ని అదుపు చేస్తుంది.

పగలు సూర్యకిరణాలూ, రాత్రి చంద్రకిరణాలూ తగిలే నీరు వాన నీటివలె (ఆకాశజలం) వలె ఆరోగ్యకరం. వేడి (వెచ్చనినీరు) చేయబడిన నీరు జ్వరాన్ని, గొంతు బాధల్నీ, ఒళ్ళు బరువులనూ వాత, కఫ దోషాలనూ పోగొడుతుంది. ఆవుపాలు వాయు, పిత్తాలను చెదరగొట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శక్తినీ బరువునూ పెంచుతాయి. గేదె పాలు మరింత శక్తివంతములే కాని జఠరాగ్నికి స్వల్పంగా అడ్డంకుల నేర్పరుస్తాయి. మేకపాలు రక్తవిరోచనాలనూ, ఆయాసాన్నీ, పడిశాన్నీ, అధిక కఫాన్నీ అరికడతాయి. రక్త పిత్తానికీ, కంటి చూపుకీ చనుబాలు మంచివి. పెరుగు జీర్ణానికి మంచిది.

త్రిదోషాలనూ మందగింపజేస్తుంది. బాగా చిలకబడిన పుల్ల మజ్జిగ త్రిదోషాలను తొలగించి అన్ని నాళాలనూ శుద్ధి చేస్తుంది.అప్పుడే తీసిన వెన్న (తాజా), మజ్జిగ త్రిదోషాలను తొలగిస్తాయి. వాంతులనూ, విరోచనాలనూ (అతిసారను) అరికడతాయి. అయితే, పులిసిపోయిన పాల పదార్థాలు: ఒంటికి మంచివి కావు. (పుల్లమజ్జిగ అల్ప పరిమాణంలో అనుపానంగా ఎక్కడో పనికి రావడం వుంది) వెన్నా, మజ్జిగా మొలలనూ, వేడి కురుపులనూ, పచ్చకామెర్లనూ పోతాయి.

నెయ్యి కూడా ఒక హద్దులోపల ఒంటికి మంచిదే. అన్నం అరగడానికీ త్రిదోషాలూ సోకకుండా ఉండడానికీ దోహదం చేస్తుంది. ఆవునెయ్యైతే మేధకు మెరుగులు దిద్ది, కన్నులలోకి కొత్తవెలుగులను కూడా తెచ్చిపెట్టగలదు. త్రిదోషాలకు తగిన మందులు ఎన్ని వేసినా ఆవు నెయ్యిని ఏదో ఒక మోతాదులో తగిలిస్తే గాని పోవు. ఔషధయుక్తమై భావన (శుద్ధి) చేయబడిన నెయ్యి జ్ఞాపకశక్తిని కాపాడుతుంది. మెదడుకు సంబంధించిన అతి పలవరింతల వంటి అన్ని వ్యాధులనూ కుదురుస్తుంది. మేకపాల నుండి తీసిన నేతికి కూడా ఈ ఔషధీయ గుణాలన్నీ వుంటాయి. మేక మూత్రం కఫ, వాయు దోషాలను పోగొట్టు శక్తినీ, క్రిములను కాల్చి వేసే శక్తినీ కలిగివుంటుంది. కొన్ని విషాలకు విరుగుడుగా కూడా పనిచేస్తుంది.

వైద్య శాస్త్రోక్తంగా తీయబడిన నువ్వుల నూనె గొప్ప ఆరోగ్యకారి. పచ్చకామెర్లు, జారుడు జబ్బు, గజ్జిలోనగు చర్మ వ్యాధులు, పేగు కురుపు, మూలవ్యాధి, ప్లీహ వ్యాకోచం, చక్కెర వ్యాధి అను బాధలన్నీ దీని వల్ల సమసిపోతాయి. ఆవనూనెను కామెర్లకూ, కొవ్వు వల్ల, వాత, కఫ ప్రకోపాల వల్ల వచ్చే రుగ్మతలకూ వాడితే అవి తగ్గుతాయి. అలసీ (అవిసె)విత్తనాలనుండి ఒక పద్ధతిలో తీయబడిన నూనె త్రిదోష ప్రకోపాలకు మంచిదే కాని కళ్ళు పాడవుతాయి. కఫ, పిత్త దోషాలకు అక్ష నూనెను వాడవచ్చు. అది కేశాలనూ బలపరుస్తుంది. చర్మాన్నీ, రక్త నాళాలనూ మృదువుగా ఉంచుతుంది.

ఆయుర్వేదంలో తేనెకున్న స్థానం విశిష్టమైనది. త్రిదోషాలనూ శాంతింపచేసి ప్రాణవాయువును పెంచే శక్తి దీనికున్నది. వెక్కుళ్ళు, పడిశం, క్రిములు, వాంతులు, మూత్రదోషాలు, విషం మున్నగు రోగాలను ఇది తగ్గించగలదు. అనుపానంగా కూడా ఆయుర్వేదంలో తేనెకు అగ్రస్థానమీయబడింది.చెఱకు రక్త పిత్తానికి మంచి మందు. బెల్లం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అది కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాయు, పిత్తరోగాలను తగ్గిస్తుంది. ముతక పంచదార రక్త పిత్తాన్ని (నేతితో కలిపి ముందుగా వాడితే) చెదరగొడుతుంది. జీర్ణానికి కూడా దోహదం చేస్తుంది. పాత బెల్లం అన్ని విధాల మంచినే చేస్తుంది. బెల్లపు సారాయి పిత్త దోషాలను పెంచుతుంది కాని వాత, కఫ దోషాలను తగ్గిస్తుంది. సౌవీరజ పానీయాలు చురుకుదనాన్ని కలిగించినా రక్తపిత్తాన్ని కలిగిస్తాయి. మండాయను పేరుగల వేచిన బియ్యంతో చేయబడిన, అంబలి ఆకలిని, అరుగుదలను బలాన్నీ కూడా సంపూర్ణంగా పెంచుతుంది.

పేయం (కొన్ని ధాన్యాలు, మందులు కలిపి నీరు బాగా పోసి చేసిన జావ) పాడైన వాతాన్ని బాగు చేస్తుంది, శరీరాన్ని తేలికపఱచి మూత్రవ్యవస్థను పదిలపరుస్తుంది. దానిని మజ్జిగ, దాడిమ వ్యోశ, బెల్లం, తేనె, రావిలతో తగు పాళ్ళలో కలిపి లేహ్యంగా చేసి తీసుకుంటే దగ్గు, గొంతువాపు మున్నగు కంఠ వ్యాధులు అతిసార తగ్గిపోతాయి. చారు (రసం) సహజంగానే చింతపండు, నీరుల మిశ్రమం కావడం వల్ల గొంతునుండి చివరి దాకా గల వ్యవస్థను స్వస్థపరుస్తుంది. గుండ్రటి ఉల్లి, ముల్లంగి, పండ్లముక్కలతో నేతితోగాని నూనెతో గాని తయారు చేసిన రసం ఉత్సాహాన్నీ, బలాన్నీ పుంజుకునేలా చేస్తుంది. దీనిని గోరు వెచ్చగా నున్నపుడే త్రాగడం మంచిది.దాడిమ, ఉసిరికలతో తయారుచేసిన యూష (ఉప్పులేని రసం) జఠరాగ్నిని ప్రజ్వరిల్ల చేసి వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. ముల్లంగి యూష (ఉప్పులేని రసం) దగ్గునీ, శ్వాసకోశంలోని ఇబ్బందులనీ జలుబుని కఫాన్ని అదుపులోకి తెస్తుంది.

యవ, కొల, కులత్థములతో వండిన యూష వాయువును పెంచి, గొంతును బాగుచేస్తుంది. ముద్దతో, ఉసిరికతో ఉడికించిన యూష కఫ, పిత్త దోషాలను నశింపజేస్తుంది.వేడి మందకాలు (అంబళ్ళు) చలవ చేస్తాయి. పెరుగు, బెల్లం కలిపి తింటే వాతవృద్ధి, శష్కులి (జిలేబీ) ని నేతిలో వేయించుకు తింటే జఠరాగ్ని బాగా జ్వలించడం, సత్తుపిండిని దేనితో కలిపి వండుకు తిన్నా మంచి వాయువుల పెరుగుదలా లభిస్తాయి.ఏది తిన్నా నీరు తాగడం మానకూడదు. అది దాహాన్ని తీర్చడమే కాక జీర్ణకోశం అలసిపోకుండా కాపాడగలదు.

నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment