Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయం

జ్వరం, అతిసార నివారణ

శుశ్రుతా! త్రిదోషాలలో నొకదాని వల్లగాని, రెండింటి వల్ల గాని, మూడు కలిసి వచ్చిన కలిసి దాని కాలంలో గాని వచ్చే జ్వరాలు ప్రధానంగా ఎనిమిది రకాలున్నాయని. అనుకున్నాం కదా! దాహం, ఉష్ణోగ్రతలో విపరీతమైన పెరుగుదల వున్న జ్వరానికి ముస్త, పర్పటక, ఉశీర, చందన, ఉదీచ్య, నాగరలను సమపాళ్ళలో నీళ్ళలో పోసి మరిగించి బాగా చల్లార్చి రోగి చేత త్రాగించడం మంచి చికిత్స. శీఘ్రంగా రోగి కుదుట పడతాడు..

నాగర, దేవకాష్ట, ధన్యాక, ద్వివిధ బృహతులతో కషాయాన్ని చేసి త్రాగితే ఏ జ్వరమైనా పోతుంది. పైగా జీర్ణమండలం కూడా బాగుపడుతుంది. ఆరగ్వధ, అభయ, ముస్త, రిక్త, గ్రంథికాలతో చేసిన చిక్కటి కషాయం ఆమ జ్వరానికి అద్భుతమైన మందు. జ్వరం బాగా పెరిగిపోయి అపస్మారక స్థితిలోకి పోయిన రోగికి మధూకసార, సింధూత, వచ, ఊషణ, కణలను సమపాళ్ళలో కలిపి పొడిచేసి నీళ్ళలో కలిపి త్రాగిస్తే వెంటనే గుణం కనబడుతుంది.

మొత్తం లోపలి భాగాలన్నిటినీ కడిగేసి మరీ, ఏ జ్వరాన్నయినా తగ్గించేశక్తి త్రివృత,విశాల, త్రిఫల, కటుక, ఆరగ్వధ, చూర్ణాలను లవణజలంతో కలిపి తయారుచేసిన ఔషధానికుంది. తృతీయక జ్వరానికి శొంఠి, గుడూచి లేదా హరీతకి, ముస్త, చందన,ఉశీర, ధాన్యకలను పంచదారతోనూ నూరి తేనెతో రంగరించి తయారుచేసిన మందు బాగా పనిచేస్తుంది. అపామార్గ జటాలను ఏడు ఎఱ్ఱని దారాలతో కట్టి ఆదివారం నాడు రోగి నడుముచుట్టూ కడితే కూడా ఈ జ్వరం తగ్గుతుంది. (జటాని జఠాగా వ్రాస్తారు) తఱచుగా వచ్చే జ్వరాలకు తర్పణాల సాధనమొకటుంది.

పుత్ర సంతానం లేనివాడూ, సన్యసించిన పిమ్మట గంగోత్తర తీరంలో మృతి చెందినవాడూ నగు వ్యక్తి పేర తిలలతో తర్పణాల అర్పించడం.. గుడూచి, త్రిఫల, వాసక, ఋజ్విక, వేరుతో కలిపియున్న బల – వీటిని నేతితో కలిపి కషాయం చేసి సేవిస్తే జ్వరం పోతుంది. అలాగే ధాత్రి, శివ, కణ, చిత్రకాలను కలిపి తీసిన కషాయం చాలా వఱకు జ్వరాలను తగ్గిస్తుంది. జ్వరం, విరేచనాలు ఒకేమారు వస్తే పృశ్నపర్ణి, ఐల, బిల్వ, నాగర, ఉత్పల, ధన్యాక, పాఠ(ర)ఇంద్రయవ, భూనింబ, ముస్త, పర్పరక, శొంఠిలను కలిపి కషాయం చేసి రోగికిస్తే. అవి తగ్గుతాయి. ఇది చీముపడుతున్న నులుగదుపుకి బాగా పనిచేస్తుంది. నాగర, అతివిశ, ముస్త, నేలవేము, అమృత, వత్సకలతో చేసిన కషాయం అన్ని రకాల జ్వరాలనూ విరేచనాలనూ కుదుర్చుతుంది.

విశ్వ, మామిడి టెంకల కషాయంలో కాస్త ముతక చక్కెరను కలిపి తేనెతో రంగరించి త్రాగినా, కుటజం బెరడును కణతో కలిపి పొడిచేసి తేనెతో కలిపి త్రాగినా, అతిసార అదుపులోకి వస్తుంది. ముస్త, పర్పరు, శృంగవేర, ఉదీచలను వేడినీటిలో మరిగించి చల్లార్చి అతిసార రోగికివ్వాలి. వానికి ఆహారంతోబాటు శాలపర్ణి, పృశ్నిపర్ణి, బృహతి, కంటకారిక, ఐల, స్వదంష్ట్ర (గోక్షుర) విశ్వాది, పాఠ, నాగర, ధాన్య కాల కషాయాన్నిస్తే మంచి గుణం కనిపిస్తుంది. కడుపులో శూల, రక్త విరోచనాలు, చీము పడుట, అతిసార రోగాలకు (రోగానికి) వత్సక, అతివిష, తిశ్వ, కణ, కందలతో చేసిన కషాయాన్ని వాడాలి. చిత్రకను కషాయంగా చేసి, అడుగంటే దాకా ఆవిరి చేసి మిగిలిన దానిని నేతితో కలిపి ఇస్తే గ్రహణి, ప్లీహవ్యాకోచం, మొలలు, శూల తగ్గుతాయి.

మొలలకు అయిదు రకాల ఉప్పును వాడాలి. అవి: సౌవర్చల, సైంధవ, విడంగ, ఔద్భిద, సాముద్రికలు. అప్పుడే చిలికిన మజ్జిగను గంటకొక రకం లవణంతో ఇస్తే గుణం కనిపించవచ్చు. శస్త్రచికిత్స కూడా ఉంది. జీర్ణశక్తి పెరగడానికి పంచకొల, త్రియూషణ, మిరియాలు గుండ చేసి కషాయం చేసి ఇస్తే మంచిది. హరీతకిని నాగర, బెల్లం లేదా ఉప్పు గడ్డలతో కలిపి తరచుగా తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

తాపజ్వరం, పచ్చకామెర్లు తగ్గించడానికి త్రిఫల, అమృత, వాస, తిక్త, భూనింబ, నింబాలను కషాయము చేసి తేనెతో కలిపి ఇవ్వాలి. సన్నిపాత జ్వరాలకూ, రక్తం గడ్డకట్టడానికీ త్రివృత, త్రిఫల, శ్యామ, పిప్పలులను తేనెతో పంచదారతో కలిపి ఇస్తే మంచిది. వాసమందు దొరుకుతున్నంతకాలం దగ్గు, కోరింత దగ్గు, రక్తస్రావక వ్యాధులు గల రోగులు నిరాశచెందనక్కరలేదు. ఆటరూషక (వాసక) మృద్విక, పథ్యములను పందార, తేనెలతో కలిపి తీసుకుంటే గొంతు దురదవేసి కొండనాలుక క్రిందికి తగిలి దగ్గువచ్చే రోగం తగ్గుతుంది.

రక్తవ్యాధి (హీమోలైసిస్) కూడా పోతుంది. ఈ కషాయాన్ని నిత్యం ఇంట్లో ఉంచుకోవాలి. రక్తస్రావం వెంటనే కట్టాలంటే వాసరసాన్ని పటిక పంచదారతో, తేనెతో కలిపి త్రాగించాలి. అలాగే సల్లకి, బదరి, జంబు, ప్రియాల, ఆమ్ర, అర్జున లేదా ధవలను కలిపి తీసిన రసాన్ని పాలలో కలిపి తాగితే రక్తం కారడం ఆగుతుంది. నిర్గుండి వేరు, పండు, ఆకు కలిపి శుద్ధి చేసి, నేతితో కలిపి తిన్నవారికి అధికాహారం వల్ల వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. తరువాత మాత్రం తిండి తగ్గించాలి. అన్నద్వేషం, దగ్గు, దాహం గల రోగికి హరీతకి, సొంఠి, కణ, మిరియాలు, బెల్లం కలిపిన కషాయాన్నివ్వాలి. కంటకారి లేదా గుడూచి రసంలో ఒక ప్రస్థ బరువున్న నేతినీ, ముప్పది పలాల కొలతలో రసాన్నీ కలిపి వేడి చేసి చల్లార్చి త్రాగిస్తే దగ్గు, అజీర్ణం తగ్గిపోతాయి.

కృష్ణ (రావిలో ఒకరకం) ధాత్రి, శిత, శుంథిలను తేనెతో కలిపి సేవిస్తే వెక్కిళ్ళు ఆగిపోతాయి. ఆయాసమున్న రోగికి భార్గి, విశ్వరసాలను వెచ్చని నీటితో కలిపి ఇస్తే ఉపశమనం వుంటుంది. నాగర, పథ్యాలను గాని, రావి, పథ్యాలను గాని, కాస్త నూనెతో కలిపి ముద్ద చేసిన కాచుని గాని చప్పరిస్తే గొంతు పట్టడం, బొంగురు పోవడం తగ్గుతాయి. భావన నేతిని అశ్వగంధ కషాయంతోనూ ఈ ముద్దకి నాలుగింతల కొలతలో పాలతో కలిపి తీసుకుంటే వీర్యవృద్ధి, శృంగార సామర్థ్యమూ కలుగుతాయి. మతి భ్రమణాన్నీ, గ్రహాపస్మారాన్నీ తగ్గించడానికి పాత నేతితో బ్రాహ్మీరసం, వచ, కుస్థ (ష్ట) శంఖపుష్టిలతో కలిపి తీసుకోవాలి. ఛిన్న, నీలి, ముందీరికల కషాయాన్ని నెయ్యి, తేనెల మిశ్రమంతో కలిపి స్వీకరిస్తే ఎంత విపత్కరమైన వాత రక్తదోషమైనా సరే, సమసిపోతుంది. దీనితో బాటు మూర్ఛ కూడా గల వారికి త్రిఫల, గుగ్గిలాలను కలిపి ఇవ్వాలి.

తొడల కదలికలు మందగించి పక్షవాతదశకు చేరుకున్న రోగికి గోమూత్రాన్ని గుగ్గిలంతో కలిపి ఇవ్వాలి. సామవాతానికి గోక్షురక, శుంధి కషాయం బాగా పనిచేస్తుంది. దశమూల, అమృత, ఎరండ, రాస్న, నాగర, దేవదారు కషాయాన్ని బెల్లం, మిరియాలతో కలిపి తీసుకుంటే పరమ మొండి వ్రణాలూ, కురుపులూ నశిస్తాయి. ఈ కషాయం దగ్గునీ, దాహాన్నీ, అన్న విరక్తినీ కూడా కుదిర్చివేస్తుంది. కంటకారి రసం ముప్పది పళాలూ, గుడూ చిరసమొక ముప్పది పళాలూ తీసుకొని ఒక ప్రస్థ పరిమాణం గల నేతితో కలిపి వేడి చేసి చల్లార్చి ఆ ముద్దను తగినంతగా స్వీకరిస్తే దగ్గు, గుండెనొప్పి మాయమవుతాయి. ఆకలి పెరుగుతుంది. కృష్ణ, సొంటి, శిత, మరిచల కషాయాన్ని గెడ్డలుప్పుతో, ఆముదంతో కలిపి తీసుకుంటే కడుపులో మంట, సామవాత ప్రకోపం తగ్గుతాయి.

వాతశూలకి బల, పునర్నవ, ఎరండ, ద్వివిధ బృహతి, గోక్షుర కషాయానికి ఉప్పు, ఇంగువలను కలిపి చేసిన మందు మంచిది. త్రిఫల, నింబ, యష్టిక, కటుక ఆరగ్వధాలతో కషాయాన్ని తయారుచేసి దానిని వేడిచేసి చల్లార్చిన ముద్దలో తేనెను కలిపి త్రాగితే కడుపులో మంట, ఉదరశూల తగ్గుతాయి. ఉదరశూలలోనే పరిణామార్తి అని మరోరకం కడుపునొప్పి వుంది. ఇది త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి యష్టికనందులు వేసి స్వీకరిస్తే తగ్గుతుంది. మండూరాన్ని గోమూత్రంతో శుద్ధిచేసి త్రిఫల చూర్ణంతో కలిపి తేనెతో రంగరించి వేసుకుంటే త్రిదోష జన్యమైన ఉదరశూల ఉపశమిస్తుంది. రెండు పాళ్ళు త్రివృతం అయిదు పాళ్ళు హరీతకి, నాలుగుపాళ్ళు కృష్ణంలను కలిపి ముద్ద చేసి సమపాళ్ళలో బెల్లంను కలిపి చిన్నచిన్న వుండలుగా జేసి చప్పరిస్తే మలబద్ధకం పోతుంది. వ్యాధి తీవ్రతను బట్టి ఉండలను వాడాలి. మలబద్ధకంతో బాటు ప్రేగు (వాయు) బొడిపెలు కూడా ఉన్నవారు అవి తగ్గాలంటే హరీతకి, యవక్షార, పిప్పలి, త్రివృతాలను నేతితో కలిపి వాడాలి. అలాగే త్రివృత, హరీతకి, శ్యామాలను స్నుహిరసంలో శుద్ధి చేసి ఎండబెట్టి మాత్రలుగా చేసి వాటిని తగినంతగా గోమూత్రంతో కలిపి తీసుకున్నా అనాహరోగం (మలబద్ధకం) తగ్గుతుంది.

త్రయూషణ, త్రిఫల, ధన్య, విడంగ, చవ్య, చిత్రకాలను నీటిలో మరగబెట్టి పూర్తిగా ఆవిరిపాలు చేయగా అడుగున మిగిలిన అవశేషాన్ని నేతితో కలిపి తీసుకుంటే వా దోషాలూ, ప్లీహవ్యాకోచమూ నశిస్తాయి. నాగరవేరు, పాలు లేదా సౌవర్చల ఉప్పులను ఆడగుంట నక్కపాలతో కలిపి తీసుకుంటే గుండెదడ తగ్గుతుంది. కణ, పాషాణభేద, ఏలక, శిలాజటుకలను బియ్యం కడుగుతో బెల్లంతో కలుపుకొని తాగితే మూత్రశూల పోతుంది. వాత, మూత్ర, ప్రేగు దోషాలన్నిటికీ అమృత, నాగరి, ధాత్రి, వాజిగంధ, త్రికంటక లతో చేసిన కషాయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కంటకం రసాన్ని తేనెతో కలిపి త్రాగినా యవక్షారమును సమాన పరిమాణంలో చక్కెరతో కలిపి తిన్నా మూత్ర విసర్జన కష్టాలు తొలగుతాయి. త్రిఫల చూర్ణాన్ని నీటితో కలిపి ముద్ద చేసి ఉప్పేసుకొని తిన్నా.. మూత్రం ధారాళంగా పోతుంది. కర్చూరపొడిని లింగం లోనికి జొనిపితే మూత్రం బాగా జారుతుంది. శిగ్రువేరుని కషాయం చేసి గోరువెచ్చగా త్రాగితే మూత్ర విసర్జనలో మంట తగ్గుతుంది. ధాత్రి,నిశా,తేనెలతోడి రసం గానీ, త్రిఫల, దారు దార్వి, అబ్జలపొడిని తేనెతో కలిపిన మిశ్రమం గానీ మూత్ర సమస్యలను తీరుస్తాయి.

బక్కగా వున్నవాడు దుక్కగా కావాలంటే యవ, శ్యామాకలను తినాలి. తీయని నీటిని త్రాగుతుండాలి. లావుపాటి వాళ్ళు సన్నబడాలంటే బాగా వేచినబార్లీపొడిని తేనెతో కలుపు కొని తినాలి. జీలకఱ్ఱ, చవ్య, వ్యోశ, ఇంగువ, సౌవర్చల ఉప్పు, అమలల మిశ్రమాన్ని తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. అంటే ఒళ్ళు తగ్గుతుంది. బలం తగ్గదు.. చిత్రక ఉత్పలాలను రెండేసి ప్రస్థల పరిమాణంలో తీసుకొని నీటిలో బాగా తవ్వి ఆవిరైపోయేదాకా మరిగించి పాత్రలో మిగిలిన ముద్దను నాలుగుమార్లు నీటితో కలిపి వడకట్టి, రెండుమార్లు గోమూత్రంతో కడిగి ఎండబెట్టి ఒక ప్రస్థ నేతితో, ఒక ప్రస్థ పాలతో కలిపి స్వీకరిస్తే అన్ని రకాల ద్రవోదరాలు పోతాయి. ఆరోగ్యంగా లావెక్కడానికీ, చిరకాలం జీవించగలగడానికి, ద్రవోదరం, మహోదరాలు నశించడానికీ పది పిప్పలి గింజలతో మొదలుపెట్టి రోజుకి పది పెంచుకుంటూ పోయి అలా పదిరోజులపాటు పాలతో తినాలి. తరువాత రోజుకి పదిచొప్పున తగ్గించుకుంటూ రావాలి. ఈ ఇరవైరోజులూ ఆహారంగా యష్టికనీ పాలనూ మాత్రమే స్వీకరించాలి.

ఇలాగే కృష్ణ లేక ముద్ద అనే మందులతో కూడా ప్రయత్నించవచ్చును. ఇవి మాత్రం వెయ్యి ముక్కలదాకా వుండాలి. పునర్నప కషాయం ముద్దతో నేతిని కలిపి వేడి చేసి చల్లార్చి తీసుకుంటే కడుపుబ్బు తగ్గుతుంది. దీనితో పాటు బొడిపెలు మున్నగునవి కూడా కలవారికి గోమూత్రంలో నానబెట్టి తీసిన పిప్పలిని పాలతో కలిపి ఇస్తే గుణం కనిపిస్తుంది. అలాగే బెల్లం, అభయ లేదా విశ్వలను సమపాళ్ళలో పిప్పలి, గోమూత్రాలతో కలిపి ఇవ్వవచ్చు. బల అనే మందును కషాయం చేసి పాలతోనూ ఆముదంతోనూ కలిపి తాగితే కడుపుబ్బు, ఉదరరోగాలూ, గిలక (ప్రేగు – వృషణ సంబంధి) రోగం నిమ్మళిస్తాయి. పథ్య ఔషధ, ఆవిరిశేషాన్ని కృష్ణ, సైంధవ, ఆముదపు వేచిన విత్తనాల కషాయం కలిపి తీసుకుంటే వరిబీజం (వృషణ వ్యాకోచం తగ్గుతుంది.

శరీరం లోపలి కురుపులు స్నుహీగండీరక కషాయంతో కాపడం పెడితే పోతాయి. ఇలాటి కురుపే విద్రధి కూడా అది తేలని కురుపు. అది శోభాంజనాక. సింధూత, హింగ్వౌ షధాలను ముద్దచేసి పట్టీవేస్తే పోతుంది. కుష్ఠ ప్రారంభ దశయనదగు కంఠగండమాల నిర్గుండి ముద్ద చేసి పట్టీ వేస్తే కంతిరోగ సమసి పోతుంది. ధత్తూర, ఎరండ, నిర్గుండి. ముద్దను పూస్తే పోవచ్చు. హస్తికార్ల, పలాశలను వర్షభూ, శిగ్రు, సర్షపాలపొడితో నీటితో ముద్దను తయారుచేసి పట్టీ వేస్తే బూరగాలు తగ్గుతుంది. శోభంజనక (ముద్ద పసుపు) సింధూత్త, హిందూత్తలతో కడుపుపై పట్టీ వేస్తే ఉబ్బరం తీస్తుంది. శరపుంఖాన్ని తేనెతో కలిపి పట్టీ వేస్తే లోపలి కురుపులు నశిస్తాయి. వేపాకులను ముద్దచేసి రాస్తే చీము పట్టకుండా కాపాడుతుంది. త్రిఫల, ఖదిర, దార్వి, న్యగ్రోధాలను ముద్దజేసి రాస్తే కురుపులు, గాయాలు ప్రక్షాళన చేయబడతాయి, యష్టి, మధుకాలను (వేడి) నేతితో కలిపి అప్పుడే తగిలిన గాయాన్ని ఎంత నొప్పికైనా ఓర్చుకొని గట్టిగా రుద్ది కడుక్కుంటే శీఘ్రమే అది మానిపోవచ్చు.

దూషితమైన పిత్తాన్నీ, రక్తపు వేడినీ చలువచేసే మందులతోనో సామాన్య ఆహార పదార్థాలతోనో తగ్గించవచ్చు. వెదురు, ఎరండ, స్వదంష్ట్ర బెరళ్ళను పొడిచేసి తేనె, హింగు, గెడ్డ ఉప్పులతో కలుపుకొని త్రాగితే రక్తం పరిశుభ్రమవుతుంది. మలిన రక్తం బయటికి పోతుంది.సామాన్యారోగ్యం చెడకుండా వుండాలంటేయవ, కొల,కులస్థలనుయవాగు (అంబలి లాటిది) తో కలిపి కాస్త గడ్డవుప్పేసుకొని తఱచుగా తింటుండాలి. కరంజారిష్ట, నిర్గుండి రసాలను కలుపుకొని తాగితే పురుగులునశించి అంతర కురుపులు మాడిపోతాయి. గుగ్గిల, త్రిఫలమాత్రలు నొప్పిని తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని పోగొడుతుంది..

నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment