Skip to content Skip to footer

🌹🌹🌹నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం

చంద్రగ్రహ మహిమ – మూడవ భాగము

రోజులు వారాలుగా , నెలలుగా ఎదిగిపోతున్నాయి. యోగానంద మహారాజు ఒకటి తర్వాత ఒకటిగా పరివార బృందాలను యువరాజు అన్వేషణ కోసం నియమిస్తూ ఉన్నాడు. అరణ్యాలలో ఇరుగు పొరుగు రాజ్యాలలో గాలించి గాలించి , వృథా ప్రయాసపడి పరివారం తిరిగి వస్తూనే ఉన్నారు.

ఏకైక వారసుడు ప్రాణాలతో లేడన్న నిర్ణయానికి వచ్చిన రాజదంపతులు ఎనలేని దుఃఖంలో మునిగిపోయి , దుర్భరంగా కాలం వెళ్ళదీస్తున్నారు. అలాంటి పరిస్థితిలో – ఒకనాడు , ఉన్నట్టుండి పోల్చుకోవడానికి వీలు లేని వికృతమైన ఆకారంతో హిరణ్యగుప్తుడు రాజధానిలో ప్రత్యక్షమయ్యాడు.

మాటా , పలుకూ లేకుండా పిచ్చిగా వ్యవహరిస్తున్న అతన్ని అతికష్టంమీద పోల్చుకున్న రాజభటులు రాజమందిరానికి తీసుకువచ్చారు. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు ఆనందం , పిచ్చివాడుగా మారిపోయినందుకు ఆవేదన రాజ దంపతులను ఉక్కిరిబిక్కిరి చేసి వేశాయి. రాజుగారి ఆజ్ఞతో రాజ వైద్యుడు యువరాజుకు వైద్యం ప్రారంభించాడు.రోజులు గడుస్తున్నాయి. వైద్యం కొనసాగుతూనే ఉంది. యువరాజు హిరణ్యగుప్తుడి పిచ్చి నయం కాలేదు. కనీసం అతన్ని ఆవహించిన ”మౌనం” మాయం కాలేదు.యోగానంద మహారాజు మహామంత్రితో , రాజవైద్యునితో , ఆస్థాన జ్యోతిష్కుడితో సమావేశమయ్యాడు.

“ఆరునెలలుగా వైద్యం చేస్తున్నాను. నాకు తెలిసిన చికిత్సలే కాకుండా , ఇరుగుపొరుగు దేశాల రాజవైద్యులను సంప్రదించి , వాళ్ళు సూచించిన చికిత్సలూ అందించాను. నేను ఇస్తున్న దివ్యమైన ఔషధాలన్నీ సముద్రంలో ఇంగువలాగా యువరాజుగారి శరీరంలో కరిగి , వ్యర్థమైపోతున్నాయి…” రాజవైద్యుడు చెప్పుకుపోతున్నాడు.”కనీసం మాట తెప్పించే ప్రయత్నం చేయలేకపోయారా ?” యోగానంద మహారాజు అడిగాడు.

“చిత్తం ! యువరాజులుంగారు మెలకువగా ఉన్న సమయంలో ఆపకుండా ఆ ప్రయత్నం సాగిస్తూనే ఉన్నాను , ప్రభూ !” రాజవైద్యుడు నిట్టూరుస్తూ అన్నాడు. “ప్రభువులు మన్నించాలి. యువరాజులుంగారి మౌనాన్ని భగ్నం చేసే సదుద్దేశంతో శలాకను ఎర్రగా కాల్చి వాతలు కూడా పెట్టించాను. యువరాజులుంగారు నోరే తెరవలేదు !”

“ఆశ్చర్యంగా ఉందే !” మహామంత్రి అన్నాడు. “సందేహం లేదు ! నా పరిశీలననూ , రోగనిర్ణయాన్నీ ప్రాతిపదికలుగా చేసుకుని నిష్కర్షగా మనవి చేస్తున్నాను… యువరాజులుంగారిది కేవలం మౌనం కాదు ; అది శాశ్వతమైన మూగతనం ! వారు మూగవారైపోయారు !”

యోగానంద మహారాజు అరచేత్తో నుదురును కప్పుకుని , బరువుగా నిట్టూర్చాడు. ఆయన చూపులు ఆస్థాన జ్యోతిష్కుడి వైపు తిరిగాయి. “ఆచార్యా ! యువరాజు జాతకం పరిశీలించారా ?”

“చిత్తం ! పరిశీలించాను ; పరిశీలిస్తూనే ఉన్నాను. నాకున్న పరిజ్ఞానానికి అంతూ పొంతూ అందడం లేదు. యువరాజులంగారికి ఎందుకు ఇలా అయిందో ; ఈ జాడ్యం ఎంతకాలం ఉంటుందో లెక్కకట్టే శక్తి నాకు లేదు. వేటకు వెళ్ళడానికి సమయం అనుకూలంగా లేదని తమకు ఆనాడే మనవి చేశాను…”

“ఆ మాత్రం మనవి చేయడానికి ఆస్థాన జ్యోతిష పండితుడు అవసరం లేదు. ఆచార్యా ! పంచాంగం చూడగలిగిన వారు ఎవరైనా చెప్పగలరు !” యోగానంద మహారాజు విసుగ్గా అన్నాడు.”చిత్తం… ప్రభువులు మన్నించాలి. యువరాజులుంగారికి ఏం జరిగిందో , ఎందుకు జరిగిందో , ఏం జరగబోతోందో అనే అంశాలను జాతక గణన ద్వారా చెప్పగలిగిన పరిజ్ఞానం నాకు లేదు !”

“వరరుచి చెప్పేవాడుగా , ఆచార్యా ! ఆయన పరిశీలించేదీ జాతకచక్రమేగా !” యోగానందమహారాజు అన్నాడు.

“ఆయన మహానుభావుడు ! జ్యోతిషశాస్త్రంలో మహామహోపాధ్యాయుడు! పుంభావ సరస్వతి ! ఆ మేధావి ఎక్కడ ? నేనెక్కడ ?” ఆస్థాన జ్యోతిష్కుడు పైకి నమస్కరిస్తూ అన్నాడు. “కానీ , మన దౌర్భాగ్యం ! ఆ మహాజ్ఞాని కాలం చేశారు !”

“సరే… ఇక మీరు దయచేయండి !” మహారాజు ఆగ్రహాన్ని అణచుకుంటూ అన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడు లేచి , నమస్కరించి , నిష్క్రమించాడు. “సెలవు !” అంటూ చేతులు జోడించి , లేచాడు రాజ వైద్యుడు.

“ఆస్థాన జ్యోతిష్కుడి అభిప్రాయం యధార్థమే , ప్రభూ !” మహామంత్రి వినయంగా అన్నాడు. “ఆచార్య వరరుచి త్రికాలజ్ఞుడు. ఆయన ఉండి ఉంటే యువరాజుగారికి ఎందుకిలా అయిందో అవలీలగా చెప్పేవారు !” యోగానంద మహారాజు మౌనంగా , అవునన్నట్టు తలపంకించాడు.

“యువరాజుగారి మతిభ్రమణ వ్యాధికీ , మూగజాడ్యానికీ విరుగుడు కూడా సూచించి ఉండేవారు ఆచార్య వరరుచి !” మహామంత్రి మళ్ళీ అన్నాడు. “ఊ… ఆ త్రికాలజ్ఞుడు కాలంలో గతించిపోయాడు కద !” యోగానందుడు తగ్గు స్వరంతో అన్నాడు ; నేల చూపులు చూస్తూ.

“ప్రభువులు మన్నించాలి ! అది మన స్వయంకృతమే…” “అంగీకరిస్తున్నాం ! మా స్వయంకృతమే !” యోగానందుడు నిట్టూర్చాడు.

“వరరుచి ఎవరో తెలుసా మీకు ?” నిర్వికల్పానంద కథనం ఆపి శిష్యుల్ని కలియజూస్తూ అడిగాడు. “ఎంతో కొంత తెలుసు ! మీరు చెప్తే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ! చెప్పండి గురువు గారూ !” విమలానందుడు వినయంగా అన్నాడు.

“సరే , వినండి !” నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. “వరరుచి , విక్రమార్కుడు , భట్టీ , భర్తృహరీ – ఈ నలుగురూ జ్ఞాతులు. అంటే సవతి తల్లుల బిడ్డలు. తండ్రి ఒక్కరే ! వరరుచి బ్రాహ్మణ పత్నికీ , విక్రమార్కుడు క్షత్రియ పత్నికీ , భట్టి వైశ్య పత్నికీ , భర్తృహరి శూద్ర పత్నికీ జన్మించారు.”

“వరరుచి సకల శాస్త్ర పారంగతుడు. వేదశాస్త్ర పురాణాలూ , వ్యాకరణమూ , గణితమూ ఆయనకు అరచేతిలో అమలకాలు. నవగ్రహాల సంచారాన్ని బట్టి జాతకగణన చేసి , జరిగిందీ , జరుగుతున్నదీ , జరగబోయేదీ చెప్పడంలో వరరుచి నైపుణ్యం అసామాన్యమైంది. ఆ కాలంలో జ్యోతిష్య శాస్త్రంలో అద్వితీయమైన ప్రజ్ఞ కలిగిన విజ్ఞాని ఆయన ఒక్కడే. కార్తాంతికుడుగానే కాకుండా , ఖగోళశాస్త్రజ్ఞుడుగా వరరుచి అసామాన్యుడు. జాతకగణనలో దేవగురువు బృహస్పతి ఆచార్యులతో సమైనమైన ప్రతిభ ఆయనది. జాతక చక్రాన్ని పరిశీలించి , తత్కాల గ్రహసంపత్తి ఆధారంగా ఫలితాలనే కాకుండా – జాతకుల శారీరక లక్షణాలు కూడా దర్శించి , చెప్పగలిగిన మేధస్సు వరరుచి సొంతం. ఒక విధంగా ఆ ప్రజ్ఞాపాటవాలే ఆయనకు ముప్పుతెచ్చాయి.”

“వరరుచి యోగానంద మహారాజు ఆస్థాన జ్యోతిష్కుడుగా ఉండేవాడు. యోగానంద మహారాజుకి వరరుచి అంటే విశేషమైన గౌరవం…”

“అయితే స్వయంగా ఆ రాజే వరరుచికి మరణశిక్ష ఎందుకు విధించాడు , గురువుగారూ ?” సదానందుడు అడిగాడు.

“ఒకసారి ఒక ప్రఖ్యాత చిత్రకారుడు ఆయన ఆస్థానానికి వచ్చాడు. రాజు కోరిక మేరకు మహారాణిగారి వర్ణచిత్రం లిఖించాడు. ముమ్మూర్తులా మహారాణిలా ఉండే ఆ చిత్రపటం చూసి , రాజూ , రాణీ అందరూ ఎంతో ఆనందించారు. రాజూ , రాణీ లేని సమయంలో ఒకనాడు – వరరుచి మందిరంలోకి వచ్చి , ఆ వర్ణచిత్రాన్ని పరిశీలనగా చూశాడు. మహారాణి పొత్తికడుపు మీద ఉండే పుట్టుమచ్చ చిత్రంలో లేదు. పుట్టుమచ్చలేని చిత్రం అసంపూర్ణంగా ఉందంటూ వరరుచి చిత్రంలో నాభికి క్రింది భాగంలో పుట్టుమచ్చను చిత్రించి వెళ్ళిపోయాడు.”చిత్రంలో కొత్తగా ప్రత్యక్షమైన పుట్టుమచ్చను చూసి యోగానందమహారాజు నివ్వెరపోయాడు. ఆచార్య వరరుచి పుట్టుమచ్చను చిత్రించిన సంగతి చెలికత్తెలు ఆయనకు విన్నవించారు.

“యోగానంద మహారాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనకూ , మహారాణికి చిత్రమే కనిపించే పుట్టుమచ్చను వరరుచి ఎలా చూడగలిగాడు ? అంతఃపురంలోకి అనుమతించి తాను తప్పు చేశాడా ? వరరుచి రాణివాసంలో అభ్యంతర కక్ష్యలోకి రహస్యంగా చూసి ఉంటాడు ! అతని చర్య అక్రమం ! అనాగరికం ! శిక్షార్హం !- యోగానంద మహారాజు మహామంత్రిని పిలిపించాడు. వరరుచి నేరం వివరించి , మరణశిక్ష విధించి , శిరచ్ఛేదం చేయించే బాధ్యతను మహామంత్రికే అప్పగించాడు. యధార్థానికి వరరుచి తన చర్మచక్షువులతో మహారాణిగారి పుట్టుమచ్చను చూడలేదు. ఆమె జనన సమయంలోని గ్రహసంపత్తి ఆధారంగా , తన ”జ్యోతిష జ్ఞాననేత్రం”తో పుట్టుమచ్చను చూడగలిగాడు !”

“ఆ ”జ్యోతిషజ్ఞాన నేత్రమే” వరరుచి ప్రాణాలను హరించింది , పాపం !” చిదానందుడు అన్నాడు.”ఇతరుల కళ్ళకు కనిపించని శరీర అవయవభాగాల గురించి వెల్లడి చేయకూడదన్న ఇంగితం వరరుచికి ఎందుకు లేకపోయింది , గురుదేవా ?” శివానందుడు సందేహం వెలిబుచ్చాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment