Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట నలబై ఒకటవ అధ్యాయం

కుజగ్రహ మహిమ

“ధరణీగర్భ సంభూతం

విద్యుత్కాంతి సమప్రభం

కుమారం శక్తిహస్తం తం

మంగళం ప్రణమామ్యహమ్ !”

నిర్వికల్పానంద కుజస్తోత్రం పఠించి , తన కథాకథనం కొనసాగించాడు.

“పరమశివుడి స్వేదం నుండి భూదేవి పుత్రుడుగా అవతరించిన కుజగ్రహం భూ కారకుడనీ , యుద్ధకారకుడనీ శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దంపతుల ఐక్యత మీద కూడా కుజుడి ప్రభావం అధికంగా ఉంటుంది…”

“గురువుగారూ ! కుజుడి అనుగ్రహం వల్ల భూ లాభాన్ని పొందిన వాళ్ళ చరిత్ర ఏదైనా చెప్పండి !” శివానందుడు అడిగాడు.

“ప్రధానంగా కుజ గ్రహ ప్రభావం గురించి ఏ పురాణంలోనూ , కావ్యంలోనూ , ఏ చరిత్రలోనూ – ప్రత్యేకించి ఏమీ చెప్పబడలేదనే మనం అనుకోవాలి. అంటే , కుజగ్రహ వీక్షణ వల్ల ”ఈ వ్యక్తికి ఇలా జరిగింది కాబట్టి కుజగ్రహ ప్రభావం పనిచేసిందనీ , అలా జరగడానికి మూల కారణం కుజగ్రహ వీక్షణే అనీ మనం చెప్పుకోవచ్చు ! ఇప్పుడు మనం చేయబోయేది అదే !” నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు.

“ఎవరు, గురువుగారూ ఆ వ్యక్తి ?” చిదానందుడు కుతూహలంతో ప్రశ్నించాడు. “ఒకరు కాదు ; ఇద్దరూ ! ఆ ఇద్దరూ రామాయణంలోని పాత్రలు ! ఒకటి ప్రధాన పాత్ర. రెండవది అప్రధాన పాత్ర !” నిర్వికల్పానంద అన్నాడు. “ప్రధాన పాత్ర శ్రీరాముడు , అప్రధాన పాత్ర ఊర్మిళ !”

“శ్రీరాముడు ! ఊర్మిళ ! కుజ ప్రభావం ఆ ఇద్దరి మీదా పనిచేసిందా ?” విమలానందుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

“చెప్పానుగా ! పని చేసింది కాబట్టే ఆ ఇద్దరికీ ఆ విధంగా జరిగింది” అని అనుకోవాలి మనం ! మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను.

“మహి పునర్వసు తార మధ్యాహ్న వేళ గ్రహపంచకమునుదగ్రస్థితి తనర తొలగక గురుడు చంద్రుడు కూడి యుండ లలిత కర్కాటక లగ్నంబునందు…”అంటూ శ్రీరామ జనన సమయంలో గ్రహస్థితిని తెలియజేస్తోంది రంగనాథ రామాయణం ! శ్రీరామచంద్రుడుగా కౌసల్యాదేవికి ఆ శ్రీమహావిష్ణువు జన్మించబోయే సమయానికి గ్రహాలన్నీ చకచకా కదిలి ఉచ్ఛస్థానాలు చేరుకున్నాయన్నారు పెద్దలు. అంటే గ్రహస్థితిని అనుసరించి శ్రీరామ జననం జరిగిందని అర్థం. అంటే ఆయన జననం మీద గ్రహాల ప్రభావం ఉందని అర్థం. అదే విధంగా యుద్ధంలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ద్వారా గ్రహరాజైన సూర్యగ్రహం అనుగ్రహాన్ని పొందిన అనంతరమే శ్రీరామచంద్రుడు రావణ వధ చేయగలిగాడు. ఈ కథనాన్ని…”

“సూర్యగ్రహమహిమలో చెప్పుకున్నాం , గురువుగారూ !” సదానందుడు అందుకుంటూ అన్నాడు.

“కాబట్టి మొదలు , తుది సందర్భాలలో గ్రహవీక్షణ ఆ శ్రీరాముడి మీద తన ప్రభావాన్ని చూపిందని మనం నిశ్చయంగా చెప్పుకుంటున్నాం. అలాగే – ఆయన చరిత్ర మధ్యలో కూడా ఏదో గ్రహ ప్రభావం ఉండి ఉంటుందనుకోవటం అసంబద్ధం కాదు. శరీరం అనేది పంచభూతాల సమ్మేళనంతో రూపొందుతుంది. అందుకే శరీరాన్ని ”పాంచభౌతికం” – పంచభూత సంబంధమైంది అంటాం ! ఎంత అవతార పురుషుడైనా మానవుడిగా జన్మించే సరికి పంచభూతాల లక్షణాలకు లోబడే ఉంటాడు. ఆకలిదప్పులూ , దుఃఖం , ఏడుపూ మొదలైనవన్నీ పంచభూతాల ప్రభావంతో మానవుడికి సంక్రమించే దేహ ధర్మాలు. పాంచభౌతిక ధర్మాలకు లోబడే అవతార రూపాల మీద నవగ్రహాల ప్రభావం ఉండి తీరుతుందని చెప్పడానికే ఇంత వివరించాను !”

“ఈ వివరణ మాకు కొత్త అంశాలను తెలియజేసింది గురువుగారూ !” చిదానందుడు అన్నాడు.

“జన్మించిన ప్రతి జీవి మీదా నవగ్రహ ప్రభావం ఉంటుందని అర్థం చేసుకొన్నాం. అది అంశావతార పురుషులకు , అవతార పురుషులకు కూడా వర్తిస్తుంది ! ఈ నేపథ్యంలో శ్రీరాముడి గురించీ , లక్ష్మణ పత్ని ఊర్మిళ గురించీ ఆలోచించాలి మనం. ముందుగా రామాయణంలో అప్రధానపాత్ర అయిన ఊర్మిళ గురించి చెప్పుకుందాం.

“అన్నావదినలను సేవించుకునే సంకల్పంతో లక్ష్మణుడు అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. ఊర్మిళ తను కూడా వస్తానంది. ఆమె కోరికను తిరస్కరించి , అయోధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త ఆ తరువాత పట్టించుకోనట్టే రామాయణ కావ్యం కూడా ఊర్మిళ గురించి పట్టించుకోలేదు. శ్రీరామ వనవాసం , రావణ వధా అన్నీ పూర్తయి పధ్నాలుగేళ్ళ తరువాత ఆయన తిరిగి వచ్చేదాకా – ఊర్మిళ భర్త వియోగాన్ని అనుభవించాల్సి వచ్చింది…”

“ఆ పధ్నాలుగు సంవత్సరాల పాటు ఊర్మిళ గాఢ నిద్రలో ఉండిపోయిందని చెప్పారుగా , గురువుగారూ !” సదానందుడు అడ్డుతగుల్తూ అడిగాడు.

“ఔను ! ”ఊర్మిళాదేవి నిద్ర” అనే స్త్రీల పాట ఆ విషయాన్ని తెలియజేస్తోంది. ఆంధ్ర స్త్రీ లోకంలో బహుళ ప్రచారంలో ఉన్న పాట అది. ఆ పాటలలో ప్రస్తావించబడిన విధంగా ఊర్మిళ పధ్నాలుగేళ్ళ పాటు నిద్రలో మునిగిపోయిందో , భర్త వియోగ దుఃఖంతో తనకు తాను ఏకాంతవాస శిక్ష విధించుకుందో మనకు ఇదమిత్థంగా తెలీదు. పధ్నాలుగేళ్ళ సుదీర్ఘ కాలం ఆమె భర్తకు దూరంగానే ఉందనీ , వియోగ వేదనను అనుభవించిందనీ తెలుసు.”

“ఊర్మిళకు సంభవించిన భర్తవియోగ క్లేశానికి కారణం కుజుడి వీక్షణ ఆమె పట్ల వక్రంగా ఉండడమే అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. కుజగ్రహ అశుభ దృష్టి ఊర్మిళ మీద ఉన్నట్టే శ్రీరాముడి మీద కూడా వనవాస కాలంలో పనిచేసిందని మనం సులువుగా ఊహించుకోవచ్చు. ఊర్మిళ నుండి ఆమె భర్తను దూరంగా తరలించినట్టే , కుజగ్రహ వక్రదృష్టి శ్రీరామచంద్రుడి నుండి ఆయన భార్యను దూరం చేసింది ; అంతే కాకుండా , యుద్ధానికి ఆయనను గురిచేసింది. కుజుడు యుద్ధ కారకుడు కూడా !”

“అంటే శ్రీరాముల వారికి సీతా వియోగమూ , రావణాసురుడితో యుద్ధమూ సంభవించడానికి కారణం కుజగ్రహ ప్రభావమేనంటారా , గురువుగారూ ?” చిదానందుడు అడిగాడు.

నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. “కుజగ్రహ వీక్షణ సక్రమంగా , శుభంగా ఉండి ఉన్నట్లైతే – శ్రీరాముడికి సీతా వియోగమూ , రావణుడితో యుద్ధమూ సంభవించి ఉండేవి కావు – అని అనవచ్చు ! అందులో ఎలాంటి సందేహానికి అవకాశం లేదు. ఊర్మిళ విషయం కూడా అంతే ! రామాయణ గాథా , ఊర్మిళ కథా మీ అందరికీ తెలిసినవే కద ! మరీ వివరాలలోకి వెళ్ళకుండా , కుజగ్రహ మహిమకు వాళ్ళిద్దరి జీవితాలలో జరిగిన సంఘటనలను గుర్తు చేశాను. కుజ ప్రభావాన్ని అవగాహన చేసుకోడానికి మనకు ఈ మాత్రం చాలు ! ఏమంటారు ?”

“చాలు గురువుగారూ ! ఇక బుధగ్రహ మహిమ గురించి తెలుసుకుందాం !” విమలానందుడు నవ్వుతూ అన్నాడు.

“మంచిది ! అలాగే బుధ గ్రహ మహిమను శ్రవణం చేద్దాం !” అన్నాడు నిర్వికల్పానంద.

రేపటి నుండి బుధ గ్రహ మహిమ ప్రారంభం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment