Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట నలబై రెండవ అధ్యాయం

బుధగ్రహ మహిమ – మొదటి భాగము

“ప్రియంగు గులికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ !

సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ !!”

నిర్వికల్పానంద రాగయుక్తంగా బుధ స్తోత్రం పఠించి , అరమూసిన కళ్ళు తెరిచి , శిష్యుల వైపు చూశాడు. వాళ్ళ ముఖాలు కుతూహలాన్నీ , ఉత్కంఠనూ ప్రతిబింబిస్తున్న అద్దాల్లా ఉన్నాయి.

“బుధుడు బుద్ధినీ , ప్రజ్ఞనూ , యుక్తినీ ప్రసాదించే గ్రహం. గణితశాస్త్ర జ్ఞానాన్నీ , కావ్యరచనా శక్తినీ అనుగ్రహించే బుధుడు ”లిపి”కి అధిపతి. ఆయన కారకత్వాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రజ్ఞకూ , బుద్ధికీ , జ్ఞానానికీ మన కథనాన్ని పరిమితం చేసి చెప్పుకుందాం. బుధగ్రహ అనుగ్రహంతో అశేష ప్రజ్ఞా పాటవాలనూ , అఖండమైన జ్ఞానాన్నీ పొందిన మహానుభావులలో ”పాణిని” అగ్రగణ్యుడు. భారత జాతికి ఆయన ”పాణినీయం” అనే మహత్తరమైన వ్యాకరణ గ్రంథాన్ని అందించాడు. అది ఎనిమిది అధ్యాయాల గ్రంథం. ఆ కారణంగా ఆ వ్యాకరణ గ్రంథాన్ని ”అష్టాధ్యాయి” అని కూడా అంటారు…”

“గురువు గారూ , పతంజలి మహర్షి భాష్యం రచించింది ఆ వ్యాకరణ గ్రంథానికి కదూ ?” విమలానందుడు అడిగాడు.

“అవును , నాయనా ! పాణినీయ వ్యాకరణానికి పతంజలి వ్రాసిన భాష్యాన్ని ”మహాభాష్యం” అంటారు. ప్రపంచంలోని ఏ భాషకూ లేని సంపూర్ణమైన , శాస్త్రీయమైన , తర్కబద్ధమైన వ్యాకరణం ”పాణినీయం” ఒక్కటే అంటారు భాషావేత్తలు. పాణినీయం కేవలం వ్యాకరణం మాత్రమే కాదనీ , నిర్దుష్టమైన , సమగ్రమైన భాషా శాస్త్రమనీ అంటారు. అనన్య సామాన్యమైన ఆ మహాగ్రంథాన్ని రచించిన మహామేథావి పాణిని బాల్యంలో ”మహామొద్దు”. ఎంత ”మొద్దు” అంటే , ఎంతో మంది ఆచార్యులు అతడిని స్వీకరించడానికి నిరాకరించారు ! పాటలీపుత్ర నగరానికి సమీపంలోని ”శాలాతుర” అనే గ్రామంలో పాణిని జన్మించాడు. విద్యాభ్యాసానికి యోగ్యమైన వయసు వచ్చి , చాలా మంది గురువుల నిరాదరణకు గురి అయిన అనంతరం , యవ్వనదశలోకి అడుగు పెడుతున్న పాణిని , తనను ఆదరించే గురువును అన్వేషిస్తూ పాటలీపుత్రం చేరుకున్నాడు. ఆ నగరంలో ”వర్షాచార్యుడు” అనే పండితుడు గురుకుల విద్యాలయం నిర్వహిస్తున్నాడనీ , అజ్ఞానిని విజ్ఞానిగా రూపొందించగలిగిన శక్తి కలిగిన విద్యా వేత్త అనీ తెలుసుకున్నాడు. వర్షాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. విద్యార్జన పట్ల తనకున్న తీవ్రమైన ఆసక్తినీ , గురువు లభించని దురదృష్టాన్నీ వర్షాచార్యుడికి విన్నవించి , తనను శిష్యుడిగా స్వీకరించి విద్యాదానం చేయమని అర్థించాడు. పాణిని దయనీయ స్థితిని గ్రహించిన వర్షాచార్యుడు జాలిపడ్డాడు. అతనిలో వ్యక్తమవుతున్న తీవ్రమైన ఇచ్ఛ అతన్ని విద్యావంతుడిగా చేస్తుందన్న నమ్మకంతో వర్షాచార్యుడు పాణినిని శిష్యుడిగా స్వీకరించి , విద్యాబోధన ప్రారంభించాడు.

“అయితే – తన నమ్మకం వమ్ముకానుందని వర్షాచార్యుడు అచిరకాలంలోనే గ్రహించాడు. పాణినిలో ధారణశక్తీ , జ్ఞాపకశక్తీ – రెండూ లేవని అర్ధం చేసుకున్నాడాయన. గురుకులంలోని బాల విద్యార్థుల స్థాయిని కూడా పాణిని అందుకోలేకపోయాడు. కాలం గడిచిపోతోంది. ఋతువులు మారుతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పాణిని స్థాయి యథాపూర్వంగానే ఉన్నా కూడా వర్షాచార్యుడు అతన్ని ఆశ్రమంలో ఉండనిచ్చాడు. అందుకు కారణాలు రెండు: పాణినిలో ఉన్న అనన్యసామాన్యమైన గురుభక్తి. విద్యాభ్యాసం కోసం నిర్విరామంగా అతను పడుతున్న ప్రయాస. వృధా ప్రయాసతో పాణిని జీవితంలో అమూల్యమైన కాలం కూడా వృధా అయిపోతోందని నిశ్చయించుకున్న వర్షాచార్యుడు ఒకనాడు పాణినిని తన ఏకాంత సమ్ముఖానికి పిలిపించుకున్నాడు…” నిర్వికల్పానంద కథనాన్ని కొనసాగించాడు.పాణిని గురువుగారి పాదాలకు నమస్కరించి , చేతులు కట్టుకుని వినయంగా నిలుచున్నాడు. వర్షాచార్యుడు పాణిని ముఖంలోకి తదేకంగా చూశాడు.

“పాణినీ , విద్య చాలా విలువైంది. కాలం విద్యకన్నా విలువైంది. మానవ జీవితానికి ఉన్న కాలపరిమితి స్వల్పమే ! ఎంత శ్రమించినా నీకు విద్యాగంధం అంటదని నేను నిర్ధారణగా తెలుసుకొన్నాను. నువ్వు కూడా ఈ పాటికి గ్రహించే ఉండాలి ! నువ్వు విద్యాలాభాన్ని పొందలేకపోతున్నావు. అమూల్యమైన కాలాన్ని నష్టపోతున్నావు !”

“చిత్తం ! కాల నష్టం జరిగినా నేను విచారించను గురువు గారూ ! నాకు విద్య కావాలి !” పాణిని వినయంగా అన్నాడు.”నాకు తెలుసు పాణినీ ! వృధా కాలయాపనతో జీవితకాలం వ్యర్థం కాకూడదు ! విద్య ఉన్నా లేకున్నా మనిషి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి ! లోకంలోకి వెళ్ళు ! ఏదైనా వృత్తిని స్వీకరించి , జీవించు !” వర్షాచార్యుడు సానుభూతితో అన్నాడు.

“గురువుగారూ…” పాణిని కంఠస్వరంలో విచారం ధ్వనించింది.

“నీ కన్నా వయసులో చిన్నవాళ్లైన విద్యార్థుల అవహేళనకు నువ్వు అనుక్షణమూ గురి అవుతున్నావు. నిన్ను విద్యావంతుడిని చేయలేకపోతున్నానన్న అపఖ్యాతికి నేనూ గురి అవుతున్నాను. చేయగలిగిన పనిని చేస్తూ , జీవించు ! నా గురుకుల వాసం నుండి రేపే నిన్ను విడుదల చేస్తున్నాను !” వర్షాచార్యుడు తన నిర్ణయాన్ని వెల్లడించి , అవతలకి నడిచాడు. తన కళ్ళను కప్పేస్తున్న కన్నీటి తెరల గుండా పాణిని , కక్ష్యలోంచీ వెళ్ళిపోతున్న గురువుగారిని చూస్తూ ఉండిపోయాడు.

“స్వామీ ! పాణినిని వెళ్ళిపొమ్మంటూంటే నేను విన్నాను. కడుపున పుట్టిన పుత్రుడికన్నా మిన్నగా పాణిని మనిద్దర్నీ గౌరవిస్తున్నాడు. ఆరాధిస్తున్నాడు ! మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు కదా ?” వర్షాచార్యుల సతీమణి ఆ నాటి రాత్రి భర్తతో అంది.

“నిరక్షరకుక్షిగా జీవించేలా ఆ బ్రహ్మ పాణిని నుదుటి మీద రాసినట్టున్నాడు. వాడికి విద్యను గ్రహించే శక్తి లేదు. గ్రహించిన విద్యను మేధస్సులో నిక్షిప్తం చేసుకునే శక్తీ లేదు. అను నిత్యమూ పాణినిని అవహేళన చేసే సహపాఠుల మీదా , ఎంత బోధించినా అందిపుచ్చుకోలేని పాణిని మీదా నాకు ఆగ్రహం కలుగుతూనే ఉంది. అది వాంఛనీయం కాదు ! రేపు భోజనం పెట్టి , కొంత దారి బత్తెం ఇచ్చి పాణిని పంపించివేయి !” వర్షాచార్యుడు నిష్కర్షగా అన్నాడు. సూర్యోదయం అయింది. వర్షాచార్యులు విద్యార్థులకు పాఠం చెప్తున్నారు. పాణిని నెమ్మదిగా ఆయన్ను సమీపించాడు. విచార భారంతో ఆయనకు కడసారి పాదాభివందనం చేశాడు.

“విచారించకు నాయనా ! శరీర పోషణ ప్రాథమిక కర్తవ్యం. ఏది సాధించాలన్నా మనిషికి ఉన్న సాధనం శరీరమే. విద్య మీద మమకారాన్ని విసర్జించి , ఏదైనా స్వయం ఉపాధి చూసుకో ! సుఖీభవ !” వర్షాచార్యులు దీవించారు.నీళ్ళు నిండుతున్న కళ్ళతో సహవిద్యార్థులకు మౌనంగా వీడ్కోలు పలికి , పాణిని గురుపత్ని ఉండే ఆశ్రమ అంతర్భాగం వైపు అడుగులు వేశాడు.

అశ్రుధారలతో తన పాదాలను తడుపుతున్న పాణినిని గురుపత్ని రెండు చేతులతో లేవనెత్తి , వాత్సల్యంతో అతని కళ్ళల్లోకి చూసింది. చెమ్మగిల్లుతున్న తన నేత్రాలను నిర్లక్ష్యం చేస్తూ , పాణిని కన్నీటిని ప్రేమగా తుడిచింది. “నాయనా ! గురువుగారి నిర్ణయాన్ని అపార్థం చేసుకోవద్దు. చదువు నేర్చుకోవడంలో అశక్తత నీది. నేర్పించడంలో అశక్తత నా పతి దేవులది !” అందామె ఓదార్పుగా.

“వర్షాచార్య మహోపాధ్యాయులు అనుగ్రహించలేకపోతే , ఇంకెవరు నాకు విద్య అనుగ్రహించగలరు మాతా ?” పాణిని దుఃఖాన్ని దిగమింగుతూ అన్నాడు. “వర్షాచార్య మహోపాధ్యాయులను మించిన మహా మహోపాధ్యాయుడు ఉన్నాడు , పాణినీ !” గురుపత్ని చిరునవ్వుతో అంది.

“మాతా !”

“నాలుగు వేదాలూ ; శిక్ష , వ్యాకరణమూ , ఛందస్సూ , నిరుక్తమూ , జ్యోతిషమూ , కల్పమూ అనబడే ఆరు అంగాలూ ; మీమాంస , న్యాయ , శబ్దశాస్త్రాలూ , పురాణమూ , ధర్మశాస్త్రమూ , ఆయుర్వేదమూ , ధనుర్వేదమూ , అర్థశాస్త్రమూ – అనే అష్టాదశ విద్యలనూ నిర్మించిన విశ్వగురువు ఉన్నాడు. పాణినీ ! ఆ విశ్వగురువు ఎవరో కాదు పరమశివుడు ! హిమాలయ ప్రాంతానికి వెళ్ళు ! తపస్సు చేసి , ఆ జగద్గురువును ప్రసన్నం చేసుకో ! విద్యను వరంగా అర్ధించు !”

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment