బుధగ్రహ మహిమ – రెండవ భాగము
“అమ్మా” పాణిని గద్గదకంఠంతో అన్నాడు. “నిజమా ?!”
“వెళ్ళు పాణినీ ! పరమేశ్వరుడి కటాక్షం ప్రాప్తిస్తుంది !” గురుపత్ని గంభీరంగా అంది. “ప్రణవ పూర్వకంగా పంచాక్షరీ మంత్రాన్ని జపించు ! తదేక దీక్షతో తపించు !”
పాణిని కన్నీళ్ళు తుడుచుకున్నాడు. రెండు చేతుల్తో గురుపత్ని పాదాలు స్పృశించాడు. “మాతా ! విద్య అనే ఐశ్వర్యాన్ని మూటగట్టుకుని తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకుంటాను !”
“విజయోస్తు !” గురుపత్ని పాణిని తల మీద చెయ్యి పెట్టి దీవిస్తూ అంది. హిమాలయ పర్వత సమీపంలో పాణిని తపస్సు సాగుతోంది. తదేక దీక్షతో ప్రణవ సహితంగా పంచాక్షరీ మంత్రాన్ని అంతరంగంలో జపిస్తూ , అన్నపానీయాలు మరిచిపోయి తపస్సు చేస్తున్న పాణిని చుట్టూ మంచు గడ్డ కట్టుతోంది.
కాలం తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. గడ్డకట్టిన మంచు కరిగి , కాలువలు కట్టింది. పాణిని ఆ మార్పులు గమనించే స్థితిలో లేడు !
“పాణినీ !” మేఘ గర్జనలా ధ్వనిస్తూ పిలిచింది గంభీర కంఠం. పాణిని కనురెప్పలు మెల్లగా కదిలి , విచ్చుకున్నాయి. ఎదురుగా పరమశివుడి కమనీయ రూపం లీలగా ప్రత్యక్షమైంది.
“పరమేశ్వరా ! మహదేవా ! విశ్వగురుదేవా ! విద్య ! విద్య ! విద్యను ప్రసాదించు !” పాణిని కంఠం వణికింది.
“పాణినీ ! ఒక అడ్డు ఉంది ! అది తొలగిపోతే గానీ , నేను నీకు విద్యాదానం చేయలేను…” పరమశివుడు సానుభూతితో అన్నాడు.
“స్వామి…”
“ఆ అడ్డంకి ఏమిటో తెలుసా ?” పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు. “బుధుడి అశుభ దృష్టి ! నవగ్రహాలలో చతుర్ధ గ్రహ దేవత అయిన బుధుడు నిన్ను వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఆ వక్రదృష్టి సక్రమ దృష్టిగా , శుభవీక్షణగా పరివర్తన చెందాలి…”
“స్వామీ…” పాణిని ఏదో విన్నవించే ప్రయత్నం చేశాడు.
శివుడు చెయ్యెత్తి వారించాడు. “నీ సందేహం నాకు తెలుసు ! దేవతలలో ఎవరి అధికారం వారిదే ! ఎవరి కారకశక్తి వారిదే ! బుధుడి అశుభదృష్టిని , నేను శుభదృష్టిగా మార్చను ; మార్చకూడదు. మొదట బుధుణ్ణి ప్రసన్నం చేసుకో. అతని శుభదృష్టిని సంపాదించు ! బుధుడు చూస్తే , నేను చదువు ఇస్తాను !”
పాణిని పరమశివుడి పాదాల ముందు సాగిల పడ్డాడు.
“ఆజ్ఞ !”
“బుధగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు !” పరమశివుడు దీవించి , అంతర్థానమయ్యాడు.
“అష్టాదశ విద్యాప్రదాత ఆజ్ఞ మేరకు పాణిని అక్కడే , అప్పుడే బుధుడి గురించి తపస్సు ప్రారంభించాడు. ఏకాగ్రతతో సాగిన పాణిని దీక్ష కఠోర స్థాయికి చేరుకుంది. బుధుడు అతడి ముందు సాక్షాత్కరించాడు. కన్నీళ్ళు కారుస్తూ కాతర స్వరంతో పాణిని తన మీద శుభదృష్టిని ప్రసాదించమని బుధుణ్ణి ప్రార్ధించాడు.
“పాణినీ ! పూర్వజన్మ కర్మఫలంగా నీ మీద నా దృష్టి వక్రంగా ప్రసరించింది. నీ ప్రార్ధన ఫలించింది. నీకు సకల విద్యలూ లభిస్తాయి. ఆ పరమశివుడే నీకు పరమగురువు !” బుధుడు సౌమ్యంగా అన్నాడు.
“ధన్యుణ్ణి స్వామీ !”
“శుభం భూయాత్ ! అభవుణ్ణి ఆరాధించు !” అంటూ బుధుడు అంతర్థానమయ్యాడు.
ఇనుమడించిన ఉత్సాహంతో , అఖండ విశ్వాసంతో పాణిని మానసిక శివారాధన కొనసాగించాడు. అచిరకాలంలో ఒక ప్రశాంత సంధ్యా సమయాన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు.
“పరమేశ్వరా ! విద్యాదానం అర్థిస్తున్నాను !” పాణిని దోసిలి పెట్టి వినయంగా అన్నాడు.
“పాణినీ ! మా ఢమరుక నాదాన్ని ఏకాగ్రతతో ఆలకించు ! ఆ శబ్దాలను నీ మేథస్సులో నిక్షిప్తం చేసుకో !” పరమశివుడు గంభీరంగా అన్నాడు.
మరుక్షణం పరమేశ్వరుడి చేయి కదిలింది. ఆ ప్రశాంత ప్రభాత వాతావరణంలో పరమశివుడి ఢమరుక నాదం హిమపర్వత సానువులలో మారుమ్రోగింది. అవసరమైన విరామాలతో ఢమరుకం చతుర్దశ పర్యాయాలు మ్రోగి విభిన్నమైన శబ్దాల్ని సృష్టించింది. ఢమరుక నాదానికి అనుగుణంగా అక్షరానంద తాండవం చేస్తున్న పరమేశ్వరుడి పాదనూపురాలు సవ్వడిచేశాయి.
ఆనంద నర్తనను ఆపి అభవుడు చిరునవ్వులు చిందిస్తూ చూశాడు. “పాణినీ ! ఢమరుక నాదాలనూ , నూపురాల శబ్దాలనూ ఆలకించావు కద ! మా ఢమరుకం పలికించిన శబ్దాలకు అర్థాలే నూపుర ధ్వనులు !”
“పరమేశ్వరా ! దివ్య ఢమరుక శబ్దాలను పదునాలుగింటినీ పదునాలుగు ”మాహేశ్వర సూత్రాలుగా” స్వీకరిస్తున్నాను. అందుకు అనుమతి అర్థిస్తున్నాను !” రోమాంచంతో స్పందించిన శరీరాన్ని అదుపులో ఉంచుకుంటూ ప్రార్థించాడు పాణిని.
“తథాస్తు !” శివుడు చెయ్యెత్తి దీవించాడు.
“మహాదేవా ! చతుర్దశ మహేశ్వర సూత్రాల ప్రాతిపదికతో వ్యాకరణ శాస్త్రాన్ని నిర్మిస్తాను !” పాణిని ఆవేశంతో అన్నాడు.
“దివ్యమైన ఆలోచన ! శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో , భాషకు వ్యాకరణం అంత ముఖ్యం ! నువ్వు రచించబోయే భాషా శాస్త్రానికి ”పాణినీయం” అనే నామధేయాన్ని ప్రసాదిస్తున్నాను !”
“ధన్యుణ్ణి దేవా ! ధన్యుణ్ణి ! మీ అష్టమూర్తి తత్వాన్ని గుర్తుంచుకుని , అష్ట అధ్యాయాలతో ఆ గ్రంథాన్ని రూపొందిస్తాను !”
“సంకల్ప సిద్ధిరస్తు !” పరమశివుడు చెయ్యెత్తి దీవించాడు. “కాలాంతరంలో నువ్వు మా ఆస్థానంలో ”పార్షదుడు”గా ఉండగలవు !”
నిర్వికల్పానంద శిష్యుల్ని కలయజూశాడు. “పరమశివుడు ఢమరుక శబ్దాలతో అనుగ్రహించిన ”ప్రత్యాహార సూత్రాలు” అనబడే పధ్నాలుగు మాహేశ్వర సూత్రాల ఆధారంతో ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు పాణిని. అధ్యాయాల సంఖ్య కారణంగా పాణినీయ వ్యాకరణం ”అష్టాధ్యాయి” అని కూడా ప్రసిద్ధి చెందింది. ఎనిమిది అధ్యాయాలలో సుమారు నాలుగు వేల వ్యాకరణ సూత్రాలను సృష్టించాడు పాణిని. సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమైన పతంజలి మహర్షి పాణినీయ వ్యాకరణ గ్రంథానికి భాష్యం రచించి దానికి ”మహాభాష్యం” అనే మహత్తర నామ ధేయం నిర్ణయించాడు.
“శివానుగ్రహం పొంది తిరిగి వచ్చిన పాణినిని గురువు వర్షాచార్యుడూ , గురుపత్నీ హృదయపూర్వకంగా అభినందించారు. బుధగ్రహ అనుగ్రహం శివానుగ్రహానికి మార్గాన్ని నిర్మించిందని వివరించాడు పాణిని. కాలాంతరంలో పాణిని మహాశయుడు కైలాస మందిరంలో భృంగి , భృంగిరిటీ , నంది మొదలైన ప్రమథ ప్రముఖులతో బాటు శివుడి కొలువులో సభ్యుడుగా ఉండిపోయాడు ! మహాభాష్యం వ్రాసిన పతంజలి కూడా మహా సర్పరూపంలో మానవ శిరస్సుతో కైలాసవాసుడి కొలువు కూటంలో పాణిని సన్నిహితుడుగా రాణించాడు. పాణిని చరిత్ర ద్వారా మనం బుధగ్రహ మహిమను తెలుసుకున్నాం !” అంటూ ముగించాడు నిర్వికల్పానంద.
రేపటి నుండి గురు గ్రహ మహిమ ప్రారంభం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹