Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట నలబై నాల్గవ అధ్యాయం

గురుగ్రహ మహిమ – మొదటి భాగము

“దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభమ్ !

బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ !!”

గురువు నిర్వికల్పానందను అనుసరిస్తూ శిష్యులు కంఠస్వరాలు కలిపి , బృహస్పతి స్తోత్రం పఠించారు. నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు…

“వేదవేదాంత జ్ఞానాన్నీ భక్తి శ్రద్ధలనూ , కీర్తిగౌరవాలనూ , విద్యాపాండిత్యాలనూ , సంతానాన్నీ , సంపదనూ కలిగించే గ్రహదేవుడు ”గురువు” అనే బృహస్పతి. ఆయనను ప్రసన్నం చేసుకోవడం ద్వారా పాండితీ వైభవాన్నీ , కీర్తిప్రతిష్ఠలనూ , సంపదనూ పొందిన వ్యక్తి కథను ఉదాహరణగా చెప్పుకుందాం…”

“గురుగ్రహ అనుగ్రహంతో బహుముఖంగా లాభాలు పొందిన ఆ అదృష్టవంతుడు ఎవరు గురువుగారూ ?” సదానందుడు కుతూహలాన్ని అదుపులో పెట్టుకోలేకపోతూ ప్రశ్నించాడు.

“సంస్కృత మహాకవి ”భారవి” పేరు విన్నారా ?” నిర్వికల్పానంద ప్రశ్నించాడు. “ఆయన గురించీ , ఆయన రచించిన ”కిరాతార్జునీయం” గురించీ విని ఉన్నాం , గురువుగారూ !” శివానందుడు అన్నాడు.

“సంస్కృతంలోని పంచ మహాకావ్యాలలో ”కిరాతార్జునీయం” ఒకటి. కాళిదాస మహాకవి రచించిన రఘువంశమూ , కుమారసంభవమూ , శ్రీహర్షుని నైషధ కావ్యం , మాఘ మహాకవి ”శిశుపాలవధ” అనేవి పంచకావ్యాలలోని ఇతర నాలుగు కావ్యాలూ ! భారవి ”కిరాతార్జునీయం” ఎంత గొప్ప కావ్యమంటే ”బృహతీయి”గా వ్యవహరించ బడుతున్న విశిష్ట కావ్యత్రయంలో కూడా దానికి సముచిత స్థానం లభించింది…”

“బృహతీయిలోని మిగతా రెండు కావ్యాలూ ఏవి , గురువు గారూ ?” విమలా నందుడు అడిగాడు.

“ఒకటి శ్రీహర్షుని ”నైషధీయ చరిత” , రెండవది మాఘమహాకవి ”శిశుపాలవధ”. మరొక విశేషత ఏమిటంటే – ఉపమాలంకారానికి కాళిదాస మహాకవి పెట్టింది పేరైతే , అర్థ గౌరవానికి భారవి పెట్టింది పేరు ! భారవిలో కవితాశక్తి బాల్యంలోనే వికసించింది. వికసించిన ఆ శక్తి , యువకుడయ్యే సరికి పరిమళాలు వెదజల్లసాగింది. యువకవి భారవిని పండితులందరూ మెచ్చుకోసాగారు ! భారవి తండ్రిగారైన నారాయణ స్వామి ముందు అతన్ని ఎంతో ప్రశంసిస్తూ , “భారవిలాంటి కొడుకుని కన్న ఆయన జీవితం ధన్యమైంది” అనేవారు. “వాడింకా కుర్రవాడు ! కవిత్వం వాడికేం తెలుసు ? పాండిత్యం వాడికెక్కడిది ? మీరు అనవసరంగా మావాణ్ణి ప్రశంసిస్తున్నారు ! ఇంకా ఎంతో నేర్చుకోవాలి వాడు !” అనేవాడు , నారాయణస్వామి భారవిని తక్కువ చేస్తూ.

“పండితుల ప్రశంసలకు ఆనందించే భారవి తండ్రిగారి విమర్శను తట్టుకోలేక పోయేవాడు. ప్రశంసలు ఎక్కువయ్యే కొద్దీ తండ్రి విమర్శలూ ఎక్కువవుతూ వచ్చాయి. నలుగురి ముందూ తండ్రి తనను హీనంగా చిన్నబుచ్చడాన్ని భరించలేకపోయేవాడు భారవి , అతనిలోని యువరక్తం తెర్లిపోసాగింది. కన్నకొడుకును చిన్నబుచ్చే తండ్రికి జీవించే అర్హతలేదనుకున్నాడు భారవి. తండ్రిని హత్య చేయడానికి పథకం వేశాడు. బరువైన బండరాయిని తీసుకుని తండ్రి పడుకునే మంచం మీద ఉన్న ఆటక పైకి ఎక్కి , దాక్కున్నాడు. శిలాప్రవహారంతో తండ్రి తల పగలకొట్టి , కపాలమోక్షం ప్రసాదించి , సాగనంపాలి ! రాత్రి అయింది. తండ్రి పడుకోడానికి మంచం మీదికి చేరాడు. అప్పుడు సతీమణి ఆయనను సమీపించింది…”

“మీ పద్ధతి నాకు నచ్చలేదు…” అంది భారవి తల్లి , తన భర్తతో. “నా పద్ధతా ? ఏ పద్ధతి ? అర్థమయ్యేలా చెప్పు !” నారాయణస్వామి నవ్వుతూ అన్నాడు.

“లోకమంతా మన భారవిని ”మహాకవి , మహాకవి” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతోంది ! పండితుల ప్రశంసలు విని ఆనందించడానికి మారుగా మీరేమో ”వాడికేం తెలీదు , వాడికేం తెలీదు ! మెచ్చుకోకండి !” అంటూ వాణ్ణి తక్కువ చేస్తున్నారు ! భారవి , పాపం లోపల్లోపలే ఎంత బాధపడుతున్నాడో తెలుసా , మీకు ?”

భార్య మాటలు విని నారాయణపండితుడు గొల్లున నవ్వాడు.

“అదా , నీ బాధ ? పిచ్చిదానా , పొగడ్త ఒక మత్తు మందు ! ఆ మత్తు తలకెక్కితే అభివృద్ధి అక్కడితో ఆగీపోతుంది. అహంకారం పడగలు విప్పుతుంది. పాండిత్యం పక్కదారిపడుతుంది. మన బిడ్డడు ఇంకా ఇంకా ఇంకా ఎదగాలి. భారవి మహాకవి కావాలి. సాహితీ గగనంలో కవిలాగా వెలిగిపోవాలి నా కొడుకు ! అందుకే విస్తరిస్తున్న భారవి కవితా పక్షాన్ని పరిమితిలో బంధించే పొగడ్తలు అనే ముళ్ళకంచెను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వస్తున్నాను…”

“అలాగా , స్వామీ ?!”

“మరేమనుకున్నావు ? నా భారవిని జనం మెచ్చుకుంటూ ఉంటే నా హృదయంలో గర్వం ఆనందతాండవం చేస్తుంది. ఆ ఆనందాన్ని దిగమింగుతూ ఉంటాను వాడి అభివృద్ధి కోసం ! భారవి కవి. వాడు మహాకవి కావాలి ! భారవి పండితుడు. వాడు మహాపండితుడు కావాలి ! అవుతాడు అచిరకాలంలో !”

“ఎంత గొప్ప మనసు స్వామీ మీది !”

“నా పుత్రుడు గొప్పవాడు కావాలన్న ఆశయమే నాకు ఆ గొప్ప మనసును ఇచ్చింది ! వాడు ప్రశంసలకూ , విమర్శలకూ అతీతుడైన అసామాన్యుడవుతాడు !”

“స్వామీ ! నాకెంత ఆనందంగా ఉందో తెలుసా , స్వామీ ?”

“తెలుస్తోందిగా ! నీ ఆనందాశ్రువులు చెప్తున్నాయిగా !” నారాయణ పండితుడు నవ్వుతూ అన్నాడు. తల్లిదండ్రులిద్దరినీ నివ్వెరపాటుకు గురిచేస్తూ భారవి అటక మీద నుంచి కిందికి దూకాడు. తండ్రి పాదాల మీద వాలిపోయి , వెక్కి వెక్కి ఏడ్చాడు.

“నాన్నా ! తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేని , కవిహృదయం నాది ! అహంకరించి , అపార్థం చేసుకునే అథమ హృదయం నాది ! మీ విమర్శను తప్పుగా అర్థం చేసుకున్నాను. అటక మీద ఎక్కించిన రాతిని మీ తల మీద పడవేసి హత్య చేయాలనుకున్నాను…”

“భారవీ !”

“ఔను ! ఇతరుల పొగడ్తలు నా కళ్ళని అహంకార మలినంతో కప్పేశాయి ! నన్ను క్షమించండి !”

“తప్పు తెలుసుకున్నావుగా , నాయనా ! నాన్నగారు నిన్ను క్షమిస్తారు లే !” తల్లి కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది , కొడుకును లేవనెత్తుతూ.

“కేవలం క్షమించడం కాదమ్మా ! నాన్నగారు నన్ను మొదట శిక్షించాలి ; ఆ తరువాత క్షమించాలి !” భారవి ఆవేశంతో అంటూ తండ్రి వైపు తిరిగాడు. “నాన్నా , కన్న తండ్రిని కడతేర్చబోయిన ఈ కఠినాత్ముడికి తగిన శిక్ష విధించండి !”

“స్వామీ !” భారవి తల్లి అయోమయంగా భర్త వైపు చూస్తూ అంది.

“పాపానికి ప్రాయశ్చిత్తం , అపరాధానికి శిక్షా అవసరం ! అది న్యాయం ! అది ధర్మం ! భారవికి తగిన శిక్ష విధిస్తాను !” నారాయణ పండితుడు గంభీరంగా అన్నాడు. “అపచారం చేసినందుకు అనుభవించే శిక్ష అపరాధ భావనను తొలగిస్తుంది !”

“మీ ఇష్టం!” భారవి తల్లి బలహీనంగా అంది. “భారవీ ! నీ అపచారానికి తగిన శిక్ష ఆరునెలల పాటు అత్తవారింట నివాసం ! రేపే సతీసమేతంగా నీ అత్తవారింటికి వెళ్ళు !” నారాయణ పండితుడు గంభీరంగా అన్నాడు. భారవి తల్లి తేలికగా నిట్టూర్చింది. భారవి వినయంగా తండ్రికి పాదాభివందనం చేశాడు.

అత్తగారూ , మామగారూ భారవిని సాదరంగా ఆహ్వానించారు. అల్లుడినీ , కూతుర్నీ చూచి , ఆనందంలో మునిగిపోయారు. అయితే ఆ ఆదరణా , ఆనందం కొన్ని రోజలు మాత్రమే ! అల్లుడు ఆరునెలలు ఉండబోతున్నాడని కూతురి ద్వారా తెలిసిన మరుక్షణం వాళ్ళ ఆదరణా , ఆనందం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయి.

ఆ ఇంట్లో భారవికి లభించిన గౌరవమర్యాదలు క్రమంగా కరిగిపోసాగేయి. నిరాదరణ మోసులెత్త సాగింది. క్రమంగా అత్తవారింటి ఆవాసం భారవికి నరకప్రాయంగా మారిపోయింది. అవమానాలూ , అవహేళనలూ భారవి పాలిట నిత్యార్చనగా పరిణమించాయి. కారాగారవాసం కన్నా కఠినతరమైన శిక్షే విధించాడు తన తండ్రి అని అచిరకాలంలో అర్థమైపోయింది భారవికి ! తండ్రిగారి జీవితానుభవం భారవిని ఆశ్చర్యంలో పడవేసింది. అల్లుళ్ళకు తాత్కాలికంగా స్వర్గధామంలా ఉండే అత్తవారిళ్ళు , కాలక్రమాన నరకకూపాలవుతాయన్న నగ్నసత్యాన్ని దర్శించగలిగాడు భారవి. తండ్రిగారు తనకు తగిన శిక్షే విధించాడు !

ఒకరోజు మామగారు భారవిని పిలిచారు. “చూడునాయనా ! ఉద్యోగం పురుషలక్షణం అన్నారు. అంటే మగవాడై జన్మ ఎత్తాక ఏదో వృత్తి చేపట్టాలి. ఏదో పనిచేయాలి. పీకలదాకా మెక్కి , తిన్న తిండిని అరగదీస్తూ కూర్చోవడం మగజాతి లక్షణం కాదు , కారాదు !”

“మామగారూ !”

“ఆగ్రహమొస్తోందా ? ఆగ్రహాన్ని , ఆత్మాభిమానాన్నీ చంపుకునే కదా , అత్తవారింటికి దయచేశావు ! ఏదో పనిచేసి , తిన్న తిండి ఋణం తీర్చుకోవయ్యా !”

“నాన్నా…” అప్పుడే అక్కడికి వచ్చిన భారవి పత్ని తండ్రిని వారిస్తూ అంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment