Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ముప్పై ఐదవ అధ్యాయం

గారుడీ విద్య, గరుడ దేవుని విరాట్ స్వరూపం

ధన్వంతరి ఈ విద్యను శుశ్రుతునకు ఉపదేశించాడని సూతుడు శౌనకాది మహా మునులకీ విధంగా బోధించసాగాడు. “గరుత్మంతుడే స్వయంగా కశ్యపునికి ఉపదేశించిన మహావిషయమిది. ఈ విద్య సర్వవిషాపహారకం.

లోకం పంచతత్త్వ నిర్మితము కదా! నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే ఈ పంచతత్త్వాలకి వేరువేరుగా మండలాలుంటాయి. ప్రతి మండలానికి అధిష్టాతృ దేవత, ఇతర దేవతలు. వారందరికీ వేర్వేరు మంత్రాలు కూడా వుంటాయి. ఈ మండలాధి పతులైన దేవతలను వారి వారి మంత్రాలతో యథావిధిగా న్యాస పూర్వకంగా పూజిస్తే సర్వత్రా మంచి ఫలితాలు రావడమే కాక విషాదుల నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది.

ఈ విద్యా సాధకుడు ముందుగా ఈ అయిదు మండలాల స్వరూపాలనూ వాటి అధిష్టాతృ దేవతలనూ విడివిడిగా ధ్యానించాలి. అవి ఇలా వుంటాయి.

పృథ్వీమండలం:- చతురస్రాకారం, సువిశాలం, చతుర్ముఖం, పసుపువర్ణం, ఇంద్ర దేవాధీనం.

వరుణమండలం:- పద్మాకారం, అర్ధ చంద్రయుక్తం, ఇంద్రనీల మణి వర్ణం, సౌమ్య స్వరూపం, స్వస్తికతో నున్నది, వరుణ దేవాధీనం.

అగ్నిమండలం:- త్రికోణాకృతి, జ్వాలా మాలలతో నిండి వుంటుంది. అగ్ని వర్ణం,అగ్ని దేవాధీనం.

వాయుమండలం:- వృత్తాకృతి, బిందుయుక్తం, వివిధ ఔషధాలను కాల్చి కాటుకరంగుతో చేయబడాలి. వాయుదేవాధీనం..

ఆకాశమండలం:- క్షీరసాగరంలో ఎగసి పడుతుండే కెరటాల ఆకృతి, శుద్ధస్ఫటిక వర్ణం, అమృత కిరణాలతో ప్రపంచాన్నే ప్లావితం చేయు చంద్రాధీనం.

ఇక ఏ మండలంలో ఏయే మహానాగాలుంటాయంటే:-

వాసుకి, శంఖపాల – పృథ్వీ

కర్కోటక, పద్మనాభ – జల

కులిక, తక్షక – అగ్ని

మహాపద్మ, పద్మ – వాయు

వీటినే అష్టమహానాగాలంటారు. సాధకుడు ఈ నాగాలను ధ్యానిస్తూ ఆయా మండలాలను స్పృశించాలి. అంగుష్టం నుండి చిటికెనవేలి దాకా అనులోమ, విలోమ రీతులలో ఈ వ్యాసాన్ని చేయాలి. వ్రేళ్ళ సందులలో జయవిజయా నామక శక్తులను కూడా ఇలాగే వ్యాసం చేయాలి.

మరల తన శరీరంలోనే శివషడంగ న్యాసాన్ని పంచతత్త్వ న్యాసాన్నీ వ్యాపక న్యాసాన్నీ చేయాలి. దేవత పేరుకి ముందు ”ఓం”కారాన్ని (చతుర్థీ విభక్తిలో పేరునీ) తరువాత ”నమః” ని ప్రయోగించి మంత్రాలను చదివి వారిని పూజించాలి.

దేవతల పేర్లలోని మొదటి అక్షరానికి కూడా మంత్రశక్తి వుంటుంది. అష్టనాగాల మంత్రాలు వాటి సన్నిధానాన్ని ప్రసాదించగలవు. పంచతత్వాలకు ఇందాకటి వలెనే ముందు ఓంకారాన్ని పెట్టి జపించినా చివర ”స్వాహా” నుంచి జపించాలి.

ఈ పేర్లన్నీ ఈ విధంగా జపిస్తే మంత్రాలైపోయి సాక్షాత్తు గరుడునితో సమానంగా సాధకుని అన్ని అభీష్టకర్మలనూ సిద్ధింప చేయగలవు..

స్వర వర్ణాలతో ముందు కరన్యాసాన్నీ తరువాత సర్వాంగ న్యాసాన్ని చేసుకోవాలి. తరువాత ఆత్మ శుద్ధికారకమైన ఉద్దీప్త ప్రాణశక్తి యొక్క చింతనం చేయాలి. పిమ్మట అమృతవర్షిణీ బీజాన్ని ధ్యానించాలి. ఇంతవఱకు చేసిన దానినే ఆప్యాయనమంటారు.

ఇప్పుడు మస్తిష్కంలో ఆత్మతత్త్వ చింతనం చేయాలి. ఇపుడు రెండు పాదాలనూ నేలపై పెట్టి స్వర్ణ సమాన కాంతులతో సమస్తలోకపాల సమన్వితమై అంతటా పఱచుకొనియున్న మహాదేవతయైన పృథ్విని న్యాసం చేయాలి.

బుద్ధిమంతుడైన సాధకుడెప్పుడూ నేలతల్లిని దేవతగానే చూస్తాడు. ఇప్పుడు తన సంపూర్ణ శరీరంతో పృథ్వీదేవికి న్యాసం చేయాలి. తరువాత మిగతా నాలుగు మండలాలనూ వాటిలోని దేవతలనూ న్యాసం చేయాలి. ఈ విధంగా పంచభూత తత్త్వాలకు న్యాసం చేసిన పిమ్మట అష్టనాగుల యొక్క వ్యాసధ్యానాలను చేయాలి.

తరువాత స్థావర, జంగమప్రాణులకు సోకిన విషాన్ని, విషదోషాన్నీ చిటికెలో పారద్రోలు గరుడ భగవానునీ పరమశివునీ ధ్యానించాలి. వారిద్దరికీ సాధకుడు దేహంతో న్యాసం చేయాలి.

పిమ్మట తనకి కావలసిన రూపాన్ని ధరించే శక్తి గలవాడైనా భయంకర రూపంలోనూ వుండేవాడు, మనస్సుపై విజయాన్ని ప్రాప్తింపచేయగలవాడు, ప్రపంచాన్నంతటినీ తనదైన రసంలో ముంచెత్తగలవాడు, సృష్టికీ సంహారానికి కారకుడు, తన ప్రకాశ పుంజాల ఉద్దీప్తత వల్ల ప్రపంచమంతటా వ్యాపించినవాడు, పది భుజాలతో నాలుగు ముఖాలతో, పింగళ వర్ణ నేత్రాలతో, భయంకరమైన దంతాలతో ప్రజ్వలిస్తూ శూలధారియై మూడు కనులతో నెలవంకతో శోభిల్లు గరుడ స్వరూపుడైన భైరవుని మనసుతో చూస్తూ ఆరాధిస్తూ పూజించాలి (చింతనం)..

ఆ పరమతత్త్వమే నాగులను నశింపచేసి లోకాలను కాపాడడం కోసం మహా భయంకరమైన గరుడ రూపాన్ని ధరించాడు. గరుడ దేవుని విరాడ్రూపంలో ఆయన రెండు పాదాలూ పాతాళ లోకంలోకి ఉండగా ఆయన రెక్కలు మొత్తం అన్ని లోకాలలోకీ వ్యాపించి వుంటాయి. ఏడు స్వర్గాలూ ఆయన వక్షఃస్థలం పైననే నిలచి వుంటాయి. బ్రహ్మాండమంతా ఆయన కంఠాన్నాశ్రయించి వుండగా ఎనిమిది దిక్కులూ ఆయన మస్తకంలో ఆరంభమై అంతమవుతాయి. ఈశ్వరుడు తన మూడు శక్తులతో సహా గరుత్మంతుని శిఖలో నివసిస్తాడు.

ఈ గరుడ భగవానుడే సాక్షాత్పరాత్పరుడైన శివుడు ఆయనే సమస్త భువన నాయకుడు. త్రినేత్రధారి, ఉగ్రరూపి, నాగవిష వినాశకుడు, సర్వలోక రక్షకుడు, భీషణ ముఖుడు, గరుడ మంత్రాధిదేవత, కాలాగ్ని వలె పరమ కాంతిమంతుడు, భక్తి పూర్వకంగా చింతనం చేసిన వారి సమస్త అభీష్ట కర్మలనూ సిద్ధింపచేయువాడునగు గరుత్మంతుని ఉపాసించు సాధకుడు కూడా ఆయన వలనే శక్తిమంతుడు కాగలడు. వానిని చూడగానే రాక్షసశక్తులూ, పీడాజనిత జ్వరాల పిశాచాదులు పారిపోతాయి.

నూట ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment