గురుగ్రహ మహిమ – రెండవ భాగము
“ఏం ? నీ భర్త పనిచెయ్యకూడదా ? టూగుటూయ్యాలలో ఊగాలా ?”
“అదికాదు , నాన్నా… ఆయనకి కాయకష్టం తెలీదు…”
“తెలీకపోతే తెలుసుకుంటాడు ! గేదెలూ , దున్నపోతులూ తెలుసుకుంటాయి ! మనిషి ఆ మాత్రం తెలుసుకోలేడా ?” భారవి అత్తగారు అతన్ని కొరకొరా చూస్తూ కూతురితో అంది.
“అమ్మా !”
తల్లి కూతుర్ని పట్టించుకోకుండా , భర్త వైపు తిరిగింది. “ఒక పని చేయండి ! మన పశువుల కాపరిని పనిమానిపించి , ఆ పనిని మీ అల్లుడిగారికి అప్పగించండి !”
“నీ అత్తగారి ఆలోచన బాగుందయ్యా ! పశువుల్ని కాసే పనిలో నీ కాయం కష్టపడాల్సిన పని లేదు. వెళ్ళు ! వెళ్ళి , దొడ్లోని ఆవుల్నీ , గేదెల్నీ బీడు భూముల్లోకి తీసుకెళ్ళు !” మామగారు ఉత్తర్వులిచ్చారు.
“నాన్నా !” భారవి భార్య కన్నీళ్ళు కారుస్తూ గద్గదకంఠంతో అంది.
“నీ పతిదేవుడు సూర్యోదయం నుండీ సూర్యాస్తమయం దాకా పశువుల్ని మేపుతూ ఉంటాడు. తిండికి ఇంటికి రాడు ! వండి , వార్చి అక్కడికే పట్టుకెళ్ళి వడ్డించు !” భారవి అత్తగారు కూతుర్ని చూస్తూ గర్జించింది. భారవి తలవాల్చుకుని గోశాలవైపు అడుగులు వేశాడు.
మండుటెండ ! పంట పొలాల్లోకి వెళ్ళకుండా పశువుల్ని బీడు భూమిలోకి మళ్ళిస్తూ చూసుకుంటున్నాడు కాపరిగా మారిపోయిన భారవి.
భార్య అన్నం తీసుకుని వచ్చింది. చేతులూ , కాళ్ళూ కడుక్కొని , చెట్టు నీడలో భోజనానికి కూర్చున్నాడు భారవి. మండుటెండలో మాడిపోయి , చెమటతో తడుస్తున్న భర్తను అశ్రునయనాలతో చూసింది భారవి పత్ని.
“మామగారు మీకు దుర్భరమూ , కఠినాతి కఠినమూ అయిన శిక్ష విధించారు…” అందామె అన్నం ముద్దను భారవి చేతిలో వేస్తూ.
“నేను చేసిన మహాపాపానికి మంచి ప్రాయశ్చిత్తం ఇది ! నాన్నగారు మేథావి ! ముందుగానే మందు రాసిన కత్తితో గాయం చేసినట్టు – ”శ్వశుర గృహవాస శిక్ష” విధించారు !” భారవి నవ్వుతూ అన్నాడు.
“మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండీ కవితా వ్యాసంగం మానివేశారు !”
“ఔను ! మానసికంగా ఏదో శూన్యంలో ఉన్నట్టుంది. ఆవేదనలోంచి కవిత్వం ఆవిర్భవిస్తుందంటారు. అత్తవారింట్లో అనుభవిస్తున్న ఆవేదనాభారాన్ని అక్షరబద్ధం చేయాలని అనిపించినా… చేయలేకపోతున్నాను ! కల్పనాశక్తి కరిగిపోయినట్లుంది !” భారవి బరువుగా నిట్టూర్చాడు.
“అత్తగారింటి ఆవాసం – అదే – శిక్షా కాలం పూర్తయ్యాక మనం సుఖంగా , సంతోషంగా జీవించాలి , స్వామీ ! సుఖ జీవనానికి అవసరమైన ధనాన్ని మీరు ఆర్జించాలి !”
భారవి తలను అడ్డంగా ఊపాడు. ” మానహానీ , ధనహానీ – రెండూ మనకు ఇప్పుడు ప్రాప్తించాయి !”
“స్వామీ ! మీకు ఇలా జరగడానికి కారణం ”గ్రహచారం” అంటున్నారు. నిజమేనా ?”
“ఎవరన్నారు ?”
“జ్యోతిష పండితుడన్నారు ! ఆయన మా నాన్నగారి కన్నా పెద్దవారు ! మీ జాతకంలో గురుగ్రహం నీచస్థానంలో ఉంటూ , వక్రదృష్టిని ప్రసరిస్తున్నాడట !”
భారవి నిట్టూర్చాడు. “నిజమే కావచ్చు ! నాలో పాండిత్యం నశించడానికీ , అపఖ్యాతి రావడానికీ అదే కారణం కావచ్చు !”
“ఏది ? గురుగ్రహ వక్ర వీక్షణా ?”
” ఔను…”
“స్వామీ ! గ్రహశాంతి చేసి , ఆరాధిస్తే గురుగ్రహ దేవుడు ప్రసన్నుడవుతాడని కూడా ఆ పండితుడు చెప్పాడు ! గురుగ్రహ ప్రసన్నతకు ప్రయత్నం చేస్తారా ?”.
“చేయను…”
“స్వామీ !”
“తండ్రిగారు విధించిన శిక్షను అనుభవించి తీరాలి !” భారవి నిష్కర్షగా అన్నాడు.
“స్వామీ ! మీ కోసం , మన భవిష్యత్తు కోసం నేను గురుగ్రహాన్ని ఆరాధిస్తాను. అనుమతిస్తారా ?” భారవి పత్ని ఆశగా అడిగింది.
“దైవారాధన చేస్తానంటే వద్దనగలనా ?” భారవి చిరునవ్వు నవ్వాడు.
అది అనురాధా నక్షత్రయుక్త గురువారం.
భారవి పత్ని ఆనాటి శుభముహూర్తాన గురుగ్రహ ఆరాధన సంకల్పించింది. రోజుకు 1008 పర్యాయాలు పందొమ్మిది రోజుల పాటు – గురుగ్రహ మూలమంత్రాన్ని జపించే విధానంతో దీక్ష ప్రారంభించింది.
భర్త పాండితీ ప్రకర్షపునః ప్రతిష్టితం కావలనీ, ఆయనకు కీర్తిప్రతిష్ఠలూ , సంపద లభించాలనీ సంకల్పించి ఏకదీక్షతో ప్రారంభించిన భారవి పత్ని గురుగ్రహారాధన నిరాటంకంగా సాగుతోంది. రోజులు గడుస్తున్నాయి.
పశువులను మేపుతున్న భర్తకు భోజనం తీసుకువెళ్ళింది ఒకనాడామె. సమీపించిన ధర్మపత్ని రాకను గమనించకుండా , భారవి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు.
“స్వామీ ! ఏమిటి అన్యమనస్కంగా ఉన్నారు ?” భార్య భారవిని ప్రశ్నించింది. భారవి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. మాట్లాడకుండా చెయ్యిపట్టుకుని , ఆమెను చెట్టునీడకు తీసుకెళ్ళాడు. భోజన పాత్రను కిందపెట్టి , ఆమె కూర్చుంది.
“సహసా విదధీత నక్రియాం అవివేకః పరమాపదాం పదమ్ !
వృణతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః !!”
భారవి రాగయుక్తంగా , భావస్ఫోరకంగా శ్లోకాన్ని పఠించాడు. చిరునవ్వుతో భార్యను చూశాడు.
“స్వామీ… ఈ శ్లోకం…” భార్య సందేహిస్తూ ఆగింది.
“నాదే !” భారవి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. ఎందుకో ఇవాళ సూర్యోదయం అయినప్పటి నుండీ ఒకదాని అనంతరం ఒకటిగా శ్లోకాలు నా మేధస్సులోంచి జిహ్వ మీదికి దొర్లుకుంటూ వస్తున్నాయి !”
“స్వామీ ! నేను చేసిన గురుగ్రహ ఆరాధన ఫలించింది. ఆ దేవ గురువు మీమీద శుభ దృష్టిని ప్రసరించాడు !” భారవి పత్ని ఉద్రేకంతో అంది. “పందొమ్మిది రోజుల ఆరాధన ఈ నాటితో పరిసమాప్తమైంది !”
“ఓం గురవేనమః” భారవి చేతులు జోడించి , భక్తితో నమస్కరించాడు , ఆకాశం వైపు.
“దేవీ ! ఈ శ్లోకం నా జీవితానుభవంలోంచి సహజంగా జన్మించింది. భావం ఏమిటో తెలుసా ? ”ఆలోచన అనేది లేకుండా , ఉన్నట్టుండి హఠాత్తుగా ఏ పనీ చేయకూడదు ! అవివేకమే అనర్ధాలకు మూలకారణం ! యోచన చేసి , కార్యం నిర్వహించే వ్యక్తి వద్దకు సంపద దానంతట అదే వస్తుంది !” – అనేదే భావం !”
“జీవితసత్యాన్ని చాటి చెప్తోంది, స్వామీ మీ శ్లోకం !”
“ఈ ఉదయం… “కిరాతార్జునీయం”అనే కావ్యాన్ని రచించాలని సంకల్పించాను. మానసికంగా రెండు “సర్గలు” పూర్తిచేశాను ! నువ్వు విన్న శ్లోకం ద్వితీయ సర్గలోనిదే !”
” గురువు” మనిద్దర్నీ కరుణించాడు !” భారవి భార్య ఆనందబాష్పాలు తుడుచుకుంటూ అంది.
“మన భావి జీవితానికి ధనం అవసరమన్నావు కద ! ఈ శ్లోకాన్ని తాళపత్రం మీద లిఖించి ఇస్తాను ! ఎవరో ఒక శ్రీమంతుడికి విక్రయించు !” భారవి అన్నాడు.
“అలాగే స్వామీ !”
నిర్వికల్పానంద శిష్యుల్ని సాభిప్రాయంగా చూశాడు.
“భారవి చెప్పినట్టుగానే ఆయన ధర్మపత్ని ఆ శ్లోకాన్ని ఒక శ్రీమంతుడైన వాణిజ్యవేత్తకు విక్రయించింది. శ్లోకంలోని అర్థగౌరవాన్ని గ్రహించిన ఆ శ్రీమంతుడు ఆమెకు పుష్కలంగా ధనం ఇచ్చాడు. ఆరు నెలలు గడిచిపోయాయి. భారవి సతీసమేతంగా స్వగృహానికి చేరుకున్నాడు. తాను విధించిన విచిత్రమైన ఆత్మన్యూనతకు కారణమైన శిక్షను అనుభవించి , తిరిగి వచ్చిన భారవిని తండ్రి ఆనందంగా దీవించాడు. తల్లి కొడుకుని అక్కున చేర్చుకుంది.”
“భారవి కిరాతార్జునీయ కావ్య రచనను సకాలంలో సమర్థవంతంగా పూర్తి చేశాడు. ఆ మహాకావ్యాన్ని చదివి , తండ్రి నారాయణ పండితుడు ఆనందంతో పులకించిపోయాడు. కుమారుడిని హృదయానికి హత్తుకుని మనసారా అభినందించాడు. భారవి తన పుత్రుడైనందుకు గర్విస్తున్నానన్నాడు. అచిరకాలంలో మహాకవిగా రూపొందినందుకు పండితులు ప్రశంసల వర్షం కురిపించారు. తనకు లభించిన పాండితీ వైభవానికీ , కీర్తిప్రతిష్ఠలకూ , సంసారానికి అవసరమైన సంపదకూ కారణం గురుగ్రహం ప్రసరించిన శుభవీక్షణమే అన్నాడు భారవి.”
“ఆ విధంగా ఏకోన్ముఖంగా సాగిన గురుగ్రహ ఆరాధన త్రిముఖ ఫలితాన్ని అందించింది. సాహిత్యాకాశంలో భారవి ధ్రువతారగా విలసిల్లాడు ! నేటికీ విలసిల్లుతున్నాడు !” నిర్వికల్పానంద ‘గురుగ్రహ మహిమ’ కథనాన్ని ముగించాడు.
రేపటి నుండి శుక్రగ్రహ మహిమ ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹