Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం

ధర్మసారం

“ఇది బ్రహ్మశంకరునికి బోధించినది” అంటూ సూతుడు మహామునులకిలా చెప్పసాగాడు. “శంకరా! అన్ని పాపాలనూ అగ్నిలో తోసేదీ, ”ఇక్కడ” భోగాన్నీ, ”అక్కడ” మోక్షాన్నీ నరులకు కలిగించేదీ, చీకటి మనసును వెలిగించేదీ అగు అతిశయ సూక్ష్మమైన ధర్మసారాన్ని సంక్షిప్తంగా అందిస్తాను, వినండి.

శోకం మనిషికి అన్నిటికన్న పెద్ద శత్రువులలో నొకటి. అది శాస్త్రీయ జ్ఞానాన్నీ, ధర్మాన్నీ, బలాన్నీ, ధైర్యాన్నీ, సుఖాన్నీ, ఉత్సాహాన్నీ మంటగలిపేస్తుంది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఏడువరాదు.మనిషికి కర్మయే సర్వస్వము. అదే స్త్రీ, అదే లోకం, అదే బంధువు, అదే సుఖ, దుఃఖాలకు కారణము కాబట్టి ఉత్తమ కర్మలను మాత్రమే చేపట్టి సుఖించాలి. ధర్మాలలో పరమధర్మం దానమే.

దానమేవ పరో ధర్మో దానాత్సర్వమవాప్యతే ||

దానాత్ స్వర్గశ్చ రాజ్యంచ దద్యాద్దానం తతో నరః ||

దానం వల్లనే మనిషికి అన్ని కోరికలూ తీరగలవు. దానమే స్వర్గాన్నీ రాజ్యాన్నీ కూడా ప్రదానం చేయగలదు. కావున ఎవరి పరిధిలో వారు, దానం మాత్రం చేస్తుండాలి. విధిపూర్వక ప్రశస్త దక్షిణగా నిచ్చు దానము భయభీతుడైన వాని ప్రాణ రక్షణము అ రెండూ సమానమే. విధ్యుక్తమైన తపస్సు, బ్రహ్మచర్యం, వివిధ యజ్ఞాలు, స్నానాలు – వీటివల్ల ఎంత పుణ్యం వస్తుందో భయభీతులైన వారి ప్రాణ రక్షణ వల్ల అంత పుణ్యం వస్తుంది. హోమ, జప, స్నాన, దేవతార్చనాది సత్కార్య తత్పరులై సత్య, క్షమ, దయాది సద్గుణాలతో జీవించేవారు స్వర్గప్రాప్తి నొందుతారు.

యే చ హోమజప స్నానదేవతార్చన తత్పరాః ||

సత్యక్షమా దయాయుక్తా స్తేనరాః స్వర్గగా మినః ||

మానవమాత్రులెవరూ మరొకరిని సుఖపెట్టడానికి గాని బాధపెట్టడానికి గాని శక్తి గలవారు కానేరరు. అలాగే ఇతరులు సుఖదుఃఖాలను తాము తీసుకుని తమ సుఖదుఃభాలను వారికిచ్చుటకూ సమర్థులుకారు. ఎవరి కర్మను వారనుభవించడంలో భాగమే వారికి కలిగే సుఖదుఃఖాలు.

నదాతా సుఖదుఃఖానాం నచ హర్తాస్తి కశ్చన ||

భుంజతే స్వకృంతాన్యేవ దుఃఖానిచ సుఖానిచ ||

ధర్మరక్షణ కోసం తన జీవితాన్నే దానం చేసినవాడు అన్ని కష్టాలనూ దాటుకొని పోగలడు. ఎవని మనసైతే నిత్యసంతుష్టమై వుంటుందో అతడు ఫల, మూల, శాకాదులనే తింటూ కూడా సుఖానుభూతినొందగలడు.

ధర్మార్ధం జీవితం యేషాం దుర్గాణ్యతి తరంతి తే ॥

సంతుష్టః కోన శక్నోతి ఫలమూలైశ్చ వర్తితుం॥

సుఖాన్ని కోరుకుంటూ దానికోసం లంపటం నెత్తికెక్కించుకొని సంకటంలో పడతారు సామాన్యజనం. ఇది లోభం పరిణామమే. ఈ లోభం ఒకసారి మనసులో దూరితే ఇక అంతే. మనిషి బతుకు జారుడు మెట్లమీద పడ్డట్లే. ఇక దాని నుండి క్రోధం హింసా ప్రవృత్తి, మోహం,మాయ, గీర, ఈసు, రాగద్వేషాలు, అసత్య భాషణం, మిథ్యాచరణం ఇవన్నీ పుట్టుకొస్తాయి. కాబట్టి లోభాన్ని వదలుకుంటే పాపాన్ని వదులుకున్నట్టే. లోభి కానివాడే దేహాంతంలో స్వర్గగామి కాగలడు. హే మహాదేవా! ధార్మికులను దేవతలు, మునులు, నాగులు, గంధర్వులు, గుహ్యక గణాలూ కూడా గౌరవిస్తారు, పూజిస్తారు. ధనాఢ్యుడు, కాముకుడునగు వానిని నరులే పూజింపరు..

దేవతామునయో నాగా గంధర్వా గుహ్యకా హర ||

ధార్మికం పూజయంతీ హ న ధనాధ్యం న కామినం ||

ఎవరైనా (ఇతరులు) తమ అనంత బల వీర్య ప్రజ్ఞా పౌరుషాలను సాధనాలుగా ఆయుధాలనుగా వాడుకొని గొప్ప ఫలాన్ని పొందినపుడు ఎవరూ ఈర్ష్యపడరాదు. ఏడ్చుకోరాదు. అన్ని ప్రాణుల పట్ల దయాభావమును పెంచుకొనుట, ఇంద్రియాలను అదుపులో నుంచుకొనుట, ఏదీ శాశ్వతం కాదనే ఊహని లోలోన పదిలించుకొనుట పరమ శ్రేయ స్కరం. దుఃఖాన్ని వదిలించుకొనుటకిదే మార్గము. మృత్యువు తప్పదని తెలిసికూడా ఆశ, లోభం పెంచుకొని ధర్మాచరణకు పూనుకోని వాని బతుకు మేక మెడ చన్నువలె దండగే.

సర్వసత్త్వ దయాలుత్వం సర్వేంద్రియ వినిగ్రహః ||

సర్వత్రా నిత్యబుద్ధిత్వం శ్రేయః పరమిదం స్మృతం ||

పశ్యన్నివాగ్రతో మృత్యుం యో ధర్మనాచరేన్నరః ||

అజాగలస్తన స్యేవ తస్య జన్మనిరర్ధకం ||

అన్ని దానాల్లోకి అన్నదానం, గోదానం పరమశ్రేష్టాలు. న్యాయార్జిత ధనంతో గోవును కొని దానం చేసిన వానితో బాటు వాని కుటుంబమంతా తరిస్తారు. అన్నదాన ఫలానికిక సాటియే లేదు.

నగోదానాత్సరం దానం కించి దస్తీతి మే మతిః ||

యా గౌర్ న్యాయార్జితా దత్తా కృత్స్నం తారయతే కులం ||

నాత్ర దానాత్సరం దానం కించి దస్తి వృషధ్వజ ||

అన్నే ధార్యతే సర్వం చరాచరమిదం జగత్ ||

నిజానికి పరమ పుణ్యప్రదాలైన దానాలు చాలానే వున్నాయి. కన్యాదానమనీ, వృషోత్సర్జనమనీ, భూదానమనీ, సువర్ణదానమనీ, జపదానమనీ, గోదానమనీ కానీ అన్నదానపుణ్యం వీటికి పదహారు రెట్లు గొప్పది. ఎందుకంటే అన్నంలోంచే ప్రాణం, తేజం, వీర్యం, ధృతి, స్మృతి అన్నీ పుట్టుకొస్తాయి. మరొక గొప్పదానం వాపీ, కూప, తటాక, ఉపవనాలను నిర్మించి జీవులు సేదతీర్చడం. ఈ దానాల వల్ల ప్రాణులు సంతృప్తి చెందితే ఆ నిర్మాత లేదా దాత విష్ణు లోక ప్రాప్తి నొందుతాడు. అంతేకాక అతని ముందరి ఇరువది యొక్క తరాలవారు ఉద్ధరింపబడతారు.

కూపవాపీత దాగాదీ నారామశ్చైవ కారయేత్ ||

త్రిసప్త కులముద్ధృత్య విష్ణులోకే మహీయతే ||

సాధుజనులను దర్శించినంత మాత్రముననే అతిశయపుణ్యం లభిస్తుంది.

సాధూనాం దర్శనం పుణ్యం తీర్థాదపి విశిష్యతే ||

కాలేన తీర్థం ఫలతి సద్యః సాధు సమాగమః ||

సత్యం, దమం, తపస్సు, శౌచం, సంతోషం, క్షమ, సరళత, జ్ఞానం, శమం, దయ, దానం ఇవన్నీ కలిసి సనాతన ధర్మమేర్పడింది.

సత్యం దమస్తపః శౌచం సంతోషశ్చక్షమార్జవం ||

జ్ఞానం శమో దయాదానం ఏషధర్మః సనాతనః ||

నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment