Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట నలబై ఎనిమిదవ అధ్యాయం

శనిగ్రహ మహిమ – మొదటి భాగము

“నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ !

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ !!”

శనైశ్చరుణ్ణి స్తుతించి , నిర్వికల్పానంద శనిగ్రహ మహిమా కథనం ప్రారంభించాడు.“ ”శని” అనగానే మానవులలో భయమూ , భక్తీ పెనవేసుకుని పుట్టుకొస్తాయి. వక్రవీక్షణతో ఎంత కీడు చేస్తాడో , శుభవీక్షణతో అంతకు రెండింతలు మేలు చేసే గ్రహం శనైశ్చరుడు ! ఆయన ఆగ్రహం మనలో భీతిని పుట్టిస్తుంది. అనుగ్రహం ధైర్యస్థైర్యాల నిస్తుంది ! శని మనిషికి చాలా చాలా ఇష్టమైన దానిని ప్రసాదించే గ్రహదేవత. మనిషి అన్నింటికన్నా మిన్నగా ఇష్టపడేదీ , అనుక్షణమూ కోరుకునేది ఆయుష్షు ! నవగ్రహాలలో ఆయుష్షును కరుణించే ఏకైక గ్రహంగా శనైశ్చరుడిని చెప్పుకోవచ్చు ! శని ఆయుర్దాయ కారకుడు !

“ఆయన ఆగ్రహిస్తే అల్లకల్లోలం ! అనుగ్రహిస్తే అఖండ సౌఖ్యం ! ఈ అంశాలను నిరూపించే గాథ ఒకటి ఉంది. ఆ సంఘటన దశరథ మహారాజు చరిత్రలో ఉంది. శనిగ్రహ మహిమను తేటతెల్లం చేసే ఆ ఐతిహ్యాన్ని శ్రవణం చేద్దాం. దశరథ మహారాజు అయోధ్య రాజధానిగా భారతావనిని పరిపాలిస్తున్న రోజులు. ఆస్థానంలో నిత్యమూ పంచాంగ పఠనం చేసి గ్రహాల చలనాన్ని విశ్లేషించి , శుభాశుభాలు వివరించే జ్యోతిష పండితులు ఒకనాడు భయాందోళనలు కలిగించే భవితవ్యం గురించి తెలియజెప్పారు. “శని రోహిణీ నక్షత్ర పరిధిలోకి ప్రవేశించబోతున్నాడనీ , ఫలితంగా భూమండలం మీద భయానకమైన కరవు పన్నెండేళ్ళపాటు కరాళ నృత్యం చేస్తుందనీ గ్రహచాలనను పరిశీలించి వెల్లడించారు కార్తాంతికులు. ద్వాదశ వర్షాలు సాగే అనావృష్టి కారణంగా త్రాగడానికి నీళ్ళూ , తినడానికి తిండి ఉండవనీ , ఊహించలేని పరిమాణంలో ప్రాణిక్షయం జరిగిపోతుందనీ హెచ్చరించారు. దశరథుడు కులగురువైన వశిష్ఠ మహర్షితో సంప్రదించాడు. పన్నెండు సంవత్సరాల పాటు విలయతాండవం సాగించే దుర్భిక్షాన్ని అరికట్టడానికి ఉపాయం ఉపదేశించమన్నాడు…”

“మహారాజా ! దుర్భిక్షం దాపురించిన అనంతరం ఉపశమనానికి ప్రయత్నించడం అనేది అవివేకమే అవుతుంది. దుర్భిక్షం రాకుండా నిరోధించడమే రాజుగా నీ కర్తవ్యం !” వశిష్ఠ మహర్షి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “దుర్భిక్షం దాపురించకుండా ఆపడమా ? అంటే మహావరుణ యాగాల్లాంటివి చేయడమా , గురుదేవా ?” దశరథుడు ప్రశ్నించాడు.”రోహిణి పరిధిలోకి ప్రవేశిస్తున్న శక్తి సామాన్య గ్రహం కాదు ; శనైశ్చరుడు ! యాగాలూ , యజ్ఞాలూ ఆయనను ఆపలేవు !”

“అయితే కరవుకాటకాలు రాకుండా నిరోధించడానికి మేం ఏం చేయాలో సూచించండి!”

“శనైశ్చరుడు రోహిణీ నక్షత్ర మండలంలోకి ప్రవేశించకుండా నిరోధించడమే !”వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు.”జటిలమైన సమస్యే ఇది. మన మంత్రులతో సమాలోచన చేద్దాం , గురుదేవా !”దశరథుడు సాలోచనగా అన్నాడు.

దశరథ మహారాజుగారి అష్టమంత్రులు దృష్టి , జయంతుడు , విజయుడు, సిద్ధార్థుడు , అర్థసాధకుడు , అశోకుడు , మంత్రపాలుడు , సుమంత్రుడూ చక్రవర్తి ముందు వినయంగా నిలుచున్నారు. దశరథుడు రాబోయే ఉపద్రవానికి గురుదేవులు వశిష్ఠుల వారు సూచించిన పరిష్కారం గురించి వివరించాడు.”శనిని నిరోధించడం ఎలాగో గురుదేవులే శలవివ్వాలి !” సుమంత్రుడు అన్నాడు.”శనిగ్రహ శాంతికి శాంతిహోమాలూ , ఆరాధనలూ చేస్తే ?”అన్నాడు ధర్మపాలుడు. మిగిలిన మంత్రులందరూ ఆమోదం తెలియజేస్తూ శిరస్సులు పంకించారు.

“జ్యోతిష్కుల గ్రహచాలన గణన ప్రకారం శనిగ్రహం రోహిణీ నక్షత్ర మండలం వైపు ఈరోజే తన ప్రయాణం ప్రారంభించి ఉంటాడు. ఆయనను నిరోధించాలనుకుంటే , ఆ కార్యం ఈరోజే జరిగిపోవాలి ! శాంతి హోమాలూ , ఆరాధనలూ ఆచరించే వ్యవధానం లేదు !” వశిష్ఠుడు వివరించాడు. మంత్రులందరూ ముఖాలు చూసుకున్నారు.దశరథుడు తన చూపులను మంత్రుల మీద నుండి వశిష్ఠ మహర్షివైపు మళ్ళించి , కనుబొమలు ముడివేశాడు.

“సమాలోచనలకూ , మంత్రాలోచనలకూ సమయం లేదు , దశరథరాజా ! శనైశ్చరుడు ప్రయాణించే మార్గంలోనే ఎదురుపడి ఆపాలి ! అదొక్కటే మార్గం !”వశిష్ఠుడు దశరథుని చూపులను అర్థం చేసుకుని అన్నాడు.”గురుదేవా ! ఆ మహత్కార్యం తమరే చేయాలి !” దశరథుడు సాలోచనగా అన్నాడు. వశిష్ట మహర్షి చిరునవ్వు నవ్వాడు. “గతాన్ని మరిచిపోయావా , దశరథా ? దేవతలను ఆటపట్టిస్తున్న శంబరాసురుడిని వధించడానికి దేవేంద్రుని కోరిక మేరకు రథం మీద స్వర్గానికి వెళ్ళావు ! పదిరూపాలు ధరించి దశదిశల నుండీ బాణ వర్షం కురిపించిన శంబరాసురుణ్ణి – ఒకే రథాన్ని ఒకే సమయంలో దశదిశలూ మళ్ళిస్తూ యుద్ధం చేసి అసురుడి అసువులు హరించావు కద ! ఆ క్షణంలో మీ నిజనామధేయం ”నేమి” స్థానంలో ”దశరథుడు” అనే సార్ధక నామధేయాన్ని బ్రహ్మ అనుగ్రహించారు కద ! రథాన్ని అధిరోహించి గ్రహ నక్షత్రమండలానికి వెళ్ళు ! శనిని నిరోధించు !”

“గ్రహ మండలం చేరుకోవడం సరే , గురుదేవా ! ఆ మహానుభావుణ్ణి ఆపడం ”ఎలాగా” – అన్నదే సమస్య !” దశరథుడు అన్నాడు.”దారిలో ఎదురుపడి విన్నవించి , నిరోధించు ! విన్నపాలు వినకపోతే , విరోధించి నిరోధించు , రాజా !” వశిష్ఠ మహర్షి నవ్వుతూ అన్నాడు.”దివ్యమైన ఆలోచన !” అష్టమంత్రులూ ఏకకంఠంతో అన్నారు.

నవరత్నాలు పొదిగిన స్వర్ణ రథం మీద , స్వర్ణ వస్త్రాలు ధరించి , రత్నఖచిత వర్ణకిరీటం ధరించి ఆసీనుడయ్యాడు దశరథుడు. స్వర్ణ రథానికి పూన్చిన శ్వేతాశ్వాలు దశరథుని హృదయాన్ని అర్థం చేసుకుని , ఆకాశం వైపు దూసుకు వెళ్ళాయి.

వాయువేగాన్ని ధిక్కరిస్తూ దూసుకువెళ్తున్న రథం మీద దశరథమహారాజు ఒక లక్షా ఇరవై ఐదు వేల యోజనాలు ప్రయాణించాడు. రోహిణీ నక్షత్ర మండలానికి వెలుపల శనైశ్చరుని మార్గంలో రథాన్ని ఆపాడు. విచిత్రమైన రంగుల మేళవింపులో ఉన్న పది శబలాశ్వాలు లాగుతున్న ఇనుపరథం మీద , కారు నలుపు ఆకారం కలిగిన శనైశ్చరుడు రోహిణి వైపు వస్తూ కనిపించాడు దశరథునికి. రోహిణీ మండలాన్ని సమీపిస్తున్న శని ధగధగ మెరిసిపోతున్న దశరథ రథాన్ని చూసి , తన రథాన్ని ఆపాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment