Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట నలబై తొమ్మిదవ అధ్యాయం

శనిగ్రహ మహిమ – రెండవ భాగము

“ఎవరి దారికి అడ్డు నిలుచున్నావో తెలుసా , దశరథా ? రథాన్ని మళ్ళించి , తొలగిపో !” శనైశ్చరుడి గంభీర కంఠం ఉరుములా ధ్వనించింది.

“శనైశ్చరుల చరణారవిందాలకు నమస్సులు !” దశరథుడు చేతుల్ని శిరస్సు మీద జోడిస్తూ , వినయంగా అన్నాడు.”రథాన్ని అడ్డు తొలగించి , అర్పించు దశరథా , నీ నమస్సులను !” శని గర్వంగా , నిర్లక్ష్యంగా అన్నాడు.

“రథాన్ని తొలగించడానికి మార్గాన నిలువలేదు. దేవా ! మిమ్మల్ని నిలువరించడానికి నిలిపాను !” దశరథుడు చిరునవ్వుతో అన్నాడు.”దశరథా ! నా గమనానికి ఆటంకం కలిగిస్తే జరిగేది ప్రళయమే ! తెలుసా ?”

“ఆటంకం కలిగించకపోతే , తమరు రోహిణీ నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే భూలోకం ద్వాదశ వర్ష ప్రళయంతో సర్వనాశనమై పోతుంది , దేవా ! దయచేసి , తిరోగమనం చేయండి !” శనైశ్చరుడు మేఘ గర్జనను వెక్కిరిస్తూ వికటాట్టహాసం చేశాడు. “తిరోగమనమా ! మాకు పురోగమనం మాత్రమే తెలుసు ! అడ్డులే !”

శనైశ్చర రథం ముందుకు కదిలింది. అది గమనించిన దశరథుడు తన రథాన్ని కూడా ముందుకు నడిపాడు. కొద్ది దూరంలో ఆపి , చేతులెత్తి నమస్కరిస్తూ శనితో ఇలా అన్నాడు.

“స్వామీ , శనైశ్చరా ! మీ పురోగమనం భూలోక ప్రాణులపాలిట మహాశాపమవుతుంది. భూలోక వాసుల పక్షాన మిమ్మల్ని అర్థిస్తున్నాను. రోహిణీ మండల ప్రవేశ కార్యాన్ని మానుకోండి !”

“అసంభవం ! ముమ్మాటికీ అసంభవం !” శనైశ్చరుడు నిష్కర్షగా అన్నాడు. “వినయాలకూ , విన్నపాలకూ ఈ సూర్యపుత్రుడు కరిగిపోయి , తిరిగిపోవడం జరగదు !”

“విన్నపంతో నిరోధించలేని పక్షంలో , ఈ దశరథుడు నిన్ను విరోధంతో నిరోధిస్తాడు !” దశరథుడి ఆగ్రహం ఏకవచన ప్రయోగంలో ప్రతిధ్వనించింది.

“సామాన్య మానవుడు ఈ అసామాన్య గ్రహదేవుడిని విరోధంతో నిరోధించడమా ?” శని అట్టహాసంగా అన్నాడు. “ఏదీ , ప్రయత్నించు!”

దశరథుడు చిరునవ్వుతో చూశాడు. “గ్రహదేవతవు ! నీ కోరికను కాదనలేను !” అంటూ ధనువును అందుకున్నాడు. నారిని చెవిదాకా లాగి ఒక్కసారి ”టంకారం” చేశాడు. దశరథుని వింటినారి చేసిన భయంకరమైన టంకారధ్వని దశదిశలా మారుమ్రోగింది. శని రథాశ్వాలు అదిరిపడి వెనకకు అడుగులు వేశాయి.దశరథ మహారాజు ఆగ్రహాన్నీ , అఖండశక్తినీ చాటింపు వేస్తున్నట్టు ధ్వనిస్తున్న భీకర టంకారం శనైశ్చరుడి చెవులలో గింగుర్లు తిరుగుతూ ఉండిపోయింది. దశరథుడు దివ్యబాణాన్ని అందుకుని , వింటిలో సంధించాడు.

“భూలోక ప్రాణుల ప్రాణాలు రక్షించి , నా ప్రభు ధర్మాన్ని పాలించడం కోసం , అఖండమైన సంహారాస్త్రాన్ని నీమీద ప్రయోగిస్తున్నాను ! కాచుకో , శనైశ్చరా !” దృఢనిశ్చయం ధ్వనించింది దశరథుడి కంఠంలో , వింటినారిని శ్రవణేంద్రియం దాకా లాగుతున్న దశరథుడిని చూస్తూ శనైశ్చరుడు నిర్ఘాంతపోయాడు.

“ఆగు దశరథా ! ఆగు !” శనైశ్చరుడి హెచ్చరిక దశరథుడి వైపు దూసుకు వెళ్ళింది. దశరథుడు ప్రశ్నార్థకంగా చూశాడు.

“అస్త్రాన్ని ఉపసంహరించు ! అలాగే నీ నిశ్చయాన్నీ , ఆగ్రహాన్నీ ఉపసంహరించు ! నీ విన్నపాన్ని మన్నిస్తున్నాను !” శనైశ్చరుడు చిరునవ్వుతో అన్నాడు. దశరథుడు ఆశ్చర్యంగా చూశాడు.

“ధనుర్బాణాలు విసర్జించి , సన్నిధికి రా , దశరథా !” శని అనునయంగా అన్నాడు. శని మాటలో , ప్రవర్తనలో వచ్చిన మార్పుని గమనించిన దశరథుడు ధనుర్భాణాలను రథంలో పెట్టి , రథం దిగి , శనైశ్చర రథం వద్దకు నడిచాడు.

“దశరథా ! నేను సూర్యపుత్రుణ్ణి ! నువ్వు సూర్య వంశస్థుడవు ! మా జనకుల వంశాన ఉద్భవించిన నీ శక్తినీ , ధైర్యసాహసాలనూ , నీ వ్యక్తిత్వాన్నీ , ప్రజాపాలనలో నీ చిత్తశుద్ధినీ పరీక్షించే ఉద్దేశంతో నీ ప్రార్థనను మొదట తిరస్కరిస్తూ, నటించాను !”

“స్వామి !”

“నీ ధైర్య స్థైర్యాలూ , తెగింపూ నన్ను అలరించాయి. ఏదైనా వరం కోరుకో దశరథా !”

“మహానుభావా ! లోకాలకు శాశ్వతంగా మేలు చేకూర్చే వరం కోరుకుంటున్నాను. ఈ నాటి నుండీ , తమరు ఎన్నటికీ రోహిణీ నక్షత్ర మండలంలో ప్రవేశించరాదు. ఆ విధంగా కరుణించాలి. నేను కోరే వరం ఇదే !” దశరథుడు దోసిలిపట్టి అర్ధించాడు.”భళా , దశరథా ! అలాగే వరమిస్తున్నాను ! ఇక మీదట ఏనాడూ రోహిణీ మండలంలో ప్రవేశించను !”

“ధన్యోస్మి దేవా ! ధన్యోస్మి !” దశరథుడు పులకించిపోతూ అన్నాడు. శనైశ్చరుడు చిరునవ్వుతో చూస్తున్నాడు. దశరథుడు చేతులు జోడించి , కృతజ్ఞతా పూర్వకంగా అశువుగా శనైశ్చర భగవానుణ్ని స్తుతించాడు. దశరథ స్తోత్రాన్ని ఆనందంగా ఆలకించిన శనైశ్చరుడు చెయ్యెత్తి దీవించాడు.

“దశరథా ! నీవు గానం చేసిన ఈ స్తోత్రానికి ”దశవిధ స్తోత్రం” అనే నామధేయాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తి శ్రద్ధతో దశవిధ స్తోత్రాన్ని పఠించే మానవులకు గ్రహపీడ ఉండదు. వారికి నేను ప్రసన్నుడనవుతాను !” శనైశ్చరుడు ఆశీర్వదించి , రథాన్ని వెనుకకు మళ్ళించాడు. శనైశ్చరుడి రథం కనుమరుగయ్యే దాకా , చేతులు జోడించి చూస్తూ ఉండిపోయాడు దశరథుడు.

నిర్వికల్పానంద కథనం ముగించి , ”అర్థమైందా” అన్నట్టు శిష్యుల వైపు చూశాడు.

“శనిగ్రహ వక్ర వీక్షణ వల్ల కష్టాలపాలై , తదనంతరం ఆయనను ఆరాధించి , శుభాన్ని పొందిన వ్యక్తి చరిత్ర వినిపిస్తారని అనుకున్నాం , గురువుగారూ !” సదానందుడు నవ్వుతూ అన్నాడు.

నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు.

“గ్రహవీక్షణ అనుకూలంగా లేనప్పుడు మానవుడికి సంభవించే కష్టనష్టాల గురించీ , గ్రహవీక్షణను సానుకూలం చేసుకుంటే ఆ కష్టనష్టాలు తొలగే విధానం గురించి ఇదివరకే ఇతర గ్రహాల మహిమలలో చెప్పుకున్నాం. ”భవిష్యత్తులో “గ్రహదోషం” వల్ల సంభవించబోయే కష్టాలను గ్రహసంచార గణన ద్వారా ముందుగానే తెలుసుకుని , ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుని , రాబోయే అవాంతరాలను అరికట్టుకోవచ్చు” అనే అంశాన్ని స్పష్టం చేసే ఉద్దేశంతో ప్రత్యేకంగా మీకు దశరథ శనైశ్చరుల ఉపాఖ్యానం వినిపించాను !”

“ఔనౌను ! గ్రహ శాంతి ద్వారా రాబోయే అనర్థాలను అరికట్టవచ్చు అనే సత్యం ఇప్పుడు చక్కగా బోధపడింది !” విమలానందుడు మిత్రుల్ని చూస్తూ అన్నాడు.

“ఇప్పుడు అష్టమగ్రహమైన రాహువు మహిమను శ్రవణం చేద్దాం !” నిర్వికల్పానంద హెచ్చరించాడు.

రాహుగ్రహ మహిమ ప్రారంభం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment