Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట యాబయ్యవ అధ్యాయం

రాహుగ్రహ మహిమ

“అర్ధకాయం మహావీహం చంద్రాదిత్య విమర్ధనమ్ !

సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ !!”

రాహుదేవ ప్రార్థన పఠించిన నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు.

“రాహువు వక్రంగా వీక్షిస్తే అష్టకష్టాలూ పట్టి పీడిస్తాయి. ఘోర యుద్ధాలు సంభవిస్తాయి. వ్యక్తికి దేశాటన క్లేశమూ , శ్మశాన వాసమూ దాపురిస్తాయి అని తెలియ జేస్తున్నాయి శాస్త్రాలు…”

“గురువుగారూ ! అష్టకష్టాలూ , దేశాటనా , శ్మశాన వాసమూ అంటున్నారు. అవన్నీ కలిసికట్టుగా పీడించిన వ్యక్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఉన్నాడు కదా ? ఆయన అనుభవించిన కష్టాలకూ , దైన్యస్థితికి , రాహుగ్రహ దుర్వీక్షణ కారణం అనుకోవచ్చా ?” విమలానందుడు. ప్రశ్నించాడు.

“అందుకు సందేహం లేదు ! అనుకోవచ్చు అన్నారు జ్యోతిష విద్వాంసులు !” నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. రాహుగ్రహ మహిమకు ఉదాహరణగా ఆయన గురించే చెప్పబోతున్నాను , నేను.

“గ్రహచారం బాగా లేనప్పుడు మానవుడి ఆలోచనలూ , ఆదరణలూ దారితప్పుతాయి. ఆ పరిస్థితిలో మనిషి అపశకునాలనూ , గ్రహదోషాలనూ లెక్కచేయడు. మార్కండేయ పురాణం ప్రకారం , దేశం సుభిక్షంగా , సురక్షితంగా ఉన్న మంచి కాలంలో ఆయన అరణ్యానికి వేటకు వెళ్ళాడు. రాజు మృగయా వినోదానికి వెళ్ళే ముందూ , యుద్ధానికి వెళ్ళే ముందూ గ్రహచాలనను పరిగణించి , శుభమైన , జయప్రదమైన ముహూర్తం నిర్ణయించుకోవాలి. అయితే శక్తివంతుడైన కారణంగా ఆ ముహూర్త సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేసి హరిశ్చంద్ర చక్రవర్తి వేట వ్యసనానికి లొంగిపోయాడు.”

“గురువు గారూ ! ”వేట” వ్యసనమవుతుందా ?” సదానందుడు సందేహం వ్యక్తం చేశాడు.

“నిస్సందేహంగా ! సప్తవ్యసనాలలో ”వేట” కూడా ఒకటి ! మనజాతి పితామహులు సప్త వ్యసనాల శ్రేణిలో వేటను ఏనాడో చేర్చారు ! జూదం , మద్యపానం , స్త్రీలోలత , వేట , వాక్పారుష్యం , తస్కరణ , అర్థదూషణం అనేవే సప్త వ్యసనాలు. మన హరిశ్చంద్ర చక్రవర్తి క్షత్రియ సహజమైన మృగయా వినోద వ్యసనానికి లొంగిపోయాడు. ఆ సందర్భంలో ఆయనకు విశ్వామిత్ర మహర్షితో వైరం ఏర్పడింది. రాహుగ్రహ దుర్వీక్షణ ఆయనను ఎక్కడిదాకా తీసుకువెళ్ళిందంటే దేవబ్రాహ్మణ మాన్యాలు తప్పించి సమస్త రాజ్యాన్నీ విశ్వామిత్రుడికి అప్పగించేలా చేసింది. అంతే కాకుండా ఋణగ్రస్థుణ్ణి చేసింది. ఫలితంగా భార్యా పుత్రులతో ఆయన దేశం విడిచి వెళ్ళాల్సి వచ్చింది. వారణాశిలో భార్యా బిడ్డలనూ , కాటికాపరికి తననూ విక్రయించుకోవల్సిన విపత్కర పరిస్థితి దాపురించింది !”

“హరిశ్చంద్ర మహారాజు అనుభవించిన అష్టకష్టాల గురించీ , శ్మశాన నివాసం గురించీ , శవసంస్కారం చేసే హీనమైన స్థితి గురించీ మనందరికీ తెలుసు కదా ! ఆయన పట్ల రాహు గ్రహవీక్షణ శుభంగా లేకపోవడం అందుకు మూల కారణం అని మనం అర్థం చేసుకుంటే చాలు !”

“గురువుగారూ ! అనుభవించిన అష్టకష్టాల మూలంగానే కదా హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడైనాడు ?” చిదానందుడు అన్నాడు.

“అంతే కాదు , చివరకు ఆయనను ఇంద్రాది దేవతలూ , బ్రహ్మ స్వయంగా ఆశీర్వదించారు కూడా !” శివానందుడు అన్నాడు.”అవును ! హరిశ్చంద్రుడికి దేవతల ఆశీస్సులూ , ప్రశంసలూ అందేయి. సత్యహరిశ్చంద్రుడనే సార్థకనామమూ లభించింది. అందుకు కారణం – రాహువు ఆయన మీద శుభదృష్టిని ప్రసరించడమే అని మనం అనుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు !” నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు.

“అంటే రాహుగ్రహ ఆగ్రహానికీ , అనుగ్రహానికీ సత్యహరిశ్చంద్ర మహారాజు ఐతిహ్యాన్ని ఉదాహరణగా మనం స్వీకరించవచ్చునన్నమాట !” విమలానందుడు అన్నాడు.”మీకు మరొక ముఖ్యమైన సందేహం కూడా కలగవచ్చు !” నిర్వికల్పానంద సాలోచనగా అన్నాడు. “తన జీవితంలో ఎదురైన అష్టకష్టాల నుండి విముక్తి పొందడానికి హరిశ్చంద్ర చక్రవర్తి ప్రయత్నించి ఉండవచ్చు కదా ; రాహుగ్రహ అనుగ్రహాన్ని పొంది ఉండవచ్చు కదా ? అని మీరు అడగవచ్చు !”

“అవును గురువుగారూ ! అంతే కాదు. మరొక ధర్మసందేహం కూడా పుట్టుకొస్తోంది. రాహు వీక్షణం వల్ల హరిశ్చంద్రుడికి తోచి ఉండకపోవచ్చు ! ఆయన కులగురువు వశిష్ట మహర్షి ఉన్నారు కదా ? ఆయన హరిశ్చంద్రుడిని హెచ్చరించి రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకొమ్మని చెప్పి ఉండవచ్చు కదా ?” విమలానందుడు ప్రశ్నించాడు.

“చక్కటి ప్రశ్న వేశావు , నాయనా ?” నిర్వికల్పానంద మెచ్చుకుంటూ అన్నాడు. “హరిశ్చంద్రుడు మహోన్నతమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు. ఇక్ష్వాకు వంశం సూర్యుడి నుండే ఆవిర్భవించింది ! హరిశ్చంద్రుడు స్వయం నిర్ణయం తీసుకుని విశ్వామిత్రుని ముందు శపథం చేసేలా , రాజ్యాన్ని ధారబోసేలా పరిస్థితి ఏర్పడింది ! రాజు ఇచ్చిన మాట నిలుపుకోవాలి ! అంటే , విశ్వామిత్రుడికి రాజ్యం అప్పగించాలి. నిరుపేదగా మారిపోయి రాజ్య భ్రష్టుడైన అనంతరం ఆయన ఋణం తీర్చాలి. ఆ రెండూ జరగాలంటే – హరిశ్చంద్రుడు కష్టనష్టాలను ఎదుర్కొని అనుభవించి తీరాలి. ఈ ధర్మసూక్ష్మం తెలిసే వశిష్ఠ మహర్షి ఆయనను హెచ్చరించలేదు. హితబోధ చేయలేదు.

“అంతేకాకుండా వశిష్ఠ మహర్షి త్రికాలజ్ఞుడు. హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పని సత్యహరిశ్చంద్రుడుగా రూపొంది చరిత్రలో శాశ్వత స్థానం ఆర్జించుకుంటాడని కూడా ఆయనకు తెలుసు !”

“చక్కగా అరటిపండు వలిచి , అరచేతిలో పెట్టినట్లు చెప్పారు , గురువుగారూ !” చిదానందుడు తన మిత్రుల వైపు చూస్తూ అన్నాడు.”ఔనౌను ! మనకిప్పుడు ఒక ధర్మసూక్ష్మం కూడా అర్థమైంది !” సదానందుడు ఉత్సాహంగా అన్నాడు.

“సరే…రాహు మహిమ గురించి విన్నారు. కేతుగ్రహ మహిమను తెలుసుకుందామా ?” నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. “చెప్పండి , గురువుగారూ ! శ్రవణం చేసి , తరించిపోతాం !” శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.

రేపటి నుండి కేతుగ్రహ మహిమ ప్రారంభం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment