నాలుగు యుగాల ధర్మాలు
విష్ణు మహిమ, ధర్మం నాలుగు పాదాలు, పురాణ, ఉపపురాణ పదునెనిమిది విద్యల లెక్క, ప్రళయం నాలుగు యుగాల ధర్మాలు, కలియుగం నామ సంకీర్తన
మహర్షీ! ఇప్పటిదాకా మీరు విన్న ధర్మాలూ, వ్రతాలూ విష్ణు ప్రీతికరాలు కూడ. సూర్యాదిదేవుల పూజ, పితృతర్పణలు, హోమాలు, సంధ్యావందనాలు, పురుషార్థ చతుష్టయ సిద్ధిని సమకూర్చేవ్రతాలు. వీటన్నిటినీ విష్ణుభగవానుడే స్వీకరించి మంచి ఫలితాలనిస్తాడు. విష్ణుదేవుడే ధర్మస్వరూపుడు. ఈ పూజలు, తర్పణలు, హవనాలు, సంధ్యావందనాలు, ధ్యాన ధారణాది సత్కర్మలన్నీ ఆయన రూపాలే”. ఇంతవఱకు చెప్పి ఆగాడు సూతుడు.
కొంతసేపాగి “శౌనకాది మహామునులారా! ఇపుడిక నాలుగు యుగాలలో దీపించే ధర్మాన్ని వినిపిస్తాను. అంటూ సూతమహర్షి ఇలా ప్రవచింపసాగాడు.నాలుగు వేల యుగాలొక కల్పం, అది బ్రహ్మకొక పగలు అనుకున్నాము కదా! కృత, త్రేత, ద్వాపర, కలి అనేవి యుగాల పేర్లు. కృతయుగంలో సత్యం, దానం, తపం, దయ అనే నాలుగు పాదాలతో ధర్మం నడుస్తుంది. ధర్మసంరక్షకుడు శ్రీహరియే ఈ రహస్యాన్ని కనుగొన్న జనులందరూ సంతుష్ఠులై జ్ఞానులై వెలుగొందు తారు. సత్యయుగపు మానవుల ఆయుః ప్రమాణం నాలుగువేల సంవత్సరాలు.
సత్యయుగాన్నే కృతయుగమని కూడా అంటారు. క్షత్రియులు ధర్మపాలన పైననే దృష్టిని కలిగివుంటారు. నాలుగు వర్ణాలవారూ సత్యసంధులై ధర్మపరులై వుంటారు. అయితే హానికారక ప్రవృత్తులైన రాక్షసులు కూడా వుంటారు. వారిని సర్వాధిక బలశాలియు, శూరుడునైన విష్ణుభగవానుడు సంహరిస్తాడు. త్రేతాయుగంలో ధర్మం సత్యం, దానం, దయ అనే పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలోని ప్రజలు యజ్ఞపరాయణులై యుంటారు. లోకమంతా క్షత్రియుల వల్ల సురక్షితమై వుంటుంది. విష్ణు భగవానుడు రక్తవర్ణుడై ఈ యుగంలో మానవులచే పూజింపబడతాడు. వారి ఆయువు ఒక వేయి సంవత్సరాలుంటుంది. ఈ యుగంలో హరిని భీమరథుడంటారు. రాక్షసులను క్షత్రియులే సంహరిస్తారు.
ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలపైనే నిలబడి వుంటుంది. విష్ణు భగవానుడు పీతవర్ణుడై వుంటాడు. మానవుని ఆయుఃప్రమాణము నాలుగు వందలేళ్ళు వుంటుంది. బ్రాహ్మణ క్షత్రియ వర్ణముల వారు లోకమంతటా వ్యాపిస్తారు. లోకుల అల్పబుద్ధిని చూసి విష్ణువే వ్యాసునిగా పుట్టి వేదాలను విభజించి వైదిక ధర్మాన్ని వ్యాప్తిలోకి తెస్తాడు.తన శిష్యులలో పైలునికి ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్నీ, వైశం పాయనునికి యజుర్వేదాన్నీ సుమంతునికి అథర్వవేదాన్నీ ప్రసాదించి ప్రచారం చేయడానికి కనుజ్ఞనిస్తాడు. వేదాంగాలనూ, పురాణాలనూ సూతునికి అనుగ్రహిస్తాడు. అన్ని పురాణాలూ, వేదాలూ పూర్తిగా తెలిసినవాడు శ్రీహరి ఒక్కడే. పురాణం పంచలక్షణం అని చెప్పబడింది. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములే ఆ అయిదు లక్షణాలు.
18 పురాణాల పేర్లను గుర్తుంచుకోవడానికి మన పెద్దలొక శ్లోకం చెప్పారు. ఇలా:-
మద్వయం వ చతుష్టయం
అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షతః ॥
బ్ర అనే అక్షరంతో – 3
భ అనే అక్షరంతో – 2
మ అనే అక్షరంతో – 2
వ అనే అక్షరంతో – 4
అ, నా, ప, లిం, గ, కూ, స్కాలతో ఒక్కొక్కటి.
ఈ పట్టికలో శివపురాణం లేదు. గరుడపురాణ పట్టికలో వామన పురాణం కానరాదు. పురాణ విజ్ఞానం పదునెనిమిది రూపాలుగా విభక్తమైవుంది. అవేమనగా బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారదీయ, స్కంద, లింగ, వరాహ, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, కూర్మ, మత్స్య, గరుడ, వాయు, బ్రహ్మాండ పురాణాలు. మునులు పలు ఉపపురాణాల పేర్లు కూడా వినిపిస్తుంటారు.
మొదటి ఉపపురాణం సనత్కుమారుడు చెప్పినది (ఇదే సనత్కుమార సంహితయా?) రెండవది భగవంతుడైన నృసింహునిచే ఉపదేశింపబడినది. మూడవది కుమారస్వామి చెప్పినది కాగా నాల్గవది నందీశ్వరుడు చెప్పిన శివధర్మ లేదా శివధర్మోత్తర పురాణం. ఆశ్చర్య లేదా అద్భుత పురాణం దుర్వాసకృతం. నారదుడు చెప్పినదొకటుంది. ఇలాగే కపిల, ఉశన మహర్షులు చెప్పిన ఉపపురాణాలున్నాయి. అంతేకాక వారుణ, కాలిక, మాహేశ్వర, సాంబ, పారాశర్య, మారీచ, భార్గవ నామ ఉపపురాణాలు కూడా ఉన్నాయి. ఇక పదునెనిమిది విద్యలేవనగా పురాణం, ధర్మశాస్త్రం, నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలు, న్యాయం, మీమాంస, ఆయుర్వేదం, అర్థశాస్త్రం, గాంధర్వశాస్త్రం, ధనుర్వేద శాస్త్రం.
పురాణం ధర్మశాస్త్రంచ వేదాస్యంగాని యన్మునే |
న్యాయంః శౌనక మీమాంసా ఆయుర్వేదార్థశాస్త్రకం||
ద్వాపర యుగాంతంలో భగవంతుడైన శ్రీహరి భూభారాన్ని తగ్గిస్తాడు. కలియుగంలో ధర్మం ఒక పాదం మీదనే నడుస్తుంది. భగవానుడైన అచ్యుతుడు కృష్ణవర్ణుడై వుంటాడు. ఈ యుగంలో ప్రజలు సామాన్యంగా దురాచారులై నిర్దయులై వుంటారు. సత్వ రజస్తమో గుణాలు ప్రస్ఫుటాలౌతాయి. ముఖ్యంగా చివరి రెండు నాలుగు యుగాలపై అవగాహన ఈ క్రింది శ్లోకాల ద్వారా కలుగుతుంది.
ప్రభూతశ్చయదా సత్త్వం మనోబుద్ధీంద్రియాణిచ ||
తదాకృత యుగం విద్యాత్ జ్ఞానే తపసియద్రతిః ||
యదాకర్మసు కామ్యేషు శక్తిర్యశనే దేహినాం ||
తదా త్రేతా రజో భూతిః ఇది జా నీ హిశౌనక ||
యథాలోభస్త్వసంతోషో మానో దంభశ్చ మత్సరః ||
కర్మణాం చాపి కామ్యానాం ద్వాపరం తద్రజస్తమః ||
యదా సదానృతం తంద్రా నిద్రా హింసాది సాధనం ||
శోక మోహౌ భయం దైన్యం సకలిస్తమసి స్మృతః ||
కలియుగం గడుస్తున్న కొద్దీ మానవులకు కామాసక్తి పెరుగుతుంది. కటువుగా మాటతీరుంటుంది. జనపదాలను దొంగలు, దోపిడీ దొంగలు ఆక్రమిస్తారు, వేదాలు పాఖండ దూషితాలవుతాయి, రాజులు ప్రజల సర్వస్వాన్ని హరిస్తారు. ప్రజలు మైథునానికీ, పొట్టపోషణకీ తప్ప ఇక దేనికీ ప్రయత్నించరు, బ్రహ్మచర్యమనే మాటే వినబడదు, గృహస్థులూ సన్యాసులూ కూడా లోభులైపోతారు.
తపస్వులెక్కడో మారు మూలాల్లోకి వెళ్ళిపోతారు. దైవాన్ని కన్నా ధనాన్నే నమ్ముకొని ప్రజలు జీవిస్తుంటారు. లఘు శరీరులై వుండి కూడా అమిత భోజనులై నడివయస్సులోనే అనారోగ్యం పాలై చతికిలబడిపోతారు. ప్రజలెప్పుడైతే దొంగలను పట్టుకొచ్చి సాధువులను చేసి ఇతరులను నమ్మించి డబ్బు చేసుకుంటారో అపుడే కలియుగంం పరకాష్ఠకు చేరుకుందని తెలుసుకోవాలి.ఈ యుగానికి పట్టని జాడ్యాలు లేవు. ఈ మనుజులు పాల్పడని పాపాలుండవు. ఇంకా కొందరు సజ్జనులు మిగిలే వుంటారు. వారికి సుఖజీవనాన్ని ప్రసాదించే సాధనమొక్కటే. అదే శ్రీకృష్ణ సంకీర్తనం.
ఆ సంకీర్తనం ద్వారానే మనిషి సంసారమనే మహాబంధనంలో చిక్కుకోకుండా కర్మిష్టిగా జీవించగలడు, జనన మరణాల ఉచ్చునుండి. తప్పించుకోగలడు. కృతయుగంలో ధ్యానం త్రేతా యుగంలో జపం, ద్వాపర యుగంలో (దేవునికి) సేవ, కలియుగంలో ఆయన గుణ, లీలా, నామసంకీర్తనం ముక్తిదాయకాలు.
కలేర్దోషనిధోర్విప్రా ||
అస్తి హ్యోకే మహాగుణః ||
కీర్తనాదేవ కృష్ణస్య ||
మహాబంధం పరిత్యజేత్ ||
కృతే యద్ ధ్యాయతో విష్ణుం ||
త్రేతాయాం జపతః ఫలం ||
ద్వాపరే పరిచర్యాయాం ||
కలౌతద్ధరి కీర్తనాత్ ||
తస్మాద్ ధ్యేయో హరిర్నిత్యం ||
గేయః పూజ్యశ్చ శౌనక ||
ప్రళయం నైమిత్తికమనీ ప్రాకృతికమనీ (రెండుగా) చెప్పబడింది. నాలుగు వేలయుగాల కొకమారు వచ్చే ప్రళయాన్ని బ్రహ్మ లయమనీ, నైమిత్తిక ప్రళయమనీ అంటారు. ఇది కాక కొన్ని కల్పాల కొకమారు వచ్చేది ప్రాకృతిక ప్రళయం బ్రహ్మలయం కలియుగాంతంలో వందేళ్ళపాటు అనావృష్టి ఏర్పడుతుంది. ఆకాశమండలంలో ప్రచండ రూపంతో అంతటినీ మండించే ఏడుగురు సూర్యులుదయిస్తారు. వారు ముల్లోకాలలోనూ గల జలాన్నీ ఇంకించి వేస్తారు. అపుడు విష్ణుభగవానుడే రుద్ర స్వరూపుడై భూ, భువః, స్వః, మహః, జన, పాతాళలోకాల్లోని సమస్త చరాచర సృష్టినీ దహించివేస్తాడు. తరువాత సంవర్తకములను పేరుగల మేఘాలను సృష్టిస్తాడు.
అవి నూరేళ్ళపాటు భయంకర వృష్టిని అలా కురిపిస్తునే వుంటాయి. విష్ణు రూపుడైన వాయువు మిక్కిలి వేగంతో నూరేళ్ళపాటు వీస్తాడు. అపుడు ప్రపంచమంతా సముద్రమే అయిపోతుంది. ఆ సముద్రంలో అనంత శయ్యపై విష్ణువు శయనిస్తాడు. అలా ఒక వెయ్యేళ్ళు శయనించిన పిమ్మట లేచి ఆయనే మరల జగత్తును సృష్టిస్తాడు ఇపుడు ప్రాకృతిక ప్రళయాన్ని వర్ణిస్తాను. బ్రహ్మవర్షాలొక నూరు పూర్తికాగానే భగవంతుడైన శ్రీహరి తన యోగ బలంతో సమస్తసృష్టినీ బ్రహ్మతో సహా తనలో లీనం చేసుకుంటాడు.
బ్రహ్మాండమైన వర్షాలు నూరు వర్షాల పాటు కురిసి బ్రహ్మాండ మంతా జలమయమై పోతుంది. బ్రహ్మ ఆయువు పూర్తయి మరొక బ్రహ్మ ఉదయించే కాలం దగ్గర పడగానే శ్రీహరి శయనం నూరేళ్ళు కూడా పూర్తికాగా అవ్యక్తాది క్రమం నుండి మరల వ్యక్తీభూతమైన చరాచర జగత్తు సృష్టించబడుతుంది..
నూట నలబయ్యవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹