Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట యాబై ఒకటవ అధ్యాయం

కేతుగ్రహ మహిమ – మొదటి భాగము

“పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ !

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !!”

నిర్వికల్పానంద చేతులు జోడించి ప్రార్థించాడు. “గురువుగారూ… ”పలాశపుష్పం” అంటే…” సదానందుడు ప్రారంభించాడు.

“మోదుగు పువ్వు నాయనా ! కేతువు వర్ణం మోదుగు పువ్వులాగా ఎర్రగా ఉంటుంది ! ఇతర గ్రహాలకు లాగే నవగ్రహాలలో నవమగ్రహమైన కేతువుకూ అనేక కారకత్వాలున్నాయి. వాటిలో మహత్తరమైన కారకత్వం ఒకటుంది. అదే మోక్షకారకత్వం ! మానవుడికి జనన మరణ చక్రం నుండి విముక్తి అనే ”ముక్తి” లభించాలంటే కేతుగ్రహ శుభవీక్షణ చాలా ముఖ్యం. ఆయన దయలేని కారణంగా విశ్వప్రయత్నం చేసినప్పటికీ . మోక్షాన్ని , అంటే స్వర్గాన్ని అందుకోలేకపోయిన పురాణ పురుషుడి గాథ చెప్పుకుందాం !” నిర్వికల్పానంద ఉపోద్ఘాతం ముగించి , శిష్యుల వైపు ప్రసన్నంగా చూశాడు.

విమలానందుడూ , చిదానందుడూ , సదానందుడూ , శివానందుడూ ఆయన వైపు ఆసక్తిగా చూశారు.

“ఇందాక మనం హరిశ్చంద్రుడి కథ చెప్పుకున్నాం. ఆయన తండ్రి ఎవరో తెలుసా ? సత్యవ్రత మహారాజు ! ఆయన మనకు ”త్రిశంకుడు’గా తెలుసు !”

“సత్యవ్రత మహారాజుకు ”త్రిశంకుడు” అనే పేరు ఎందుకు వచ్చింది , గురువుగారూ ?”

“వశిష్ఠ మహర్షి శాపం వల్ల ఆయన త్రిశంకుడయ్యాడు. ”త్రిశంకుడు” అంటే మూడు పాపాలు చేసినవాడు అని అర్థం…”

“ఆ మూడు పాపాలు ఏవి , గురువుగారూ ?” సదానందుడు అడిగాడు.

“యుక్తవయస్సులో ఉన్నప్పుడు సత్యవ్రతుడు వివాహవేదిక మీద నుండి మంగళ సూత్రధారణ జరిగే ముందు , ఒక వధువును ఎత్తుకు వెళ్ళిపోయాడు. అది ఒక పాపం !”

“ఆ నేరానికి శిక్షగా ఆయన తండ్రి అయిన త్రయ్యారుణ చక్రవర్తి సత్యవ్రతునికి రాజ్య బహిష్కార శిక్ష విధించాడు. కన్నతండ్రి ఆగ్రహానికి గురి అవడం రెండవ పాపం.”

“దేశం వదిలి అరణ్యాలలో జంతువులను వేటాడి తింటూ నికృష్టమైన జీవనం సాగిస్తున్న సత్యవ్రతుడు , ఒకనాడు వశిష్ఠ హోమధేనువైన నందినిని చంపి , ఆ గోవు మాంసం ఆరగించాడు. గోమాంస భక్షణ మూడవ పాపం ! మూడు పాపాల కారణంగా – అంటే ”త్రిశంకల” కారణంగా అతన్ని ”త్రిశంకుడు”గా వ్యవహరించబడమని శపించాడు వశిష్ఠ మహర్షి. ఆనాటి నుండి సత్యవ్రతుడు త్రిశంకుడుగా ప్రఖ్యాతుడయ్యాడు !” నిర్వికల్పానంద వివరించాడు. “ఒక్కగానొక్క కొడుకుని అరణ్యాల పాలు చేసినందుకు విచారించి త్రిశంకుడి తండ్రి త్రయ్యారుణ చక్రవర్తి అతన్ని రాజధానికి పిలిపించి , రాజుగా అభిషేకించాడు. చాలా ఏళ్ళ పాటు రాజ్యపాలన చేసిన త్రిశంకు చక్రవర్తికి జీవితం మీద విరక్తి కలిగింది. మరణించకుండా స్వర్గం చేరి , తద్వారా మోక్షాన్ని పొందాలన్న సంకల్పం బలంగా కలిగింది ఆయనకు. కులగురువైన వశిష్ఠ మహర్షితో ఆ విషయం గురించి చర్చించాడు…” నిర్వికల్పానంద కథనం కొనసాగిస్తున్నాడు…

“గురుదేవా ! జీవితంతో విసిగిపోయాను ! రాజ్య పాలనతో అలసిపోయాను. ఈ జీవితం పట్లా , అధికారం పట్లా విరక్తి పుట్టింది…”

“ఈ వయసులో అది సహజమే త్రిశంకూ !” వశిష్ఠమహర్షి చిరునవ్వుతో అన్నాడు. “హరిశ్చంద్రుడు పెద్దవాడయ్యాడు కద ! అతన్ని రాజుగా అభిషేకించి , నివృత్తి జీవితం గడుపు !”

“నా ఉద్దేశం నివృత్తి జీవితం గడపడం కాదు. నాలో మోక్షేచ్ఛ బలంగా ఉంది. నేను స్వర్గానికి వెళ్ళాలి గురుదేవా !”

వశిష్ఠుడు చిన్నగా నవ్వాడు. “అది మన చేతుల్లో లేదు త్రిశంకూ ! స్వర్గమో , నరకమో – మనిషి మరణిస్తే గానీ తేలదు. మరణం మన చేతిలో లేదు. స్వర్గవాస కాంక్షతోనే ఆత్మహత్య ద్వారా మరణిస్తే నరకం తప్పదు !”

“గురుదేవా ! దయచేసి నన్ను చెప్పనివ్వండి ! నేను మరణించకుండానే , ఈ శరీరంతోనే నేరుగా స్వర్గానికి వెళ్ళాలి !”

వశిష్ఠ మహర్షి నిర్ఘాతంపోతూ చూశాడు. త్రిశంకుడికి మతి భ్రమించిందా ?! “త్రిశంకూ , ఒక సత్యం చెప్తాను విను ! సశరీరంగా స్వర్గానికి చేరే వ్యవహారం అలా ఉంచుదాం ! ఒకవేళ నీకు సమీప భవిష్యత్తులో సహజ మరణం సంభవించినప్పటికీ నీకు స్వర్గవాసమూ , మోక్షమూ లభించే అవకాశం లేదు…”

“గురుదేవా !”

“ఎందుకో తెలుసా ? మోక్షకారకుడైన కేతుగ్రహదేవత నీకు అనుకూలంగా లేడు ! కేతువు వక్రంగా వీక్షిస్తే , మోక్షం సిద్ధించదు !”

త్రిశంకు చక్రవర్తి వశిష్ఠుడి వైపు రెప్పవేయకుండా , తీక్షణంగా చూశాడు. “గ్రహచారాన్నీ , అదృష్టాన్నీ మరిచిపోండి. గురుదేవా ! నన్ను బొందితో స్వర్గానికి పంపించే మహత్తర సంకల్పంతో అద్వితీయమైన మహాయాగం చేయండి. మీరు అందుకు సమర్థులని నాకు తెలుసు. మా వంశానికి చెందిన వైవస్వత మనుమహారాజుకు యజ్ఞాచరణంతో సంతతి కలిగేలా చేశారు మీరు !”

“అది వేరు , త్రిశంకు ! నీ కోరిక అసాధారణమైంది ! ఆచరణ సాధ్యం కానిది ! నిజం చెప్పాలంటే నీది ఆశ కాదు ; వ్యామోహం – విపరీతమైన వ్యామోహం !” వశిష్ఠ మహర్షి నిష్కర్షగా అన్నాడు.”నా విపరీత వ్యామోహాన్ని ఆశగా , ఆశయంగా పరివర్తింపజేయండి ! సశరీర స్వర్గయానానికీ , మోక్షానికీ అవసరమైన యాగం చేయండి !” త్రిశంకుడు గంభీరంగా అన్నాడు.

“ఆజ్ఞాపిస్తున్నావా , రాజా ?”

“అర్థించాను ; అభ్యర్థించాను ! ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను !”

“నీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నాను !”

“గురుదేవా !”

“మళ్ళీ చెప్తున్నాను త్రిశంకూ ! మోక్షకారక గ్రహం నీకు అనుకూలంగా లేదు ! క్రతువు విజయవంతం కాదు ! సఫలం కాదు ! ఫలించని క్రతువుని ఈ వశిష్ఠుడు చేయడు !” తీక్షణంగా చూస్తున్న త్రిశంకుడి చూపుల్ని పట్టించుకోకుండా వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయాడు.

ఆశ్రమ ప్రాంగణంలో అరుగు మీద కూర్చున్న విశ్వామిత్ర మహర్షి పాదాలకు ప్రణామం చేశాడు త్రిశంకు చక్రవర్తి “ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు !” విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు.

“సమయోచితమైన దీవెన అనుగ్రహించారు ! కులగురువైన వశిష్ఠుడి నిరాదరణను రుచి చూసి , అవమాన భారంతో మీ సన్నిధికి వచ్చాను” త్రిశంకుడు బరువుగా అన్నాడు.”ఏం జరిగింది , సత్యవ్రతా ?” విశ్వామిత్ర మహర్షి అనునయంగా అడిగాడు. “శాప రూపంలో ఆ వశిష్ఠుడు నీకు బహూకరించిన నామధేయంతో నిన్ను ఈ విశ్వామిత్రుడు సంబోధించడు !”

“ధన్యుణ్ణి ! రాజ్యాధికారం మీదా , జీవితం మీదా విరక్తి పెచ్చరిల్లిన కారణంగా , తగిన మహాయాగం చేసి , నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించి , ఆ విధంగా మోక్షం ఇప్పించమని ఆ వశిష్ఠ మహర్షిని అర్థించాను. ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించాడు !” త్రిశంకుడి కంఠంలో ఆవేశం గంటలా ధ్వనించింది.

“కారణం ?”

“మోక్షకారకుడైన కేతువు నన్ను వక్రంగా చూస్తున్నాడట !” త్రిశంకుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు.

విశ్వామిత్రుడు గొల్లున నవ్వాడు. “చేయగలిగిన చేవ ఉన్న వ్యక్తిని అడగాలి , సత్యవ్రతా నువ్వు ! ఆ వశిష్ఠుడు ఎంత ? అతగాడి తపోబలమెంత ? బ్రహ్మర్షి అన్న అహంకారం ఒక్కటే – ఆ వశిష్ఠుడు కాని , వశిష్ఠుడి బలం ! హోమాగ్నిని పుట్టించలేని వాడు ”సమిథలు పచ్చివి” అన్నట్టు తన చేతగానితనాన్ని గ్రహచారానికి ఆపాదించాడు !”

“గురుదేవా… నా కోరిక మీరే తీర్చాలి !” త్రిశంకు ప్రాధేయపూర్వకంగా అన్నాడు. “సత్యవ్రతా ! సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన మేధావి మాత్రమే , ”మహర్షి” మాత్రమే నిన్ను సశరీరంగా స్వర్గానికి సాగనంపగలడు ! నీ కోరిక నేను తీరుస్తాను ! ఆ వశిష్ఠుడి కళ్ళు తెరిపిస్తాను !” విశ్వామిత్రుడు సగర్వంగా అన్నాడు.”గురుదేవా ! మీరు అంగీకరించారు ! సశరీర స్వర్గ ప్రవేశంలో నాకింక అనుమానమే లేదు !” త్రిశంకుడు ఆనందంగా అన్నాడు.

“యజ్ఞ నిర్వహణకు సన్నద్ధం చేయించు. ముందుగా బ్రహ్మవాదులైన ఋషులను ఆహ్వానించు. నేను స్వయంగా యాజకత్వం వహించి యజ్ఞం చేయిస్తాను !”విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు.త్రిశంకు చక్రవర్తి కృతజ్ఞతా పూర్వకంగా విశ్వామిత్రుడికి పాదాభివందనం చేశాడు. “సశరీర స్వర్గ ప్రాప్తిరస్తు !” దీవించాడు విశ్వామిత్రుడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment