కేతుగ్రహ మహిమ
త్రిశంకుడు యాగనిర్వహణకు అవసరమైన ఋషులను ఆహ్వానించే ప్రయత్నంలో వశిష్ఠ పుత్రులను కలిశాడు. “మీ తండ్రిగారు నా ప్రార్ధనను నిరాదరించి , యజ్ఞం చేయడానికి నిరాకరించారు. విశ్వామిత్ర మహర్షి ఆ కార్యం చేయడానికి అంగీకరించారు. మీరు యజ్ఞంలో పాల్గొని నన్ను దీవించండి !”
“మా జనకులు నిరాకరించిన కార్యం మాకూ నిషేధించదగిందే ! ఒక క్షత్రియుడు యాజకుడుగా జరిపించే యజ్ఞం కాని యజ్ఞంలో మేం పాల్గొనడం జరగదు !” అన్నాడు వశిష్ఠ పుత్రుడు శక్తి. త్రిశంకుడు అవమాన భారంతో తిరిగి వచ్చాడు. ఇతర బ్రాహ్మణ బ్రహ్మవాదులను ఆహ్వానించడానికి వెళ్ళిన మంత్రి నిరాశగా తిరిగి వచ్చాడు.
“ప్రభూ ! విశ్వామిత్రుడు చేయించే క్షత్రియ యజ్ఞంలో పాల్గొనడం మహాపచారం అన్నారందరూ !” అన్నాడు మంత్రి. త్రిశంకు చక్రవర్తి జరిగిందంతా విశ్వామిత్ర మహర్షికి విన్నవించాడు. ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు.
“మహా తపస్సంపన్నుడైన ఈ విశ్వామిత్రుణ్ణి బ్రహ్మర్షిగా గుర్తించకపోవడం ఆ బ్రాహ్మణాధముల దౌర్భాగ్యం ! సత్యవ్రతా , ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను ! నేనొక్కడినే క్రతువును నిర్వర్తిస్తాను ! నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతాను ! ఈ విశ్వామిత్రుడి అనుగ్రహం ఉన్నంతకాలం మానవులే కాదు , ఏ గ్రహమూ నిన్ను ఏమీ చేయలేదు ! వెళ్ళు ! యజ్ఞశాలను సిద్ధం చేయించు !”
తన నేతృత్వంలో జరిగే యజ్ఞంలో పాల్గొనడానికి నిరాకరించిన వాళ్ళందరినీ ఘోరంగా శపించిన విశ్వామిత్రుడు , అనితర సాధ్యమైన రీతిలో త్రిశంకు చక్రవర్తి చేత మహాయజ్ఞం చేయించాడు. యజ్ఞహవిర్భాగాలను స్వీకరించడానికి అర్హులైన దేవతలందరినీ ఆవాహనం చేసి , మంత్ర పూర్వకంగా ఆహ్వానించాడు విశ్వామిత్రుడు. అసహజమైన , విపరీతమైన సంకల్పంతో సాగిన ఆ యజ్ఞంలో హవిస్సులను స్వీకరించడం అసమంజసమని భావించిన దేవతలు రాలేదు !
“గురుదేవా ! కర్తవ్యం ఏమిటి ? ఆవాహనం ద్వారా ఆహ్వానించబడిన దేవతలు ఆగమించి హవిస్సులో భాగాలను స్వీకరించకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు కద !” అన్నాడు త్రిశంకు చక్రవర్తి నిరాశగా. విశ్వామిత్ర మహర్షి తన ఆహ్వానాన్ని మన్నించని దేవతల మీద ఆగ్రహంతో ఊగిపోతూ , లేచి నిలుచున్నాడు. “స్రువం” అనబడే యజ్ఞోపకరణాన్ని పైకెత్తి ఇలా అన్నాడు.
“సత్యవ్రతా ! ఆందోళన వలదు ! నిర్వహణకు అవసరమైన బ్రహ్మ , ఉద్గాత , బ్రాహ్మణాచ్ఛంసి , హోత , అధ్వర్యుడు , ప్రస్తోత , ప్రతిప్రస్థాత , పోత , మైత్రావరుణుడు , ప్రతిహార్త , అచ్చావాకుడు , వేష్ట , అగ్నిధ్రుడు , సుబ్రహ్మణ్యుడు , గావస్తుతుడు , ఉన్నత – అనే ఆ షోడశ ఋత్విజులు లేనప్పటికీ నీ యజ్ఞాన్ని ఏకహస్తంతో విజయవంతంగా నిర్వర్తించాను. ఋత్విక్కులు రాకున్నా యజ్ఞం విజయవంతమైంది ; దేవతలు రాకున్నా యజ్ఞం ఫలవంత మవుతుంది ! ఫలవంతం చేస్తాను !”
“తమ దయ !” త్రిశంకుడు చేతులు జోడించి అన్నాడు.
“అత్యంత కఠోరమైన , ఘోరమైన తపస్సు సాగించి , సాధించిన తపోఫలాన్ని ధారబోసి నిన్ను నీ శరీరంతో సహా స్వర్గానికి పంపిస్తాను. యజ్ఞేశ్వరుడికీ , నాకూ ప్రణమిల్లి , లేచి నిలబడు !” విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు. త్రిశంకు చక్రవర్తి యజ్ఞేశ్వరుడికీ , విశ్వామిత్రుడికీ నమస్కరించి , లేచి నిలుచున్నాడు.
విశ్వామిత్రుడు అరమోడ్పు కన్నులతో ధ్యానం చేశాడు. మెల్లగా రెప్పలెత్తి త్రిశంకు చక్రవర్తిని చూశాడు. “సామాన్యులకు దుర్లభమైన సశరీర స్వర్గ ప్రాప్తి నీకు లభిస్తుంది. ఈ గాధిసుత విశ్వామిత్రుడి అఖండ తపశ్శక్తి , అదృశ్య దివ్య విమానంలాగా నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది. ఓం ! సశరీర స్వర్గధామవాస ప్రాప్తిరస్తు ! వెళ్ళు సత్యవ్రతా ! స్వర్గానికి తరలి వెళ్ళు !”
విశ్వామిత్ర మహర్షి అనుశాసనం వెలువడిన మరుక్షణం త్రిశంకు చక్రవర్తి శరీరం గాలిలోకి లేచి , వాయువేగాన్ని ధిక్కరిస్తూ ఖగోళంలోకి దూసుకుపోసాగింది. క్రిందకు చూస్తూ , విశ్వామిత్ర మహర్షికి చేతులు జోడించాడు త్రిశంకుడు. విశ్వామిత్రుడు సగర్వంగా చిరునవ్వు చిందిస్తూ చెయ్యెత్తి దీవించాడు.
త్రిశంకు చక్రవర్తి తారకాగ్రహ మండలాలనూ , సూర్యమండలాన్నీ అధిగమించి స్వర్గం వైపు అమిత వేగంతో ప్రయాణిస్తున్నాడు. స్వర్గ సామ్రాజ్యం వైపు దూసుకు వస్తున్న త్రిశంకు చక్రవర్తి గురించి చారులు దేవేంద్రునికి తెలియజేశారు. దేవేంద్రుడు స్వర్గధామం చేరుకున్నాడు. దేవతలూ , గంధర్వులూ , సిద్ధులూ , సాధ్యులూ , అప్సరసలూ అందరూ మానవ శరీరంలో స్వర్గాన్ని సమీపిస్తున్న త్రిశంకుడిని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
త్రిశంకుడు ద్వారం వద్దకు చేరుకున్నాడు. సహచర సమేతంగా దేవేంద్రుడు “తనకు స్వాగతం పలకడానికి సిధ్ధంగా ఉన్నాడని ఆయన అనుకున్నాడు. చేతులు జోడించి , దేవేంద్రునికి నమస్కరించాడు.”మహేంద్రా మహాభాగా ! నేను త్రిశంక చక్రవర్తిని ! మహర్షి విశ్వామిత్రుల వారు యజ్ఞం ఆచరించి , తమ తపశ్శక్తితో నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించారు. స్వర్గవాసిగా నన్ను స్వీకరించి , ఆదరించండి !”
“తెలుసు ! నీ అసహజ వ్యామోహమూ , ఆ విశ్వామిత్రుడి అహంకార యాగమూ మాకు తెలుసు. నీ శరీరం పాంచభౌతికం. పైపెచ్చు నువ్వు శాపగ్రస్తుడివి. పృథివీ , నీరు , అగ్ని , గాలీ , గగనం అనే పంచభూతాల సమ్మేళనంతో రూపొందిన పాంచభౌతిక దేహులకు స్వర్గవాస యోగ్యత లేదు. స్వర్గ ద్వారాలు నీకోసం తెరుచుకొనవు ! ఫో ! తిరిగిపో ! తలక్రిందులుగా నీ భూలోకానికి తిరిగిఫో !”అంటూ ఇంద్రుడు హస్త చాలనం చేశాడు.
మరుక్షణం త్రిశంకుడు తలక్రిందులుగా వేళ్ళాడుతూ మహావేగంతో భూమి వైపు – కిందికి దూసుకుపోసాగేడు. ఆయన హృదయాన్నీ , శరీరాన్నీ భయమూ , ఆందోళనా ఆక్రమించాయి. స్వర్గానికీ , భూమికీ మధ్య భాగాన్ని చేరుకున్న త్రిశంకుడు విశ్వామిత్రుణ్ణి ఉద్దేశించి బిగ్గరగా అరిచాడు.”మహర్షీ ! విశ్వామిత్రా ! నన్ను రక్షించండి ! రక్షించండి !” ఇంద్రుడి దుష్కార్యానికి ఆగ్రహించిన విశ్వామిత్రుడు త్రిశంకు చక్రవర్తి భూమిని చేరకుండా నిరోధించాలనుకున్నాడు.
“సత్యవ్రతా ! ఆగు ! అక్కడే ఆగు !” అంటూ ఆజ్ఞాపించాడు. అఖండ తపఃశక్తి నిండిన విశ్వామిత్ర శాసనం పనిచేసింది. త్రిశంకుడు గగనమధ్యంలో తల్లక్రిందులుగా అలాగే నిలిచిపోయాడు.
“రాజా ! నిన్ను సశరీరంగా స్వర్గానికి చేరుస్తానన్న ఈ విశ్వామిత్రుడి వాక్కు వృధా కాదు ! దేవేంద్రుడి స్వర్గాన్ని ధిక్కరిస్తూ నీ కోసం అక్కడే మరొక నూతన స్వర్గాన్ని సృష్టిస్తాను. అది నీ స్వర్గం. త్రిశంకు స్వర్గం ! నీ స్వర్గానికి నాయకుడైన ఇంద్రుడు నువ్వే !” అన్నాడు విశ్వామిత్రుడు గంభీరంగా.
నిర్వికల్పానంద కథనం ఆపి , శిష్యులను సాభిప్రాయంగా కలయజూశాడు. “వాగ్దానం చేసిన విధంగానే విశ్వామిత్ర మహర్షి త్రిశంకుడి కోసం భువికీ , దివికీ మధ్య అప్పటికప్పుడు ద్వితీయ స్వర్గాన్ని సృష్టించాడు. సృష్టిని ప్రతి సృష్టి చేయగలిగిన తపస్సంపన్నుడుకదా , ఆయన ! అయితే ఆయన సృష్టించిన త్రిశంకు స్వర్గం అటూ ఇటూ కాకుండా పోయింది. అందుకే రెంటికీ చెడిన వ్యక్తి ”త్రిశంకు స్వర్గం”లో ఉన్నాడు అంటూ ఉంటారు. అర్థమైంది కదా – త్రిశంకు స్వర్గం ఏర్పడడానికి మూలకారణం త్రిశంకుడికి కేతు గ్రహం అనుకూలించక పోవడమేనని !”
“బాగుంది , గురువుగారూ ! రాహువు అశుభ వీక్షణ మూలంగా హరిశ్చంద్ర చక్రవర్తీ , కేతువు అశుభ వీక్షణ కారణంగా ఆయన తండ్రి త్రిశంకు చక్రవర్తీ కష్టాల పాలయ్యారు !” విమలానందుడు చిరునవ్వుతో అన్నాడు.
“మీకు మళ్ళీ చెప్తున్నాను: వ్యక్తికి దాపురించిన కష్టాలనూ , నష్టాలనూ ఆధారం చేసుకుని తత్సంబంధమైన కారకశక్తి కలిగిన గ్రహ వీక్షణ కారణం అయి ఉండవచ్చు అన్న గణన ప్రాతిపదికగా మనం కొందరి జీవితాలనూ , చరిత్రలనూ ఉదాహరణలుగా చెప్పుకున్నాం ! అది అశాస్త్రీయమూ కాదు ; అసంబద్ధమూ కాదు !” నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు.
“గురువుగారూ ! సమగ్రంగా , ఆసక్తికరంగా మీరు శ్రవణం చేయించిన నవగ్రహ పురాణం మాకు పరమానందాన్ని కలిగించింది !” సదానందుడు తృప్తిగా అన్నాడు.”అంతేకాదు , నవగ్రహాల ఉనికి గురించీ , ఆ దేవతల మహిమ గురించీ మనకు చక్కటి అవగాహన కలిగింది !” శివానందుడు అన్నాడు.
“నవగ్రహ పురాణం శ్రవణం చేశాక , మన దేశంలోని నవగ్రహ ఆలయాలను దర్శించాలన్న కోరిక కలుగుతోంది !” చిదానందుడు ఉత్సాహంగా అన్నాడు.”గురువుగారూ ! నవగ్రహ ఆలయాల దర్శనానికి వెడదామా ?” విమలానందుడు అడిగాడు.
“అలాగే , వెళ్లాం !” నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. “ఇప్పుడు నవగ్రహ పురాణ శ్రవణ ఫలశ్రుతి చెప్పుకుందాం ! నవగ్రహ పురాణ శ్రవణమూ , పఠనమూ చేసిన మానవులకు నవగ్రహాల కరుణ పుష్కలంగా లభిస్తుంది ! నవగ్రహ పురాణం ఇంతటితో పరిసమాప్తమైంది !”
“ఓమ్ ! ఆదిత్యాది నవగ్రహార్పణం !”
ఇది శ్రీ కౌండిన్య సగోత్రుడూ , ఆపస్తంబ సూత్రుడూ , వక్కంతం సుబ్బమ్మా వెంకట్రామయ్యల ప్రపౌత్రుడూ , లక్ష్మమ్మా రామయ్యల పౌత్రుడూ , సుబ్బలక్షమ్మా వరదయ్యల పుత్రుడూ రామసుబ్బయ్య గారి అనుజుడూ అయిన వక్కంతం సూర్యనారాయణరావు గారు రచించిన నవగ్రహపురాణం
సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹