అష్టాంగయోగం, ఏకాక్షర బ్రహ్మ, ప్రణవ జపమాహత్మ్యం
ద్విజశ్రేష్ఠులారా! మానవులకు భోగ, మోక్ష ప్రదానానికి శ్రేష్ఠతమ సాధనమైన మహాయోగాన్ని సర్వాంగ సహితంగా వినిపిస్తాను. భక్తి పూర్వకంగా ఈ మహాయోగ విధిని చదివినంతమాత్రాననే మనుష్యులు సర్వపాపాలూ పటాపంచలౌతాయి.
ఒకప్పుడు మహామతియు భగవంతుడునైన దత్తాత్రేయుడు అలర్క మహారాజుకీ మహావిషయాన్ని అనుగ్రహించాడు. మమతయే దుఃఖాలకు మూలము. ఆ మమతను పరిత్యజించుటయే దుఃఖాలను దూరం చేసే గొప్ప ఉపాయము. అజ్ఞానరూపియైన మహావృక్షము. అహంకారంతోనే అంకురిస్తుంది. మమత ఆ చెట్టునకు బోదె వంటిది. ఇళ్ళూ, పొలాలూ ఆస్తులు దాని కొమ్మలు. పత్నిదాని చిగురుటాకైతే ధనధాన్యాలు పత్రాలు మరియు పాపమే దాని అత్యంత దుర్గమమైన మూలము. మానవులు తాము పొందుతున్నామనుకుంటున్న ఆపాత రమణీయమైన సుఖమూ శాంతీ ఈ పాపమూలకాలే కాబట్టి అశాశ్వతాలు.
నిత్యానందకారకమైన పరబ్రహ్మలో లీనమైపోవాలని కోరుకునేవారు. జ్ఞానమనే గొడ్డలి సహాయంతో ఈ మహా అజ్ఞాన మహావృక్షాన్ని నరికి పారెయ్యాలి. అప్పుడేవారు బ్రహ్మరసాన్ని నిష్కంటకంగా పానం చేసి ప్రాజ్ఞులై నిత్యసుఖాన్నీ పరమశాంతినీ పొందగలరు. ఈ సమస్త దృశ్య ప్రపంచమూ, ఇంద్రియాలూ కూడా అదే పరబ్రహ్మలోనే లీనమైపోతాయి. అక్కడ నువ్వు, నేను అనే భావన వుండదు. శబ్దాది తన్మాత్రలుండవు. అంతఃకరణే వుండదు. జీవుడూ ఆత్మా ఐక్యమై వున్నా వేరు వేరు భావాలున్నాయని బోధపడుతుంది. ఇది జ్ఞానం తక్కువ కావడం వల్ల జరుగుతుంది. ఆత్మతో కలసి వుంటుందనుకున్న శరీరం దానిలో ప్రచలితంగా వున్న ”నేను” అనే భావన ఆ శరీరంతోనే పోతాయి. శరీరమూ పోతుంది. కాబట్టి త్రిగుణాల మధ్య వున్న నేను అనేది ఆత్మ కాదు. ఆత్మ త్రిగుణాతీతం. దానిని తెలుసుకున్నవాడే యోగి.
ఎందులోనైతే నివసిస్తామో దానిని ”ఇల్లు” అంటారు. దేనినైతే తింటున్నామో దానిని ”ఆహారం” అంటాము. అలాగే మోక్షాన్ని గూర్చి ఏ విద్యను నేర్చుకుంటామో అదే “యోగవిద్య”. అజ్ఞానం మనకూ ఈ విద్యకూ మధ్య వుండే పొర. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అగ్రాహ్యం, అనేవి యమనియమాలనబడతాయి. శౌచము బాహ్యమనీ అంతరమనీ రెండు విధాలు. దమము అనగా మనస్సును అదుపులో ఉంచుకోవడం.
శరీరంలో ప్రవహించే వాయువుపై విజయాన్ని సాధించడానికే ప్రాణాయామం చేయాలి. ప్రతి ప్రాణాయామ మాత్రలోనూ కుంభక, రేచక, పూరకాలని మూడు 1 భాగాలుంటాయి. పది మాత్రలపాటు చేసే ప్రాణాయామాన్ని లఘు ప్రాణాయామమనీ, దీనికి రెట్టింపు మాత్రలను మధ్యమ ప్రాణాయామమనీ దీనికి మూడింతల మాత్రల పర్యంతము చేయగలిగితే దానిని ఉత్తమ ప్రాణాయామమనీ అంటారు. జప ధ్యాన సహిత ప్రాణాయామాన్ని ”సగర్భ” ప్రాణాయామము అంటారు. ఇక ప్రణవం అనగా ఓంకారమే. యోగి పద్మాసనం వేసుకొని ప్రణవంలో చిత్తాన్ని ఏకాగ్రం చేసి ధ్యానం, జపం చేయాలి. ఈ స్థితిలోనతడు తన లింగాన్నీ వృషణాలతోనూ కాలి మడమలతో అదిమి పట్టి అన్ని వికారాలనూ అదుపులో ఉంచుకోగలగాలి. తమోగుణాన్ని రజోగుణంచేతా, రజోగుణాన్ని సత్త్వగుణం చేతా అణచివేసి నిశ్చల వృత్తిని సాధించాలి. పంచేంద్రియాలనూ ప్రాపంచిక వాంఛలకు దూరం చేయాలి. వాయువును వీలైనంతసేపు ఆపి అదుపులోకి తెచ్చుకొని వదలి మనస్సును రాగద్వేషాలకతీతం చేసుకోవాలి. ప్రత్యాహారమను పేరు గల ఈ పద్ధతిని నిరంతరం అభ్యసిస్తూ ఆచరిస్తూ వుండాలి.
ఎనిమిది లేక పది ప్రాణాయామాలను తీసుకొనుటను ధారణ అంటారు. ఈ ధారణకు శరీరంలో పదిస్థానాలుంటాయి. అవి నాడి (నాభి) గుండె, గొంతు, నోరు, ముక్కుకొన, కనురెప్పల నడిమిభాగము తల – ఇక చివరగా ఆత్మ. ఈస్థానాలన్నీ వ్యక్తి అదుపులోకి వస్తే అతడు శాశ్వతుడవుతాడు.అగ్ని అగ్నిలో కలిసినట్లుగా ఆత్మ పరమాత్మలో కలసిపోతుంది. ఓంకారమే పరబ్రహ్మకు సంకేతం. దానిని మనం నిద్రలో ఉన్నా శ్వాస ద్వారా జపించగలగడమే యోగసిద్ధి. అగ్నిలో వేసిన ఏ వస్తువైనా అగ్ని ఆకారాన్నే ధరించినట్లు పరమాత్మ ధ్యానంలోనే వుండిపోయే ఆత్మ పరమాత్మ ఆకారాన్నే ధరిస్తుంది. అప్పుడు సాధకుడు ఓంకారాన్ని మనసుతో శ్వాసతో జపిస్తాడు. అందులోని అ, ఉ, మ కారాలే సత్త్వరజస్తమోగుణాలతో కలిసిపోయి తుదకు వాటిని జయించడంలో సాధకుని సార్ధకుని చేస్తాయి.
ఓమ్ లో చివరి అర్ధమాత్ర నిర్గుణము. అది యోగుల ద్వారా తెలుపబడుతుంది. ఇందులో ‘గ్’ అనే ధ్వని కలిసి గాంధార స్వరం పలికి యోగమార్గంలో పరబ్రహ్మవైపు తీసుకువెళ్ళే యోగంగా స్వీకరింపబడింది. ఇపుడు సాధకుడు తనలో తాను తనతో తాను బ్రహ్మ భావనను నిశ్చితం చేసుకుంటూ ఇలా అనుకుంటాడు.
1) పూరక (గాలిని లోనికి పీల్చుట)
2) కుంభక (గాలినలాగే లోపలే వుంచుట)
3) రేచక (గాలిని బయటికి వదలుట)
“నేను జ్యోతిర్మయ పరబ్రహ్మను. నాకు స్థూల దేహంలేదు. ఈ పృథ్విపైనున్న ఏ మలమూ అంటని జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను. నేను వాయురాకాశర హితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మను. నేను. “స్థానాస్థాన రహితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మనునేను. గంధతన్మాత్ర లేని జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను.
శ్రోత్రత్వచేంద్రియ రహితుడైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను. ప్రాణాపాన వ్యానోదానవాయు రహిత జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను. అజ్ఞాన రహితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను. శరీర, ఇంద్రియ, మనఃబుద్ధి, ప్రాణ అహంకారములు వుండని తురీయావస్థలో ప్రకాశించు పరమపద స్వరూపం, జ్యోతిర్మయం ఐన పరబ్రహ్మను నేను. నిత్య శుద్ధ- బుద్ధ, ముక్త, ఆనందమయ, అద్వైత, జ్ఞాన స్వరూప, జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను”. ఈ విధంగా పరబ్రహ్మను సాధించి పెట్టేది అష్టాంగయోగం. మాయా పాశబద్ధులై నిత్య- నైమిత్తిక కార్యాలను మాత్రమే చేసేవారు, ఆ చక్రంలోనే గిరగిర తిరుగుతూ జీవితాంతం ఉండిపోతారు. కాబట్టి వారికి పరమాత్మలో ఐక్యమయ్యే స్థాయిరాదు. వారు మరల మరల ఇదే పుడమిపై ఇలాగే పుడుతుంటారు, గిడుతుంటారు. అజ్ఞానంచే మోహితులై ఆ విషయాన్ని గ్రహించి అజ్ఞానాన్ని నశింపచేసుకొని జ్ఞానయోగ ప్రాప్తికై తపించి దానిని కైవసం చేసుకొని జీవన్ముక్తులైన వారూ ఉన్నారు.
జీవన్ముక్తుడైన యోగికి మరణం లేదు. దుఃఖముండదు, రోగమంటదు, సంసారంలోని ఏ బంధమూ వానిని బంధింప సమర్థం కాదు. పాపముక్తుడు కాబట్టి నరక దర్శనముండదు. గర్వముండదు. గర్భవాసక్లేశముండదు. అతడే స్వయంగా అవ్యయ నారాయణ స్వరూపుడవుతాడు. ధ్యానం, పూజ, జపం, స్తోత్రం, వ్రతం, యజ్ఞం, దాన నియమపాలనం చేయడం వల్ల మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దానివల్ల జ్ఞానం కలిగే అవకాశ ముంటుంది. ప్రణవాది మంత్ర జపం చాలా గొప్పది. ఇంద్రుడు దానివల్లే దేవేంద్రుడైనాడు. గంధర్వులూ, అప్సరలు, దేవతలందరు కూడా ఆ జపం వల్లే అక్కడ నిలబడగలుగుతున్నారు. రాజుల రాజత్వానికాధారమూ మంత్రజపమే.
నూట నలబై రెండవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹