Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట నలబై నాల్గవ అధ్యాయం

నామసంకీర్తన మహిమ

ముక్తికి కారణభూతుడు, అనాది, అనంతుడు, అజుడు, నిత్యుడు, అవ్యయుడు, అక్షయుడునగు శ్రీ మహావిష్ణువు నామ సంకీర్తననే నిత్యం చేసేవానికి ఈ లోకమే నమస్కరిస్తుంది. నేను (అనగా సూతుడు, బ్రహ్మ మొదలగువారు) ఆనందస్వరూపుడు, అద్వైతుడు, విజ్ఞానమయుడు, సర్వవ్యాపకుడు, సకల జన హృదయ వాసుదేవుడునగు విష్ణుభగవానునికి భక్తిభావంతో, ఏకాగ్ర మనస్కుడనై ఎల్లపుడూ నమస్కరిస్తున్నాను.

ఈశ్వరుడై ఐశ్వర్యాన్ని పంచుతూ అందరి అంతఃకరణలలో నిత్యనివాసం చేస్తూ అందరి శుభాశుభ కర్మలనూ వీక్షించే సర్వసాక్షియు పరమేశ్వరుడునైన శ్రీ మహా విష్ణువునకు నా నమస్కారములు. శరీరంలో తగినంత శక్తి వుండీ కూడా భగవంతుడైన చక్రపాణికి నమస్కారం చేయని వానికంటే గాలికి కదలాడే తుచ్ఛమైన గడ్డి పరకమేలు. దీనికన్నా అదే ఉద్విగ్నంగా వుంటుంది. నవనీల మేఘశ్యాముడు, లోకనాథుడు, పరమపురుషుడు, అప్రమేయుడునైన శ్రీకృష్ణభగవానునికి భక్తి పరవశుడై ఒక్కమారు సర్వస్వాన్ని అర్పించుకుంటూ నమస్కారం చేస్తున్న శ్వపచుడు (చండాలుడు) కులీనుల కంటె ఉత్తముడై ఉత్తమ గతులు పొందుట కర్హుడవుతాడు. వంద యజ్ఞాలు చేసినా దక్కని ఫలం నేలపై బడి శ్రీకృష్ణునికి భక్త్యశ్రువులు పొంగుతుండగా సాక్షాద్దండ ప్రణామం ఒక్కసారి చేస్తేనే దక్కుతుంది. ఈ సాష్టాంగ ప్రణామమే సంసార ప్రళయ జలాల్లో మునగని నావలాగా నిలబడి కృష్ణభక్తుని కాపాడుతుంది. ముక్తిని ప్రసాదిస్తుంది.

నమో నారాయణాయ

మంత్ర స్మరణమెంతో సులభం. దానినలా ఏ పనిచేస్తున్నా , ఏపని చేయకున్నా, శ్వాసతో బాటుగా స్మరిస్తే చాలు ”ఇక్కడ” అన్ని సుఖాలూ ”అక్కడ” స్వర్గసుఖాలూ లభిస్తాయి. అయినా ప్రజలు మూర్ఖులై ఈ మంత్రాన్ని విస్మరించి నరకానికి పోతున్నారు.విష్ణు మహిమను గానం చెయ్యాలంటే వెయ్యి ముఖాలైనా చాలవు. రెండువేల నాలుకలున్న శేషుడే ఎంత గానం చేసినా స్వామి మహిమలో సహస్రాంశను కూడా చెప్పలేకపోయాడు. వ్యాసాది మహానుభావులే ఆయన లీలలను అనితర సాధ్యంగా చెప్పి కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు.

కాబట్టి ఆయన దయ ఎంత గొప్పదంటే తనను ఒక్కమారు ఆర్తిగా భక్తితో పిలచినా వచ్చి రక్షిస్తాడు. పులిపంజాలో చిక్కుకోబోతూ, చివరిక్షణంలో ఆ పులి శరాఘాతం వల్ల కూలిపోతే రక్షింపబడ్డ లేడి వలె కోరికల వెంట పరుగుతీసి, అలసి, అజ్ఞానపు తెరలు తొలగి, చివరిక్షణంలో కృష్ణుని శరణు కోరినవాడు. రక్షింపబడతాడు. తననూ తన పరివారాన్నీ కూడా మోక్షం వైపు నడిపింపగలుగుతాడు. కలలో కూడా శ్రీకృష్ణనామస్మరణను చేస్తూనే ఉండే మనుష్యుని పూర్వ అక్షయ పాపరాశి అంతా వినష్టమైపోతుంది. హేకృష్ణా! హే అచ్యుతా! హే అనంతా! హే వాసుదేవా! నీకు నమస్కారము ”అని ఆయనను ఎలుగెత్తి పిలిచి నమస్కారం చేసే వాడు యమపురికి పోనక్కరలేదు. పాశములచేత బట్టి పనికి బయల్దేరుతున్న తన కింకరులతో యముడిలా అంటాడట.”

దూతలారా! మీరు మధుసూదనుడైన మహావిష్ణుని భక్తులజోలికి పోకండి. నేను అన్యజీవుల పాపుల గుంపుకే స్వామిని, వారినే శిక్షింపగలను. మీరు వారినే గొని రాగలరు. విష్ణు భక్తులకు స్వామి విష్ణువే. వారి మరణానంతర జీవనాన్ని ఆయనే చూసుకుంటాడు. నామసంకీర్తన వల్ల కలిగే సుఖం ముందు స్వర్గ సుఖం తుచ్ఛంగా కనిపిస్తుంది. పైగా అది అనిత్యం, క్షయశీలం, శ్రీకృష్ణధామం దాకా గల మార్గంలో కృష్ణదేవలగ్న చిత్తుడైన వానికేకైక పాధేయం (అనుపమ అవలంబనం) శ్రీ కృష్ణనామసంకీర్తనమే.

సంసారరూప సర్పదంశ (పాముకాటు) కు ఏకమాత్ర ఔషధం ”శ్రీకృష్ణ”నామమే. ఈ క్రింది వైష్ణవ మంత్రాన్ని జపించిన వారికి ముక్తి సులభసాధ్యము.

పాధేయం పుండరీకాక్ష ||

నామ సంకీర్తనం హరేః ||

సంసార సర్ప సందష్టవిష చేష్టక భేషజం ॥

కృతయుగంలో హరినే ధ్యానిస్తూ త్రేతాయుగంలో ఆయన మంత్రాలను జపిస్తూ ద్వాపరంలో ఆయనను పూజిస్తూ, ఏ ఫలాలనైతే ప్రాణులు పొందాయో అవే ఫలాలను కలియుగంలో, కేశవ నామస్మరణ, సంకీర్తన మాత్రమున పొందగలవు.

ధ్యాయన్ కృతే జపన్ మంత్రై
త్రేతాయాం ద్వాపరే ర్భయన్ ||
యదాప్నోతి తదాప్నోతి
కలౌ సంస్కృత్య కేశవం ||

జిహ్వాగ్రాన హరియను రెండక్షరములుగల వ్యక్తి సంసారసాగరాన్ని అనాయాసంగా దాటి మోక్షమునందగలడు.

జిహ్వాగ్రే వర్తతేయస్య హరిరిత్యక్షర ద్వయం ||

సంసార సాగరం తీర్వాస గచ్ఛేద్వైష్ణవంపదం ||

అనేక పాపాలను తెలిసో తెలియకో చేసిన వారు వాటి నుండి ముక్తులై పరిశుద్ధులు కావాలంటే హరినామస్మరణమే మార్గము. నారాయణ స్తవనము, గుణ కీర్తనలచే నిండిన కథలను వినడంలో నిమగ్నుడైన వ్యక్తిని ఈ సంసారంలో ఏదీ బాధించలేదు. కలలో కూడ అతడీ లోకాన్ని వరించడు.

విజ్ఞాత దుష్కృతి సహస్రమావృతో పి ||

శ్రేయః పరంతు పరిశుద్ధమ భీప్సమావః ||

స్వపాంతరే నహి పునశ్చ భవం సపశ్యే ||

న్నారాయణ స్తుతి కథా పరమో మనుష్యః ||

నూట నలబై నాల్గవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment