Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట నలబై ఐదవ అధ్యాయం

విష్ణుపూజలో శ్రద్ధాభక్తుల మహిమ

శౌనకాది మహామునులారా! జీవన సారం సర్వలోక స్వామియైన శ్రీహరి ఆరాధన మాత్రమే. పురుషసూక్తం ద్వారా ఎవరైతే పుష్ప జలాదులను ఆ పరాత్పరునికి ఆ శ్రీమహా విష్ణువుకి సమర్పిస్తారో వారు సర్వదేవతలనూ సర్వజగత్తుతో సహా పూజించిన పుణ్యాన్ని పొందుతారు. విష్ణు పూజ చేయని వానిని బ్రహ్మఘాతిని చూసినట్లే చూడాలి.

సమస్త ప్రాణుల ఉత్పత్తి ఎవని నుండి జరిగిందో, సమస్త చరాచర జగత్తంతటా వ్యాపించిన భగవంతుడెవరో అట్టి విష్ణు దేవుని పూజించని మానవుడు పేడపురుగుతో సమానుడు. నరకంలో నోటితో చెప్పరాని బాధలు పడుతున్న వారిని యమధర్మరాజు ఇలా ప్రశ్నిస్తాడు. ”ఏమయ్యా, ఏమమ్మా? మీరు కష్టవినాశకుడైన విష్ణుదేవుని అస్సలు పూజించనే లేదా? ఎందుచేత? స్తోమతులేకనా? ఆయనతో ఆ సమస్యే ఉత్పన్నం కాదే! ఒక నీటి చుక్కను ఆయనకు సమర్పించి నమస్కారం చేస్తే ప్రసన్నుడైపోయి తన లోకాన్నే మీకిచ్చివేసే కరుణామయుడు కదా ఆయన! విష్ణుపూజను చేయక ఈ నరకంలో పడ్డారు. ఏల చేసిరి కాదో?”

శ్రద్ధగా మనిషి చేసే పూజలకి సంతుష్టుడై ఆ మహావిష్ణువు తనికి చేసే ఉపకారాన్ని వాని తల్లిగాని తండ్రిగాని సోదరుడు గాని, వేయేల, మరే దేవతలు గాని చేయలేరు. అలాగే మనస్సు పెట్టి చేసే పూజ తప్ప ఆయనకెవరూ ఏమీ సంతుష్టిగా పెట్టనూ లేరు. దానాలు గాని స్వర్ణం గాని ఖరీదైన సుగంధాలు గాని అనులేపనాలు గాని భక్తివలె ఆయనను తృప్తిపఱచలేవు.నీ సంపత్తి, ఐశ్వర్యం, బలం, పుత్రపౌత్రా దులు, మాహాత్మ్యము ఇవేమీ ఆయనకవసరం లేదు. ఆయనకి కావలసింది భక్తి ఒక్కటే.

(సహస్ర శీర్షా పురుషః మున్నగు పదహారు మంత్రాలు పురుష సూక్త నామంతో ప్రసిద్ధాలు. ఈ మంత్రాలన్ని దేవతా సంహితలలోనూ వుంటాయి.)

నూట నలబై ఐదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment