Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట నలబై ఆరవ అధ్యాయం

విష్ణుభక్తి మాహాత్మ్యం

అన్ని శాస్త్రాలనూ అవలోకించి మరల మరల విచారించి చూస్తే తేలే పరమవిజ్ఞాన పూర్ణమైన నిష్కర్ష ఒక్కటే. అదేమనగా మనుష్యులు ఎల్లవేళలా శ్రీమన్నారాయణునే ధ్యానించాలి.

ఆలోక్య సర్వశాస్త్రాణి |
విచార్య చ పునః పునః ||

ఇద మేకం సునిష్పన్నం |
ధ్యేయో నారాయణః సదా ||

తదేక నిష్ఠతో నిత్యం నారాయణ ధ్యానం చేసేవానికి దానాలు, విభిన్న తీర్థ పరిభ్రమణం, తపస్సు, యజ్ఞాలు చేయడంవంటివి ఎందుకు? ఏం ప్రయోజనం? అనగా శ్రీమన్నారాయణ ధ్యానమే సర్వోత్కృష్టదానం, తీర్థం, యజ్ఞం. సమస్త ప్రాయశ్చిత్తాలూ, తపఃకర్మలు విష్ణువు వైపు నడిపించేవే. వీటన్నిటిలో సర్వశ్రేష్ఠతపం ఆయన ధ్యానమే. ఎన్ని పాపాలు చేసిన వాడైనా పశ్చాత్తాపపడి మనసా హరిని ధ్యానిస్తూ శేషజీవితం గడిపితే చాలు. ప్రాయశ్చిత్తం అవసరమే లేదు.

ఒక ముహూర్తం పాటు అన్నీ మఱచి ఆయనను ధ్యానిస్తేనే స్వర్గం ప్రాప్తిస్తుంది. అటువంటప్పుడు అనన్య పరాయణ భక్తి గలవాని విషయము చెప్పనేల?

ముహూర్తమపియోధ్యాయే |
నారాయణ తంద్రితః ||

సో పి స్వర్గతి మాప్నోతి |
కిం పునస్తత్పరాయణః ||

యోగ పరాయణులు, యోగసిద్ధులు కలలోనూ ఇలలోనూ కూడా, చివరికి సుషుప్త్యవస్థలోనూ భగవానుడైన అచ్యుతునే మనసా ఆశ్రయించి వుంటారు. సామాన్యు లైనా లేస్తూ, పడుతూ, రోదిస్తూ, తింటూ, కూర్చుంటూ, నిద్రిస్తూ మేలుకొంటూ గోవిందా మాధవా నారాయణా అంటూ స్మరిస్తుండాలి. ఎవరి కర్మలను వారు నిర్వర్తిస్తూనే చిత్తాన్ని హరిపై లగ్నం చేయాలి. ఆయన పట్లనే అనురక్తులై వుండాలని శాస్త్రాల కథనం.

స్వే స్వే కర్మణ్య భిరతః |
కుర్యా చిత్తం జనార్దనే ||

ఏషా శాస్త్రాను సారోక్తిః |
కిమన్యైర్బహు భాషితైః ||

ధ్యానమే పరమధర్మము. ధ్యానమే పరమ తపము, ధ్యానమే పరమశుద్ధి. కాబట్టి మానవులు భగవద్ధ్యాన పరాయణులై వుండాలి. విష్ణుధ్యానమును మించిన ధ్యానము లేదు, ఉపవాసాన్ని మించిన తపస్సు లేదు, కాబట్టి వాసుదేవచింతనమే మన ప్రధాన కర్మ కావాలి. ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఏవైతే అత్యంత దుర్లభాలో, కనీసం ఆలోచనకు కూడ అందవో అలాటి వాటినన్నిటినీ మధుసూదనుడు మనం అడగకుండానే ఇస్తాడు. యజ్ఞాదులలో పొరపాట్లను కూడా ఆయన పూరిస్తాడు.

ప్రమాదాత్ కుర్వతం కర్మ |
ప్రచ్యవేతా ధ్వరేషుయత్ ||

స్మరణాదేవ తద్విష్ణోః |
సంపూర్ణం స్వాతి శ్రుతిః ||

పాపకర్ములను శుద్ధిపరచాలంటే హరి ధ్యానమును మించిన సాధనం లేదు. పునర్జన్మను తెచ్చే కారణాలను దహించి భస్మం చేసే యోగాగ్ని హరిధ్యానం. సమాధి (ధ్యానయోగ) సంపన్నుడైన యోగి.

యోగాగ్నిలో తను తెలిసీ తెలియక చేసిన కర్మఫలాలన్నిటినీ భస్మము చేసి పూర్వకర్మఫలం కూడా లేకుండా చూసుకొని ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు. వాయువుకు అగ్నితోడైనట్లు ధ్యానయోగికి విష్ణు కృపతోడై వాని కర్మఫలాలను దహించి వేస్తుంది.

స్వర్ణంలోగల మలం అగ్నిలో పడితే మటుమాయమైనట్లు మనిషిలోని మాలిన్యం విష్ణుధ్యాసలోపడితే పటాపంచలైపోతుంది. మంచికోసం ఎదురుచూడకుండా హరి వైపు మళ్ళిపోవాలి. హరిధ్యానము చేసే రోజే మంచిరోజు, తిథే మంచి తిథి, తారే (నక్షత్రమే) సంపత్తార.

ఎవని హృదయంలోనైతే గోవిందుడుంటాడో వానికి కలియుగం కూడా సత్య (కృత) యుగమైపోతుంది. సుఖంగా ఉంటాడు ఏమీ లేకపోయినా అదే హరి హృదయమందు లేనివానికి సత్యయుగమే కలియుగమై పోతుంది. ఏమీ సుఖముండదు. అన్నీ సమకూడియున్నా.

కలౌ కృత యుగం తస్య |
కలిస్త స్య కృతయుగే ||

హృదయే యస్య గోవింద |
యస్య చేతసి నాచ్యుతః ||

యస్యాగ్రత స్తథా పృష్టే |
గచ్ఛతస్తిష్ఠతో పివా ||

గోవిందే నియతం చేతః |
కృత కృత్య సదైవ సః ||

శ్రీ కేశవదేవుని చరణాలపై తన మనసునూ జీవితాన్నీ సంపూర్ణంగా అర్పించిన మహాభక్తుడు గృహస్థాశ్రమాన్ని పరిత్యజింపకపోయినా, మహాతపశ్చర్యలో మగ్నుడు కాకపోయినా మాయను ఛేదింపగలడు శ్రీమహావిష్ణువు ఎవని హృదయంలో కొలువై వుంటాడో అతడు క్రోధులను క్షమతోనూ మూర్ఖులను దయతోనూ మార్చగలదు. ధర్మాత్ములపై ప్రసన్నతను కురిపించగలడు.

క్షమాంకుర్వంతి కృద్ధేషు |
దయాం మూర్ఖషు మానవాః ||

ముదంచ ధర్మ శీలేషు |
గోవిందే హృదయ స్థితే ||

స్నానదానాది సత్కర్మలను చేస్తున్నపుడూ, దుష్కర్మలకి ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటున్నపుడూ శ్రీహరిని ధ్యానిస్తూ చేస్తే అవి మరింత గొప్ప ఫలాన్నిస్తాయి. నీలకమల సమాన కాంతిమంతుడూ, సుందర శ్యామవర్ణుడునైన శ్రీమహా విష్ణువు ప్రకాశించే హృదయం కలవాడు. సర్వవిజయుడౌతాడు. పరాభవప్రసక్తే లేదు.

లాభస్తేషాం జయస్తేషాం |
కుతస్తేషాం పరాభవః ||

యేషా మిందీవర శ్యామో |
హృదయ స్థోజనార్దనః ||

పూర్వపుణ్యం కొద్దీ కీటకాలు, ఈగలూ, పక్షులూ మున్నగు జంతువులే హరిని చిత్తంలో స్మరిస్తే ఉత్తమగతులు నొందుతాయి. ఇక జ్ఞాన సంపన్నులైన మానవుల సంగతి వేరే చెప్పాలా?

కీటపక్షి గణానాంచ |
హరౌ సంన్యస్త చేతసాం ||

ఊర్ధ్వా హ్యేవ గతిశ్చాస్త్రి |
కిం పునర్ జ్ఞానినాం నృణాం ||

భగవంతుడైన వాసుదేవుడను మహావృక్షము యొక్క నీడలో నివసించగలిగిన వారికి ఎముకలు కొరికే చలిగాని గుండెను మండించే వేడిగాని వుండవు. ఈ నీడయే మనను నరకం నుండి రక్షిస్తుంది..

వాసుదేవ తరుచ్చాయా |
నాతి శీతా తితా పదా ||

నరక ద్వార శమనీ సా |
కిమర్దంచ న సేవ్యతే ||

మిత్రులారా! మధుసూదన భగవానుని తన మనసులో నివసింప చేసుకో గలిగిన వానినీ, అహర్నిశలూ ఆయననే ధ్యానించే వానినీ, మహాక్రోధి దుర్వాసుని శాపం కూడా నశింపచేయలేదు. ఇంద్రుని శాసనమైనా వానిని బాధింప సమర్థం కాదు.

నచ దుర్వాస సః శాపో |
రాజ్యం చాపి శచీపతేః ||

హంతుం సమర్థం హి సకేః |
హృత్ కృతే మధుసూదనే ||

ఎవరితోనో మాట్లాడుతూ, ఆపుతూ, ఇచ్ఛానుసారం అన్యకార్యాలు చేస్తూ కూడా మనసులో నిరంతరం భగవద్విషయక చింతన చేయగలిగితే ధారణ అనే మహాసిద్ధి కైవసమైనట్లే. ఈ ధారణే, అనగా ధ్యేయంపై చిత్తస్థిరతయే విష్ణులోక ప్రాప్తిదం.

వదతస్తిష్ఠతో న్యద్వా |
స్వేచ్ఛయా కర్మ కుర్వతః ||

నాపతి యదా చింతా |
సిద్ధాం మన్యేత ధారణాం ||

సూర్యమండల మధ్యంలో స్థిర ప్రకాశంతో వెలుగొందువాడు, కమలాసనంపై కొలువు తీరేవాడు, కేయూర, మకరాకృత కుండలుడు, దివ్యహారయుక్తుడు, మనోహారిణియైన స్వర్ణసుందర కాంతితో విరాజిల్లు శరీర శోభాయుక్తుడు, శంఖచక్రధరుడునగు విష్ణుభగవానుని అన్ని ప్రాణులూ ధ్యానించాలి.

ధ్యేయః సదా సవితృ మండల మధ్యవర్తీ |

నారాయణః సరసిజాసన సంనివిష్టః ||

కేయూరవాన్ మకరకుండల వాన్ కిరీటీ |

హరీ హిరణ్మయవపుర్హృత శంఖ చక్రః ||

భగవద్ధ్యానాన్ని మించిన పవిత్ర కార్యం ఈ విశ్వంలోనే లేదు. విష్ణు ధ్యానపరుడు చండాలుడు భక్తితో పెట్టిన అన్నాన్ని తిన్నా అపవిత్రుడు కానేరడు. ఎందుకంటే విష్ణుభక్తుడే స్వయంగా భగవన్మయుడు. ప్రాణుల చిత్తం విషయ వాసనలలో తగుల్కొని చిక్కుకుపోవడం ఇరుక్కుపోవడం చూస్తూనే వుంటాం. కాని అదే అనురక్తిని ఈ ప్రాణులు భగవంతునివైపు మళ్ళిస్తే ఎందులోనూ చిక్కుకోక, ఇరుక్కోక జీవన్ముక్తులే కాగలరు కదా!

సదాచిత్తం సమాసక్తం |
జంతోర్విషయ గోచరే ||

యది నారాయణే ప్యేయం |
కోన ముచ్యేత బంధనాత్ ||

శ్రీ మహావిష్ణువుని చిత్తంలో నిలుపుకున్నవాడు ప్రతిక్షణం ఆయనకే నమస్కరిస్తుంటాడు, అదీ మనసుతో కాబట్టి అతడు పాప సముద్రాన్నెప్పుడో దాటిపోయి వుంటాడు.గోవిందుని గూర్చి తెలిపే జ్ఞానమే జ్ఞానము. కేశవ లీలలను తెలిపే కథలే కథలు. ఆ ప్రభువు నిమిత్తం చేయబడే కర్మయే కర్మ. హరి స్తుతిని చేయు జిహ్వయే జిహ్వ, విష్ణు సమర్పితమైన చిత్తమే చిత్తము. కమలాక్షు నర్చించు కరములే కరములు.

(తెలుగు వారికి చిరపరిచితమైన ఈ భావం భాగవతం కన్న ముందే గరుడ పురాణంలో ఇలా చెప్పబడింది).

తదిజ్ఞానం యత్రగోవిందః |
సా కథా యత్ర కేశవః ||

తత్కర్మ యత్ తదరాయ |
కీమ న్యైర్భహుభాషితైః ||

సా జిహ్వాయా హరిం స్తోతి |
తచ్చిత్తం యత్ తదర్పితం ||

తావేవ కేవలౌ శ్లాఘ్య |
యౌతత్పూజా కరౌ కరౌ ||

మస్తకము ఉన్నందుకు ఫలమేమి? భగవానుని పాదాలపై పెట్టి నమస్కరించే సత్కర్మను చేయగలుగుట. చేతులెందుకు? దేవుని పూజించుటకే. మనస్సెందుకు? శ్రీహరి గుణ, కర్మలపై నిత్య చింతనను నిర్వహించుటకే. నోరున్నది కేవలం శ్రీహరి గుణకీర్తనం చేయుటకే.

ప్రణామ మీశస్య శిరః ఫలం విదు |
స్త దర్శనం పాణిఫలం దివౌకసః ||

మనఃఫలం తద్గుణ కర్మచింతనం |
వచస్తు గోవింద గుణస్తుతిః ఫలం ||

సుమేరు పర్వతమంత, మందరాచలమంత కుప్పలుగా పాపాలు రాశిపోసుకున్న, ఆర్జించిన దుర్జనుడైనా పరివర్తనమొంది, పశ్చాత్తపించి ఒక్కమారు కేశవుని స్మరించినా ఆ పాపరాశి అంతా దగ్ధమై భస్మమై ఎగిరిపోతుంది.

మేరు మందర మాత్రో పి |
రాశిః పాపస్య కర్మణః ||

కేశవ స్మరణాదేవ |
తస్య సర్వం వినశ్యతి ||

ఎవనిపై మనసును లగ్నం చేసిన ప్రాణి నరకంవైపే పోనక్కర్లేదో, ఎవని చింతన సుఖానికి ముందు స్వర్గసుఖాలే దిగదుడుపో, ఎవనిని అర్థం చేసుకున్న జ్ఞానులు బ్రహ్మలోక ప్రాప్తిని పట్టించుకోరో, ఏ భగవానుడు అవ్యయుడై జడబుద్ధులైన మానవుల మనస్సుల్లో నిలచి వారిని ముక్తికి అర్హులను చేస్తాడో అట్టి శ్రీమహావిష్ణువుని నిరంతరం జీవితాంతం సంకీర్తనం చేసేవారు ఆయనలోనే కలసి పోవడంలో ఆశ్చర్యమేముంది?

యస్మిన్ వ్యస్తమతిర్నయాతి నరకం స్వర్ణోప్రి యచ్చింతనే విఘ్నయత్ర |

నవా విశేత్ కథమపి బ్రహ్మో పిలో కో ల్పకః ||

ముక్తించేతసి సంస్థతో జడధియాం పుంసాం దదాత్యవ్యయః |

కిం చిత్రం యదయం ప్రయాతి విలయం తత్రాచ్యుతే కీర్తితే ||

దుఃఖసాగరాన్ని దాటాలనుకొనేవారు వారి వారి స్తోమతును బట్టి యజ్ఞ, జప, స్నానాదులను చేస్తూ వాటితో బాటు శ్రీమన్నారాయణ సంకీర్తను కూడా చెయ్యాలి. ఏ స్తోమత లేని వారు సంకీర్తనమొక్కటి చేస్తే చాలు. రాజ్యానికి రాజు, బాలకులకు తల్లిదండ్రులు, సమస్త ప్రాణులకూ ధర్మమూ ఆశ్రయాలైతే ఆ ధర్మమే అన్నిటితో బాటు శ్రీహరి నాశ్రయించు కొనివుంటుంది.

రాష్ట్రస్యశరణం రాజా పితరోబాల కస్యచ |

ధర్మశ్చ సర్వమర్త్యానాం సర్వస్య శరణం హరిః ||

జగత్కారణ స్వరూపుడు, సనాతనుడునైన వాసుదేవుని పూజించు వాని దర్శనమే. ఒక తీర్థయాత్రంత పుణ్యాన్నిస్తుంది. నిరాలస్యుడై (బద్ధకం లేనివాడై) గోవింద ధ్యానం చేస్తూ నరుడు తన స్వాధ్యాయాది కర్మలను కూడా ఆయనకే సమర్పిస్తూ నిర్వహించాలి. శూద్రుడైనా నిషాదుడైనా, చండాలుడైనా శ్రీమహావిష్ణువు యొక్క మహాభక్తుడైతే వాని కులశీలములతో పనిలేకుండా వానిని గౌరవించి నమస్కరించు వారి గౌరవ నమస్కారములను స్వయంగా విష్ణువే స్వీకరించి వారికి నరక బాధ లేకుండా చేస్తాడు.

ధనప్రాప్తి కోసం ఒక ధనవంతుని చేరి వానినే స్తుతిస్తూ గడిపే వానికి ధనప్రాప్తి కలుగుతుందో లేదో కాని మోక్షమును కోరి విష్ణునామస్మరణ సంకీర్తనాదులను చేయువారికి ముక్తి తప్పక ప్రాప్తిస్తుంది. అడవిలో రేగిన అగ్నికీలలు కర్రనూ ఇతర ఇంధనాలనూ దహించునట్లు యోగి హృదయస్థితుడైన విష్ణువు వారి సమస్త పాపాలనూ భస్మీపటలం చేస్తాడు. విష్ణువు పట్ల మనకెంత విశ్వాస ముంటుందో అంత సిద్ధి మనకి కలుగుతుంది.

విద్వేషాదపి గోవిందం |
దమ ఘోషాత్మజః స్మరన్ ||

శిశుపాలో గత స్తత్వం |
కింపునస్తత్పరాయణః ||

శ్రీకృష్ణభగవానుని పుట్టిన దగ్గర్నుండీ ద్వేషిస్తూ బతికి ఆయననే ఎదిరించి ఆయన చేతిలోనే పోయిన శిశుపాలుని వంటి దుష్టుడే, ఆయనను ఎలాగో ఒకలాగ, నిత్యం స్మరించిన పుణ్యం వల్ల ఆయనలో లీనమై పోయాడంటే ఇక భక్తి భావంతో శ్రీవిష్ణుపరాయణులై నిత్యమూ ఆయనను స్మరించు వారి సంగతి వేరే చెప్పాలా?

నూట నలబై ఆరవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment