కులామృతస్తోత్రం
మహామునులారా! కులామృతమను శ్రేష్టమైన స్తోత్రాన్ని మీకిప్పుడు వినిపిస్తాను. ఒకప్పుడు దేవర్షిvనారదుడు పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు.
హే భగవాన్! మనుష్యులందరూ పుట్టిననాటి నుండీ మంచివారుగా ఉండడం జరుగదు కదా! వారిలో కొందరు దుర్మతులుంటారు. పరిస్థితుల ప్రభావం కొందరిని దుష్టులనుగా మారుస్తుంది. వారు కామ క్రోధ, శుభాశుభ ద్వంద్వాలలో పడికొట్టు మిట్టాడుతూ శబ్దాది విషయ బంధాలచే కట్టువడి బ్రతుకుతూ ఎప్పటికో మేల్కొని పశ్చాత్తాపపడి భగవద్ధ్యానంలోనే శేషజీవితాన్ని గడపాలనుకుంటారు గానీ దానికి సమయం లేదని మథనపడుతుంటారు. అలాటి వారినుద్ధరించడం ఎలా ? లోక కల్యాణ కర్తలూ, జగదానంద కారకులూ శివకేశవులే అయినా ఆ కల్యాణాన్నీ ఆనందాన్నీ లోకులదాకా తీసికెళ్ళి పంచేవాడు నారదుడు. శివుడతనిని ప్రసన్నంగా చూసి ఇలా బోధించాడు.
‘ఓ ఋషి శ్రేష్ఠా! భవబంధాలను తొలగించేదీ సర్వదుఃఖాలనూ నశింపజేసేదీ అగు పరమరహస్యమైన విషయమొకటుంది విను. గడ్డిపరకనుండి బ్రహ్మ దాకా గల ఈ సృష్టిలో విష్ణుమాయలోపడి చరాచరములన్నీ ఒక రకమైన నిద్రలో చేరి జోగుతుంటాయి. ఆ నిద్ర నుండి విష్ణుభగవానుని దయవల్ల ఎవరు మేలుకోగలరో వారే ఈ భవబంధాలను తొలగించుకోగలరు. భవసాగరాన్ని దాటిపోగలరు. ఈ మాయ జగము దేవతలను కూడా భ్రమింపచేసి వ్యామోహంలో పడవేయగలదు. అడవి నుండి సముద్రస్నానానికి వచ్చిన ముసలి ఏనుగుల్లాగా వ్యామోహంలో పడ్డ జనులు బయటికి రాలేరు. హరి కీర్తనను చేయనివారు నూతిలో కప్పలవలె ఈ భవ సాగరంలోనే అలాగే వుండిపోతారు. కాబట్టి ప్రసన్నచిత్తులై పశ్చాత్తప్తులై ఈ సంసారమును కాదనుకొని ఈ క్రింది స్తోత్రాన్ని పఠిచేవారు ముక్తులౌతారు.
యస్తు విశ్వమనాద్యంత మజ మాత్మని సంస్థితాం ||
సర్వజ్ఞ మచలం విష్ణుం సదా ధ్యాయేత్ సముచ్యతే ||
దేవం గర్భోచితం విష్ణుం సదాధ్యానన్ విముచ్యతే ||
అశరీరం విధాతారం సర్వజ్ఞాన మనోరతిం ||
అచలం సర్వగం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే ||
నిర్వికల్పం నిరాభాసం నిష్ప్రపంచం నిరామయం ||
వాసుదేవం గురుం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే ||
సర్వాత్మకం యావత్ ఆత్మచైతన్య రూపకం ||
శుభమే కాక్షరం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే ||
వాక్యాతీతం త్రికాలజ్ఞం విశ్వేశం లోక సాక్షిణం ||
సర్వ స్మాదుత్తమం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే ||
బ్రహ్మాది దేవ గంధర్వై ర్మునిభిః సిద్ధచారణైః ||
యోగిభిః సేవితం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే ||
సంసార బంధనాన్ముక్తిం ఇచ్ఛల్లోకో హ్యశేషతః ||
స్తుత్వైవం వరదం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే ||
సంసార బంధనాత్ కోపి ముక్తి మిచ్ఛన్ సమాహితః ||
అనంత మవ్యయం దేవం విష్ణుం విశ్వ ప్రతిష్ఠితం ||
విశ్వేశ్వర మజం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే ||
మహర్షులారా! శివుడు సెలవిచ్చినది ప్రత్యక్షర సత్యము. నిరంతరము ఆ అక్షయుడు, నిష్కలుడు, సనాతనుడు, అవ్యయుడు, బ్రహ్మస్వరూపుడునగు విష్ణువును ధ్యానించేవారు. నిస్సందేహంగా ఆయన శాశ్వతపదాన్ని పొందగలరు. వేలకొద్దీ అశ్వమేధాలూ, మరింతగా వాజపేయాలు చేయగా వచ్చే పుణ్యం తదేక చిత్తంతో సర్వం మఱచి విష్ణుధ్యానం ఒక్కనిముషం చేస్తే వచ్చే పుణ్యంలో పదహారవ వంతు కూడా ఉండదు.
మహాదేవుడే ఉపదేశించిన ఈ స్తోత్రం దివ్యం. దీనిని నిత్యం పఠించేవారు గత వేయి జన్మల పాప ఫలాన్నీ దగ్ధం చేసుకోగలరు. అమృతత్త్వస్థాయి అనగా వైష్ణవ పరమపదాన్ని ఈ శ్లోకసంహిత ద్వారా మానవులందుకోగలరు.
నూట నలబై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹