ఆత్మజ్ఞాన నిరూపణం
ఇప్పుడు ఆత్మ జ్ఞానము యొక్క తాత్త్వికవర్ణనను వినిపిస్తాను. అద్వైత తత్త్వమే సాంఖ్యము, దానిలో ఏక చిత్తతయే యోగము. అద్వైత తత్త్వయోగ సంపన్నుడైనవాడు ముక్తిని పొందగలడు. అద్వైత తత్త్వమేదో తెలిసి రాగానే అతీత, వర్తమాన, భవిష్య కర్మలన్నీ నష్టమై పోతాయి. జ్ఞానియైన వ్యక్తి సద్విచారమను గొడ్డలితో సంసారమనెడి వృక్షాన్ని నఱకివేసి వైరాగ్యమను తీర్థం ద్వారా వైష్ణవ పదాన్ని పొందుతాడు.
ఈ సంసారానికి మూలం మన మనస్సు యొక్క జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలే. ఇవి మాయ యొక్క రూపాలు. సత్యమేదో అవగతమయేదాకా ఈ మాయ యొక్క రూపాలు అలాగే పాతుకుపోయి వుంటాయి. నిజం చెప్పాలంటే శాశ్వత అద్వైత తత్త్వంలోనే ఇవన్నీ ప్రవేశించి వుంటాయి. అద్వైతతత్త్వమే పరబ్రహ్మం. దీనికి నామ, రూప, క్రియలుండవు. ఈ బ్రహ్మమే జగత్తును సృష్టించి తాను అందులో ప్రవేశిస్తాడు.”మాయాతీతుడైన చిత్పురుషుని తెలుసుకోగలిగాను. నేను కూడ ఆత్మస్వరూపుడనే” అనే జ్ఞానమే ముక్తికి మార్గం.
వేదోహమేతం పురుషం చిద్రూపం తమసః పరం ||
సో.. హమస్మీతి మోక్షాయ నాన్యః పంథా విముక్తయే ||
ముక్తి దాన, ధ్యానాదుల వల్ల వస్తుందని కొందరి మతం కాగా పూజాది కర్మల వల్ల ప్రాప్తిస్తుందని కొందరి అభిప్రాయం. కర్మను ఆచరించు, కర్మను త్యజించు అనే రెండు వచనాలూ వేదాలలో వినిపిస్తాయి. నిష్కామభావనతో యజ్ఞాది కర్మలను ముక్తి కోసం చేయాలి.
ఎందుకంటే నిష్కామభావంతో అనుష్టింపబడిన యజ్ఞాది కర్మలు శుద్ధికి సాధనంగా చెప్పబడ్డాయి. జ్ఞానం ప్రాప్తించిన పిమ్మట ఒక్క జన్మకే ముక్తి లభిస్తుంది. భేదభావమున్న వారికది దొరకనే దొరకదు. కుయోగి ముక్తిని పొందలేడు. ఏ కారణంగానో యోగభ్రష్టుడైన వాడు మరుజన్మలో యోగ సాధన జరిగే గృహంలో జన్మిస్తాడు. తనంతట తానుగా శ్రమించి ముక్తిని పొందుటకు, ఆ జన్మలో, అవకాశముంటుంది. కర్మల ద్వారాజ్ఞానాన్ని సంపాదించిన వాడు సంబంధాలను త్యజించి మోక్షమంద వచ్చు. దానికి ఆత్మజ్ఞానాన్నాశ్రయించాలి. ఆత్మజ్ఞానానికి భిన్నమైన జ్ఞానం అజ్ఞానం కిందే లెక్క హృదయంలో చెలరేగే కోరికలన్నీ సమాప్తమై పోతే, ఇక కోరికలే లేని స్థాయికి జీవి చేరుకోగలిగితే ఆ వ్యక్తికి అప్పటి జన్మాంతంలోనే నిస్సంశయంగా ముక్తి లభిస్తుంది.
యదాసర్వే విముచ్యంతే కామాయే సృహృదిస్థితాః ||
తదా మృతత్వ మాప్నోతి జీవన్నేవన సంశయః ||
పరబ్రహ్మమెక్కడుంది? దేవుడెక్కడికి పోతాడు? ముక్తి పొందినవాడు ఏ దేశంలో ప్రవేశిస్తాడు? ఇలాంటి ప్రశ్నలకవకాశమే లేదు. అనంతుడగు పరబ్రహ్మకొక దేశమనీ, రూపమనీ, గతియనీ ఉండవు కదా! ఆయన అద్వయుడు; కాబట్టి ఆయన కానిదేదీ లేదు. ఆయనే జ్ఞాన స్వరూపుడైనపుడిక జడుని వలె ఒకే చోట ఎందుకుంటాడు? జ్ఞానమే చైతన్యం. ఆయన ఆకాశమే అయినపుడు ఆయనకు గతి, అగతి, స్థితి లాంటి వాటిని ఆరోపించుట అవివేకం కదా! జాగ్రత్, స్వప్న, సుషుప్త్యాది అవస్థలు మాయ ద్వారా కల్పితాలు. వస్తుమాత్రసారం పరబ్రహ్మయే. తేజోరూపుడైన బ్రహ్మ ఒక అఖండ పుణ్య రూపమని అర్థం చేసుకోవాలి. జీవికి తన ఆత్మ ప్రియమైనపుడు పరమాత్మ కూడా అంత ఇష్టమైనదే కావాలి, ఎందుకంటే బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. తత్త్వజ్ఞులంతా జ్ఞానమే సర్వోచ్చమని అంగీకరిస్తారు. చిత్తమున కాలంబము బోధ స్వరూపమైన ఆత్మయే.
ఇది ఆత్మ విజ్ఞానము. ఇది పూర్ణము, శాశ్వతము. మూడు అవస్థలలోనూ జీవికి కలిగే సుఖం, నిజానికి, పూర్ణ సుఖ స్వరూపుడైన బ్రహ్మ నుండి ఆత్మ పొందగలిగే దానిలో పరమ క్షుద్రాంశ మాత్రమే. మరి ఈ స్మరణ ఏమిటి? అంటారు కొంతమంది. గుండెలో నిండుగా నిత్యమూ కొలువై వుండేవాడు స్మృతిలోనే వుంటాడు కదా! విస్మరిస్తే కదా స్మరించాలి. అని వారి ఆందోళన. కాని, ఇక్కడ స్మరించడం అంటే దేవుని తలచుకోవడం.
అయన మనలోనే వున్నాడని తెలిసీ తలచుకోవడం అనగా ఆ సమయంలో తుచ్ఛ సుఖాలను తలచుకోకుండా . వుండడం. చిత్తంలో స్థిరంగా వుండే చేతన తత్త్వాన్ని, ఆత్మ, బ్రహ్మ, పరమాత్మాది రూపాలలో మనం స్వీకరించిన దానిని తలచుకుంటున్న కొద్దీ అజ్ఞానం దూరమౌతుంటుంది.మనం చేసే అన్ని పనులూ, ఆలోచనలూ మనలోనే సాక్షీభూతుడై వున్న పరమాత్మకు పూర్తిగా తెలుస్తాయి, ఆయన పరమశక్తిమంతుడు కూడా, కాబట్టే మన శుభాశుభకర్మల ఫలితాలు, ఆయన ద్వారా అందవలసిన సమయంలో మనకి అందుతుంటాయి. ఈ బ్రహ్మతత్త్వమే సత్యం, జ్ఞానం, ఆనందరూపం, అనంతం. సత్యం జ్ఞానం నుండి వేరు కాదు. అనంతతత్వం నుండి ఆనందమూ వేరు కాదు. “నేను బ్రహ్మను’ అని జీవి తెలుసుకున్ననాడు ఆ జీవియే అనంతము, సత్యము, ఆనందస్వరూపము.
హేమమణి ఇనుమును బంగారం చేసినట్లు పరబ్రహ్మ సామాన్యాత్మను పరమాత్మను చేయగలడు. చీకట్లో తాడును చూసి పామనుకొని భయపడేవాడు ఆ ప్రదేశంలోకి వెలుగు ప్రసరించాక ఇక భయపడడు.ఈ భయమే అజ్ఞానం. వ్యామోహాల మధ్య జీవించే మనిషి అవే నిత్యమనీ సత్యమనీ అనుకుంటాడు. అవి అందవేమోనని భయపడతాడు కూడ. వాని చీకటి గుండెలో జ్ఞానమనే పరమాత్మ వెలుగులు ప్రవేశించగానే ముందా భయం పోతుంది. అవి ఎంత నిర్వీర్యాలో నిస్తేజాలో తెలుస్తుంది. ఒక పాపానికి తప్ప దేనీకీ భయపడడు.. ద్విజుడు గ్రహావిష్ణుడై (మామూలు భాషలో దెయ్యం పడితే) నేను శూద్రుడను అంటూ కేకలు వేస్తే తన వర్ణధర్మాన్ని పాటించకుండా చిందులేసినా, ఏ బ్రాహ్మణ లేదా మంత్రవేత్త దయ వల్లనో ఆగ్రహం (దెయ్యం) వదిలేయగానే తాను ద్విజుడనే స్పృహ వచ్చి తన వర్ణాశ్రమధర్మాన్ని ఎప్పటిలాగానే పాటిస్తాడు.
అలాగే స్వచ్ఛ, నిర్మలహృదయుడై పుట్టిన మానవుడు మాయ కమ్మినపుడు ”నేను నేనే. అంతా నాదే” అనుకుంటాడు. తపోధ్యానాల వల్ల ఆ మాయ తెరలు కరిగిపోగానే “నేను బ్రహ్మను. అంతా ఆయనదే” అని తెలుసుకుంటాడు. సంసారచక్రం లాగే దానికి మూలమైన భగవానుని మాయ కూడా అనాదియైనదే. ఈ మాయకు సత్, అసత్ రూపాలుంటాయి. వ్యవహార కాలంలో సత్తుగా వుండే మాయ పరమార్ధతః అసత్తవుతుంది. మాయ వల్లనే పరమాత్మ కూడా తానే జగత్తుగానూ అందులోని వ్యక్తిగానూ మారవలసి వస్తుంది. మూడు గుణాలతో ఇరవై ఎనిమిది తత్త్వముల రూపములో మాయ ద్వారానే విశ్వసృష్టి జరుగుతుంది. నామ, రూప, క్రియాదులు మధ్యలో వస్తాయి. మొదట్లో వుండవు, చివరా వుండవు. ఆ వున్నపుడు కూడా ఒక చోటే వుంటాయి. ఇవి ఇటు వున్నవి అటు లేవు; అటు వున్నవి ఇటు లేవు.
సత్తా అనగా ఏ బలమూ శాశ్వతం కాదు. కలలో కనిపించే నీ స్వంతమైనట్లనిపించే రథాలూ, రాజ్యాలూ, సిరులూ కల కరగగానే విరిగిపోతాయి. ఇలలో కూడా అంతే, అక్కడ ఒక గంట అయితే ఇక్కడ కొన్నేళ్ళు. అంతే. కలలోనూ ఇలలోనూ కూడా శాశ్వతంగా నిలచేది పరమాత్మ ఒక్కడే. ”సుఖము దుఃఖము నెఱుగని సుషుప్తిలోన” ఏదీ వుండదు. ఒక రకమైన నిశ్చేష్టత మాత్రముంటుంది. దీనినే అచల లేదా అద్వైత పదమంటారు. అదే బ్రహ్మ స్వరూపం.మాయ భగవంతుని కన్న గొప్పదేమీ కాదు. ఆయనతో సమానమైనదీ కాదు. ఆయన చేసిన ఒక కల్పన, ఆయన ఆడుకొనే ఒక బొమ్మ ఈ మాయ అంతే.
ఓయి నారదా! నేను అనంతుడను. నా జ్ఞానం అనంతం. నాలో నేను పూర్ణుడను. ఆత్మ ద్వారా అనుభూతమయే అంతస్సుఖం నేను. త్రిగుణాలకతీతంగా వుంటాను. నేను శుద్ధుడను. నేను అశుద్ధము నుండి పుట్టను. అమృత స్వరూపుడైన బ్రహ్మను నేనే. ప్రాణుల గుండెలలో వెలిగే దీపాన్ని నేనే. చీకటి గుండెను వెలిగించే చిరుదివ్వె నుండి లోకాలన్నిటినీ తేజోమంతం చేసే సూర్యుని దాకా గల వెలుగంతా నేనే. ఆత్మజ్ఞాని కూడా ఇలాగే చెప్పగలిగివుంటాడు..
నూట యాబై రెండవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹