Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట యాబై మూడవ అధ్యాయం

గీతాసారం

నారదా! ఒకప్పుడు నేను అర్జునునికి ”గీత” ఉపదేశించాను. దాని సారంలో కొంత నీకిపుడు వినిపిస్తాను.

అష్టాంగంయోగ యుక్తుడూ వేదపారంగతుడూ నగు వ్యక్తికి ఆత్మ కల్యాణం సంభవం. అనగా అట్టివాడు ఆత్మ సాక్షాత్కారాన్నీ, తద్వారా ఆనందాన్నీ పొంది లోకానికి సుఖాన్ని కలిగించే అవకాశముంది.ఆత్మకి దేహం లేదు. ఇంద్రియాలు లేవు. నేను ఆత్మను. నన్నీ సంసార బంధాలు దుఃఖపఱచలేవు, కట్టి పడెయ్యనూ లేవు. ధూమరహితమై ప్రజ్వలించు అగ్ని శిఖలాగా ఆత్మ స్వయంప్రకాశయుక్తమై శోభిల్లుతుంటుంది.

ఆకాశం విద్యుత్తు చేత అగ్ని చేత ప్రకాశించునట్లే యోగి హృదయం, ఆత్మస్వయం ప్రదీప్తాలవుతుంటాయి. మనమెంతో గొప్పగా ప్రేమించే, గొప్పగా చెప్పుకొనే ఈ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం వుండదు. అవి వాటినే చూసుకోలేవు. కాని సర్వజ్ఞం, సర్వదర్శి, క్షేత్రజ్ఞం అయిన ఆత్మయే ఇంద్రియాలను దర్శించి వాటి చేత పని చేయించుకుంటుంది. ఆత్మ ఉజ్జ్వల ప్రదీపం వలె హృదయపటలంపై ప్రకాశించడం ప్రారంభించగానే పురుషుల (స్త్రీల) పాపకర్మం నష్టమైపోయి జ్ఞానం ఉత్పన్నమవుతుంది.

అద్దంలోకి చూస్తే తన రూపం తనకు కనబడినట్లే ఆత్మలోకి చూడగలిగితే ఇంద్రియాలూ, విషయాలూ (వాటి అనిత్యత్వము) పంచమహాభూతాలూ అన్నీ కనిపిస్తాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, అవ్యక్త పురుషుడు ఈ అన్నిటి జ్ఞానం ద్వారా సంసారం నుండి ముక్తులు కావచ్చు, కావాలి కూడా. అది తప్పదు. అన్ని ఇంద్రియాలనూన మనస్సుతో అదుపులోకి తెచ్చుకొని అహంకారాన్నందులో స్థాపించి తరువాత దానిని బుద్ధిలోనూ, బుద్ధిని ప్రకృతిలోనూ, ప్రకృతిని పురుషునిలోనూ, పురుషుని పరబ్రహ్మలోనూ విలీనం చెయ్యాలి.

అప్పుడు జీవి ”అహంబ్రహ్మాస్మి” అనే జ్ఞానజ్యోతిని పొందుతాడు. నవద్వారాలతో, మూడు గుణాలతో, ఆకాశాది పంచభూతాత్మికమై ఆత్మచే అధిష్ఠితమైన ఈ శరీరాన్ని ఎవడైతే పూర్తిగా తెలుసుకొని ముక్తికి సాధనంగా దానిని వాడుకోగలడో వాడే జ్ఞాని. అట్టివాడే క్రాంతదర్శి, సర్వశ్రేష్ఠుడు. వంద అశ్వమేధాలూ, వేలకొద్దీ రాజసూయాలు కూడా ఈ జ్ఞాన యజ్ఞమిచ్చు ఫలంలో పదహారవ వంతైనా ఇవ్వలేవు.

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఇవి అష్టాంగ యోగ సాధనాలు. ఇవి అష్టాంగ యోగసాధనాలు. (ఇవన్నీ కలిసి అష్టాంగ యోగమవుతుంది) ఇది ముక్తిని సంపాదించిపెడుతుంది. మనస్సు, శరీరం, మాట- ఇవి ఎల్లప్పుడూ హింసకు దూరంగానే వుండాలి. అహింసయే పరమధర్మము కదా!

కర్మణా మనసా వాచా సర్వభూతేషు సర్వదా ||

హింసా విరామ కోధర్మో హ్యహింసా పరమం సుఖం ||

ఎల్లవేళలా సత్యాన్నే పలకాలి. మనిషికి కష్టం కలిగించే సత్యాన్ని తప్పనిసరి కాకపోతే పలుకరాదు. ప్రియాన్నే పలకాలి. అలాగని అబద్ధాలాడరాదు.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్న బ్రూయాత్ సత్యమప్రియం ||

ప్రియంచనా నృతం బ్రూయాదేష ధర్మః సనాతనః ||

దొంగతనంగానో దౌర్జన్యంగానో పరుల ధనాన్ని అపహరించడాన్ని స్తేయమంటారు. కదా! దీనికి వ్యతిరేకం అస్తేయం.అది ధర్మసాధనం.

యచ్చద్రవ్యాపహరణం చౌర్యాద్వాథ బలేన వా ||

స్తేయం తస్యానాచరణ మస్తేయం ధర్మ సాధనం ||

ముక్తిని కోరువాడు మనసా, వాచా, కర్మణా మైథునాన్ని పరిత్యజించాలి. బ్రహ్మచర్యం ముక్తికి సోపానం. అపరిగ్రాహ్యం మరొక ధర్మసాధనం. ఎంతటి ఆపద ఎదురైనా ఎవరి నుండీ ద్రవ్యాన్ని గ్రహించకుండా వుండడమే అపరిగ్రాహ్యం.బాహ్యమనీ అభ్యంతరమనీ శౌచం రెండు ప్రకారాలు. మట్టితో జలంతో తోమి కడిగితే బాహ్యశౌచం, భావశుద్ధి ద్వారా అభ్యంతర శౌచం కలుగుతాయి.

ఇక సంతోషమనగా అనాయాస ప్రాప్తి వల్ల కలిగే సుఖం. మనస్సు, ఇంద్రియాలూ ఏకాగ్రం చేయడమే. తపస్సు, కృచ్ఛ, చాంద్రాయణాది వ్రతాల ద్వారా శరీరాన్ని శుష్కింపచేయడం కూడా తపస్సులో భాగమే. సత్త్వశుద్ధికై వేదాంతాన్నీ శతరుద్రీయాన్నీ పఠించడం, ఓంకారాదిక జపం చేయడం ఇదే స్వాధ్యాయమని పండితజనమంటారు. మనోవాక్కాయ కర్మలతో హరిస్తుతి, నామస్మరణ, పూజాదికార్యాలు, అనిశ్చలభక్తి వీటిని నిర్వహించుటయే ఈశ్వర చింతన అనబడుతుంది. ఇంద్రియాలు సహజంగా అసద్విషయాలవైపే పరిగెడుతుంటాయి. వాటిని వెనక్కి లాగి హరిచింతనపై కేంద్రీకరించాలి.

తేజోమండలంలో శంఖ చక్ర గదా పద్మధరుడై, వన మాలాలంకృతుడై, కౌస్తుభచిహ్న విభూషితుడై కొలువు తీరిన వాయు స్వరూపుడైన ”ఆ బ్రహ్మను నేనే” అని త్రికరణశుద్ధిగా విశ్వసించడమే ధారణ. ఈ తాదాత్మ్య రూపమే సమాధి.

నూట యాబై మూడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment