బ్రహ్మగీతాసారం
శౌనకాదులారా! ఒకప్పుడు నారదుని కోరికపై బ్రహ్మదేవుడు సంసార విముక్తి కరమైన బ్రహ్మగీతను ఉపదేశించాడు. దానిని మీకు వినిపిస్తాను. ”నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి” అనే వాక్యార్థాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకోగలిగినవారు ముక్తులౌతారు.
నేను, బ్రహ్మ అనే ఈ రెండు పదాలనూ అర్థం చేసుకోవాలి. విద్వాంసులు వాచ్య, లక్ష్య రూపాలు రెండింటిలోనూ వీటికి అర్థాలు స్వీకరించారు. ఏ పదానికైనా లక్ష్య వాచ్యార్థాలను చూసుకోవాలి. అదే శుద్ధ వాక్యార్థమవుతుంది.
అహం శబ్దానికి ప్రాణ పిండాత్మకమనీ ప్రత్యగ్ రూపాత్మ అని వేదంలో అర్థాలు కనిపిస్తాయి. బ్రహ్మ పదానికి కూడా అంతే. ప్రపిండాత్మ కతతో బాటు నిష్ఠ, పరోక్షతాది గుణాలు వాచ్యార్థంలో చెప్పబడగా అద్వయానంద చైతన్యం లక్ష్యార్థంలో ద్యోతకమైంది.
”నేనే బ్రహ్మను” అని గాని ”బ్రహ్మయే నేను” అని గాని భావించుకొని సాధించుకొనే స్థితికి ప్రాణిని గొని వచ్చు ఐక్యజ్ఞానం, నిశ్చితంగా, వేదాల ద్వారా పొందబడుతుంది. జ్ఞానం వల్ల అజ్ఞానం నుండి ”విడుదల” లభిస్తుంది. కదా!
ఈ విడుదల తరువాతి నిచ్చెన మెట్టు ప్రాణి యొక్క చిత్త లక్ష్యమై పొందబడిన ఐక్యస్థితి. ఆ ఐక్యస్థితియే ముక్తి.
పరమాత్మ నిజము, నిత్యము కదా! ఆ పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వి ఉత్పత్తి అయినాయి. ఈ పృథ్వియే ధాత్రి, జగత్తుకి ప్రపంచానికీ జన్మదాత్రి,
తరువాత పదిహేడు తత్త్వాలు జనించాయి. మాట కాళ్ళు, చేతులు, పాయు, ఉపస్థ- ఇవి అయిదూ కర్మేంద్రియాలు. చెవులు, చర్మం, కనులు, నాలుక ముక్కు – ఇవి జ్ఞానేంద్రియాలు. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన ఇవి వాయువులు.
ఈ పదిహేనూ మనస్సు, బుద్ధిలతో కలిసి పదిహేడు తత్త్వాలవుతాయి. భగవానుడు హిరణ్యగర్భ రూపంలో ఆత్మగా బుద్ధి రూపమైన అంతఃకరణలో వుంటాడు, చాలా సూక్ష్మంగానే వుంటాడు. దానినే జీవాత్మ అంటారు. ఈ విధంగా ప్రపంచానికావలనున్న మహాప్రాణ పరమాత్మ ద్వారా పంచమహాభూతాలతో శరీరం ఉత్పత్తి చేయబడింది. అవే పంచీకృత పంచమహా భూతాలచే బ్రహ్మాండమూ నిర్మితమైంది.
కాలు సేతులాదిగా గల స్థూలశరీరం అందరికీ తెలిసిందే, పైగా కనిపిస్తుంది కూడా. తరువాత, దానిలో పంచభూత తత్త్వాలూ వాటి అనేక కార్యాలూ గల స్థితిని స్థూల శరీర పూర్వ శరీరమనుకోవచ్చు. దాని నుండి ఉత్పన్నమయ్యేది కూడా స్థూల శరీరమే.
విద్వాంసులు (దీనినే ఉదాహరణగా చూపిస్తూ) పరమాత్మ స్థితమైన శరీరం మూడు ప్రకారాలని వర్ణిస్తారు. స్వతత్త్వ భేదాన్ని తెలిపే వాక్యం అహం బ్రహ్మాస్మి ప్రకారం ఆ రెండు పూర్వ స్థూల, స్థూల శరీరాల్లో ఆ బ్రహ్మయే ప్రవేశించి వుంటాడు.
నీటిలో సూర్యుని ప్రతిబింబము లాగా, రేగుపండులాగా ఆ సమయంలో ఆయన ఆకృతి వుంటుంది. జీవస్వరూపుడైన బ్రహ్మ దానిలో ప్రాణాది ఈ శరీర తత్త్వాలను ధరిస్తాడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థలలోనూ చేయబడు కార్యాలకు సాక్షిగా వుండేదే ”జీవుడనబడుతుంది.
ఆ మూడు అవస్థలకి ఆవల బ్రహ్మము నిర్గుణ స్వభావంతోనే వుంటుంది. ఈ శరీరంతో కలివిడిగా నున్నా విడివిడిగా వున్నా బ్రహ్మ నిత్య శుద్ధ స్వభావుడే. ఆయనలో నెటువంటి వంటి వికృతీ వుండదు.
ఈ మూడు అవస్థలలోనూ మూడు ప్రకారాలుగా ఆయన వుంటాడని పెద్దలంటారు.మన అంతఃకరణలోనే స్థితుడై వున్న ఆయనను ఆ ప్రకారాలలో మనమే భావించుకుంటాం.
ఇక ఫలయుక్త క్రియను వినండి. అవస్థల వర్ణన కూడా శ్రీకృష్ణునిచే చేయబడింది. ఇంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే తన్మాత్రలను తెలుసుకొనే దశ మానవులకు జాగ్రదావస్థ.
ఈ దశలో అన్ని కోరికలనూ, ఆశయ సాధనాలనూ ఎవని సంస్కారంతో వాడు దర్శిస్తాడు. మిగతా రెండు దశలలో శరీరంతో కాకుండా బుద్ధితో అదే సంస్కారం మనసుని చింతల పాలు చేస్తుంటుంది. కాబట్టి ఈ మూడు దశలలోనూ కొట్టుమిట్టాడుతున్న జీవాత్మను యమ నియమాది అష్టాంగమార్గాల ద్వారా యథాక్రమంగా దాటుకుంటూ గొనిపోయి సమాధి సాధనకు పూర్వమే పరమాత్మ అను గమ్యం వైపు మహాయోగి నిలబెట్టుకుంటాడు.
అప్పుడిక జీవాత్మను ఏ అవస్థలూ (ఈ పదానికున్న అన్ని అర్ధాలలోనూ) ఇబ్బంది పెట్టలేవు.తరువాత ముముక్షువు (అనగా మోక్షాన్ని కోరేవాడు) అంతఃకరణం కైవల్యావస్థలోకి ప్రవేశిస్తుంది.
ఇది పరమాత్మ సాక్షాత్కారావస్థ. ఇక్కడ మోక్షార్జి తన పాంచభౌతిక శరీరంలో చిక్కుకున్న క్షేత్రజ్ఞ జీవాత్మ తన శరీరం నుండి వేరుగా వుండాలనే చింతనను చేస్తాడు. ఎందుకంటే ”ఆత్మతత్త్వం శరీరం నుండి వేరు” అనే భావం మనస్సులో స్థిరం కాకపోతే బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
కాబట్టి క్షేత్రంలో అనగా శరీరంలో విషయవాసనలతో ఇంద్రియ వీర విహారం మధ్య ఇరుక్కుపోయిన ఆత్మను ఆ ఊబిలో నుండి బయటికి లాగాలి. ముందుగా ఈ క్షేత్రాన్ని శూన్యం చేసుకుంటే అందుండి ఉత్పన్నములగు వాంఛలూ, వాసనలూ అన్నీ నశిస్తే ఆత్మ క్షేత్రజ్ఞ రూపంలో స్వచ్ఛ ప్రకాశాన్ని వెలారుస్తూ పరమాత్మను చేరే అర్హతను సంపాదించుకుంటుంది.
ఈ పాంచభౌతికమైన శరీరంకుండలాంటిదే. కుండలోని రిక్తతను ఘటాకాశ మంటారు. ఆ ఖాళీని అధిగమించి జ్ఞాననేత్రాలతో చూస్తే శరీర సమగ్రరూపమూ, సాధారణ నేత్రాలకే కుండలోని విషయమూ తెలుస్తాయి.
కాబట్టి ఈ ఆకాశమనేది భ్రమ. కుండలోని మట్టిలాగే మనిషిలో జీవాత్మ వున్నా కుండ నుండి మన్నుని వేరుగా చూడగలిగే శక్తి వున్నట్టే శరీరం నుండి జీవాత్మను భిన్నం చేసి చూడగలిగే శక్తి కూడా వుంటుంది. కుండ పగిలితే గాని మన్ను రూపం ధరించదు.
కోరికలు నశిస్తే గాని ఆత్మతత్త్వం బోధపడదు. శరీరంలో వున్నది పంచీకృత అనగా పంచభూత సంబంధితత్త్వం. ఈ పంచీకృత భౌతిక తత్వం అపంచీకృత మహాభూతుడైన పరమాత్మచే ఉత్పత్తి చేయబడింది. కార్యము శరీర నిర్మాణమైతే కరణము పరమాత్మయైనపుడు కార్యము నుండి కారణం వేరు కానట్టే శరీరం నుండి పరమాత్మా వేరు కాదు.
అయితే, “పాల నుండి వెన్నను తీసినట్లుగా శరీరం నుండి పరమాత్మను తీసి చూడగలగాలి. పాలనో మజ్జిగనో తాగాలనే కోరికను వదిలేస్తేనే వెన్న లభించినట్లు ఇంద్రియ క్రియా వ్యతిరేకత ద్వారానే సూక్ష్మ శరీరుడైన పరమాత్మవైపు వెళ్ళగలము. విద్వజ్జనులు దీనినే ”సూక్ష్మ శరీరావధారణ” మన్నారు.
ఈ చిన్న శరీరం దాని సృష్టికర్త మరియు పెద్ద శరీర కర్తయగు అపంచీకృత స్వామి కంటె భిన్నము కాదు. నేల లేనిదే ఏ మనిషి నిలబడలేనట్లే ఈ నేల కూడా ఆ స్వామి లేనిదే నిలబడలేదు. అనగా మానవులకూ, వారికి ఆధారమైన పృథ్వికి కూడా పరమాత్మయే ఆధారము.
పంచభూతాలలో దేనికేది ఆధారమో ఇదివఱకు చెప్పబడింది. బాహ్యదృష్టికి అన్నిటికీ ఆధారంగా గోచరించే ఆకాశానికి కూడా ఆ మాయా ఛిన్న బ్రహ్మమే ఆధారం.
అయితే మాయా రహితుడైన ఆ శుద్ధ బ్రహ్మ ఆకాశాన్ని ప్రకాశింపజేసి తాను అందులో ప్రవేశించి లోకులను భ్రమింపజేస్తాడు. ధ్యానికి ఈ ఆకాశం ముందుగా తెలిసి వస్తుంది. అక్కడి మాయను కూడా తొలగించగలిగిననాడు, వెలుగుల మధ్య, పరమాత్మ దర్శనమవుతుంది. అపుడు వాని హృదయం సంపూర్ణంగా శుద్ధమై జాగ్రదాది అవస్థలను జయిస్తుంది.
బ్రహ్మము నిత్య శుద్ధ, బుద్ధ, సత్య, అద్వైత భావనమని చెప్పబడింది. ఇది రెండు విశిష్ట పదాల మధ్య వుండే తత్త్వమనీ చెప్పబడింది. బ్రహ్మ వాచక పదం లేదా శబ్దం ఓంకారం. ఇందులో రెండు స్వరాలూ (అ,ఉ) ఒక అనునాసిక వ్యంజనమూ (మ్) ఉన్నాయి కదా! ఈ శబ్ద సమ్మేళనం సామాన్యమైనది కాదు. దానంతట అదే ఒక గొప్ప మహా మంత్రము.
ఈ ఆత్మ తత్త్వం పరమజ్యోతిస్స్వరూపం. ఇది చిదానంద రూపం. ఇదే సత్యజ్ఞానం, అనంతం. ఇదే “తత్త్వమసి”కి నిలయం. ఇది వేద ప్రవచనం. ”అహం బ్రహ్మాస్మి” అనగా సాంసారిక విషయాలకి అందనంత దూరంలో వున్న నిర్లిప్త దేవుడను నేను. సర్వత్ర గామియైన పరమాత్మను నేను.
ఆదిత్య స్వరూపుడైన దేవదేవుని నేనే. అనాది దేవ దేవేశ్వరుడైన పరబ్రహ్మను నేను. నా ఆదిని గాని అంతాన్నిగాని కనుగొనగలిగేవారు. లేరు. ఎందుకంటే అవి లేవు కాబట్టి.
ఇదే గీతాసారం. దీనిని విని బాగా తనలో ఇవతళించుకొన్నవాడు పరబ్రహ్మలో లీనమైపోతాడు అనగా జీవన్ముక్తుడవుతాడు.”
(గరుడ పురాణాంతర్గత ఆచార కాండ సమాప్తం)
ధర్మదృఢ బద్ధమూలో వేదస్కంధః పురాణ శాఖాఢ్యః ||
క్రతుకుసుమో మోక్షమఫలో మధుసూదన పాదపోజయతి ||
శ్రీ మహావిష్ణువు నొక మహావృక్షంగా భావించి వ్యాసమహర్షి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ధర్మమనే గట్టి మాను కలిగి వేదములనే స్కంధములు (కొమ్మలు కట్టి విడిపోయే భాగాలు) పురాణములు అనే కొమ్మలు కలిగిన, క్రతువులు అనే పుష్పములు కలిగి, మోక్షమనే ఫలము(లు) కల మధుసూదనుడైన శ్రీమహావిష్ణువనే వృక్షము విరాజిల్లు తున్నది. దానికి జయమగు గాక.
ఓం నమో నారాయనమః
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹