Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – నలబై తొమ్మిదవ భాగము

శ్రీ పురుషోత్తమ స్తుతి :-

క్షరాక్షరం క్షీరసముద్ర శాయినం క్షితిధరం మూర్తిమతాం పరంపదమ్।

అతీంద్రియం విశ్వభుజాం పురఃకృతం నిరాకృతం స్తోమి జనార్దనం ప్రభుమ్॥

త్వమాది దేవః పరమార్థరూపీ విభుః పురాణః పురుషోత్తమశ్చ |

అతీంద్రియో వేదవిదాం ప్రధానః ప్రపాహి మాం శంఖగదాస్త్ర పాణే ॥

కృతం త్వయా దేవ సురాసురాణాం సంకీర్త్యతే సౌ చ అనంతమూర్తే|

సృష్ట్యర్థ మేతత్ తవ దేవ విష్ణో న చేష్టితం కూటగతస్య తత్స్యాత్॥

తధైవ కూర్మత్వ మృగత్వ ముచ్చై స్వయాకృతం రూప మనేక రూప|

సర్వజ్ఞభావా దసకృచ్ఛ జన్మ సంకీర్త్యతే తేలి చ్యుత నైత దస్తి ॥

నృసింహ నమోవామన జమదగ్నినామ దశాస్య గోత్రాంతక వాసుదేవ!

నమోస్తుతే బుద్ధ కల్కిన్ ఖగేశ శంభో నమస్తే విబుధారి నాశన||

నమోస్తు నారాయణ పద్మనాభ నమో నమస్తే పురుషోత్తమాయ|

నమః సమస్తామర సంఘ పూజ్య నమోస్తుతే సర్వవిందాం ప్రధాన||

నమః కరాళాస్య నృసింహమూర్తే నమో విశాలాద్రి సమాన కూర్మ|

నమః సముద్ర ప్రతిమాన మత్స్య నమామి త్వాం క్రోడరూపి న్ననంత||

సృష్ట్యర్థ మేతత్ తవ దేవ చేష్టితం న ముఖ్యపక్షే తవ మూర్తితా విభో|

అజానతా ధ్యాన మిదం ప్రకాశితం నైభి ర్వినా లక్ష్యసే త్వం పురాణ||

ఆద్యో మఖస్త్యం స్వయమేన విష్ణో మఖాంగభూతో సి హవిస్త్వమేవ|

పశుర్భవాన్ ఋత్విగిజ్యం త్వమేవ త్వాం దేవ సంఘా మునయో యజన్తి||

యదేతస్మిన్ జగధ్రువ చలాచలం సురాది కాలానల సంస్థ ముత్తమమ్|

న త్వం విభక్తో సి జనార్ధనేశ ప్రయచ్ఛ సిద్ధిం హృదయే_ప్సితాం మే||

నమః కమలపత్రాక్ష మూర్తిమూర్త నమో హరే|

శరణం త్వాం ప్రపన్నో స్మి సంసారా న్మాం సముద్ధర||

(శ్లో॥31-41,అధ్యా-55)

మహాత్ముడైన ఆ మహారాజు ఒక మామిడి చెట్టు క్రింద కూర్చుని ఈవిధంగా స్తుతించగానే భక్తవరదుడైన శ్రీహరి స్వయంగా ఒక మరగుజ్జు రూపంలో అక్కడికి వచ్చాడు. ఆయన రాగానే అక్కడున్న మామిడి చెట్టు కూడా కుంచించుకుపోయింది. అది చూసి ఆ మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎంతో విశాలంగా వున్న ఆ చెట్టు హఠాత్తుగా కుచించుకు పోయేసరికి ఆయనకి ఆందోళన కలిగింది.

ఎదురుగా ఆ రాజుకి ఒక చిన్న విప్రుడు కనిపించాడు. అతన్ని చూడగానే ఇదంతా ఆ జగన్నాధుడి మాయేనని గ్రహించాడు రాజు. వెంటనే భక్తిప్రపత్తులతో ఆ విప్రుడికి నమస్కరించి స్వామీ! దయచేసి నీ నిజరూపాన్ని చూపించు అని వేడుకున్నాడు. వెంటనే శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ శంఖ చక్ర గదా పద్మాలని ధరించి తన నిజరూపాన్ని చూపించాడు. వరం కోరుకోమని రాజుతో పలికాడు.

మహారాజు శ్రీహరిని దర్శించే వేరే ఏ ఇతర వరాలూ కోరుకోకుండా మోక్షాన్ని ప్రసాదించమని అడిగాడు. అప్పుడు శ్రీహరి “రాజా! నేను రాగానే ఈ విశాలమైన మామిడిచెట్టు చాలా చిన్నగా కుబ్జలా మారిపోయింది. రాబోయే కాలంలో ఈ ప్రాంతం “కుబ్జామ్రక తీర్థంగా విఖ్యాతి పొందుతుంది. ఎవరైనా సరే పశుపక్ష్యాదులు సైతం ఇక్కడ ప్రాణాలు కోల్పోతే వారిని స్వర్గానికి తీసుకువెళ్ళటానికి ఎన్నో దివ్యవిమానాలు వస్తాయి. ఇక్కడ యోగం చేసిన వారికి సరాసరి ముక్తి లభిస్తుంది” అని చెప్పి తన చేతిలోవున్న శంఖాన్ని చిన్నగా ఆ రాజుకి తాకించాడు. అంతే ఆ మహారాజు ప్రాణాలు విడిచి శ్రీమన్నారాయణుడి పరమపదాన్ని చేరుకున్నాడు.

పరమపావనమైన ఈ శుభవ్రతాన్ని ఆచరించిన వారికి సకలశుభాలూ కలుగుతాయి. మరణానంతరం శ్రీహరి పరమపద ప్రాప్తి కూడా లభిస్తుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment