శుభవ్రతం :-
అన్ని వ్రతాలకన్నా ఎంతో ప్రశస్తమైనది చేసిన వారికి సకల సంపదల్ని చేకూర్చేది శుభవ్రతం. ఈ వ్రతాన్ని అగస్త్యమహర్షి లోకానికి అందించాడు.
మార్గశిరమాసం శుక్లపక్ష పాడ్యమినుంచి దశమితిథివరకు, ఒకపూట మాత్రమే భోజనం చేస్తూ, ఈ వ్రతాన్ని ఆచరించాలి. దశమినాడు మద్యాహ్నం స్నానంచేసి శ్రీమహావిష్ణువుని పూజించి, ద్వాదశీవ్రతానికి సంకల్పం చెప్పుకోవాలి. ఆరోజు యవలు విప్రుడికి దానం చెయ్యాలి. దానం చేసేడప్పుడు, పూజచేసేడప్పుడు ఓం కృష్ణాయనమః అని హరిని స్మరించాలి. ఈవిధంగా మార్గశిరం నుంచి నాలుగు మాసాలు గడిపి చైత్రమాసం ప్రారంభంకాగానే తిరిగి శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమివరకూ ఒంటిపూట భోజనం చేస్తూ దశమినాడు విష్ణువుని పూజించి, పేలపిండి, బంగారు లేదా వెండి నాణాలను యథాశక్తి విప్రులకి దానమివ్వాలి.
శ్రావణ మాసం నుంచి ఆశ్వయుజ మాసం దాకా మూడు నెలలు ఇదేవిధంగా ప్రతిమాసం పాడ్యమి నుంచి దశమిదాకా ఒంటిపూట నియమాన్ని ఆచరిస్తూ ఈ మూడు నెలలూ దశమితిథినాడు విష్ణువుని పూజించి బియ్యాన్ని విప్రులకి దానం చేయాలి.
కార్తికమాసంలో కూడా పాడ్యమి నుంచి దశమిదాకా పూర్వంలాగానే నియమాన్ని పాటించి ఏకాదశినాడు శ్రీమహావిష్ణువుని పూజించి సంకల్పంచెప్పుకోవాలి. ఆ మర్నాడు ద్వాదశినాడు అందంగా పూజమందిరాన్ని అలంకరించుకుని అందులో శ్రీమహావిష్ణువుని స్థాపించి ఆయనముందు నేలమీద గంధపుష్పాక్షతలు చల్లి రెండు తెల్లటి వస్త్రాల్ని ఉంచాలి. ఆ వస్త్రాల మీద అక్షతలు చల్లుతూ భూదేవిని పూజించాలి. పూజలో భాగంగా ఓం ప్రియదత్తాయై నమః, అనే నామాన్ని పఠించాలి. ఆవిధంగా విష్ణువుని, భూదేవిని ద్వాదశినాడు పూజించాక ఆ రాత్రి అక్కడే నిద్రపోవాలి.
మర్నాడు ఉదయం ఇరవైనాలుగుమంది బ్రాహ్మణుల్ని పిలిపించి ఒక్కొక్కరికి ఒక్కో గోవుని, ఎద్దుని, పంచ ఉత్తరీయాల్ని, ఉంగరాన్ని తమ తమ శక్తిననుసరించి దానమివ్వాలి. లోభించకుండా తనకు ఉన్నదానిలో ఘనంగా దానంచేయాలి. తరువాత ఆ విప్రులకి భోజనం పెట్టి పాదరక్షలు, గొడుగు ఇచ్చి సగౌరవంగా సాగనంపాలి. వీరికి దానం చేసేడప్పుడు “శ్రీకృష్ణుడు దామోదరుడు, విశ్వరూపుడు, హరిదేవుడు ఎల్లప్పుడూ నా ఎడల సంప్రీతుడై ఉండుగాక” అని పలకాలి. ఈవిధంగా వ్రతాన్ని చేసినవాడికి లభించే శుభ ఫలితాలు ఇంత అని చెప్పటానికి ఎవరికీ సాధ్యంకాదు.
పూర్వం ధర్మాత్ముడైన ఒక రాజుండేవాడు. అతడికి పుత్ర సంతానం లేకపోవటంతో తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఈ శుభవ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. ఆ రాజు యథావిధిగా వ్రతాన్ని ఆచరించగా శ్రీహరి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడా రాజు స్వామికి నమస్కరించి దేవా! ఏ దోషాలు లేనివాడు, ధర్మాత్ముడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు అయిన ఒక పుత్రుణ్ణి ప్రసాదించు, అలాగే నేను మరణించాక నాకు దుఃఖం అనేదే కలగని పరమపదాన్ని అనుగ్రహించు అని కోరుకున్నాడు. తథాస్తు అని వరాలిచ్చి శ్రీహరి అదృశ్యమయ్యాడు. తరువాత కొంతకాలానికి ఆ రాజుకి ”వత్సశ్రీ” అనే పుత్రుడుదయించాడు. అతడు అన్నివిద్యలూ నేర్చి మహా పరాక్రమ శాలిగా, ధర్మాత్ముడిగా కీర్తి పొందాడు.
రాజు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి పవిత్రమైన హిమాలయాలకి వెళ్ళాడు. అక్కడ చక్కటి మునివృత్తిని అవలంబించి దీక్షగా ఎలాంటి ప్రత్యేక కోరికలు లేకుండా నిశ్చలమైన మనసుతో పురుషోత్తముడైన శ్రీహరిని నిత్యం ఇలా స్తుతిస్తూ తన తపస్సు కొనసాగించాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹