Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – నలబై ఆరవ భాగము

శాంతి వ్రతం :-

గృహస్థులైన వారందరికీ మనశ్శాంతిని ప్రసాదించే వ్రతం శాంతి వ్రతం. ఎంతో గొప్పదైన ఈ వ్రతాన్ని అగస్త్య మహర్షి ప్రబోధించాడు. కార్తికమాసం శుక్లపక్ష పంచమినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి.

ఈ వ్రతాన్ని ప్రారంభించినప్పట్నుంచీ ఒక సంవత్సరం పాటు పులుసుని, పులుపు పదార్థాల్ని తినకూడదు. వ్రతం చేసే రోజు రాత్రి ఆదిశేషుడిమీద పవళించివున్న శ్రీమహావిష్ణువు ప్రతిమని గానీ, చిత్రపటాన్ని గానీ స్థాపించి ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి, ఓం వాసుకయే నమః జఘనం పూజయామి, ఓం తక్షకాయ నమః ఉదరం పూజయామి, ఓం కర్కోటకాయ నమః హృదయం పూజయామి, ఓం పద్మాయనమః కంఠం పూజయామి, ఓం మహాపద్మాయ నమః భుజే పూజయామి, ఓం శంఖపాలాయ నమః ముఖం పూజయామి, ఓం కుటిలాయనమః శిరః పూజయామి అని విష్ణుగతంగా, విడిగా అక్షతలతో పూజచేయాలి.

పై తెలిపిన సర్పమంత్రాలతో శ్రీమహావిష్ణువునుద్దేశించి పాలతో అభిషేకం చేయాలి. అలాగే వ్రతం చేసే రోజు చిత్రపటం, ప్రతిమ ముందు చిన్న హోమకుండం ఏర్పాటుచేసుకుని పాలతో నువ్వులతో మంత్రాల చివర ”స్వాహా” ని చేర్చి హోమం చేయాలి. ఇలా ఒక సంవత్సరం నియమంగా వ్రతాన్ని ఆచరించిన తరువాత బంగారు లేదా ఏదైనా లోహంతో ఒక నాగ ప్రతిమని తయారుచేయించి యోగ్యుడైన విప్రుడికి దక్షిణ తాంబూలాలతో సహా దానం చేయాలి. ఈవిధంగా శాంతి వ్రతాన్ని చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా మనశ్శాంతి లభిస్తుంది.

కామవ్రతం :-

కోరిన కోరికలు తీర్చే శుభప్రదమైన వ్రతం ఈ కామవ్రతం. ఈ వ్రతాన్ని అగస్త్యుల వారు ప్రబోధించారు. ఎంతో ప్రభావవంతమైన ఈ వ్రతాన్ని పుష్యమాసం శుక్లపక్ష చవితినాడు భోజనంచేసి తరువాత వచ్చే షష్ఠి తిథినాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆరోజు మౌనవ్రతాన్ని పాటించి, కేవలం ఫలాల్ని ఆహారంగా తీసుకోవాలి. ఆ రోజంతా కేవలం పళ్ళనే స్వీకరిస్తూ మర్నాడు ఉదయం సప్తమినాడు భోజనం చేయాలి.

షష్ఠితిథినాడు హోమకుండాన్ని ఏర్పాటుచేసుకుని అక్కడ విష్ణుమూర్తి ప్రతిమను స్థాపించాలి. ముందుగా విష్ణుమూర్తిని అక్షతలతో ఓం కార్తికేయాయ నమః, ఓం గుహాయ నమః, ఓం సేనాన్యై నమః, ఓం కృత్తికా కుమారాయ నమః, ఓం కుమారస్వామినే నమః, ఓం స్కందాయ నమః అని కుమార స్వామి పేర్లతో పూజించాలి. ఈ వ్రతంలోని విశేషం ఇదే కుమార స్వామి పేర్లతో శ్రీమహావిష్ణువుని పూజించటం. ఆ తరువాత ఇదే నామాల్ని చివర ”స్వాహా” అని చేర్చి అనగా ఓం కుమారస్వామినే నమః స్వాహా అని చెబుతూ నువ్వులతో హోమం చేయాలి. ఈవిధంగా వ్రతాన్ని పూర్తిచేసాక బ్రాహ్మణులకి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో పాటు బంగారం లేదా ఏదైనా లోహంతో చేసిన కుమార స్వామి ప్రతిమని దానం చేయాలి.

“ఓ కుమారస్వామీ! విప్రుడి రూపంలో వచ్చిన నీకు భక్తితో ఈ దానం చేస్తున్నాను. దీన్ని స్వీకరించి నన్ను సంపూర్ణంగా అనుగ్రహించు. నీ దయవల్ల నా కోరికలన్నీ నెరవేరుగాక” అని సంకల్పం చెప్పుకుని ఆ ప్రతిమని దానం ఇవ్వాలి. ఈ ప్రతిమతో పాటు పంచే ఉత్తరీయాన్ని కూడా ఇవ్వటం ఆచారం.

పరమపవిత్రమైన ఈ కామవ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తీరతాయి. పుత్రులు లేనివారికి పుత్రులు, ధనహీనులకి ఐశ్వర్యం, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు వచ్చేవారికి వ్యాపారాభివృద్ధి కలుగుతాయి. పూర్వం నలమహారాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అలాగే ఎంతోమంది రాజ్యభ్రష్టులు ఈ కామవ్రతం చేసి తిరిగి తమ తమ రాజ్యాల్ని అధికారాల్ని పొందారు. ఇది ఎంతో పురాణ ప్రసిద్ధమైన వ్రతం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment