Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – నలబై ఐదవ భాగము

అగస్త్యుడు చెప్పిన అవిఘ్నకర వ్రతం :-

ఫాల్గుణ శుద్ధ చవితి తిథినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ముందు రోజు రాత్రి నువ్వులు కలిపిన అన్నాన్ని భుజించాలి. తరువాత నువ్వులతోనే హోమం చేసి, విప్రుడికి నువ్వుల్ని బియ్యాన్ని కలిపి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని వరుసగా నాలుగు నెలలు ఆచరించి అయిదో నెలలో బంగారంతో యథాశక్తి గణపతి ప్రతిమని తయారుచేయించాలి. దానితో పాటు అయిదు పాత్రల్లో నువ్వులు నింపి పాయసంతో పాటు, ఆ నువ్వుల పాత్రని గణపతి ప్రతిమని యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి.

ఈ విధంగా విఘ్నకర గణపతివ్రతాన్ని చేసినవాడికి ఎలాంటి విఘ్నాలు కలుగవు. పూర్వం సగర చక్రవర్తి అశ్వమేథయాగం చేయటానికి ముందు విఘ్నం కలగగా ఈ వ్రతాన్ని ఆచరించి విఘ్నాల్ని తొలగించుకున్నాడు. త్రిపురాసురుణ్ణి సంహరించేముందు పరమేశ్వరుడు కూడా ఈ వ్రతాన్నే ఆచరించాడు. అలాగే అగస్త్యుడు సముద్రాన్ని త్రాగే ముందు ఈ వ్రతాన్ని చేసాడు. ఈవిధంగా ఎంతో మంది రాజులు, తాపసులు, జ్ఞానులు, ఈ దివ్య వ్రతాన్ని ఆచరించి తాముచేసే పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు.

“శూరుడు, ధీరుడు, గజముఖుడు, లంబోదరుడు ఏకదంతుడు అయిన విఘ్నరాజుకి నమస్కారం” అని చెప్పి గణపతిని శ్రద్ధగా పూజించాలి. విఘ్నాలు నివారించటానికి గణపతికి హోమం చేయాలి. శ్రద్ధా భక్తులతో ఈ వ్రతాన్ని నియమంగా ఆచరించిన వాడికి సకల శుభాలూ కలుగుతాయి. శ్రీగణేశుడి దివ్యానుగ్రహం లభిస్తుంది.

సౌభాగ్య కరణ వ్రతం

స్త్రీలకి, పురుషులకీ సౌభాగ్యాన్ని ప్రసాదించే దివ్యవ్రతం ఈ సౌభాగ్యకరణ వ్రతం. ఈ వ్రతాన్ని అగస్త్యమహర్షి చెప్పాడు. ఫాల్గుణ మాసం శుక్ల పక్ష తదియనాడు రాత్రిపూట ఈ దివ్యవ్రతాన్ని ఆచరించాలి. వ్రతంలో భాగంగా లక్ష్మీ నారాయణుల్ని గానీ, ఉమామహేశ్వరుల్నిగానీ శ్రద్ధగా పూజించాలి. లేదా ఇద్దర్నీ పూజించవచ్చు.

రుద్రుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే. అలాగే పార్వతీ లక్ష్మీ కూడా ఒక్కరే. వీరిద్దర్నీ వేరు భావంతో చూడటం చాలాపాపం. వ్రతంలో భాగంగా లక్ష్మీనారాయణుల్ని స్థాపించి వారిద్దర్నీ శివసంబంధమైన మంత్రాలతో పూజించాలి. ఎందుకంటే వారిద్దరికీ ఎలాంటి భేదం లేదు కనుక.

ఓం గంభీరాయ నమః-పాదౌ పూజయామి, ఓం సుభగాయనమః – కటిం పూజయామి, ఓం నమో దేవదేవాయ నమః – ఉదరం పూజయామి, ఓం నమస్త్రినే త్రాయ నమః ముఖం పూజయామి, ఓం నమో వాచస్పతయే నమః – శిరః పూజయామి, ఓం నమో రుద్రాయ నమః సర్వాంగాని పూజయామి అని పూజించాలి.

ఈ విధంగా లక్ష్మీనారాయణులు లేక గౌరీశంకరుల్ని గంధపుష్పాక్షతలతో పూజించి ఆ తరువాత వారిముందు ఒక హోమకుండాన్ని ఏర్పాటు చేసుకుని అందులో తేనె, నెయ్యి, నువ్వులు ఉపయోగించి ‘ఓం నమః సౌభాగ్య పతయే స్వాహా” అనే మంత్రాన్ని పఠిస్తూ హోమం చేయాలి. (108 సార్లు)

హోమం పూర్తయిన తరువాత వ్రతం చేసిన వాళ్ళు ఉప్పు కారం లేని, నూనె తగలని గోధుమ అన్నాన్ని మాత్రమే తినాలి. కృష్ణ పక్షంలో కూడా ఇది విధానాన్ని ఆచరించాలి. ఆ తరువాత ఆషాఢమాసంలో వచ్చే విదియనాడు యవల భోజనాన్ని చేసి ఈ వ్రతాన్ని ఆచరించాలి. తిరిగి కార్తీకం నుంచి మూడు నెలలు అనగా పుష్యమాసం వరకూ నియమంగా చామల అన్నాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి.

మాఘకృష్ణ తదియనాడు గౌరీ శంకరులు లేదా లక్ష్మీ నారాయణుల బంగారు లేక యథాశక్తి వేరే లోహంతో ప్రతిమల్ని తయారు చేయించి, యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. ఆ ప్రతిమలతో పాటు ఆరుపాత్రల్లో తేనె, నెయ్యి, నువ్వులనూనె, బెల్లం, ఉప్పు, ఆవుపాలు వీటిని నింపి ఇవి కూడా దానం చేయాలి. ఈవిధంగా సౌభాగ్యకరణ వ్రతాన్ని ఆచరించిన స్త్రీ లేక పురుషుడు ఏడు జన్మలదాకా దివ్య సౌందర్యంతో వర్ధిల్లుతారు. అందర్నీ ఆకర్షిస్తారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment