Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – నలబై మూడవ భాగము

మధురాతీర్థం – ప్రదక్షిణా విధి – మాహాత్మ్యం :-

అయోధ్యా మధురామాయా కాశీకాంచీ అవంతికా|

పురీ ద్వారావతీం చైవ సప్తయితే మోక్షదాయికా॥

అన్న శ్లోకం ప్రకారం మథురానగరం సప్తమోక్షపురాల్లో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దివ్య నగరం ఇరవై యోజనాలు విస్తరించివుంది. దీని ప్రాచీన నామం మధుపురి, మధుహాలి. మధురామండలం చుట్టూ నాలుగు మైళ్ళ పరిధిలో ఎన్నో దివ్యస్థలాలున్నాయి. ఈ మండలం మొత్తంలో ఎక్కడ స్నానం చేసినా ఏ ప్రాంతంలో మరణించినా వారికి మోక్షం తప్పక లభిస్తుంది.

వర్ష ఋతువులో మధురానగరం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. సప్తద్వీపాలలో ఉన్న పుణ్యనదులు, తీర్థాలు అన్నీ మధురకి వచ్చి చేరతాయి.

మధురకు చేరి శ్రీకృష్ణుణ్ణి దర్శించిన వారికి సకల పాపాలూ హరిస్తాయి. మధురలో నివసించినవారందరికీ ముక్తి తథ్యం. ఏ మానవుడు మథురలో ప్రవేశించి కాళిందీ (యమున) నదిలో స్నానం చేసి నిరంతరం కృష్ణ నామస్మరణ చేస్తాడో. అలాంటివాడు అశ్వమేథ, రాజసూయ యాగాలు చేసిన ఫలితం పొందుతాడు.

మధురానగర ప్రదక్షిణ :- కార్తికమాసం శుక్లపక్ష నవమినాడు గోవిందనామ స్మరణ చేస్తు మధురానగర ప్రదక్షిణ చేయటం ఉత్తమం. ఇలా చేస్తే సకల పాపాలు హరిస్తాయి. ఈ ప్రదక్షిణకి ఒక పద్ధతుంది. కార్తిక శుక్ల అష్టమినాడు మధురానగరానికి చేరి బ్రహ్మచర్య దీక్షని పాటిస్తూ ఆ రోజు ఉపవాసముండి ఆ రోజు రాత్రి నేను ప్రదక్షిణ చేస్తాను అని ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. మర్నాడు ఉదయం యథావిధిగా దంతధావనాది క్రియలు ముగించుకుని తెల్లని వస్త్రాలు ధరించి మౌనంగా నగర ప్రదక్షిణ ప్రారంభించాలి.

ఈ విధంగా దీక్షగా మధురానగర ప్రదక్షిణ చేసేవాడికి సకలశుభాలూ కలుగుతాయి. ఇవి ప్రదక్షిణ చేసేవాడికే కాదు. అతన్ని దారిలో తాకినవాడికి కూడా మనోరథాలు నెరవేరుతాయి. ప్రదక్షిణ పూర్తయిన తరువాత మధురలో ఉన్న శ్రీకృష్ణమూర్తిని దర్శించాలి. దానితో దీక్ష పరిసమాప్తవుమవతుంది.

ఈ భూమండలం మొత్తం మీద 66000 కోట్ల తీర్థాలున్నాయి. అదేవిధంగా ఆకాశంలో కూడా అంతే సంఖ్యలో తారలు ప్రకాశిస్తున్నాయి. ఈ లెక్కని చెప్పిన వారు ప్రపంచానికి ఆయుఃస్వరూపులైన వాయువు, బ్రహ్మ, లోమశమహర్షి నారదుడు, ధ్రువుడు, జాంబవంతుడు, బలి, హనుమంతుడు. వీరంతా వనాలతో, సముద్రాలతో, పర్వతాలతో కూడిన ఈ భూమండలాన్నంతా బైటి వైపు నుంచి ఎన్నో సార్లు ప్రదక్షిణ చేసి ఈ లెక్క చెప్పారు.

మధురప్రదక్షిణ ఫలం :- సప్తద్వీపాలతో కూడిన ఈ భూమండలం మొత్తం ప్రదక్షిణ చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా అధికపుణ్యం మధుర ప్రదక్షిణ చేస్తే లభిస్తుంది. ఒకనాడు స్వయంగా బ్రహ్మదేవుడే ఇలా చెప్పాడు. సమస్త వేదాల్ని అధ్యయనం చేయటం, అన్ని తీర్థాల్లో స్నానం చేయటం, ఎన్నో రకాల దానాలు చేయటం, యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించటం, బావులు,చెరువులు, ఆలయాలు నిర్మించటం వీటన్నిటి ద్వారా లభించే పుణ్యం కన్నా వందరెట్లు అధికమైన పుణ్యం మధురానగర ప్రదక్షిణ వల్ల లభిస్తుంది.

బ్రహ్మదేవుడి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న సప్తర్షులు వెంటనే మధురానగరానికి వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. వారితో పాటు ధ్రువడు కూడా అక్కడికి వెళ్ళాడు. తరువాత వారంతా తమ తమ కోరికలు నెరవేరాలని సంకల్పించుకుని శుక్లపక్ష నవమి తిథినాడు విధివిధానంగా నగర ప్రదక్షిణ చేసారు. తద్వారా వారి కోరికలన్నీ నెరవేరాయి.

మధురానగర ప్రదక్షిణలో ఎదురయ్యే తీర్థాలు, దేవతలు : మధురానగరాన్ని ప్రదక్షిణ చేయాలనుకునేవారు ముందు రోజు సంకల్పం చెప్పుకుని మర్నాడు ఉదయం పరిక్రమని ప్రారంభించాలి. పరిక్రమకి ముందు మధురలో ఉన్న ”దక్షిణకోటి” అనే తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి. ఆ తరువాత ముందుగా బ్రహ్మచారి హనుమంతుణ్ణి ఆ తరువాత గణపతి, విష్ణువు కార్తికేయుడు తదితర దేవతల్ని పూజించాలి. వెంటనే అక్కడ నుంచి బయలుదేరి వసుమతీదేవిని దర్శించుకోవాలి. ఆ తరువాత అష్టమాతల్ని దర్శించి వారందరి అనుమతి తీసుకుని యాత్ర ప్రారంభించాలి.

ప్రదక్షిణ చేసే దారిలో శ్రీకృష్ణుడిచేత పూజించబడ్డ ”ఇక్షువాస” దేవికి నమస్కరించాలి. ఇంకా ఆ దారిలో వాసపుత్ర, అర్కస్థల, వీరస్థల, కుశస్థల, పుణ్యస్థల, హయముక్తి, సిందూర అనే దివ్య స్థలాలు కనిపిస్తాయి. వాటన్నిటినీ దర్శించి ముందుకు సాగిపోవాలి. గుర్రం మీదకానీ, వాహనం మీద కానీ ప్రదక్షిణ ఎప్పుడూ చేయకూడదు. శక్తిమేరకు నడిచి మాత్రమే చేయాలి.

మధురాప్రదక్షిణ మార్గంలో శివకుండం, కదంబకుండం, వర్షాఖాత కుండం, కృష్ణ క్రీడాసేతు బంధకుండం, బలిహరణ కుండం కనిపిస్తాయి. ఇవన్నీ కృష్ణ పరమాత్మ జల విహారంచేసిన కుండాలు వాటిని చూస్తేనే చాలు పాపాలు నశిస్తాయి. అదే దారిలో స్తంభోచ్ఛ్యం అనే శిఖరం ఉంది. ఆ శిఖరానికి నమస్కరించి ముందుకు సాగాలి. దారిలో నారాయణస్థాన తీర్థం, కుజ్జికా వామన తీర్థం కనిపిస్తాయి. వాటిని దాటి ముందుకు వెళ్ళాక సిద్ధేశ్వరీ దేవి దివ్యస్థలం కనిపిస్తుంది. అక్కడే ఒక దివ్యకుండం కూడా ఉంది. అమ్మవార్ని దర్శించి ముందుకు సాగితే గోకర్ణేశ్వరీదేవి, గణపతి దర్శనమిస్తారు.

ఇంకా ఆ దారిలో వరుసగా గార్హ్యతీర్థం, భద్రేశ్వర తీర్థం, సోమేశ్వర తీర్థం, ఘంటాభరణ గరుడకేశ, ధారాలోపసక, వైకుంఠ ఖండవేలక, మందాకినీ, సంయమున, అనకొండ, గోపతీర్థ, ముక్తికేశ్వర, వైలక్ష, మహాపాతనాశక అనే దివ్య తీర్థాలున్నాయి. ప్రదక్షిణ చేసేవాడు వీటన్నిటినీ దర్శిస్తే మంచిది.

ప్రదక్షిణ చేసేవారు దారిలో ఉన్న అన్ని తీర్థాల్ని దర్శించి పరమేశ్వరుణ్ణి భక్తిగా స్తుతించాలి. “ఓ పరమేశ్వరా! నీ ఆజ్ఞతో మధురా ప్రదక్షిణ చేస్తున్నాను. నాకు తగిన ఫలం లభించేలా చేయి” అని ప్రార్ధించాలి. ఆ తరువాత విశ్రాంతి సంజ్ఞకం అనే తీర్థానికి వెళ్ళాలి. అక్కడ స్నానం తర్పణం చేసి అక్కణ్ణుంచి మంగళాదేవి మందిరానికి వెళ్ళి తమ యాత్ర సఫలం చేయమని వేడుకోవాలి. అక్కణ్ణుంచి సరాసరి పిప్పలేశ్వరుడి ఆలయానికి చేరుకోవాలి. అక్కడి స్వామిని దర్శించి పూజించి ప్రదక్షిణ యాత్రలో చివరిగా సూర్య తీర్థానికి చేరి అక్కడున్న సూర్య నారాయణమూర్తిని దర్శించుకోవాలి. దీనితో మధురానగర ప్రదక్షిణ పూర్తవుతుంది.

పరమపవిత్రమైన మధురానగరంలో ప్రదక్షిణ చేసే మానవుడు భూమిమీద ఎన్ని అడుగులు వేస్తాడో అన్ని వేల సంవత్సరాలు అతడు అతడి పూర్వీకులు సూర్యలోకంలో నివాసాన్ని పొందుతారు. మధురానగర పరిక్రమ చేసి వచ్చే వ్యక్తిని చూసినా చాలు, వారు పాపాలనుంచి విముక్తి పొందుతారు. ఈ ప్రదక్షిణకు సంబంధించిన విషయాలు విన్నవారికి కూడా పుణ్యఫలాలు లభిస్తాయి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment