Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – నలబై ఒకటవ భాగము

మధురాతీర్థ మాహాత్మ్యం :-

జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మకి మథురానగరం కన్నా ప్రియమైన లోకం ముల్లోకాలలో మరేదీలేదు. ఈ దివ్య నగరంలోనే శ్రీకృష్ణుడు అవతరించాడు. అందుకే ఆ నగరం పుష్కర, ప్రయాగ, కాశీ, ఉజ్జయినీ, నైమిశారణ్య క్షేత్రాలకన్నా గొప్పది. ఆ నగరంలో విధి పూర్వకంగా నివసించే మానవులు నిస్సందేహంగా ముక్తిని పొందుతారు. మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో ప్రయాగక్షేత్రంలో ఉంటే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో అలాంటి పుణ్యఫలం మథురలో ఒక్కరోజు ఉంటేనే చాలు లభిస్తుంది. అదేవిధంగా వారణాసిలో ఒక వెయ్యి సంవత్సరాలు నివసిస్తే ఎలాంటి ఫలం లభిస్తుందో అంతే ఫలం మథురలో ఒక్క క్షణం నివసించినా లభిస్తుంది.

కార్తికమాసంలో పుష్కరక్షేత్రంలో నివసిస్తే వచ్చే ఫలం, మధురలో నివసించేవారికి సహజంగానే లభిస్తుంది. ఎవరైనా మధురా మండలం అనే పేరుని ఉచ్చరించినా లేక మధుర అనే శబ్దాన్ని విన్నా చాలు. వారు అన్ని పాపాల నుంచీ ముక్తిని పొందుతారు. ఈ భూమండలం మీద ఎన్ని తీర్థాలు, సరోవరాలు ఉన్నాయో అవన్నీ మధురా నగరంలో అంతర్గతంగా వున్నాయి. ఎందుకంటే పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు గుప్తరూపంలో అక్కడ శాశ్వత నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నాడు గనుక భూలోకంలో ఉన్న తీర్థాలలో కుబ్జామ్రకం, సౌకరం, మధుర అనే ఈ మూడూ పరమ విశిష్ఠమైనవి.

ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యయాతి వంశంలో అవతరించాడు. మథురలో అవతరించిన పరమాత్మ శ్రీకృష్ణ బలరామ, ప్రద్యుమ్న అనిరుద్ధులుగా మారి చతుర్వ్యూహాలతో వంద సంవత్సరాలు నివసించాడు. ఆయన అవతరించిన కాలంలోనే కంసుడులాంటి భయంకరులైన ముప్పై రెండు మంది దానవులు భూమిమీద అవతరించారు. వారందర్నీ కృష్ణ పరమాత్మ సంహరించాడు.

మధురానగరంలో సూర్యుడి పుత్రిక అయిన యమునానది ఎంతో అందంగా, మందంగా ప్రవహిస్తూ ఉంటుంది. మధురలో కృష్ణుడికి సంబంధించిన ఎన్నో తీర్థాలు గుప్తంగా ఉన్నాయి. ఆ తీర్థాల్లో స్నానం చేసిన నరులు పుణ్యలోకాల్ని చేరుకుంటారు. ఆ తీర్థాల సమీపంలో ప్రాణం వదిలినవాళ్ళు ఆ సరాసరి విష్ణులోకాన్నిచేరుకుంటారు.

మధురామండలంలో ”విశ్రాంతి అనే తీర్ధం ఉంది. అది ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందింది. అందులో స్నానం చేసే మానవుడు సకల పుణ్యాలనీ పొందుతాడు. అక్కడున్న విష్ణు ప్రతిమని దర్శించి రెండుసార్లు దానికి ప్రదక్షిణ చేస్తే శుభం జరుగుతుంది. అక్కడే ”కణకల్” అనే మరో గుహ్య స్థానం కూడా ఉన్నది. అక్కడ స్నానం చేస్తే చాలు స్వర్గలోకాన్ని చేరుకుంటారు. ఇంకా ఆ మధురలో ”విందుక” అనే తీర్థం కూడా ఉంది. అది ఎంతో మహిమాన్వితమైనది.

మధురలో ఉన్న అన్ని తీర్థాల్లోకీ ఎంతో విశిష్ఠమైనది ”సూర్యతీర్థం”. అది సకల పాపాల్నీ పోగొడుతుంది. ఆ తీర్థం దగ్గరే పూర్వం విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి సూర్యుణ్ణి ఉపాసించాడు. బలి తపస్సుకి సంతోషించిన సూర్య భగవానుడు ప్రత్యక్షమై “ఎందుకు తపస్సు చేస్తున్నావు” అని అడిగాడు. అప్పుడు బలి దేవేశ్వరా! నా నివాసం పాతాళలోకంలో ఉంది. ప్రస్తుతం నేను రాజ్య హీనుణ్ణి, ధనహీనుణ్ణి నన్ను నీవే కరుణించాలి. అందుకే ఈ తపస్సు చేస్తున్నాను అని విన్నవించాడు. బలి మాటలు విని మనసు కరిగిపోయిన సూర్యుడు వెంటనే తన కిరీటంలో ఉన్న దివ్యమణిని తీసి అతడికిచ్చాడు. ఆ మణిని తీసుకుని బలి ఆనందంగా పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇదీ సూర్యతీర్ధం మహిమ.

ఆదివారంనాడు, సూర్యగ్రహణాలు సంభవించినప్పుడు ఆ తీర్థంలో స్నానం చేస్తే రాజసూయయాగం చేసిన ఫలితం లభిస్తుంది. పూర్వం ధ్రువుడు కూడా ఇక్కడే తపస్సుచేసి ధ్రువలోకాన్ని పొందాడు. అతడి పేరుతో మధురలో ధ్రువతీర్థం ఏర్పడింది. ఈ తీర్థంలో స్నానం చేసినవారు సకల శుభాలు పొందుతారు. ఈ ధ్రువ తీర్థానికి సమీపంలోనే తీర్థరాజం అనే ఒక తీర్థం వుంది. దానికి పడమర భాగంలో కోటి తీర్థం నెలకొంది. పితృదేవతల అనుగ్రహం పొందాలనుకునేవారు కోటితీర్థంలో స్నానంచేసి పితృదేవతల్ని అర్చించాలి. ఆ తీర్థంలో పవిత్రంగా స్నానం చేసినవాడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు.

మధురా నగరంలోనే పితృదేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందించే వాయుతీర్థం ఉన్నది. ఇక్కడ పిండప్రదానం చేసినవాడు పితృలోకాన్ని చేరుకుంటాడు. గయలో పిండప్రదానం చేస్తే ఎంత గొప్ప ఫలం లభిస్తుందో అదే ఫలితం మధురలో వున్న ఈ వాయు తీర్థంలో, జ్యేష్ఠ మాసంలో పిండప్రదానం చేస్తే లభిస్తుంది. ఇలా మధురా క్షేత్రంలో మొత్తం పన్నెండు దివ్య తీర్థాలున్నాయి. వీటిని ఒక్కసారి స్మరించినా చాలు. ఆ తీర్థాల్లో స్నానంచేసిన ఫలం లభిస్తుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment